అమెరికా ఎంబసీ: పన్ను ఎగేస్తుంది, స్పైలను పోషిస్తుంది…


దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో భారత పాలకులు కాస్త తల ఎత్తిన ఫలితంగా ఇండియాలో అమెరికా ఎంబసీ సాగించిన చట్ట విరుద్ధ కార్యకలాపాలు కొద్దిగా ఐనా వెలుగులోకి వస్తున్నాయి. భారత దేశంలో అమెరికా దౌత్యాధికారులు, రాయబార ఉద్యోగులు, వారి అనుబంధ సంస్ధలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సౌకర్యాలకు తోడు దేశ ఆదాయానికి కూడా గండి కొట్టే కార్యాలు వాళ్ళు చాలానే చక్కబెట్టుకున్నారు. అమెరికన్ ఎంబసీకి అనుబంధంగా నిర్వహించే క్లబ్ కార్యకలాపాలకు చెక్ పెట్టిన కేంద్రం ఇప్పుడు ‘అమెరికన్ ఎంబసీ స్కూల్’ (ఎ.ఇ.ఎస్) పై దృష్టి సారించడంతో కోట్లాది రూపాయల ఆదాయ పన్ను ఎగవేతలు, స్కూలు ఫీజులు వెల్లడి అవుతున్నాయి.

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం భారత ఆదాయ పన్ను చట్టాలు అమెరికా ఎంబసీకి తెలియనివేవీ కావు. ఆ మాటకొస్తే భారత ప్రభుత్వమే అమెరికన్ ఎంబసీ అధికారులకు కొన్ని మినహాయింపులు సమకూర్చింది. ఈ మినహాయింపులను ఆసరా చేసుకుని అమెరికా ఎంబసీ పెద్ద ఎత్తున ఆదాయం పొందుతూ కూడా ఆదాయ పన్ను ఎగ్గుడుతోంది. ఇలా ఎగవేసిన మొత్తం లెక్క కడితే కోట్ల రూపాయలు ఉంటుందని, ఈ ఎగవేత దశాబ్దాలుగా సాగుతోందని పత్రిక తెలిపింది.

న్యూ ఢిల్లీలో సంపన్న కాలనీగా పేరు గాంచిన చాణక్యపురిలోని అమెరికన్ ఎంబసీ స్కూల్ ప్రస్తుతం భారత అధికారుల తనిఖీలకు కేంద్రం అయింది. అమెరికా కనీస వేతన చట్టాలను ఉల్లంఘించి దేవయాని తన ఇంటి పని మనిషిని దోపిడీ చేసిందని అమెరికా ఆరోపించి కేసు నమోదు చేసిన నేపధ్యంలో ఇండియాలో అమెరికా ఎంబసీ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులకు వేతనాలు ఏ మేరకు చెల్లిస్తున్నదీ వివరాలు ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది.

ఈ వివరాలు ఇవ్వాల్సిన గడువు ముగిసినా ప్రభుత్వానికి ఇంకా పూర్తి వివరాలు అందలేదు. ఇప్పటికి రెండు సార్లు గడువు పెంచినా ప్రభుత్వ ఆదేశాలు సంపూర్ణంగా అమలు కాలేదు. దీనికి కొన్ని చోట్ల అసలు రికార్డులే నిర్వహించకపోవడం ఒక కారణం అయితే, తమ అక్రమాలు, చట్టాల ఉల్లంఘన వెల్లడి అవుతాయన్న శంకతో ఎంబసీ అధికారులే మీన మేషాలు లెక్కించడం మరో కారణం.

న్యూఢిల్లీలోని ఎ.ఇ.ఎస్ ను 1952లో స్ధాపించారని, ఇందులో వందలాది మంది సిబ్బందితో పాటు 150 మంది వరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. ఈ స్కూల్ తో పాటు ఇండియాలోని ఇతర చోట్ల నిర్వహిస్తున్న స్కూల్సూ, ఇతర సంస్ధలలో పని చేసే సిబ్బంది జీత భత్యాల వివరాలు ఇండియా అడిగింది. వారికి ఆయా సంస్ధలు నిర్వహించేందుకు అనుమతి ఉన్నదా లేదా అని పరిశీలన ప్రారంభించింది. ఎంబసీలో పని చేసే వివిధ అధికారులు, రాయబారుల జీవిత భాగస్వాములు అనేకమంది ఈ స్కూళ్ళలో టీచర్లుగా పని చేస్తున్నారనీ, భారీ ఆదాయాలు పొందుతూ కూడా వారు ఆదాయ పన్ను కట్టడం లేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది.

తమ పాఠశాలల ఉద్యోగుల జీత భత్యాలు, అనుమతుల వివరాలను భారత ప్రభుత్వం కోరిన నేపధ్యంలో మెరికా ఎంబసీ తన సిబ్బందికి ఈ రోజు (జనవరి 16) రెండు అంతర్గత ఈ మెయిళ్ళు పంపిందట. త్వరలోనే తమకు వ్యతిరేకంగా మీడియా పబ్లిసిటీ ఎదురు కావచ్చని ఇందులో ఎంబసీ హెచ్చరించిందిట. త్వరలో ఎదురయ్యే సంక్షోభం గురించి హెచ్చరిస్తూ ఇప్పటి వరకూ అనేక విడతలుగా ఎంబసీ అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. అవసరమైతే న్యూఢిల్లీ లోని ఎ.ఇ.ఎస్ ను మూసేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఎంబసీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది.

ఈ జాగ్రత్తలకు కారణం ఆదాయ పన్ను ఎగవేతే. “విద్యార్ధుల నుండి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ కూడా పన్నులు చెల్లించకపోవడం ఉద్దేశ్యపూర్వకంగా మోసానికి పాల్పడడమే” అని భారత అధికారులు చెప్పారని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. ఎ.ఇ.ఎస్ లో వసూలు చేసే ఫీజులు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఈ స్కూళ్లకు తమ పిల్లల్ని పంపించడంలో భారతీయ సంపన్నులు పోటీలు పడుతుంటారు. ఇక్కడ చదివితే భవిష్యత్తులో తమ పిల్లలు అమెరికా వెళ్లడానికి, అక్కడ స్ధిర పడడానికి అవకాశాలు మెరుగవుతాయని వారి ఆశ. ఇది భారతీయుల వైపు నుండి చూసినపుడు కనిపించే కారణం. కానీ అమెరికన్ ఎంబసీ వైపు నుండి పరికిస్తే అసలు కారణం బోధపడుతుంది.

అమెరికా ప్రాపకంలో పెరిగే పిల్లలు (తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో) అమెరికా అనుకూల భావాలు పెంచుకోవడం అనివార్యం. అలాంటివారు ఇండియా కంటే అమెరికాకే ఎక్కువ విధేయులుగా పెరిగినా ఆశ్చర్యం లేదు. విదేశీ గడ్డ పైన తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి తగిన సిబ్బందిని సదరు విదేశీయుల నుండే తయారు చేసుకునే అపురూప సౌకర్యాన్ని, అవకాశాన్ని అమెరికా ఎలా కాలదన్నుతుంది? అందునా తాము పని చేసే దేశాల పైన గూఢచర్యం చేయడంలో నిరంతరం మునిగితేలే అమెరికా రాయబారులు అలాంటి అవకాశాన్ని చస్తే వదులుకోరు. ఆదాయ పన్ను ఎగవేత కంటే ఇది ఇంకా తీవ్రమైన అంశం అని భారత పత్రికలు గుర్తించే రోజుకోసం ఎదురు చూడడం తప్ప ప్రస్తుతానికి చేసేదేమీ లేదు.

ఫీజుల విషయానికి వస్తే ఎ.ఇ.ఎస్ లో కె.జి ముందు కోర్సుల్లో (నర్సరీ అయి ఉండాలి) పిల్లల్ని చేర్చాలంటే చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 10,310 డాలర్లు. అనగా దాదాపు అక్షరాలా 6.2 లక్షల రూపాయలు (డాలర్ కి రు. 60 చొప్పున). 6-8 మధ్య తరగతుల పిల్లలైతే సం.కి $21,690 (సుమారు రు. 13 లక్షలు) చెల్లించాలి. 11-12 తరగతులైతే సం.కి $22,390 (సుమారు రు. 13.5 లక్షలు) చెల్లించాలి. ఇవన్నీ కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే అని మరువొద్దు.

[అమెరికన్ ఎంబసీ స్కూల్ సొగసులు ఏ స్ధాయిలో ఉంటాయో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది. చివరి మూడు ఫోటోలు అమెరికా ఎంబసీవి]

ఈ స్కూల్ లో చేరడానికి దరఖాస్తు కావాలంటే $300 (రు. 18,000) సమర్పించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కె.జి ముందు తరగతులకి $5,110 (దాదాపు రు. 3 లక్షలు), కె.జి నుండి 12 వరకు $11,110 (6.6 లక్షలు) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఇంగ్లీష్ నేర్చుకోదలిస్తే అదనంగా $2,500 (1.5 లక్షలు) చెల్లించాలిట. మధ్యాహ్న భోజనం కోసం $550 (రు. 33,000) వసూలు చేస్తారు. వీళ్ళు తినేది (పెట్టేది) ఏంటో, చిన్న బొజ్జలను కూడా అంతంత పెట్టి ఎంత నింపుతారో తెలుసుకోవాలని ముచ్చట పడితే అది మన తప్పు కాదు. ఇక బస్సు ఫీజు దూరాల్ని బట్టి $1170 (రు. 70,000) నుండి $1800 (రు. 1.08 లక్షలు) వరకూ వసూలు చేస్తారు.

డాలర్ ఒక్కింటికి రు. 60 చొప్పున లెక్కించాం గానీ నిజానికి ప్రస్తుతం డాలర్ విలువ రు. 62 వరకు ఉంది. ఈ సంపాదన అంతా భారత భూభాగంలో చేస్తున్నదే. ఎంబసీలో కాదు. కాబట్టి భారత చట్టాలకు లోబడి ఉండాలి. వారి ఆదాయాలు, కొనుగోళ్ళు అన్నీ వివిధ పన్నుల పరిధిలోకి వస్తాయి. కానీ వారు ఇప్పటిదాకా ఏ పన్నూ చెల్లించలేదు. ఘోరం ఏమిటంటే వారి ఆదాయ వివరాలకు అసలు రికార్డులు లేవు. మనవాళ్లు అడిగిందీ లేదు. పోనీ ఇవే సౌకర్యాలు అమెరికాలో మన రాయబారులకి ఇస్తారా అంటే సమాధానంగా దేవయాని మన ముందు నిలబడే ఉన్నారు. దేవయాని పని మనిషికి వీసా ఇవ్వాలంటే కనీస వేతనం కాంట్రాక్టు ఉండి తీరాలని నిబంధన పెట్టే అమెరికాకి ఇండియాలో తమ వాళ్ళు సంపాదించేదానికి రికార్డులు ఉండాలనీ, వాటికి పన్నులు కట్టాలని తెలియదా? తేరగా వస్తే తింటారు గానీ బాధ్యతలు మాత్రం పాటించరా? అమెరికా ద్వంద్వ నీతికి ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి?

ఎ.ఇ.ఎస్ లో పని చేసే వారికి నిర్దిష్ట పరిమితి మేరకు మనవాళ్లు ఆదాయ పన్ను పరిమితి ఇచ్చారు. ఈ పరిమితిని అమెరికా తనకు తానే ఏకపక్షంగా తానే పెంచేసుకుంది. ఎంత తీవ్రంగా పెంచుకుందంటే అసలు ఆదాయాలకు రికార్డులే నిర్వహించనంత! కాంట్రాక్టు ఒప్పందంను పాటించలేదని, తప్పుడు రికార్డు చూపిందని దేవయాని పైన కేసు పెట్టారు సరే. అసలు రికార్డులే నిర్వహించనందుకు ఇంకెంత పెద్ద కేసు పెట్టాలి. కోట్లాది డబ్బును బాగా తినమరిగి అలా తిన్నామని చెప్పడానికి రికార్డులు కూడా నిర్వహించకపోవడం అంటే ఇంకెంత మోసం కావాలి? వీళ్ళా మన రాయబారి చట్టాల అనుసరణను ప్రశ్నించే గొప్ప పరిశుద్ధాత్ములు? నవ్విపోదురుగాక!

ఈ తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి అమెరికా నానా చెత్త పనులూ చేస్తోంది. పని మనిషి సంగీత రిచర్డ్ చేత అలవిమాలిన అబద్ధాలు పలికిస్తోంది. ఆమె ఫిర్యాదు ప్రకారం ఆమె చేత వారానికి 100 గంటలు నిరంతరాయంగా పని చేయించారట. అంటే రోజుకు 14 గంటలు. ఆమె చేసే పని ఇల్లు చూసుకోవడం స్కూల్ కి వెళ్ళే ఇద్దరు పిల్లలను చూసుకోవడం. అంటే రోజులో కనీసం 6-8 గంటల వరకు పిల్లలు అసలు ఇంట్లోనే ఉండరు. అలాంటి ఇంట్లో రోజుకు 14 గంటలు చేసే పని ఏమిటి?

వాస్తవం ఏమిటంటే సంగీత, దేవయాని ఇంట్లో పని చేసిన తర్వాత బైట మరో పని చేసుకోవడానికి కూడా అనుమతి కోరింది. అందుకు దేవయాని నిరాకరించింది. రోజుకి 14 గంటలు ఇంటి పని చేసే వ్యక్తికి ఇంకా బైట మరో పని చేసే ఖాళీ ఎలా దొరుకుతుంది. 14 గంటలు పోను మిగిలింది 10 గంటలే. సంగీత ఇక నిద్ర పోదా? నిద్రలేమి జబ్బుతో ఆమె బాధపడుతూనైనా ఉండాలి లేదా పచ్చి అబద్ధాలతో కూడిన ఆరోపణలైనా చేస్తూండాలి. అబద్ధపు ఆరోపణలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరో పనికి అనుమతి ఇవ్వకపోవడంతో సంగీత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దేవయాని హామీతోనే ఆమెకు అమెరికా వీసా ఇచ్చింది. అలాంటి వ్యక్తి కనపడకపోతే ఫిర్యాదు చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఫిర్యాదు చేయకపోవడమే నేరం అవుతుంది తప్ప ఫిర్యాదు చేస్తే తప్పు కాదు. అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా దేవయాని ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఆమె పారిపోయింది అమెరికాలో, పౌరసత్వం ఇండియాలో కనుక. దీనిని ఇండియన్-అమెరికన్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరార భారత దేశపు వేధింపులు అని పేరు పెట్టాడు. వాల్ స్ట్రీట్ ఘరానా దొంగలని పట్టుకునే పేరుతో ఒక ఇండియన్-అమెరికన్ వ్యాపారిని జైల్లో తోయించిన ఘన చరిత్ర ఈ మాలావు లాయర్ సొంతం. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశాడని శిక్ష వేయించాడు. తప్పు చేస్తే శిక్షించొచ్చు, కాదనలేమ్. కానీ భారతీయ అమెరికన్ మాత్రమే శిక్షార్హులా? బిలియన్ల కొద్దీ దోచుకు తింటున్న అమెరికన్ తిమింగలాలను ఈయన చూసి చూడనట్లు వదిలేస్తాడు. అదేమంటే సాక్ష్యాలు లేవంటాడు. అమెరికాలో ఇండియన్ల హక్కులను కాపాడింది చాలక ఈ ప్రీత్ భరార ఇండియాలో పని మనుషుల హక్కుల సంరక్షణకు కూడా నడుం బిగించాడన్నట్టు! ఎంతగా నడుం బిగించాడంటే భారత ప్రభుత్వానికి తెలియకుండా ఒక భారతీయ కుటుంబాన్నే న్యూ ఢిల్లీ నుంచి ఖాళీ చేయించి అమెరికాకు పట్టుకుపోయేంత!

నిజం ఏమిటంటే సంగీత కుటుంబం ఇండియాలో అమెరికా ఎంబసీ కోసం పని చేసిన గూఢచార కుటుంబం. వారి కుటుంబ సభ్యులు అందరూ ఢిల్లీలో ఏదో ఒక దేశానికి చెందిన ఎంబసీలో పనిచేసేవారే. ఆయా ఎంబసీల్లో పని చేస్తూ సదరు ఎంబసీల రహస్యాలు అమెరికా ఎంబసీకి చేరవేయడం వారికి అప్పగించబడిన పని. స్వయంగా రహస్యాలు చేరవేయాల్సిన పని లేదు. తమ చేతికి ఇచ్చిన పరికరాన్ని ఫలానా చోట అమర్చినా చాలు. తమకు ఇచ్చిన చిన్న కెమెరానో లేదా ఆడియో రికార్డర్ నో తమకే అమర్చుకుని తాము డ్రైవ్ చేసే కారులో సంభాషణలని రికార్డు చేసినా చాలు. ఇలాంటి సేవలకు ప్రతిఫలంగా అమెరికా పౌరసత్వాన్ని వారు కాక్షించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒక ఏజన్సీ ద్వారా సంగీత దేవయాని ఇంట్లో చేరింది. ఆ తర్వాత కధ తెలిసిందే.

(With thanks to SriRam for providing link.) 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s