ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు


ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల తాము చాన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికినట్లయిందని ఢిల్లీ లోని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు సంతృప్తి ప్రకటిస్తున్నారు. విదేశీయుల కార్యకలాపాల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదని, ఢిల్లీ మంత్రి సోమ్ నాధ్ భారతి తనిఖీ, ముఖ్యమంత్రి ధర్నా వలన తమ ఏరియాలో పోలీసుల నిఘా పెరిగిందని వారు తెలిపారు. కాగా ధర్నా నిర్వహించినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సోమ్ నాధ్ భారతి గుంపుగా తమపై దాడి చేశారని ఉగాండా మహిళలు ఆరోపిస్తున్నారు.

ఆఫ్రికా దేశాల నుండి (ప్రధానంగా ఉగాండా, నైజీరియా) వచ్చినవారు అక్రమ డ్రగ్స్ ర్యాకెట్ నిర్వహిస్తున్నారని, వ్యభిచారం కూడా చేస్తున్నారని ఢిల్లీ వాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసులు ఈ విషయమై అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ మహిళలు రాత్రిళ్ళు వీధుల్లో సంచరిస్తూ కస్టమర్ల కోసం వేటాడుతుంటారని, వీరివల్ల తమకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోందని వారు ఆరోపిస్తున్నారు. తమ ఇబ్బందులను పోలీసులు ఎన్నడూ పట్టించుకోలేదని వారి ఫిర్యాదు. ఢిల్లీ సి.ఎం ధర్నాతో తమ సమస్య మొదటిసారి పట్టింపుకు నోచుకుందని వారు చెబుతున్నారు.

“భారతి (ఢిల్లీ న్యాయ మంత్రి) మా సమస్యను పట్టించుకున్నప్పటి నుండి పరిస్ధితి చాలా మెరుగైందనడంలో సందేహం లేదు. ఆయన గురించీ, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి రకరకాలుగా ఏమేమో చెబుతున్నారు. వాళ్ళు మాకు సాయం చెయ్యడానికే ప్రయత్నించారు. ఇప్పుడు మేము నిలబడ్డ చోటులోనే విదేశీ జాతీయులు తిరుగాడుతూ కస్టమర్ల కోసం వెతుకుతూ ఉండేవారు. అర్ధరాత్రి దాడి, అనంతరం జరిగిన ఆందోళన ఫలితంగా వారి సంఖ్య బాగా పడిపోయింది. ఎఎపి కృషి వల్లనే ఇక్కడ పోలీసుల పెట్రోలింగ్ తీవ్రం అయింది” అని ఖిర్కి ఎక్స్ టెన్షన్ వాసుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు న్యాన్సీ జార్జి చెప్పారని ది హిందు తెలిపింది.

పోలీసులకు వ్యతిరేకంగా ఎఎపి ఆందోళన నిర్వహించడం కూడా సానుకూల పరిణామంగా స్ధానికులు చూస్తున్నారని పత్రిక తెలిపింది. అయితే ఈ ఆందోళన ఫలితంగా పోలీసుల పనితీరు పరీక్షకు గురికావడంతో వారి నుండి ప్రతీకారం ఎదురుకావచ్చని కూడా వారు భయపడుతున్నారని తెలిపింది.

ఎఎపి ధర్నా అనంతరం స్ధానికులు సంతోషం ప్రకటిస్తుండగా ఆఫ్రికన్ దేశాల వారు మాత్రం తమ భద్రత గురించి భయపడుతున్నారని తెలుస్తోంది. పెట్రోలింగ్ పోలీసులు రోడ్డు మీద కనిపిస్తున్న ఆఫ్రికన్లను ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారని ది హిందు తెలిపింది. రోడ్డు పై ఉన్న ముగ్గురు ఆఫ్రికన్ మహిళలను ఎక్కడికి వెళ్తున్నారని పోలీసులు ప్రశ్నించారని, షాపింగ్ మాల్ కి వెళ్తున్నామని వారు చెప్పినా పోలీసులు సంతృప్తి పడలేదని వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారని ది హిందు రిపోర్టర్ తెలిపారు.

స్ధానికంగా నివశిస్తున్న ఆఫ్రికన్ జాతీయులు తమ అభిప్రాయాలూ చెప్పడానికి ముందుకు రాలేదని పత్రిక తెలిపింది. ఒక ఆఫ్రికన్ మహిళ మాత్రం తమను స్ధానికులు బెదిరిస్తున్నారని ఆరోపించింది. స్ధానిక నివాసులు కొందరు తమపై దాడి చేసి వీధుల్లో తిరగొద్దని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందనీ బెదిరించారని ఆమె ఆరోపించింది. రాత్రి పూట తనను ఇంట్లోనే ఉండాలని కోరారని చెప్పింది.

రాజధాని ఢిల్లీ నుండి గత సంవత్సరకాలంలో అనేకమంది ఆఫ్రికన్లను అక్రమంగా నివాసం ఉంటున్నారన్న కారణంతో పోలీసులు పంపించివేశారు. అలా పంపిన వారిలో సగం మంది ఖిర్కి ఎక్స్ టెన్షన్ నుండే ఉన్నారని ఒక కానిస్టేబుల్ చెప్పినట్లు తెలుస్తోంది. కాబట్టి ఖిర్కి ఎక్స్ టెన్షన్ నివాసుల ఆరోపణలు నిజమేనని అర్ధం చేసుకోవచ్చు.

స్వల్పకాలిక లబ్ది కోసం స్ధానికులు కొందరు వెనకా ముందూ చూడకుండా విదేశీయులకు ఇళ్ళు అద్దెకు ఇస్తున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల యజమానులు, ప్రాపర్టీ డీలర్లు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారు ఎక్కడి నుండి వచ్చింది, సరైన అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా అని చూడకుండా నివాసం కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసుల తనిఖీలు జరగకుండా లంచాలు కూడా ఇచ్చి కాపాడుతున్నారని తెలిపారు. అలాంటి వారు స్వల్పకాలంలోనే బాగా డబ్బు గడిస్తున్నారని మిలియన్ల రూపాయలు అర్జిస్తున్నవారు ఉన్నారని వారు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఇలాంటి వారంతా కార్యాలయాలు మూసుకుని అదృశ్యం అయ్యారని స్ధానికులు చెప్పడం విశేషం.

ఇదిలా ఉండగా సోమ్ నాధ్ భారతి, ఆయన అనుచరులు అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారని తమను కొట్టారని ఉగాండా మహిళలు ఆరోపిస్తున్నారు. సోమ్ నాధ్ భారతి అని ప్రత్యేకంగా పేరు చెప్పి ఆరోపించడం విశేషం. ఇలా ఆరోపించిన మహిళ నుండి మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. “సోమ్ నాధ్ భారతి నేతృత్వంలో కొంతమంది భారతీయులు బుధవారం (జనవరి 15 రాత్రి) మాపై దాడి చేశారు… మమ్మల్ని వేధింపులకు గురి చేశారు. మమ్మల్ని కొట్టారు. వారి దగ్గర పొడవాటి కర్రలు ఉన్నాయి. దేశం విడిచి వెళ్లిపోవాలని లేకపోతే ఒక్కొక్కరినీ చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు” అని ఉగాండా మహిళ ఒకరు చెప్పారని పత్రిక తెలిపింది. ఆ రోజు రాత్రి ఆయన తమ ఇంటికి వచ్చారని, మరుసటి రోజు టి.వీల్లో ఆయనను చూశానని అందుకే పేరు చెబుతున్నానని కూడా చెబుతున్నారు.

ఈ ఆరోపణలను సోమ్ నాధ్ భారతి ఖండిస్తున్నారు. తాము ఎవరి పైనా దాడి చేయలేదని, ఎవరిని కొట్టలేదని ఆయన చెప్పారు. టి.వి కెమెరాల ముందే తాము ఉన్నామని తాము అలాంటి చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా రికార్డు అయి ఉంటుందని ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్, వ్యభిచారం ముఠాలను అరికట్టాలని, వారిపై రైడింగ్ చేయాలని తాను పోలీసులను కోరానని కానీ వారు తన ఆదేశాలను బేఖాతరు చేశారని భారతి తెలిపారు. ఈ విధంగా భారతి పోలీసు అధికారులను ఏదో కోరడం, పోలీసు అధికారులు ఆయన ఆదేశాలను తిరస్కరిస్తూ అడ్డంగా తలూపడం.. ఈ దృశ్యాలను ఆంగ్ల ఛానెళ్లు ప్రసారం చేసిన మాట వాస్తవం.

 

2 thoughts on “ఎఎపి ధర్నా: ఢిల్లీ వాసుల సంతృప్తి, కోర్టులో కేసులు

 1. ధర్నా విషయంలో కేజ్రీవాల్‌ని సమర్ధించలేకున్నాను. కేంద్రాన్ని ఒప్పించడానికి ఆయన ఇంకేదైనా విధానాన్ని అవలంభించుంటే బాగుండేదేమో. కానీ ఆయన కోరుతున్న కోరికలు మాత్రం సబబుగానే అనిపిస్తున్నాయి నాకు.

  మంత్రిగారే దగ్గరుండి చేయిజేత వ్యవహారాన్ని నడిపించడం నేను సమర్ధించలేకున్నాను.

  అన్నట్లు నిన్ననుకుంటాను (21-Jan-2014) మనదేశంలో చదువుకుంటున్న నల్లజాతి విద్యార్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులూ, వివక్షలగురించి TOI/Indian Expressలో ఒక వార్త ప్రచురించారు. చదివారా? సినిమాల ప్రభావమేమోగానీ వాళ్ళకు ఇళ్ళు అద్దెకు ఇవ్వడానికి చాలామంది ముందుకురారట, కాలేజీలేమో పాస్పోర్టులు స్వాధీనంచేసుకుంటాయట ఆనక ఫీజులు చెల్లించకపోతే పాస్పోర్టులు తిరిగిచ్చేదిలేదని బెదిరిస్తాయట. ఆటోలవాళ్ళు మీటరుపైరావడానికి అంగీకరించరు, ఏ సందర్శన ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నా మాదగ్గరనుంచి ఎక్కువడబ్బులు వసూలుచేస్తారంటూ ఒక విద్యార్ధి వాపోయారు. అందరు భారతీయులూ చెడ్డవారు కానట్లే అందరు ఆఫ్రికీయులూ చెడ్డవారికాదని విద్యార్ధులు విన్నవించుకున్నట్లు గుర్తు.

 2. సి.ఎం, మంత్రులు ధర్నా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఎన్.టి.ఆర్, నాయుడు ప్రభుత్వాల్లో ఇవి జరిగాయి. ఇటీవల రాహుల్ గాంధీ కూడా ఇలాంటివి చేశాడు. కాకపోతే అవి షో కోసం జరిగితే ఢిల్లీ ధర్నా నిజంగా సమస్యల మీద జరిగింది.

  ఢిల్లీ పోలీసుల సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇంతే. ఇది మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది. సొంత ప్రభుత్వాలు గనక కాంగ్రెస్, బి.జె.పి లు సర్దిపుచ్చాయి గానీ సమస్య మాత్రం తీవ్రమైనదే. డెన్మార్క్ యువతిపై అత్యాచారం జరిగినప్పుడు చాలా మంది ఢిల్లీ ప్రభుత్వాన్ని నిందించారు గానీ కేంద్రాన్ని కాదు.

  ఇంకేదైనా విధానం అందుబాటులో లేకే కదా జనం ఆందోళన మార్గం పడుతున్నది. మన ప్రభుత్వాల దళసరి చర్మాలకు చురుకు ఇంకే విధంగానూ పుట్టదు గాక పుట్టదు.

  చేయి చేసుకోలేదని మంత్రి చెబుతున్నాడు.

  మీరు చెప్పిన వార్త చూళ్లేదు గానీ అలాంటివి గతంలో చదివాను. దళితులకే ఇళ్ళు ఇవ్వరు. ఇక ఆఫ్రికన్ లకి ఇస్తారా? సమస్యకు మూలం మన సామాజిక వ్యవస్ధలోనే ఉంది. బాధితుడిని బట్టి రూపం మారుతుంది, అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s