తమ పని మనిషి విషయంలో దేవయాని వీసా ఫ్రాడ్ కి పాల్పడిందని అమెరికా ఆరోపించింది. అమెరికన్ అయినా-ఇండియన్ అయినా, ధనికులైనా-పేదలైనా, యజమాని ఐనా-పని మనిషి ఐనా ఇలాంటి నేరాలు సహించేది లేదని హుంకరించింది. అయితే దేవయాని చేసిందంటున్న నేరంలో భారత ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు. అనగా ఫలానా పద్ధతుల ద్వారా పని మనుషుల్ని అమెరికా తీసుకెళ్లవచ్చని భారత ప్రభుత్వం సూచనలు, సలహాలు ఏమీ ఇవ్వలేదు.
కానీ ఇండియాలో ఆదాయ పన్ను చెల్లించకుండా ఉండడానికి, తమతో పాటు తీసుకెళ్లే జీవిత భాగస్వాములకు ప్రత్యేక వర్క్ వీసా పొందాల్సిన అవసరం లేకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాలో తమ రాయబారులకు అమెరికా ప్రభుత్వమే నేర్పించి పంపిందంటే నమ్మగలరా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ సంగతి బైటికి లాగింది భారత పత్రికలు కాదు. అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్!
న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం ఇండియాలో నియమితులయ్యే రాయబారులకు, వారి సిబ్బందికి అమెరికా విదేశాంగ శాఖ సూచనలు, సలహాలతో కూడిన కరపత్రం ఇస్తుంది. ఇందులో ఏయే అబద్ధాలు చెప్పి భారత చట్టాల బారిన పడకుండా తప్పించుకోవచ్చో వివరించి ఉంటుంది. ముఖ్యంగా రాయబార అధికారులు, ఇతర సిబ్బంది భార్య లేదా భర్త అమెరికన్ ఎంబసీ స్కూల్ లో గానీ ఇతర అనుబంధ సంస్ధల్లో గానీ ఉద్యోగం చేసేవారయితే వారు అబద్ధం చెప్పాల్సిందేనని సలహా ఇస్తుంది. లేనట్లయితే ప్రత్యేకంగా వర్క్ వీసా పొందాల్సి ఉంటుందని, అంతేకాకుండా వేతనాలు పొందుతున్నందుకు ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుందని కరపత్రం ద్వారా ఇస్తుంది. అంటే వీసా ఫ్రాడ్ మాత్రమే కాకుండా టాక్స్ ఫ్రాడ్ కి కూడా అమెరికా రాయబారులు పాల్పడుతున్నారు.
సంగీతకు అమెరికా వీసా పొందడానికి ఒక వేతన కాంట్రాక్టు, వాస్తవ వేతనం చెల్లించేందుకు మరొక వేతన కాంట్రాక్టూ దేవయాని కుదుర్చుకున్నారని, తద్వారా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి సంగీతకు వీసా పొందారని అమెరికా ఆరోపించింది. ఇది ‘వీసా ఫ్రాడ్’ నేరం అనీ, దీనికి గరిష్టంగా 10 సం.లు శిక్ష వేయాలని న్యూయార్క్ అటార్నీ ప్రీత్ భరార అట్టహాసంగా తమ కోర్టును కోరాడు. దేవయాని పట్ల అమెరికా పోలీసులు వ్యవహరించిన అమానవీయ తీరు పట్ల ఆగ్రహం ప్రకటించిన భారత పత్రికలను ‘సంగీత గోడు’ మీకు పట్టదా అని ప్రశ్నించాడా పెద్ద మనిషి. అసలు బాధితురాలు సంగీత అయితే దేవయానిని బాధితురాలిని చేయడం అంటే సంగీత పేదరాలు అయినందుకే కదా? అని వర్గ చైతన్యం కూడా ప్రదర్శించాడు ప్రీత్ భరార!
దేవయాని వేతనమే 6,500 డాలర్లు అయినప్పుడు ఆమె $4,500 డాలర్లు పెట్టి పని మనిషిని పెట్టుకునే సమస్యే ఉండదు. భారత కనీస వేతనాల చట్టం ప్రకారం చూస్తే దేవయాని చెల్లించిన రు. 30,000/- ఒక గజిటెడ్ అధికారి వేతనంతో సమానం. అమెరికా చట్టాల ప్రకారం అది తప్పే అని వాదనకు అంగీకరిద్దాం. కానీ ఆమె కరుడు గట్టిన నేరస్ధురాలేమీ కాదు. మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారీ కాదు. హంతకురాలు అసలే కాదు. ఏమీ కాకపోయినా అలాంటి నేరస్ధులకు మల్లే బేడీలు వేసి, బట్టలు విప్పించి తనిఖీ చేయాల్సిన అవసరం ఏమిటి? దొంగల మధ్యా, సెక్స్ వర్కర్ల మధ్యా, మాదకద్రవ్య అక్రమార్కుల మధ్యా ఖైదు చేయాల్సిన అవసరం ఏమిటి?
భారత పత్రికలు గానీ, ప్రభుత్వం గానీ ప్రధానంగా అడిగినవి ఈ ప్రశ్నలే. రాయబార రక్షణ ఉన్నందున నేరారోపణలు ఉపసంహరించాలని ఇండియా డిమాండ్ చేసింది. ఏ దేశం అయినా చేసే పనే ఇది. కానీ రెండు కాంట్రాక్టులు ఇవ్వాలని భారత ప్రభుత్వం ఏమీ సలహా ఇవ్వలేదు. అబద్ధాలు ఆడాలని కరపత్రం ప్రచురించి మరీ సూచన ఇవ్వలేదు. వెళ్ళేది టీచింగ్ పనికైతే ‘హౌస్ వైఫ్’ అని మాత్రమే చెప్పండి అని అసత్యాలు చెప్పమనలేదు. కానీ అమెరికా ప్రభుత్వం ఇవన్నీ చేసింది. “ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి” అన్న సూత్రాన్ని ఏకంగా అమెరికా ప్రభుత్వమే పాటించడం ఎలా చూడాలి?
అమెరికన్ ఎంబసీ స్కూల్ (ఎ.ఇ.ఎస్) అనేక విధాలుగా భారత చట్టాలను ఉల్లంఘిస్తోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడి చేసింది. 1972 నుండి ఆదాయ పన్ను చట్టాలను అతిక్రమించడం ఒక నేరం. 1972 నుండి అమెరికా రాయబారుల భార్యలు/భర్తలు ఎగవేసిన పన్నులను, ఎగవేతపై విధించే అపరాధ రుసుమునూ లెక్క గడితే అనేక కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది.
ఒక పద్ధతి ప్రకారం వీసా ఫ్రాడ్ మరియు టాక్స్ ఫ్రాడ్ లకు పాల్పడడం మరొక ఘోరమైన నేరం. వీసా మరియు పన్నుల మోసాలకు పాల్పడడం వెనుక అమెరికా ప్రభుత్వ ప్రత్యక్ష ప్రోత్సాహం ఉండడం ఇంకా ఘోరమైన నేరం. అమెరికా విదేశాంగ శాఖ మద్దతుతోనే అమెరికా ఎంబసీ ఈ నేరాలకు పాల్పడిందా అన్నది తెలియలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక చెబుతోంది. కానీ విదేశాంగ శాఖ మద్దతు లేకుండా కేవలం ఇండియాలోని అమెరికా ఎంబసీ మాత్రమే ఇలాంటి నేరానికి పూనుకోవడం అసాధ్యం. కరపత్రాలు (handout) ముద్రించి మరీ వీసా, పన్నుల మోసాలకు పాల్పడేలా సలహాలు, సూచనలు ఇవ్వడం అది కూడా దశాబ్దాలుగా చేయడం వెనుక అమెరికా ఎంబసీ పాత్ర మాత్రమే ఉందనడం ఇంకో మోసమే అవుతుంది.
ఇండియాలోని అమెరికన్ ఎంబసీ కార్యాలయాల్లో గానీ, కాన్సల్ జనరల్ కార్యాలయాల్లో గానీ నియమితులయ్యే అమెరికా రాయబార సిబ్బంది తమతో పాటు తమ జీవిత భాగస్వాములను, పిల్లలను తెచ్చుకోవడం సహజమే. కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వీసా ఇచ్చే పరిస్ధితి లేకుండా దేశాలు పరస్పరం సహకరించుకోవడం కూడా సహజమే. అంటే భార్యా, పిల్లలకు ప్రత్యేకంగా వీసా ఇచ్చే అవసరం లేకుండా నిబంధనలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ భార్య లేదా భర్త ఇండియాలో వేరే ఉద్యోగం చేసేందుకు వచ్చే పనైతే వారు వర్క్ వీసా తీసుకోవడం తప్పనిసరి. వాళ్ళు ఇక్కడ ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వీసా, పన్నులను తప్పించుకోవడానికి వీలుగా రాయబారుల భార్యలు సంబంధిత పత్రాలు నింపేటప్పుడే ‘హౌస్ వైఫ్’ అని నింపాలని అమెరికా ఎంబసీ తమ ఉద్యోగులకు ఇచ్చిన పత్రంలో పేర్కొందని ఎన్.వై.టైమ్స్ తెలిపింది.
ఈ వార్తను ఫస్ట్ పోస్ట్ పత్రిక కూడా తమ సొంత రిపోర్ట్ ద్వారా ధృవీకరించింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ స్కూల్ లో పని చేస్తున్న అమెరికన్ ఉపాధ్యాయుల్లో కనీసం 16 మంది ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వీసా దరఖాస్తుల్లో నింపి అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనగా 16 మంది అమెరికన్ దేవయానిలు ఒక్క ఢిల్లీ లోనే ఉన్నారు. కానీ అమెరికా స్కూళ్ళు ఒక్క ఢిల్లీలోనే కాదు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అనేకమంది రాయబారుల భార్యలు/భర్తలు, కాన్సల్ జనరల్ సిబ్బంది భార్యలు/భర్తలు టీచింగ్ లేదా ఇతర ఉద్యోగాల్లో పని చేస్తున్నారు. వీరిలో ఎవ్వరూ తాము ఉద్యోగం చేస్తున్నామని అధికారికంగా వీసా దరఖాస్తుల్లో చెప్పి రాలేదు. తమ భాగస్వామితో కలిసి ఉండడానికే వస్తున్నామని చెప్పి వచ్చారు. ముంబై, చెన్నై స్కూళ్ళలో పని చేస్తున్నవారిని కూడా లెక్కిస్తే వీసా ఫ్రాడ్, టాక్స్ ఫ్రాడ్ నేరస్ధుల సంఖ్య భారీగా ఉంటుందని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.
ఆదాయ పన్ను మోసం ఎంత ఘారానాగా చేస్తున్నారంటే ‘మరీ ఇంత కక్కుర్తా?’ అని ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాయబార ఉద్యోగికి బ్యాంకు ఖాతా ఎలాగూ తప్పనిసరి. కానీ ఆయన భార్య ఎ.ఇ.ఎస్ లో జాబ్ చేస్తుంటే గనుక ఆమె నెల వేతనానికి కూడా మరో ఖాతా తెరుస్తారని భావిస్తాము. కానీ వాస్తవం అలా లేదు. అదనపు ఉద్యోగం చేసే భార్య కూడా తమ భర్త ఖాతాలోనే వేతనం జమ చేసుకునేలా అమెరికా రాయబారులు ఎత్తులు వేశారు. దానితో భార్యల వేతనాలకు, ఉద్యోగాలకు రికార్డులు లేకుండా పోయాయి. ఎ.ఇ.ఎస్ లో పని చేసే అమెరికన్ సిబ్బంది వేతనాలకు రికార్డులు లేవని అమెరికా ఎంబసీ చెబుతుంటే ఏమిటా అనుకున్నాం. అసలు కారణం ఇది. వర్క్ వీసా తీసుకోకుండా ఎగవేయడానికీ, భారీ వేతనాలపైన ఆదాయ పన్నులు చెల్లించకుండా ఎగవేయడానికీ భార్యా, భర్తలు ఇరువురూ ఒకే ఖాతా నిర్వహించే చావు తెలివిని అమెరికా అవలంబిస్తోంది లేదా అమెరికా రాయబారులు వారి భార్యలు/భర్తలు అవలంబిస్తున్నారు. అనగా వేతనాలు రెండు, బ్యాంకు ఖాతా మాత్రం ఒకటే.
ఇలా ఒకే ఖాతా వల్ల రెండు నష్టాలు ఉన్నాయి. అమెరికా రాయబారులకు భారత ప్రభుత్వం ఆదాయ పన్ను రాయితీ ఇస్తుంది. కాబట్టి రాయబారి ఖాతాలో జమ అయే మొత్తానికి ఆదాయ పన్ను ఉండదు. ఇది ఒక నష్టం. రాయబరుల ఉద్యోగాలకు, వేతనాలకు సాక్ష్యాలు లేకపోవడం మరొక నష్టం. ఇది అక్రమ పన్ను ఎగవేత కిందికే కాకుండా అక్రమ ఆదాయం కిందికి కూడా వస్తుంది. పైగా సాక్ష్యాలు తారుమారు చేయడం లేదా మాయం చేయడం మరొక నేరం. ఇప్పుడు ఎన్ని నేరాలకు అమెరికా రాయబారులు పాల్పడుతున్నట్లు?
1. వీసాలో తప్పుడు సమాచారం ఇవ్వడం.
2. తప్పుడు సమాచారంతో వీసా పొందడం.
3. ఒకే ఖాతా నిర్వహించడం ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడడం.
4. సంపాదనకు సోర్స్ ఏమిటో చెప్పకపోవడం లేదా మనీ లాండరింగ్ కు పాల్పడడం.
5. ఆదాయ పన్ను ఎగవేయడం.
6. వర్క్ వీసా లేకుండా అక్రమంగా ఉద్యోగం చేస్తూ దేశంలో నివాసం ఉండడం.
ఈ నేరాలన్నింటికి భారత శిక్షా స్మృతిలో వివిధ సెక్షన్లు, వివిధ శిక్షలు కేటాయించబడి ఉన్నాయి. ఇదంతా కలిపి చూస్తే ఇదో పెద్ద కుంభకోణం. దశాబ్దాలుగా దర్జాగా సాగిస్తున్న కుంభకోణం. భారత పాలకుల స్నేహ (సేవక) స్వభావాన్ని వినియోగించుకుంటూ పాల్పడిన కుంభకోణం. ఇది వీసా కుంభకోణం, ఇది పన్ను కుంభకోణం, ఇది మనీ లాండరింగ్ కుంభకోణం, ఇది అబద్ధాల కుంభకోణం. అసత్యాలను సత్యాలుగానూ, సత్యాలను అసత్యాలుగానూ మలిచే సత్యాసత్య కుంభకోణం.
ఎన్.వై.టి చెప్పిన 16 మంది ఎ.ఇ.ఎస్ (ఢిల్లీ) టీచర్ల తమ జీవిత భాగస్వాముల రాయబార హోదా అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్నవారే. తాము హౌస్ వైఫ్ గా వస్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చాక ఎ.ఇ.ఎస్ లో టీచర్ గా కోట్లు ఆర్జిస్తున్నారు. సదరు కోట్ల సంపాదనకు పన్ను చెల్లించకుండా మరిన్ని కోట్లు అక్రమంగా మిగుల్చుకుంటున్నారు. ఫస్ట్ పోస్ట్ ప్రకారం ఒక్క ఢిల్లీ లోని ఎ.ఇ.ఎస్ టర్నోవరే సాలీనా రు. 120 కోట్లు. ఐ.వి.లీగ్ స్కూళ్లకు కూడా ఇంత టర్నోవర్ ఉంటుందో లేదో మరి. ఈ డబ్బులో అధిక భాగం పైన పన్నులు లేవు. ఈ డబ్బు కూడా రాయబారుల సంపాదన కిందనే దేశం దాటి పోతోంది. ఆ విధంగా మన విదేశీ మారక ద్రవ్యానికి కూడా నష్టమే.
ఢిల్లీ లోని ఎ.ఇ.ఎస్ గురించి న్యూయార్క్ టైమ్స్ ఏం రాసిందో చూడండి.
The school… has a swimming pool, tennis courts and vast athletic fields. Its stone classroom buildings and generous libraries could grace an Ivy League campus. Its price tag — around $20,000 a year — rivals that of some of New York City’s top private schools. A small army of uniformed security men patrol its perimeter.
ఇలాంటి పాఠశాలలో 1500 మంది విద్యార్ధులు ఉంటే అందులో మూడింట ఒక వంతు మంది అమెరికా రాయబారుల పిల్లలే. 20 శాతం మంది దక్షిణ కొరియాకు చెందిన పిల్లలట. అంటే ద.కొ రాయబారుల పిల్లలే కాకుండా ఆ దేశం నుండి ఇతరుల పిల్లలు కూడా ఇక్కడ అడ్మిషన్ పొందుతున్నారని భావించవచ్చు. ఇతరులు అందరూ వివిధ దేశాలకు చెందిన రాయబారుల పిల్లలు అని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. బహుశా భారతీయ పిల్లలకు ఇక్కడ అడ్మిషన్ పొందేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి స్పష్టం అవుతోంది.
భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అమెరికా రాయబారులు అనుసరిస్తున్న పద్ధతిని చట్ట విరుద్ధంగా అభివర్ణించారని ఎన్.వై.టి తెలిపింది. ఎ.ఇ.ఎస్ టీచర్లకు అమెరికా ఎంబసీ ఇచ్చిన కరపత్రం కూడా చట్ట విరుద్ధం అనీ, అందులోని అంశాలు “భారత పన్నుల చట్టానికి స్పష్టంగా విరుద్ధం” అనీ ఆయన విమర్శించారని తెలిపింది. కరపత్రం గురించి ఎన్.వై.టి ఇలా రాసింది.
The handout notes that India has placed restrictions on the number of tax-free visas available to school employees. “So, if you are a teaching couple,” the handout says, “we usually have the male spouse apply for the ‘employment’ visa and the female spouse be noted as ‘housewife’ on the visa application.”
అనగా, ఒక్క రాయబారుల జంట మాత్రమే కాదు. భార్యా, భర్తలు ఇరువురూ టీచర్లు అయినా వారు పన్నులు ఎగవేయడానికి మార్గాన్ని అమెరికా ఎంబసీ సూచించింది. ఇరువురిలో భర్త మాత్రమే టీచర్ గా చెప్పాలని భార్య టీచర్ అయినా అది చెప్పకుండా ‘హౌస్ వైఫ్’ అని తమ వీసా దరఖాస్తులో రాయాలని అమెరికన్ ఎంబసీ సూచించింది.
ఈ విషయాలు రాస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక చమత్కారం చేసింది. పన్నులు ఎగవేయడం భారత దేశంలో చాలా మామూలు వ్యవహారమేనని చెప్పుకొచ్చింది. భారతీయ ధనికులు పన్నులు ఎగవేస్తున్నట్లే తమ వాళ్ళూ ఎగవేశారని చెప్పుకోవడానికి సదరు పత్రిక ఒక వ్యర్ధ ప్రయత్నం చేసిందన్నమాట! భారతీయుల్లో కేవలం 42,800 మంది మాత్రమే తమ వార్షిక ఆదాయం రు. 1 కోటికి మించి సంపాదిస్తున్నామని చెప్పినట్లు ఆర్ధిక మంత్రి చిదంబరం చెప్పారనీ కానీ అక్కడ శాలినా 25,000 లగ్జరీ కార్లు అమ్ముడుబోతాయని చెప్పుకొచ్చింది. కాబట్టి కోటికి మించిన ఆదాయం పొందేవారి సంఖ్య 42,800 కంటే చాలా ఎక్కువే అని పత్రిక చెప్పదలిచింది.
ఎన్ని చెప్పినా అమెరికా రాయబారులు, వారి టీచర్లు వీసా ఫ్రాడ్, టాక్స్ ఫ్రాడ్ లకు పాల్పడ్డారన్న వాస్తవాన్ని అవి కప్పి పుచ్చలేవు కదా! భారతీయుల పన్నుల ఎగవేత, అమెరికన్ల పన్ను ఎగవేతను సక్రమం చేయజాలదు కదా! ఆ మాటకొస్తే తప్పుడు లెక్కలు చూపి పన్నులు ఎగవేసే కంపెనీలకు అమెరికాలో కొదవా? 17 ట్రిలియన్ డాలర్ల అప్పులో అత్యధిక భాగం ప్రపంచం మీదికి భారీ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చి పెట్టిన కంపెనీలకు మేపిందే కదా? భారతీయ ధనికులకు పేపర్ కంపెనీల ద్వారా లక్షల కోట్ల పన్ను ఎగవేసే మార్గాలు తెరిచి పెట్టిందీ వాల్ స్ట్రీట్ కంపెనీలే కాదా? భారతీయ ధనికులకు ప్రతి అంశంలోనూ మార్గదర్శకులు, మార్గ నిర్దేశకులు, యజమానులు వాల్ స్ట్రీట్ కంపెనీలు, ద సిటీ ఆఫ్ లండన్ తదితర పశ్చిమ బహుళజాతి కంపెనీలే కదా? తమ కంట్లో దూలాలు పెట్టుకుని భారతీయుల కంట్లో నలుసులు తీస్తామనడం వెర్రి బాగులతనామా లేక దృష్టి మళ్లించే దగుల్బాజీ ఎత్తుగడా?
భారత ప్రజలు చెప్పేదేమంటే పన్నులు ఎగవేసేవారు ఎవరైనా సరే -వారు భారతీయ ధనికులైనా, అమెరికన్ దుర్మదాంధ సామ్రాజ్యవాద దోపిడీ దారులైనా మాకు ఒకటే. ఇద్దరూ భారత ప్రజల రక్తమాంసాలను పీల్చుకుని బలుస్తున్నవారే. వీరిద్దరూ భారత ప్రజలకు శత్రువులే తప్ప హితైషులు ఎంతమాత్రం కాదు.