ఎర్ర తివాచీ పైన నడిచి వచ్చినట్లుగా ఢిల్లీ ఎన్నికల్లో నెగ్గి వచ్చిన ఎఎపికి పాలనలోకి వచ్చాక గాని మర్మం బోధపడలేదని ఈ కార్టూన్ సూచిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి లు చెప్పేది కూడా ఇదేగా? అవినీతిని అంతం చేయడానికి జన్ లోక్ పాల్ తేవాలంటూ అన్నా, అరవింద్ ల బృందం ఆందోళన చేస్తున్నపుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది’ అని సవాలు విసిరాయి రాజకీయ పార్టీలు.
సవాలు స్వీకరించిన అరవింద్ ఎఎపి కి అంకురార్పణ చేయగా రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని అవినీతి వ్యతిరేక నేతలు పక్కకు తప్పుకున్నారు. అలా పక్కకు తప్పుకున్నవారే తెలివిగా వ్యవహరించారా అన్న శంక ఎఎపి నాయకత్వానికి వచ్చిందని కూడా ఈ కార్టూన్ సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి వ్యవస్ధను సమస్యలమయం చేసిందే ఈ రాజకీయ పార్టీలు కాదా? ప్రత్యామ్న్యాయ పార్టీలు, అవినీతిని నిర్మూలించే పార్టీలు ఆశలు రేకెత్తించే పార్టీ ఉద్భవిస్తే అటువంటి పార్టీకి ఎర్ర తివాచీ పరిచేలా జనాన్ని మొహం మొత్తించింది ఈ పార్టీలే కాదా? స్వార్ధ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టని పార్టీల వల్లనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిధిలో వ్యవస్ధను బాగు చేసుకునే పరిస్ధితి కరువయింది.
అందుకే వ్యవస్ధను చీపురు పట్టుకుని శుభ్రం చేయడం కాదు కావాల్సింది. మురికి, మరింత మురికిని చేరదీస్తుంది అన్నట్లుగా పార్లమెంటరీ మురికిలో ఎన్నాళ్లు దొర్లినా మురికి పెరిగేదే గానీ తరిగేది కాదు. ఎన్నికల మురికిని వదిలించడం చీపురుకు సాధ్యమైందేమో గానీ వ్యవస్ధ మురికిని వదిలించడానికి మాత్రం అది సరిపోదు గాక సరిపోదు. మూడు వారాల పాలనలో ఎఎపి ప్రభుత్వానికి ఎదురయిన కాసిన్ని అనుభవాలే ఆ సంగతి చెబుతున్నాయి.
లేకపోతే లంచం అడిగిన పోలీసుల్ని శిక్షించలేని పరిస్ధితిలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఉంటాడు? సాధారణ పోలీసుల విషయంలో వీరాలాపాలు వల్లిస్తున్న అరవింద్ ఆయన శుభ్రం చేయాల్సిన మురికి ఇంకా పై స్ధాయిలో అట్టలు కట్టుకుని ఉన్న సంగతి ఎప్పటికీ గ్రహిస్తారో? లేక అక్కడి వరకూ వెళ్ళే ఆలోచనే ఆయనకు లేదా?
Sir, It will take time to clean or destroy the 60 years accumulated అవినీతిని. It is also highly impossible to clean the accumulated avineeti single handedly. The media should not criticise their efforts unjustifiably. My request to print and TV media is to encourage the good deeds more and criticise less or advise them properly.