ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?


Intelligence

ప్రశ్న (నరేంద్ర): గూఢచర్యం అన్ని దేశాలు చేసే పనే కదా? ఒక్క అమెరికానే తప్పు పట్టడం అన్యాయం కదా?

జవాబు: ఈ ప్రశ్న వేసి చాలా రోజులు అయింది. సమాధానం బాగా ఆలస్యం అయింది. ఇలా సమాధానం ఆలస్యం అయిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. ఇచ్చే సమాధానం వివరంగా సంతృప్తికరంగా ఉండాలన్న ఆలోచన చేస్తాను. ఈ ఆలోచన సమాధానాన్ని మరింత ఆలస్యం చేస్తోంది. అందుకు చింతిస్తూ…

నిజమే. గూఢచర్యం అన్ని దేశాలూ చేస్తాయి. ఇండియా కూడా గూఢచర్యం చేస్తుంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా గూఢచర్యం చేస్తాయి. ఇలా అన్ని దేశాలూ గూఢచర్యం చేస్తుంటే అమెరికాని మాత్రమే తప్పు పట్టడం ఎందుకు? అని వివిధ వేదికలపైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అమెరికా కూడా ఇదే వాదన ముందుకు తెస్తోంది. ఇతర అన్ని దేశాలు చేసేదే తాము చేస్తున్నాం అని అమెరికా తరచుగా తన చర్యలను సమర్ధించుకుంటోంది. అలా చెబుతూనే తమ జాతీయ భద్రత కోసం చేస్తున్నామని, టెర్రరిజంపై ప్రపంచ యుద్ధంలో భాగంగా చేస్తున్నామనీ… ఇలా సన్నాయి నొక్కులూ నొక్కుతోంది.

గూఢచర్యం సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా చూడవచ్చు. అంతర్గత గూఢచర్యం, విదేశీ గూఢచర్యం అన్న విభజన అందులో ప్రధానంగా కనిపించేవి. అంతర్గత గూఢచర్యంలో జాతీయ సంస్ధల నుండి రాష్ట్ర స్ధాయి పోలీసుల (స్పెషల్ బ్రాంచ్) వరకూ నిమగ్నమై ఉంటాయి. ప్రభుత్వాన్ని నడుపుతున్న వర్గాలు ప్రత్యర్ధి/ప్రతిపక్ష వర్గాలపై జరిపే అంతర్గత గూఢచర్యం ఒకటైతే, తమ అక్రమ, అణచివేత పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో తలెత్తే అసంతృప్తి తిరుగుబాటు రూపం తీసుకోకుండా కాపలా కాసే అంతర్గత గూఢచర్యం మరొకటి.

విదేశీ గూఢచర్యం ప్రధాన లక్ష్యం జాతీయ భద్రత, రక్షణలుగా అన్నీ దేశాలూ చెప్పుకుంటాయి. వాస్తవంలో చూస్తే ఆయా దేశాలకు ప్రపంచ భౌగోళిక రాజకీయ-ఆర్ధిక చిత్రపటంలో ఉన్న స్ధానాన్నీ, స్ధాయినీ బట్టి వాటి విదేశీ గూఢచర్య లక్షణాలు ఉంటాయి. ఆధిపత్య రాజ్యాలకు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. అందుకోసం అవి అడ్డమైన పనులూ చేస్తాయి. కానీ పీడిత రాజ్యాలకు/దేశాలకు/జాతులకు తమ ఉనికిని కాపాడుకోవడమే పరమ లక్ష్యంగా ఉంటుంది.

ఆధిపత్య దేశాలూ/రాజ్యాలు మరియు పీడిత దేశాలు/రాజ్యాల మధ్య గూఢచర్యపు ఆట గొర్రె-తోడేలు కధ తరహాలో ఉంటుంది. ఒక నీటి ప్రవాహంలో మెరకలో తోడేలు నీళ్ళు తాగుతుంటే పల్లంలో గొర్రె నీళ్ళు తాగుతుంటుంది. గొర్రెను చూడగానే తోడేలుకు ఆకలి గుర్తుకొస్తుంది. గొర్రెను వేటాడి తినాలని బుద్ధి పుడుతుంది. గొర్రె మీద దాడి చేయడానికి తోడేలుకు ఒక సాకు కావాలి. అది ఆలోచించి ఆలోచించి ఏదీ దొరక్క ‘నువ్వు నీటిని కెలుకు తున్నావు. దానివల్ల నీళ్ళు మురికి అవుతున్నాయి. నీ కెలుకుడు వలన నేను మురికి నీరు తాగాల్సి వస్తుంది’ అని ఆరోపిస్తుంది. నిజానికి నీళ్ళు మెరక నుండి పల్లానికి ప్రవహించడం అందరికీ తెలుసు. కాబట్టి నీళ్ళు మురికి కావడం అంటూ జరిగితే అది తోడేలు వల్ల జరుగుతోంది గాని గొర్రె వల్ల కాదు. ఈ నిజం అలా ఉండగానే తోడేలు బలం కలిగింది కాబట్టి తాను చూపిన సాకుతో గొర్రె పైన దాడి చేసి చంపి తినేస్తుంది.

అమెరికా తన గూఢచర్యానికి చెప్పే సాకులు కూడా సరిగ్గా తోడేలు చెప్పే సాకులు లాంటివే. ఇండియా లాంటి సామ్రాజ్యవాద పీడిత దేశాలు గూఢచర్యం చేసినా అవి తమ రక్షణ కోసమే చేసివిగా ఉంటాయి తప్ప ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఉండదు. ఎందుకంటే వాటి చేతుల్లో ఆధిపత్యం లేదు కాబట్టి. ఇండియా ఆధిపత్యం చేసే సందర్భం ఏదన్నా ఉన్నా ఈ సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకి ఇండియా-మాల్దీవులు. అమెరికా అంత పొగరుబోతుతనం ఇండియా చూపించకపోయినా, ఏదో మేరకు పెత్తనం చేసే ధోరణి భారత పాలకులు కనబరుస్తారు.

గూఢచర్యం చేసే విషయంలో అమెరికా, ఐరోపా దేశాలకు ఉన్న విస్తృత వనరులు, అవకాశాలు ఆసియా, ఆఫ్రికా, దక్షిణా అమెరికా దేశాలకు లేవు. ఇంటర్నెట్ గూఢచర్యమే తీసుకోండి. అతి పెద్ద ఐ.టి కంపెనీలన్నీ అమెరికాకు చెందినవే. గూగుల్, యాహూ, పే పాల్, మైక్రో సాఫ్ట్, అమెజాన్ తదితర కంపెనీలన్నీ అమెరికా కేంద్రంగా సేవలు అందిస్తున్నవే. ఈ కంపెనీల సర్వర్లు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలోని ఏ ఇతర దేశంలోని ఐ.టి కంపెనీ అయినా అమెరికా పైన ఆధారపడాల్సిందే. అనగా ఆయా కంపెనీల వ్యాపార కమ్యూనికేషన్ల తో పాటు వారి వినియోగదారుల కమ్యూనికేషన్లన్నీ అమెరికా గుండా వెళ్ళాల్సిందే. కాబట్టి ఇంటర్నెట్ కమ్యూనికేషన్ల పైన గూఢచర్యం చేసే అవకాశం అమెరికాకు ఉంటుంది గానీ ఇండియా తదితర మూడో ప్రపంచ దేశాలకు ఉండదు. అలాంటప్పుడు మీరు చేసేదే మేమూ చేస్తున్నాం అని అమెరికా ఎలా అనగలుగుతుంది? అలాంటి అమెరికా మాటల్ని మనం ఎలా నమ్మగలం?

వికీలీక్స్ (జులియన్ ఆసాంజే), ఎడ్వర్డ్ స్నోడెన్ లు వెల్లడి చేసిన పత్రాలను బట్టి అమెరికాకు అందుబాటులో ఉన్న గూఢచార వనరులు అన్నీ ఇన్నీ కావు. వారి రాయబారులు ప్రధానంగా చేసే పని గూఢచర్యమే. దౌర్భాగ్యం ఏమిటంటే వారి గూఢచారులు అమెరికన్లే కానవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడి వారినే గూఢచారులుగా తయారు చేసుకోగల అర్ధ, అంగ బలం వారి సొంతం. వారితో పోటీ పడి వారితో సమానంగా గూఢచర్యం చేయగల శక్తి ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. ఆ కొద్ది దేశాలు కూడా, ముఖ్యంగా ఐరోపా (బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ), జపాన్, ఇజ్రాయెల్ లు  అమెరికాతో సహకరిస్తాయి. అమెరికాతో దాదాపు తలపడేది చైనా, రష్యాలు మాత్రమే. ఈ దేశాలను రాక్షస దేశాలుగా చిత్రీకరించడంలో పశ్చిమ పత్రికలు ఆహారహం కృషి చేస్తుంటాయి. దానితో అమెరికా, దాని మిత్ర దేశాల గూఢచర్యం ప్రపంచ మానవాళికి అవసరమైన ప్రక్రియ గానూ, చైనా, రష్యా తదితర దేశాల గూఢచర్యం మానవాళికి హానికరమైన గూఢచర్యం గానూ ముద్ర వేయబడుతుంది. అందులో నిజానిజాలు విచారించే లోపు జరగాల్సింది జరిగిపోతుంది.

కాబట్టి ఆయా దేశాల గూఢచర్యాలన్నింటిని ఒకే గాటన కట్టడం సరికాదు. ఒకటీ, రెండూ మినహాయింపులు ఉంటే ఉండవచ్చు గానీ ఇండియా లాంటి దేశాల గూఢచర్యానికి ఆత్మరక్షణ ప్రధాన లక్ష్యం అయితే, అమెరికా లాంటి దేశాల గూఢచర్యానికి ఆధిపత్యం, పెత్తనం, అణచివేతల కొనసాగింపే ప్రధాన లక్ష్యం. అసమాన శక్తుల మధ్య సమానతను చూడాలనుకుంటే అది వాస్తవంలో అసమానతలను న్యాయబద్ధం చేయడమే.

(ఇతర ప్రశ్నలూ నా దృష్టిలో ఉన్నాయి. వీలు వెంబడి సమాధానం ఇవ్వగలను. మిత్రులు ఓపిక వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. -విశేఖర్)

One thought on “ప్రశ్న: గూఢచర్యం అన్ని దేశాలు చేస్తాయిగా?

 1. *ఇండియా ఆధిపత్యం చేసే సందర్భం ఏదన్నా ఉన్నా *

  ఇండియా ఆధిపత్యం చేసినట్లు, చేస్తున్నట్లు పక్కదేశాల వారు అనుకోరు. మనదేశాన్ని వాళ్లు వేరే కోణంలో (పెద్దన్న లాగా)చూస్తారు. రోజు పేపర్లలో నెగటివ్ వార్తలు చదివి మనదేశానికి విలువలేదని చాలా మంది అనుకోవచ్చు. దేశ ప్రజలలో చాలా మందికి తెలియని దేమిటంటే, భారత దేశ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో పోలిస్తే మనదేశం చాలా రంగాలలో ఎంతో మిన్న. గల్ఫ్ నుంచి బంగ్లదేశ్ వరకు, దశాబ్దాల తరబడి కోట్లాటల్లో మునిగి పోయారు. వారి భవిషత్ అగమ్య గోచరం గా మారింది. ఆదేశాల ప్రజలకి 60సంవత్సరాలుగా ప్రజస్వామ్య పాలనలో మనుగడ సాగించే, ఆదేశ ప్రజలకి మన దేశం అంటే చాల గౌరవం. అఫ్గానిస్తాన్, బెలుచిస్తాన్,పాకిస్తాన్,నేపాల్, బంగ్లాదేశ్, బర్మా మొదలైన దేశాల నుంచి ఎంతో మంది విద్య, వైద్యానికి మనదేశానికి వస్తారు. దేశ విభజన తరువాత, భారత ప్రజలు ఆదేశ ప్రజలతో సంబంధాన్ని, అనుబందాన్ని మరచిపోయారు. దేశ విభజనకు పూర్వం లక్షల మంది ఆఫ్గనిస్తాన్ ముస్లింలు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో వర్తక వ్యాపారాలు చేసేవారు. దేశ విభజన మన ప్రభుత్వం ఆదేశాల అస్తిత్వాన్ని గుర్తించి వాటి పలనలో జోక్యం చేసుకోకపోయినా, ఆ దేశ ప్రజలు ఇంకా భారత్ ను పెద్ద అన్నగా, అవసరం అయినపుడు అండగా ఉండాలని భావిస్తారు. క్రిందటి యేడు మనదేశ పర్యటనకి వచ్చినపుడు ఆంగ్ శాంగ్ సుకి మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. ఇక బెలూచిస్తాన్ ప్రజలు, వారిపోరాటంలో భారత దేశం బంగ్లాదేశ్ నిర్మాణంలో పోషించిన, క్రియాశీలక పాత్ర పోషించటంలేదని వాపోతూంటారు.

  While Bangladesh luckily won its freedom from Pakistan in 1971 with the military and diplomatic assistance of India and the sacrifices of around three million people, the Indians and the Bengalis never turned back to see how Pakistan continued to (mis)treat the Baluch. The Bengalis, who had faced genocide, exhibited classic selfishness by never standing with the remaining ethnic minorities in Pakistan.

  http://www.huffingtonpost.com/malik-siraj-akbar/from-bangladesh-to-baloch_b_4534394.html

  మనదేశం బంగ్లాదేశ్ లోజరిగే హింసను, మహిళల పై జరిగే అత్యాచారాలను చూస్తూ ఊరుకోలేక, ఆదేశం నుంచి మనదేశానికి లక్షల సంఖ్యలో వలస వచ్చే ప్రజలకు పునరావాసం చూపించలేక(ఆ రోజుల్లో మన ఆర్ధిక వ్యవస్థకూడా అంతంత మాత్రంగా ఉండేది) అడ్డుకోలేక పాకిస్తాన్ తో యుద్దం చేసి, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది. మనదేశ పోరాటం ఆధిపత్య ప్రయత్నంకాదని పాకిస్తాన్ ప్రజలు, మేధావులే గుర్తించారు.
  ఇటువంటి ఎన్నో కారణాల వలన ద్విజాతి సిద్దాంతం పేరుతో, మాది ప్రత్యేక అస్తిత్వం అంట్టూ వేరే దేశంగా విడిపడ్డక కూడా పాకిస్తాన్,బంగ్లదేశ్ వారంతా అమెరికా, లండన్ దేశాలలో భారతీయులుగా చెప్పుకోవటానికే ఇష్టపడతారు. అలా చెప్పుకొంటే వారికి గౌరవం లభిస్తుంది. పశ్చిమ దేశాల సంస్కృతి తో పోటి గా నిలబడేది భారత సంస్కృతి ఒక్కటే. భారతసంస్కృతి అందరిని కలుపుకు పోయేవిధంగా ఉంట్టుంది, పశ్చిమ దేశాల వారిది మొదటి నుంచి పోటి, ఆధిపత్య సంస్కృతి.

  కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ మేధావుల చర్చ ను చూడటం జరిగింది. వారిలో ఒకరు భవిషత్ లో ఏ దేశం ఏ విధంగా రూపు దాల్చుకొంట్టుంది, భారతదేశం ఎలాంటి పాత్ర పోషిస్తుందని, దాని వలన వారి దేశానికి ముప్పు ఎమైనా ఉందా అని ప్రశ్నించారు.అందులో పాల్గొన్న ఒక వ్యక్తి ఎమిచెప్పారంటే చరిత్ర లో ప్రతి దేశం ఒకానొక సందర్భంలో అగ్రరాజ్యంగా అభివృద్ది చెంది ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. అగ్రరాజ్యంగా మారిన దేశాల చరిత్ర చూస్తే, మిగతా దేశాల వాటి తో పోలిస్తే భారతదేశం ప్రత్యేకమైనది. మౌర్య సామ్రాజ్య పాలనలో అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నపుడు, భారత దేశం ఇతరదేశాల పై పడి యుద్దాలు చేయకుండా యోగ,కళలు,నాలేడ్జ్ యక్స్ పోర్ట్ చేసిందని , భారత్ అభివృద్దివలన ఏ దేశం అభద్రతా భావానికి గురికావలసిన అవసరంలేదు అని చెప్పుకొచ్చారు. మనదేశ గూఢచర్యం వెనుక ఆత్మ రక్షణే తప్పించి, ఆధిపత్యం కోసమో, ఇంకొక దేశం అస్థిరపరచటానికి చేస్తుందన్న ఋజువులు ఎక్కడా లేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s