ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా బొగ్గు తవ్వి పారేస్తున్న కంపెనీలు కొన్నాయితే పర్యావరణ అనుమతులు లేకుండానే లక్షల టన్నుల బొగ్గు గనుల్ని అట్టే పెట్టుకున్న కంపెనీలు మరి కొన్ని. ఇవి సాదా సీదా కంపెనీలు కూడా కాదు. భారత దేశ పారిశ్రామిక ప్రగతికి సంకేతాలుగా పాలకులు సగర్వంగా చాటుకునే కంపెనీలు. జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్, ఆర్సిలర్ మిట్టల్, అదాని పవర్.. ఇత్యాది కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. బొగ్గు కేటాయింపులకు కేంద్రం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసులు కొన్నింటిని పక్కన పెట్టడమే కాకుండా అసలు ఎవరూ సిఫారసు చెయ్యని కంపెనీలకు ప్రేమతో వేలాది ఎకరాల గనుల్ని కట్టపెట్టడం పైన సుప్రీం కోర్టు సైతం విస్మయం ప్రకటించింది. ఇదంతా మన ప్రధాని మన్మోహన్ నేతృత్వంలో జరగడం మరో విశేషం.
పర్యావరణ అనుమతులు లేకుండా సంవత్సరాల తరబడి బొగ్గు గనుల్ని దగ్గర పెట్టుకున్న కంపెనీలపైన కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు నిలదీసింది. ఇలా నిలదీసిన తర్వాత మాత్రమే 61 ప్రైవేటు కంపెనీలకు ‘బొగ్గు కేటాయింపులు రద్దు చేయాల్సి ఉంటుందని’ హెచ్చరిస్తూ బొగ్గు శాఖ హెచ్చరిక నోటీసులు పంపింది. కేప్టివ్ మైనింగ్ (విద్యుత్, ఉక్కు తదితర పరిశ్రమల వినియోగం కోసం మాత్రమే బొగ్గు వాడాలన్న షరతుతో తీసుకున్న బొగ్గు గనులు) కోసం అని చెప్పి తీసుకున్న ఈ గనులకు పర్యావరణ అనుమతి తీసుకోవడానికి బడా బడా ప్రైవేటు కంపెనీలు ఇంతవరకు ప్రయత్నించలేదు.
అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ఈ గనుల్లో బొగ్గు తవ్వడానికి వీలు లేదు. కొన్ని కంపెనీలు అనుమతి లేకుండానే బొగ్గు తవ్వేస్తుంటే మిగిలినవి గనుల్ని తమ వద్ద అట్టే పెట్టుకున్నాయి. కనీసం కేప్టివ్ మైనింగ్ వినియోగానికి కూడా వారు ప్రయత్నించలేదు. తమ తాతల ముల్లె అన్నట్లు అవి వేలాది ఎకరాల గనుల్ని తమ వద్ద ఉంచేసుకున్నాయి. కొన్ని కంపెనీలయితే మారు బేరానికి అమ్మేసుకున్నాయి కూడాను.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కూడా సరిగ్గా ఇదే జరగడం గమనార్హం. ఊరూ పేరూ, అనుభవమూ లేని పేర్లతో లైసెన్సులు తీసుకోని విదేశీ ప్రైవేటు కంపెనీలకు భారీ అమ్ముకున్న నీతి మాలిన పనులకు మన పారిశ్రామికవేత్తలు పాల్పడ్డారు. ఇలాంటి 2జి లైసెన్సులను 122 సుప్రీం కోర్టు ఒక్క కలం పోటుతో రద్దు చేసేసింది. బొగ్గు లైసెన్స్ లను కూడా ఇలాగే రద్దు చేస్తుందని అంతా భావించారు. తీరా చూస్తే సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈ తీర్పు ప్రకటించే లోపు అటవీ, పర్యావరణ అనుమతులను హడావుడిగా ఇచ్చేసినా ఆశ్చర్యం లేదు. ప్రభుత్వాలు ఉన్నదే అందుకు కదా!
అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని, ఫిబ్రవరి 2012 లోపు అనుమతి తీసుకోవాలని బొగ్గు శాఖ పైన ఉదహరించిన బడా కంపెనీలకు గడువు విధించింది. ఆ గడువు ముగిసి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి చర్యలు లేవు. ఇదేమిటని మొన్న సుప్రీం కోర్టు అడిగాకే నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి బొగ్గు గనుల రాష్ట్రాల అధికార పరిధిలోనివి. కానీ రాష్ట్రాలను సంప్రదించకుండానే మన్మోహన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఇష్టా రీతిన బొగ్గు గనుల రాసిచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకున్నారా అని కోర్టు అడిగితే తీసుకున్నాం అని కేంద్రం చెప్పింది. తీరా రాష్ట్రాలేమో తమకసలు చెప్పనేలేదని సుప్రీం కోర్టులో అఫిడవిట్లు సమర్పించాయి. అంటే కేంద్ర ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు అబద్ధం చెబుతుంది. అదీ ప్రజలకు చెందిన లక్షలాది కోట్ల విలువ చేసే బొగ్గు గనుల విషయంలో?
బొగ్గు శాఖ జనవరి 15 జారీ చేసిన నోటీసు ప్రకారం బొగ్గు గనులను తవ్వకపోయినా, పాక్షికంగా తవ్వినా వాటికి ఇంకా అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోని పక్షంలో వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇలా 61 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. పాక్షికంగా తవ్వడం అంటే ఏమిటి? అటవీ, పర్యావరణ అనుమతి లేకుండానే బొగ్గు తవ్వి వాడుకున్నారని అర్ధం. ఇక చట్టాలు చేసేది ఎందుకు? ప్రజల ప్రయోజనమే తమకు పరమావధి అని చెప్పుకోవడానికి చట్టాలు చేస్తారు. దేశం అభివృద్ధి చెందుతోందహో అని చాటుకోవడానికేమో ఆ చట్టాలను అడ్డంగా ఉల్లంఘించడానికి కంపెనీలను అనుమతిస్తారు. మన్మోహన్ సింగ్ లాంటి ఆర్ధిక వీరులు చెప్పే అభివృద్ధి వాస్తవానికి కంపెనీలదే అనీ ప్రజలది కాదని అర్ధం కావడానికి ఇంతకు మించి సాక్ష్యం ఏమి కావాలి? ఘోరం ఏమిటంటే వీరికి కోర్టుల భయం కూడా ఏమీ లేదు. వీరి అరాచకాలను అరికట్టడానికి నిర్ణయాత్మక ప్రయత్నాలను కోర్టులు కూడా చేయవు. ఒకవేళ చేసినా ‘ఇలాగైతే అభివృద్ధి కష్టం’ అని ఆరోపించడానికి మన ప్రధాన మంత్రే సిద్ధంగా ఉంటారు.
ఇంతోసి దానికి సి.బి.ఐ విచారణ అంటూ హడావుడి ఎందుకు? కంపెనీలు, ప్రభుత్వాల అక్రమాలను ఆడిట్ చేయడానికి కాగ్ అనే రాజ్యాంగబద్ధ సంస్ధ ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? చేసేదే చెప్పేస్తే, వాటినే చట్టాలుగా చేసుకుంటే సరిపోదా? అప్పుడైనా జనానికి విషయం అర్ధం అయ్యి తాము చేసేదేదో చేసుకుంటారు. (ఆఫ్ కోర్స్! జనం తాము చేసేదేదో చేస్తారనే ఈ నాటకాలన్నీ అనుకోండి!)
అటవీ, పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వ విభాగాలు, కంపెనీలు సమావేశాల మీద సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటూ ఉంటాయి. సి.బి.ఐ యేమో విచారణలు చేస్తూ ఉంటుంది. కాగ్ యేమో టన్నుల కోద్దీ రిపోర్టులు రాసి పార్లమెంటులు, అసెంబ్లీల్లో పెడుతూ ఉంటారు. కోర్టులేమో సంవత్సరాల తరబడి వాదప్రతివాదాలు వింటూ కూడా తీర్పులు రిజర్వ్ చేసుకుంటాయి. ఈ లోపు అడవులు తెగి పడుతుంటాయి. తెగి పడుతున్న అడవుల సాక్షిగా కంపెనీలు అటవీ, పర్యావరణ అనుమతులను తెచ్చుకుని పండగ చేసుకుంటాయి. అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న షరతు పెట్టిందే అభివృద్ధి పేరుతో ప్రకృతినీ తద్వారా మానవ జీవనాన్నీ విధ్వంసం చేయకుండా చూడాలని. కానీ జరుగుతున్నదేమో విధ్వంసం అంతా జరిగాక, అంతా శుభ్రం అయ్యాక, ఇక నాశనం అయ్యే అడవులు, పర్యావరణం ఏమీ లేకుండా పోయాక కంపెనీలు విజయవంతంగా అనుమతులు సాధించడం! ఈ కార్టూన్ వివరిస్తున్నది అదే.