జెనీవా 2: అమెరికా, యు.ఎన్ లను కడిగేసిన సిరియా


Geneva 2

స్విట్జర్లాండ్ నగరం మాంట్రియక్స్ లో ‘జెనీవా 2’ ముందరి చర్చలు ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటుకు సంబంధించి అమెరికా, రష్యాలు దాదాపు సంవత్సరం క్రితం ఏర్పాటు చేయతలపెట్టిన చర్చలివి. జెనీవా 2 పేరుతో జనవరి 24 నుండి జరగనున్న చర్చలకు ప్రిపరేటరీ సమావేశాలుగా మాంట్రియక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించిన ఐరాస నేత బాన్ కి-మూన్ సోకాల్డ్ సిరియా ప్రతిపక్షాలు, అమెరికా వ్యతిరేకించడంతో ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నాడు. దానితో జెనీవా 2 చర్చలు మొదలు కాకముందే విఫలం కానున్నాయన్న పేరు తెచ్చుకున్నాయి.

ఐరాస, అమెరికాలను సిరియా ప్రతినిధి బృందం ఎలా కడిగేసిందో తెలుసుకోవడానికి ముందు ఇరాన్-అమెరికా-ఐరాసల మధ్య జరిగిన రగడ గురించి కాస్త మాట్లాడుకుందాం.

జెనీవా 2 చర్చలకు ఇరాన్ ను కూడా ఆహ్వానించామని ఐరాస అధిపతి ప్రకటించడంతో ఈ చర్చలపై అనేకులకు ఆశలు రేకెత్తాయి. ఇప్పటికైనా అమెరికా వాస్తవం తెలుసుకుందని అనేకమంది పరిశీలకులు సంతోషం ప్రకటించారు. చర్చల్లో సానుకూల పరిష్కారం దొరుకుతుందని సిరియా ప్రజలు ఎదుర్కొంటున్న అంతులేని హింస రచన ఒక కొలిక్కి వస్తుందని ఆశించారు. సిరియా కిరాయి తిరుగుబాటు ముగిస్తే ఇండియా లాంటి అనేక దేశాలకు కూడా చమురు ధరల విషయంలో కాస్త ఊరట లభిస్తుంది.

అయితే ఇంతలోనే ఇరాన్ కి ఇచ్చిన ఆహ్వానం ఉపసంహరించుకోకపోతే చర్చలకు హాజరు కాబోమని సిరియా సోకాల్డ్ ప్రతిపక్షాలు ప్రకటించడం, ఆ వెంటనే ‘జెనీవా 1 ఒప్పందం’ కు ఆమోదం చెబితేనే ఇరాన్ ఆహ్వానితురాలని అమెరికా ప్రకటించడం, ఆ వెంటనే షరతులు పెట్టి హాజరు కమ్మంటే వచ్చేది లేదని స్పష్టం చేయడం, ఇరాన్ ప్రకటనను సాకుగా చూపుతూ బాన్ కి మూన్ కూడా ఇరాన్ ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవడం జరిగిపోయాయి.

అసలు అమెరికాకు చెప్పకుండా ఇరాన్ ను ఆహ్వానించే ధైర్యం బాన్ ఎలా చేశారని ఆశ్చర్యపోవడం పరిశీలకుల వంతయింది. జపనీయుడయిన బాన్ కి మూన్ ఐరాస అధినేత అనడం కంటే అమెరికా-నాతో పోస్టర్ బాయ్ అనడం సబబు. ఐరాస సెక్రటరీ జనరల్ గా పని చేసినవారిలో ఇంతవరకు ఎవ్వరూ ఈయన లాగా నాటో-అమెరికా లకు సాగిలపడిన వ్యక్తి లేరు. ప్రపంచంలో ఏ సమస్య రగిలినా దానిపై నాటో ఏం చెబితే బాన్ కూడా అదే చెబుతారు.

ఐవరీ కోస్ట్, మాలి, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, ఈజిప్టు, సిరియా తదితర అనేక ఘర్షణల విషయంలో అమెరికా-నాటో ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించిన ఘనుడు బాన్ కి మూన్. అలాంటి వ్యక్తి అమెరికాకు చెప్పకుండా ఇరాన్ ని ఆహ్వానించడం అసంభవం. ఇరాన్ ను ఆహ్వానించినట్లు ఆయన ప్రకటించిన వెంటనే సిరియా ప్రతిపక్షాలు (ఎస్.ఎన్.సి – సిరియన్ నేషనల్ కోవలిషన్) ఆగ్రహం ప్రకటించడంతో ఆయన ఖిన్నుడయ్యాడు. ఆ తర్వాత అమెరికా కూడా ఆహ్వానాన్ని ఖండించడంతో మరింత ఆశ్చర్యం ప్రకటించాడు.

నిజానికి అమెరికా ఆదేశాలతోనే బాన్ కి మూన్ ఇరాన్ కు ఆహ్వానం పంపాడు. ఎస్.ఎన్.సి నాయకులు తమ చేతుల్లో ఉన్నవారే కదా వారికి నచ్చజెప్పొచ్చు అని అమెరికా భావించి ఉంటుందని కానీ సిరియాలో వాస్తవంగా యుద్ధరంగంలో ఉన్న గ్రూపులు ఇరాన్ ను ఆహ్వానించడానికి ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఎస్.ఎన్.సి నాయకులు కూడా లొంగిరాలేదని ప్రముఖ మధ్య ప్రాచ్యం రాజకీయాల విశ్లేషకులు బిల్ వాన్ ఆకెన్ వెల్లడించారు. ఫలితంగా అమెరికా తన ఆహ్వానాన్ని తానే ఖండించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన తెలిపారు.

పరిస్ధితి గమనించిన ఇరాన్ బాన్ ని బైట పడేసే ప్రకటన చేసింది. షరతులతో కూడిన ఆహ్వానాన్ని తాము అంగీకరించబోమని ఇరాన్ విదేశీ మంత్రి జవద్ జరిఫ్ ప్రకటించారు. జెనీవా 1 లో అంగీకరించిన కమ్యూనిక్ ప్రకారం సిరియాలో పాలక ప్రతిపక్షాలు పరస్పర అంగీకారంతో, ఇరువురికీ ఆమోదయోగ్యమైన ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ ఏర్పాటుకు ఇరాన్ అంగీకరించిందని దాని ప్రకారమే ఆహ్వానం ఇచ్చామని బాన్ ప్రకటిస్తూ ఇరాన్ ఆ అంగీకారం నుండి ఇప్పుడు వెనక్కి వెళ్లింది కనుక ఆహ్వానం కూడా వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటించాడు.

వాస్తవానికి ఇరాన్ వెనక్కి వెళ్ళిందీ లేదు, మరొకరు ముందుకు వచ్చింది లేదు. “సిరియాలో పాలక ప్రతిపక్షాలు పరస్పర అంగీకారంతో, ఇరువురికీ ఆమోదయోగ్యమైన ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ ఏర్పాటుకు” ఇరాన్ కి ఇప్పటకీ అంగీకారమే. కానీ ఈ భాషకు అమెరికా వేరే అర్ధం లాగుతోంది. అనగా జెనీవా 1 చర్చల్లో (ఇందులో సిరియా నుండి ఎవ్వరూ పాల్గొనకపోవడం ఒక విచిత్రం) అంగీకరించిన ‘జెనీవా ఒప్పందం’ కు అమెరికా వేరే అర్ధం తీస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ కు ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ లో పాత్ర ఉండదని, ఆయన గద్దె దిగాలనీ అమెరికా సొంత అర్ధం ఇస్తోంది. ఈ సొంత అర్ధాన్నే ఇరాన్, సిరియా, రష్యాలు వ్యతిరేకిస్తున్నాయి.

మిస్టర్ కెర్రీ! అసలు మీరెవరు?

మాంట్రియక్స్ సమావేశంలో పెద్ద తలకాయలే హాజరయ్యాయి. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ, రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్, సిరియా సమస్య విషయంలో ఐరాస-అరబ్ లీగ్ సంయుక్త ప్రతిధిగా నియమితులయిన లఖ్దర్ బ్రహ్మీ, ఐరాస అధిపతి బాన్ కి మూన్, సిరియా విదేశీ మంత్రి వాలిద్ ఆల్-మౌవలెమ్, చైనా విదేశీ మంత్రి వాంగ్ యి  తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో చర్చలు అతి త్వరలోనే మాటల యుద్ధంగా మారిపోయాయి. దానికి బాటలు పరిచినవాడు అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ. ఐరాస అధినేత కూడా యధాశక్తి సహకరించాడు. వీరిద్దరికీ సిరియా మంత్రి తగిన సమాధానం ఇవ్వడంతో సిరియా ప్రతిపక్షం ఎస్.ఎన్.సి తరపున హాజరయిన ప్రతినిధి మాటల యుద్ధాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళాడు.

ఐరాస నేత బాన్ కి మూన్ మొదట మాట్లాడినట్లు ఆర్.టి (రష్యా టుడే) తెలిపింది. ఐక్యత సాధించడానికి సిరియాలో అన్ని పక్షాలకు ఒక అవకాశం వచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరాడు. పరిస్ధితి చాలా పెళుసుగా ఉన్న నిజమైన నమ్మకం కూడా ఉందని అన్నాడు. అంతటితో ఊరుకుంటే బాగుండేది. ఆ తర్వాత ఆయన ఆల్-ఖైదా టెర్రరిస్తులతో మూడేళ్లుగా తలపడుతున్న సిరియా ప్రభుత్వంపై వేలెత్తి చూపాడు. సిరియా ప్రజల ప్రజాస్వామిక డిమాండ్లు ప్రారంభంలోనే తీర్చినట్లయితే పరిస్ధితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని ఆయన ఒక పక్షం తీసుకుని మాట్లాడాడు. ఐరాస సెక్రటరీ జనరల్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి మూడేళ్లుగా నలుగుతున్న తీవ్రమైన ఘర్షణలో మధ్యవర్తిత్వం వహించడానికి పూనుకున్నపుడు నిస్పాక్షికంగా ఉండాలి. కనీసం అలా ఉన్నట్లు నటించాలి. కానీ బాన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఐరాస అధినేతగా కాకుండా సిరియా యుద్ధాన్ని రగిల్చిన అమెరికా-నాటో ల పక్షం వహించాడు. అనంతరం అన్ని పక్షాలు టెర్రరిస్టుల చర్యలను విడనాడాలని కత్తిని గాయాన్ని ఒకే గాటన కడుతూ హితోక్తి పలికాడు.

బాన్ అనంతరం సెర్గీ లావరోవ్ మాట్లాడుతూ సిరియా నుండి వెలువడే యుద్ధ ప్రకంపనలు మధ్యప్రాచ్యం మొత్తం విస్తరించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాలపై బైటి నుండి ప్రభుత్వాలను రుద్దే ఎలాంటి ప్రయత్నాలయినా గడియారాన్ని వెనక్కి తిప్పుతాయని హెచ్చరించాడు. తద్వారా ఆధునికతవైపుకు కాకుండా మధ్య యుగాల్లోకి ప్రయాణిస్తామని ఆయన హెచ్చరించాడు. అందుకు ఉదాహరణల కోసం చరిత్రలో ఎంతో దూరం వెళ్లవలసిన పని లేదని ఇటీవల ఉదాహరణలే చాలని ఈజిప్టు, లిబియా, ట్యునీషియా లను గుర్తు చేశాడు. బల ప్రయోగంతో సిరియాకు పరిష్కారం ఇవ్వలేమని సిరియా భవిష్యత్తును నిర్ణయించే అధికారం సిరియా ప్రజలకే ఇవ్వాలని రష్యా నిర్ణయమని తెలిపాడు.

సిరియాలో ప్రస్తుతం సాగుతున్న విచ్ఛిన్నకర ఘర్షణలు వాస్తవానికి సిరియా సమాజ లక్షణం కాదని దాన్ని బైటి దేశాలు చొప్పించాయని లావరోవ్ గుర్తు చేశాడు. 2,000 సంవత్సరాలుగా సిరియాలో ప్రశాంతంగా జీవిస్తున్న సిరియా క్రైస్తవులు ఇప్పుడు ముస్లిం టెర్రరిస్టు గ్రూపుల వల్ల పెద్ద ఎత్తున వలసపోయే పరిస్ధితి వచ్చిందని తెలిపాడు. ఇస్లాం లోనే నెలకొన్న అంతర్గత వైరుధ్యాలు ప్రమాదకర ధోరణిగా ముందుకు వచ్చాయని తెలిపాడు. సిరియా తిరుగుబాటు గ్రూపులే ఒకరికొకరు ఊచకోత కోసుకుంటున్న విషయాన్ని ఆయన ఈ విధంగా ప్రస్తావించాడు. బహుళ ధృవ ప్రపంచంగా అవతరిస్తున్న ప్రపంచంలో సరైన స్ధానం పొందడం కోసం ముస్లిం ప్రపంచం ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చాడు. తద్వారా అమెరికా పతనం ఎంతో కాలం పట్టదని, కావున అమెరికా మంత్రాంగాలకు లొంగి నష్టపోవద్దని హెచ్చరించాడు.

లావరోవ్ అనంతరం జాన్ కెర్రీ మైకు అందుకున్నాడు. సిరియాలో భవిష్యత్తులో ఏర్పడే ట్రాన్శిషనల్ గవర్న్ మెంట్ లో అక్కడ యుద్ధం చేస్తున్న వేలాది హింసాత్మక తీవ్రవాదులకు స్ధానం లేదన్నాడు. ఈ తీవ్రవాదులను సిరియా ప్రభుత్వమే అయస్కాంతంలా ఆకర్షిస్తున్నదని విచిత్రమైన ఆరోపణ చేశాడు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడేవరకు సిరియాలో టెర్రరిస్టులను ఓడించే అవకాశం లేదని తేల్చి చెప్పాడు.

విచిత్రం ఏమిటంటే అమెరికా ఇన్నాళ్లూ చెప్పింది ఇది కాదు. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధంగా తలపడుతున్నది అమెరికా, ఐరోపా, టర్కీ, సౌదీ తదితర దేశాలు వాదిస్తున్నట్లు పోరాటయోధులు, తిరుగుబాటు వీరులు కాదని వారంతా విదేశాలు ప్రవేశపెట్టిన టెర్రరిస్టులు, హంతకులు, దొంగలు, దోపిడీదారులు అనీ అద్యక్షుడు బషర్ చెబుతూ వచ్చాడు. దీనిని అమెరికా తిరస్కరిస్తూ తిరుగుబాటుదారులకు ఆయుధాలు ఇస్తూ వచ్చింది. ఇప్పుడేమో సిరియాలో వేలాది మంది టెర్రరిస్టులు ఫైటింగ్ చేస్తున్నారని అమెరికా చెప్పడం ఓ విచిత్ర పరిణామం.

ఆ తర్వాత తమ అసలు కోరిక చెప్పాడు జాన్ కెర్రీ. సిరియా విషయంలో రష్యా, అమెరికాల మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతూ సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ గద్దె దిగక తప్పదని నొక్కి చెప్పాడు. అస్సాద్ గద్దె దిగాలా లేదా అన్నది నిర్ణయించాల్సింది సిరియా ప్రజలే తప్ప బైటి దేశాలు కాదనేది రష్యా వాదన.

అనంతరం సిరియా విదేశీ మంత్రి వాలిద్ మువల్లేమ్ మాట్లాడాడు. తన ప్రసంగంలో అమెరికా, ఐరాస లను ఆయన దునుమాడాడు. విప్లవం ముసుగులో వహాబీ (సౌదీ రాజులు అవలంబించే ముస్లిం తెగ మతం – ఇది సున్నీ మతంలో ఓ శాఖ. దీనిని సలాఫీ మతం అనీ అంటారు. సలాఫీలో వహాబీ ఒక భాగం అనీ అంటున్నారు. మొత్తం మీద ఇతరులందరి కంటే తామే అసలు సిసలు ఇస్లాం మతావలంబకులం అని వహాబీలు అంటారు) సిరియాలో పోరాడుతున్న తీవ్రవాదులు సిరియాను 1000 సం.లు వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నారని, తీవ్రవాద సంస్ధలు పౌరులను ఊచకోత కోస్తున్నారని, సమాధులను ధ్వంసం చేస్తున్నారని, మసీదులపై బాంబులు కురిపిస్తున్నారని తెలిపాడు. వీరు సిరియా పొరుగు దేశాల నుండి (సౌదీ, కతార్, టర్కీ, యు.ఏ.ఇ) మద్దతు పొందుతున్నారని తెలిపాడు.

సిరియా అంతర్యుద్ధం ద్వారా లబ్ది పొందుదామని టర్కీ ప్రధాని ప్రయత్నించాడని, చివరికి అది ఆయనకే ఎదురు తిరిగిందని వాలిద్ గుర్తు చేశాడు. పక్కవాడి ఇల్లు తగలబడుతున్నపుడు చూస్తూ సంతోషిస్తే అది త్వరలోనే సొంత ఇంటిని అంటుకుంటుందన్న పాత సామెతను ఆయన గుర్తు చేశాడు. తీవ్రవాద సంస్ధల నాయకులు, సిరియా ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నేతలు టర్కీలో ఫైవ్ స్టార్ హోటళ్లలో బతుకుతుంటే సిరియాలో ఆయుధం పట్టిన వారు అత్యధిక మొత్తం చెల్లించినవారికి తమ ప్రాణాలు అమ్ముకుంటున్నారని సిరియా కిరాయి తిరుగుబాటు ముఖచిత్రాన్ని ఒక్క మాటలో వివరించాడు వాలిద్.

వాలిద్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ద్వారా ఐరాస అధిపతి బాన్ తన అమెరికా పక్షపాతాన్ని చాటుకున్నాడు. తన వ్యాఖ్యలను ముగించాలని ఐరాస నేత వాలిద్ ను కోరగా వాలిద్ అందుకు తిరస్కరించాడు.

“మీరు 25 నిమిషాలు మాట్లాడారు. సిరియాలో పరిస్ధితి వివరించడానికి నాకు కనీసం 30 నిమిషాలు కావాలి” అని వాలిద్, బాన్ జోక్యాన్ని తిరస్కరించాడు.

“మీరు ఉండేది న్యూ యార్క్ లో. నేను ఉండేది సిరియా గడ్డ పైన” అని తాను మాట్లాడడాల్సిన అవసరాన్ని వాలిద్ నొక్కి చెప్పాడు.

అమెరికా విదేశీ మంత్రి జాన్ కేర్రీ మాటల్ని కూడా వాలిద్ తీవ్రంగా గర్హించాడు. “మిస్టర్ కేర్రీ! సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ గద్దె దిగాలని చెప్పడానికి మీరెవరు” అని నేరుగా కేర్రీని ఉద్దేశిస్తూ ప్రశ్నించాడాయన.

“సిరియా ప్రభుత్వానికి గానీ, అధ్యక్షుడు బషర్ అస్సాద్ కి గానీ న్యాయబద్ధత (legitimacy) ను ఉప్సంహరించుకునే హక్కు ఇక్కడ ఎవ్వరికీ లేదు. అది కేవలం సిరియా ప్రజలకు మాత్రమే ఉంది. తమకు ఎవరు కావాలో ఎంచుకునే హక్కు సిరియా ప్రజలకే సొంతం” అని వాలిద్ స్పష్టం చేశాడు.

మాంట్రియక్స్ సమావేశానికి హాజరయిన ఎస్.ఎన్.సి ప్రతినిధులు కూడా అమెరికా వాదననే అందుకున్నారు. అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాదే టెర్రరిస్టు అని కొత్త పల్లవి కూడా అందుకున్నాడు. సిరియాలో ఆల్-ఖైదా టెర్రరిస్టులు పెరగడానికి మార్గం ఏర్పరిచింది బాషరే అని వాదించాడు.

ఎస్.ఎన్.సి ప్రతినిధులు గానీ, అమెరికా గానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా సిరియాలో ఆల్-ఖైదా టెర్రరిస్టులు ప్రవేశించిన సంగతి బహిరంగంగా అంగీకరించలేదు. పత్రికల ద్వారా లీక్ లు ఇవ్వడం తప్ప సిరియాలో ఉన్నది టెర్రరిస్టులు అని వారు ఎన్నడూ అంగీకరించలేదు. పైగా వారు తిరుగుబాటుదారులని అస్సాద్ అణచివేతను ఎదిరించి పోరాడుతూ ప్రజాస్వామ్యం కోసం తపిస్తున్నారని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. తీరా సౌదీ అరేబియా నియంత్రణలో ఉన్న ఆల్-ఖైదా టెర్రరిస్టులు తమ సామ్రాజ్యవాద ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తుండడంతో అమెరికా కొత్త మాటలు చెబుతోంది.

సిరియా, రష్యా, అమెరికా ప్రతినిధుల నుండి ఫైర్ బ్రాండ్ ప్రసంగాలు విన్నాక చైనా విదేశీ మంత్రి వాంగ్ యి తాను చెప్పదలుచుకున్నది చెప్పి కూర్చున్నారు. యుద్ధంతో అతలాకుతలం అయిన సిరియాకు 20 బిలియన్ యువాన్ల (3.3 బిలియన్ డాలర్లు) సాయం ఇస్తామని హామీ ఇచ్చాడు.

సిరియా సమస్యకు నిజంగా పరిష్కారం వెతకాలంటే దానికి ఇరాన్ సహకారం తప్పనిసరి. ఎక్కడో సంద్రాల ఆవల ఉన్న అమెరికా, ఇండియాలకు పాత్ర ఇచ్చి పొరుగునే ఉన్న ఇరాన్ పాత్ర గుర్తించకపోవడం లోనే జెనీవా 2 విఫలం కావడానికి తగిన పునాది ఏర్పడిపోయింది. మధ్యప్రాచ్యంలో హిజ్బోల్లా (లెబనాన్)-సిరియా-ఇరాన్ దేశాలు పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద దోపిడీని, దురాక్రమణలను ఎదిరిస్తున్న ప్రధానమైన ప్రతిఘటన అక్షం (Axis of Resistence). అలాంటి ఇరాన్ పాత్ర లేకుండా సిరియా శాంతి చర్చలు ఏ తీరాన్నీ చేరలేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s