కేంద్ర మంత్రి శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ మరణం “ఆకస్మికం, అసహజం” అని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. విష ప్రయోగం జరగలేదని నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు జరుపుతామని తెలిపారు. శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రఖ్యాతి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్ధ డాక్టర్లు ఈ విషయాలు తెలిపారు.
డాక్టర్ల నిర్ధారణలతో హత్య అన్న అనుమానాలు తలెత్తాయి. సునంద పుష్కర్ శరీరంపై గాయాలున్నాయని డాక్టర్లు చెప్పడాన్ని బట్టి ఆమెపై దాడి జరిగిందన్న అనుమానాలు ఏర్పడ్డాయి.
సునందకు అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించిన కిమ్స్ (కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్యులు ఆమె అనారోగ్యం గురించి వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే ఆమె అకస్మాత్తుగా, అసహజ రీతిలో మరణించాల్సిన అనారోగ్యంతో మాత్రం లేరని స్పష్టం చేశారు.
ఎఐఐఎంఎస్ కు చెందిన ముగ్గురు డాక్టర్ల బృందం సునంద పుష్కర్ విగత దేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. “మేము పోస్టు మార్టం పరీక్షలు నిర్వహించాము… ఆమెది ఆకస్మిక, అసహజ మరణం” అని బృందం నేత చెప్పారని ది హిందు తెలిపింది.
అయితే విష ప్రయోగం జరగలేదని ఆయన నిర్ధారించారు. ఈ నిర్ధారణ మరో కోణంలో ఆత్మహత్య కాదన్న సంగతిని పరోక్షంగా చెబుతోంది. “టాక్సికలాజికల్ అనాలసిస్ మరియు విస్కో-పాధలాజికల్ పరీక్షల కోసం నిర్దిష్ట బయోలాజికల్ నమూనాలను భద్రపరిచాము” అని తెలిపారాయన.
“మేము పూర్తి ప్రక్రియను పూర్తి చేశాము. టాక్సికలాజికల్ అనాలసిస్ కోసం నమూనా సేకరించడం అంటే విష ప్రయోగం జరగలేదని నిర్ధారించడం. గుండెకు సంబంధించిన కొంత పాధాలజీని భద్రపరిచాము” అని తెలిపారు. అనగా మరిన్ని పరీక్షలు డాక్టర్లు జరపనున్నారు.
సునంద పుష్కర్ బాగా బలహీనంగా ఉన్నారనీ ఆ కారణం వల్ల తిరువనంతపురం విమానాశ్రయంలో ఆమెను వీల్ చైర్ లో తీసుకెళ్ళాల్సి వచ్చిందని శశి ధరూర్ వ్యక్తిగత సహాయకుడు చెప్పారని పత్రికలు తెలిపాయి. అయితే కిమ్స్ వైద్యులు దీనికి విరుద్ధంగా చెప్పారు. తమ ఆసుపత్రి నుండి ఆమె నడుచుకుంటూ వెళ్లారని, అనంతరం పద్మనాభ ఆలయంలో పూజ సందర్భంగా అందరితో పాటు కింద కూర్చున్నారని వారు విలేఖరులకు గుర్తు చేశారు. చక్రాల కుర్చీలో వెళ్లాల్సిన పరిస్ధితిలో ఆమె లేరని ఈ విధంగా వారు చెప్పినట్లయింది.
శశి ధరూర్ కూడా శనివారం తెల్లవారు ఝామున గుండెపోటుకు గురయ్యారని పత్రికలు తెలిపాయి. ఉదయం 2 గంటల ప్రాంతంలో తీవ్ర గుండె నొప్పిగా ఉందని ఆయన ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎఐఐఎంఎస్ కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జి చేశారని తెలుస్తోంది.
శశి ధరూర్ స్టేట్ మెంట్ తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తన భార్య చనిపోయి ఉండగా చూసిన మొదటి వ్యక్తి శశి ధరూరే.
సునంద దేహంపై ఉన్న గాయాల గురించి చెప్పడానికి కూడా డాక్టర్లు నిరాకరించారు. తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని పోస్టు మార్టం నిర్వహించిన బృందంలో ఒకరయిన డాక్టర్ సుధీర్ కుమార్ గుప్త చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. పోస్టుమార్టం ప్రక్రియను వీడియో కూడా తీశామని, తద్వారా పారదర్శకత ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఇండియా టుడే పత్రిక ప్రకారం గదిలో ఘర్షణ జరిగిందనడానికి ఆధారాలు లేవు. “ఘర్షణ జరిగిందనడానికి గదిలో అసాధారణమైన అంశాలేమీ కనిపించలేదు. ఆమెను మొదట చూసినపుడు మంచంపై మామూలుగా పడుకున్న ఫోజులో కనిపించారు. నైట్ సూట్ (టాప్, పైజమా) లో ఉన్నారు. వంటిపై దుప్పటి కప్పుకుని ఉన్నారు. కానీ మొఖం పైన దుప్పటి లేదు. శరీరంపై కొన్ని నీలి మార్కులు కనిపించాయి. కొన్ని సార్లు అలా జరగడం సాధారణమే అని డాక్టర్లు చెప్పారు” అని పోలీసులు చెప్పారని ఇండియా టుడే తెలిపింది. కానీ ఇది పోస్టుమార్టం నివేదిక వెలువడడానికి ముందు సంగతి. నీలి మార్కులే గాయాలుగా డాక్టర్లు నిర్ధారించినట్లు కనిపిస్తోంది.
ఔషధాలను ప్రమాద వశాత్తూ అవసరమైన మొత్తం కంటే ఎక్కువ (ఓవర్ డోస్) తీసుకోవడం వలన సునంద మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు కూడా ఇండియా టుడే తెలిపింది. యాంటీ-డిప్రెసెంట్ మందులు ఇలా ఓవర్ డోస్ లో తీసుకుంటే రోగి ఊపిరి సమస్యలు ఎదుర్కొంటారని, ఊపిరి తిత్తులు పెరాలసిస్ కు గురవుతాయని పత్రిక తెలిపింది. ఇది కూడా పోస్టుమార్టంకు ముందే.
హిందూస్ధాన్ టైమ్స్ పత్రిక ప్రకారం హోటల్ గదిలోకి మారడానికి ముందు దంపతులు ఇరువురి మధ్యా చిన్న పాటి తగాదా జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ సంగతి ఇతర పత్రికలు చెప్పలేదు.
ఆమె మరణానికి ముందు ఆమె చేసిన ట్వీట్స్ ప్రకారం అమె భర్తకి ఐ ఎస్ ఐ తో సంబంధాలున్న ఆమెతో అక్రమ సంబంధం ఉంది అని తెలుస్తొంది. దీనిప్రకారం అమె మరణాం వెనుక ఐ ఎస్ ఐ హస్తం కూడా ఉండి ఉండవచ్చు.