ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…


ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి తీసింది. ఈ ఆందోళన కాస్తా మిలిటెంట్ రూపం సంతరించుకోవడంతో మంగళవారం పోలీసులు లాఠీ చార్జీకి దిగారు.

అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆందోళనలకు నేతృత్వం వహిస్తూ ధర్నాలకు దిగడంతో కాంగ్రెస్, బి.జె.పి లు సంయుక్తంగా దాడికి దిగాయి. ఢిల్లీ వీధుల్లో అరాచకం సృష్టిస్తున్నాడని సాక్షాత్తు కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే విరుచుకుపడగా, ప్రభుత్వాలు కార్యాలయాల నుండి నడుస్తాయి తప్ప వీధుల్లో పని చేయవు అని బి.జె.పి నేత అరుణ్ జైట్లీ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆఫ్రికా యువతులు వ్యభిచారం చేస్తున్నారని, యువకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఎఎపి చేస్తున్న ఆరోపణలను ‘జాతి విద్వేషం’ (రేసిజం) గా అభివర్ణించేంతవరకు జాతీయ పాలక, ప్రతిపక్ష పార్టీలు వెళ్ళాయి.

కాంగ్రెస్, బి.జె.పి పార్టీల తీవ్రస్ధాయి ఆరోపణలకు సైతం ఎఎపి నేతలు, కార్యకర్తలు బెదరలేదు. నేరస్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరికట్టాలని కోరడం జాతి విద్వేషం ఎలా అవుతుందని ఎదురుదాడికి దిగారు. ఢిల్లీ ప్రజల తరపున మాట్లాడే హక్కు తమకు ఇచ్చారు గానీ హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు కాదని అరవింద్ ఘాటుగా బదులిచ్చారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోవాలని తమ మంత్రి కోరారని, ఆయన ఆదేశాలను తిరస్కరించిన పోలీసులను వెంటనే అరెస్టు చేసి విచారించాలని అరవింద్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో పాటు ఢిల్లీ పోలీసులను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణకు అప్పగించాలన్న డిమాండ్ తో అరవింద్ ధర్నాకు దిగారు.

ఢిల్లీ పోలీసు విభాగం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని హోమ్ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి లో కూడా పోలీసు విభాగం ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన గుర్తు చేశారు. లండన్, ప్యారిస్, బెర్లిన్ తదితర రాజధానుల్లో పోలీసు విభాగం ఎవరి ఆధీనంలో ఉంటుందో హోమ్ మంత్రి సుశీల్ కుమార్ కనుక్కున్నారా? కనీసం వాషింగ్టన్ డి.సి విషయమైనా పూర్తిగా కనుక్కున్నారా?

ఢిల్లీ పోలీసులు ఎవరి ఆధీనంలో ఉండాలన్న సమస్య ఇప్పటిది కాదు. బి.జె.పి (ఎన్.డి.ఏ) పాలనలోనూ ఆ తర్వాత యు.పి.ఏ I & II పాలనల్లోనూ ఈ సమస్య ఎడతెగకుండా నలిగింది. ఢిల్లీ పోలీసుల్ని తమకు అప్పజెప్పాలని బి.జె.పి సి.ఎం మదన్ లాల్ ఖురానా డిమాండ్ చేసినా వాజ్ పేయి ప్రభుత్వం ఒప్పుకోలేదు. షీలా దీక్షిత్ కూడా ఇదే డిమాండ్ అనేకసార్లు లేవనెత్తినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారంపై చెలరేగిన ఆందోళనల పట్ల ఢిల్లీ పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు కూడా షీలా దీక్షిత్ ఈ సమస్యను గుర్తు చేశారు. అప్పుడు కూడా కేంద్ర మంత్రి చిదంబరం అనేక దేశాల రాజధానుల్లో పోలీసులు కేంద్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నారని సెలవిచ్చారు. కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది.

వాషింగ్టన్ డి.సి లో డి.సి పోలీసులు స్ధానిక మేయర్ నియంత్రణలో ఉంటారు. కేపిటల్ పోలీసులు ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. ఇంకా ఎఫ్.బి.ఐ, పార్క్ పోలీస్, సీక్రెట్ పోలీస్, డిప్లొమేటిక్ సెక్యూరిటీ తదితర పోలీసు విభాగాలు కూడా ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. కానీ ఈ విభాగాల విధులు పూర్తిగా వేరు. ప్రజలకు సంబంధించిన శాంతి, భద్రతలు, నేరాలు తదితర అంశాలు డి.సి పోలీసులే నిర్వహిస్తారు. అనగా మన ఢిల్లీ పోలీసులు నిర్వహించే తరహా విధులు నిర్వహించే పోలీసులు వాషింగ్టన్ డి.సిలో స్ధానిక ప్రభుత్వం నియంత్రణలో ఉన్నారు తప్ప షిండే, చిదంబరంలు చెప్పినట్లు ఫెడరల్ ప్రభుత్వం ఆధీనంలో లేరు.

లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగాన్ని నిర్వహించే బ్రిటిష్ హోమ్ ఆఫీస్ కూడా లండన్ పోలీసు విభాగాన్ని క్రమంగా లండన్ మేయర్ కు అప్పజెప్పారు. పోలీసింగ్ మరియు క్రైమ్ విభాగాలను లండన్ మేయర్ నియంత్రిస్తారు. చివరికి ప్రపంచ బహుళజాతి ఫైనాన్స్ పెట్టుబడికి కేంద్రం అయిన ‘ద సిటీ ఆఫ్ లండన్’ (833 మంది పోలీసు అధికారులు విధులు నిర్వర్తించే 1.1 చదరపు మైళ్ళ నగరప్రాంతం) కూడా లండన్ మేయర్ నియంత్రణలోనే ఉంటుంది.

కెనడా రాజధాని ఒట్టావా పోలీసుల్ని మునిసిపల్ పోలీసులు అనే అంటారు. అనగా నగర మేయర్ నియంత్రణలోనే వారు ఉంటారు. ప్యారిస్ లో పోలీసు విధులను స్ధానిక, కేంద్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. అక్కడ 1977 వరకు ఢిల్లీ తరహా ఏర్పాటు ఉండేది. కానీ ప్యారిస్ పోలీసు విభాగానికి మునిసిపాలిటీ కూడా నిధులు ఇస్తుంది. దానితో ట్రాఫిక్, పబ్లిక్ స్ధలాల నిర్వహణ తదితర అంశాలు మేయర్ కిందికి తెచ్చారు.

టోక్యో నగరంలో అతి పెద్ద పోలీసు విభాగం (43,000 మంది పోలీసులు) ఉన్నది. వీరిని టోక్యో మెట్రోపాలిటన్ సేఫ్టీ కమిషన్ నియంత్రిస్తుంది. ఈ కమిషన్ ఒక మంత్రి ఆధీనంలో ఉంటుంది. జపాన్ నేషనల్ పోలీసు విభాగాన్ని నియంత్రించే కమిషన్ కు జపాన్ ప్రధానే ఛైర్మన్. కానీ ఆయనకు నేషనల్ పోలీస్ పై ఉండే అధికారాలు చాలా తక్కువ. ముఖ్యంగా కమాండ్ & కంట్రోల్ పై ఆయనకి అధికారం లేదు.

కాబట్టి దేశ రాజధానుల్లో పోలీసు విభాగం కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండాలన్న రూలేమీ లేదు. పైగా అలా ఉన్న దేశాలు క్రమ క్రమంగా ఆ బాధ్యతను స్ధానిక ప్రభుత్వాలకు అప్పజెప్పాయి. ఢిల్లీ జనాభా 1.7 కోట్లకు పైనే. ఇది జమ్ము & కాశ్మీర్ కన్నా ఎక్కువ. ఢిల్లీ రాష్ట్రం ఏర్పాడ్డాక, ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్న తరుణంలో కూడా పోలీసు విభాగాన్ని కేంద్రం తమ వద్దనే ఉంచుకోవడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో జరిగే అనేక నేరాలకు, ఇతర సమస్యలకు ఢిల్లీ ప్రభుత్వాన్ని తప్పు పడతారు తప్ప కేంద్రాన్ని కాదు. కానీ నేరాలను నియంత్రించే పోలీసులేమో ఢిల్లీ ప్రభుత్వం మాట వినరు.

ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం విషయంలో గానీ ఇప్పుడు ఆఫ్రికన్ల డ్రగ్స్, ప్రాస్టిట్యూషన్ ముఠా విషయంలో గానీ జరిగింది ఇదే. ఆఫ్రికన్లను అన్యాయంగా నిందిస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నారు. కానీ తమ ఆరోపణలకు సాక్ష్యాన్ని ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. ఉగాండా రాయబారి గత సంవత్సరం మే నెలలో రాసిన లేఖ ఇది. దీని ప్రకారం ఉగాండా రాజధాని కంపాలా, ఢిల్లీలు కేంద్రాలుగా సమన్వయంతో డ్రగ్స్ మరియు సెక్స్ ట్రాఫికర్ల ర్యాకెట్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో వ్యభిచారం చేస్తున్నారని ఆఫ్రికన్ మహిళలపై స్ధానికులు ఫిర్యాదు చేయడంతో ఎఎపి ప్రభుత్వం పోలీసులకు తెలిపింది. వారు చర్యలు తీసుకోవడానికి నిరాకరించారు. దానితో ఎఎపి మంత్రి సోమ్ నాధ్ భారతి తమ కార్యకర్తలు వెంటేసుకుని వెళ్ళి కొందరు ఆఫ్రికన్ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎవరూ వ్యభిచారం చేస్తున్నట్లు ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు వాదిస్తున్నారు.

ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. ఢిల్లీ వాసుల ఫిర్యాదులను ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ పోలీసులు ఢిల్లీ ప్రభుత్వం మాట వినరు. పోనీ ఢిల్లీ మంత్రులే పూనుకుంటే అది చట్ట విరుద్ధం అయింది. వ్యభిచారం చేయని మహిళలను కూడా వారు (ఎఎపి ఉత్సాహపరులు) అదుపులోకి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇటువంటి సంక్లిష్ట పరిస్ధితి రీత్యా ఢిల్లీ పోలీసుల సమస్యను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించాలి.

ఆందోళన విరమణ

ఈ ఆర్టికల్ ముగిస్తుండగానే అరవింద్ ఆందోళన విరమించినట్లు పత్రికలు తెలిపాయి. 5 గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేయగా మధ్యే మార్గంగా 2 పోలీసు అధికారులను సెలవుపై వెళ్లాలని కోరాలని కేంద్రం నిర్ణయించింది. దానితో 30 గంటల పాటు సాగిన ధర్నాను ఢిల్లీ సి.ఎం విరమించుకున్నారు. సోమవారం రాత్రంతా రోడ్డు పై గడిపిన అరవింద్ కేబినెట్ సమావేశాన్ని సైతం కారులో నిర్వహించి సంచలనం సృష్టించాడు.

‘ప్రభుత్వాలు వీధుల్లో నడవ్వు’ అని మహా గొప్పగా ప్రకటిస్తున్న కాంగ్రెస్, బి.జె.పి నేతల ప్రకటనలను ఈ సందర్భంగా పరిశీలించాలి. ఈ ప్రకటనే ఒక పెద్ద తమాషా. కేవలం ఆర్భాట పూరితం. ప్రజల సమస్యల పరిష్కారంతో ఎ మాత్రం సంబంధం లేనిది. ప్రభుత్వాలు ఫలానా చోటనే నడవాలని రూల్ పెట్టడం ఏమిటసలు? ప్రజలు ఎక్కడెక్కడ పనులు/శ్రమలు చేస్తారో ఎరుకలో ఉన్నవారెవ్వరూ ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు ఇవ్వరు.

ప్రభుత్వం అవసరం అయితే ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికైనా దిగి రావాలి. ప్రభుత్వం అనేది ఎక్కడో మేఘాల్లోనో, చలువరాతి గోడల మధ్యనో పని చేసేదేమీ కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం పాలన. ప్రజల వలన పాలన. ప్రజల చేత పాలన. అలాంటి ప్రభుత్వం అవసరం అయితే పొలాల్లోకి రావాలి. పల్లెల్లోకి రావాలి. కార్ఖానాల్లోకి రావాలి. పంట చేలల్లోకి రావాలి. నాట్ల దగ్గరికి, కోతల దగ్గరికి, నూర్పుడు దగ్గరికి, ఊడ్చుడు దగ్గరికి, ఎక్కడ ఏయే శ్రమ జరిగితే అక్కడికి రావాలి. అలా వచ్చేదే నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం.

నాలుగు గోడల మధ్య, ఎ.సి మిషన్ల మధ్య, భారీ బల్లల వెనుక రివాల్వింగ్ కుర్చీల లో కూర్చుని నిర్వహిస్తేనే ప్రభుత్వం అనడం కంటే మించిన మోసం, వంచన, హాస్యాస్పదం, ప్రజా వ్యతిరేకం, శ్రామిక వ్యతిరేకం మరొకటి లేదు. బహుశా వీధుల్లోకి ప్రభుత్వాల్ని తెస్తే దొంగచాటుగా నోట్ల కట్టలు వసూలు చేసే దరిద్రగొట్టు ప్రభుత్వ పాలన వల్లకాదన్న భయాలు కాంగ్రెస్, బి.జె.పి లను చుట్టుముట్టి ఉండవచ్చు. 2జి, బొగ్గు లాంటి లక్షల కోట్ల రూపాయల సొమ్ము పట్టపగలు దోచుకుతినే కార్యకలాపాలు ఇలా నాలుగ్గోడల మధ్య నిర్వహించేవే. అందుకే వీధుల్లో ప్రభుత్వాలు అంటే ఈ పేరుగొప్ప జాతీయ పార్టీలు వణికి చస్తున్నాయి.

వీధుల్లోకి, పంట చేలల్లోకి, కార్ఖానాల్లోకి, పరిశ్రమల్లోకి, చివరికి చిట్టచివరి సామాన్యుడి ఇంటి ముందుకి ప్రభుత్వ పాలన తెచ్చిన అద్వితీయ చరిత్ర ఒక్క సోషలిస్టు ప్రభుత్వాల పాలనలోనే సాధ్యమయింది. ఎఎపి పాలన ఆ స్ధాయిలో ఉందని చెప్పడం దుస్సాహసమే అవుతుంది. కానీ కనీసం వీధుల్లో ప్రభుత్వం అన్న కాన్సెప్ట్ ను ఢిల్లీ ప్రజలకు పరిచయం చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రిని అభినందించాల్సిందే.

2 thoughts on “ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

  1. పింగ్‌బ్యాక్: ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా… | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s