ఎఎపిపాలన: అప్పుడే తిరుగుబాటు?


Vinod Kumar Binny

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం చిన్నపాటి తిరుగుబాటు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి విఫలం అయిన వినోద్ కుమార్ బిన్నీ ఈ తిరుగుబాటుకు కేంద్రంగా ఉన్నాడు. అయితే ఆయనకు మద్దతుగా ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఎఎపి ప్రభుత్వం తన సిద్ధాంతాల నుండి పక్కకు వెళ్తోందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అవుతోందని బిన్నీ ఆరోపించాడు.

అధికారం చేపట్టి మూడు వారాలు కూడా కాక మునుపే ఈ రకం విమర్శ చేయడంలోనే బిన్నీ చిత్తశుద్ధి దాగి ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. పదవి దక్కపోవడంతోనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ముఖ్యమంత్రి అరవింద్ ప్రత్యారోపణ చేశారు. మొదట మంత్రి కావాలన్నారని అందుకు నిరాకరించడంతో ఇప్పుడు ఎం.పి టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారని అరవింద్ తెలిపారు. కానీ ఎం.ఎల్.ఎ గా ఉన్నవారికి ఎం.పి టికెట్ ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించిందని అరవింద్ చెప్పారు. ఈ కోరికల వెనుక బిన్నీ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చారు.

బిన్నీ చేసిన ఆరోపణలు ప్రధానంగా ఇవి:

 1. కాంగ్రెస్ మద్దతు తీసుకునే ముందు జరిపిన చర్చలు రహస్యంగా జరిగాయి.
 2. మంత్రులు ఎర్ర బత్తిలు వాడబోమన్నారు. కానీ అందరూ వి.ఐ.పి రిజిస్ట్రేషన్ లతో కూడిన పెద్ద పెద్ద కార్లు తీసుకున్నారు.
 3. డెన్మార్క్ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అదే మరో పార్టీ ప్రభుత్వం ఉంటే ఎఎపి పెద్ద ఎత్తున జనాన్ని కదిలించి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హోరెత్తించేది.
 4. అనేక నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభావితం చేస్తోంది.

ఈ ఆరోపణలు అంత సీరియస్ స్వభావం కలిగినవి కావు. కానీ సమాధానం ఇచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎఎపి, అరవింద్ లపైన ఉంది.

 • ఏ పార్టీ మద్దతూ తీసుకోబోమని జనానికి చెప్పి కాంగ్రెస్ మద్దతు స్వీకరించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పార్టీ సూత్రాల విషయంలో రాజీపడడమే.

ఇది తీవ్రమైన ఆరోపణే. కానీ దీనికి అరవింద్/ఎఎపి లు ఇప్పటికే వివరణ ఇచ్చారు.

“అతి పెద్ద పార్టీగా ఏర్పడిన బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోగా తనకు బలం లేదని చెప్పి బాధ్యతను ఎఎపి మీదికి నెట్టింది. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే విమర్శించి లబ్ది పొందాలని భావించింది. అంతే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జంకుతున్నారని, కొత్తవారు కావడంతో ధైర్యం చేయలేకపోతున్నారని కాంగ్రెస్, బి.జె.పి లు పరాచికాలాడాయి. ఈ పరిస్ధితుల్లో ప్రభుత్వ నిర్వహణ భ్రహ్మాండం ఏమీ కాదని, ఆ శక్తి తమకూ ఉందని నిరూపించుకోడానికి ప్రభుత్వం ఏర్పాటు చేశాము. దానికి ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం.”

ఇదీ ఎఎపి ఇచ్చిన వివరణ. ఎఎపి ఫలానా సామాజికార్ధిక సిద్ధాంతం చెప్పి ఉంటే కాంగ్రెస్ మద్దతు తీసుకున్నందుకు విమర్శించడం తేలికై ఉండేది. కానీ అలాంటివేమీ వారు చెప్పలేదు. కాంగ్రెస్ బైటి నుండి మాత్రమే మద్దతు ఇస్తోంది కనుక వారు అవినీతికి పాల్పడకుండా అరికట్టే పొజిషన్ లో ఎఎపి మంత్రులు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మరింత సమయం ఇచ్చి చూడడమే న్యాయం అవుతుంది.

 • వాడుకుని వదిలేసే విధానం అవలంబిస్తున్నారు. మొదట అన్నా హజారే, కిరణ్ బేడీలను వాడుకున్నారు, అనంతరం వదిలేశారు. ఇంకా అనేకమంది ఆ జాబితాలో ఉన్నారు.
 • భారీ ఫ్లాట్ తీసుకోవడానికి అరవింద్ రెడీ అయిపోయాడు. జనం నుండి విమర్శలు వచ్చేసరికి వెనక్కి తగ్గాడు. విమర్శలే రాకపోయి ఉంటే ఆయన ఆ ఫ్లాట్ లోకి మారి ఉండేవాడు.
 • కాంగ్రెస్ ఎం.పి సందీప్ దీక్షిత్ (షీలా తనయుడు) తో అరవింద్ చాలా సన్నిహితంగా మెలుగుతున్నాడు.

ఈ ఆరోపణలు కాస్త సిల్లీగా ఉన్నాయి. హజారే, బేడీలు అసలు ఎఎపి లో చేరనే లేదు. కాబట్టి వారిని వాడుకుని వదిలేసే ప్రశ్నే తలెత్తదు. రాజకీయాల్లోకి దూకడాన్నే వారు వ్యతిరేకించారు. ‘ఇండియా అగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమంలో అందరూ కలిసే నాయకత్వం వహించారు. పైగా అన్నాయే నాయకుడు. కనుక ఉద్యమంలో ఐనా వాడుకుని వదిలేసే సమస్య ఎక్కడిది?

 1. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నియంతలా వ్యవహరిస్తున్నారు. నిర్ణయాలన్నీ నలుగురైదుగురు నాయకులు తలుపులు మూసుకుని చర్చించి తీసుకుంటున్నారు.
 2. తన అభిప్రాయాలతో విభేదిస్తే అరవింద్ అరుపులు, కేకలు వేస్తాడు. భిన్నాభిప్రాయాన్ని సహించలేడు.
 3. ప్రతి ఇంటికి 700 లీటర్ల నీరు ఉచితం అన్నారు. ఇప్పుడు చాలా తెలివిగా పరిమితి దాటితే పూర్తి ఛార్జీ అంటున్నారు.
 4. విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నెలవారీ వినియోగం 400 యూనిట్లు దాటితే మొత్తం కట్టాల్సిందేనని ఇప్పుడు చెబుతున్నారు.
 5. ఇచ్చిన హామీలకూ చేస్తున్నాదానికి చాలా తేడా ఉంది. 14 రోజుల్లో జన లోక్ పాల్ బిల్లు తెస్తామన్నారు. 19 రోజులైనా అతీ గతీ లేదు.

ఇవి తీవ్రమైన ఆరోపణలు. తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాల్సిన ఆరోపణలు. పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదని సాంప్రదాయక పార్టీలపై ఆరోపణలు చేసి తమ పార్టీలోకూడా లేకుండా చేయడం క్షమార్హం కాదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే చర్చించడం, ఓపికతో నచ్చ జెప్పడం మాని అరుపులు, కేకలు వేయడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధం. నీరు, విద్యుత్ విషయంలో కూడా సమాధానం చెప్పాలి. దుబారా అరికట్టడానికి ఇతర పద్ధతులు అవలంబించాలి తప్ప ఆ పేరుతో పాత ప్రభుత్వాల బాదుడు కొనసాగించడం మోసగించడమే. కాగ్ ఆడిట్ తర్వాత సబ్సిడీ ఇవ్వకుండానే ఛార్జీలు తగ్గించవచ్చు అని అరవింద్ చెప్పి ఉన్నారు. ఈ అంశంలో అవకాశం ఇచ్చి చూడాలన్న మాట నిజమే. కానీ నీరు, విద్యుత్ ల వినియోగానికి సంబంధించి ఒక సమగ్ర విధానాన్ని ఎఎపి ప్రభుత్వం ప్రకటించాల్సిన అగత్యం అయితే ఉంది. ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నది చెప్పాల్సిన పనిలేదు.

 1. ఎన్నికల హామీల నుండి ఎఎపి వెనక్కి మళ్లుతోంది.
 2. అధికారం వచ్చాక పార్టీ సిద్ధాంతాలను విస్మరించి అవకాశ సంస్ధగా ఎఎపి మారిపోయింది. ఏ అంశాల ప్రాతిపదికన అధికారంలోకి వచ్చిందో ఆ అంశాలకు దూరంగా వెళ్తోంది.
 3. ఢిల్లీ మహిళల రక్షణ కోసం వాళ్లేమి చేశారు?

ఈ ఆరోపణలు ఇప్పుడే చేయాల్సినవి కావు. కనీసం రెండు సం.ల సమయం అయినా ఇవ్వాలి. కానీ ఒక 6 నెలల్లోనే ప్రభుత్వం ప్రయాణిస్తున్న దారి ఏదో తెలిసే అవకాశం ఉండకపోదు. అంటే కనీసం మరో 6 నెలలైనా చూడకుండా ఈ ఆరోపణలు చేయడం అన్యాయం అవుతుంది.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం బిన్నీ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. మొదట మంత్రి పదవి కావాలన్నాడని, అది దక్కకపోవడంతో ఎం.పి టికెట్ కావాలన్నాడని, అదీ దక్కకపోవడంతో అసంబద్ధ ఆరోపణలు చేసున్నాడని వారు చెబుతున్నారు. బ్లాక్ మెయిలింగ్ కు లొంగబోమని తెగేసి చెబుతున్నారు. బి.జె.పి ప్రోద్బలంతోనే బిన్నీ ఆరోపణలు చేస్తున్నారని కూడా ఎఎపి నేత యోగేంద్ర యాదవ్ పరోక్షంగా సూచించారు.  

వారు చెప్పింది నిజమే కావచ్చు. పదవి కోసమే బిన్నీ తిరుగుబాటుకు దిగి ఉండవచ్చు. బ్లాక్ మెయిల్ రాజకీయాలే కావచ్చు. కానీ ఆయన ఆరోపణల్లో సమాధానం చెప్పాల్సిన అంశాలను విస్మరించడానికి వీలు లేదు. అసలు కాంగ్రెస్ నుండి ఎఎపి లోకి దూకినవారు ఇంతకంటే భిన్నంగా ఉంటారా అన్నది ఎఎపి నేతలు మొదటే ఆలోచించి ఉండాల్సింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s