అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ ఆన్-లైన్ కంప్యూటర్ల పైనే కాకుండా ఆఫ్-లైన్ కంప్యూటర్లపైన కూడా నిఘా పెట్టే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడి అయింది. ఇంటర్నెట్ తో కనెక్షన్ లేకపోయినా నిఘా పెట్టగల పరికరాలను తయారు చేసుకున్న ఎన్.ఎస్.ఏ ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలకు చెందిన అత్యంత ముఖ్యమైన లక్షకుపైగా కంప్యూటర్లపై వాటి సాయంతో గూఢచర్యం నిర్వహించిందని తెలిసింది. లక్ష్యిత కంప్యూటర్లలో రేడియో తరంగాలను వెలువరించే పరికరాలను, తగిన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లను ఇన్ స్టాల్ చెయ్యడం ద్వారా ఎన్.ఎస్.ఏ ఈ ఘనత సాధించిందని రష్యా టుడే తెలిపింది.
ఎన్.ఎస్.ఏ సాగించే కంప్యూటర్ గూఢచర్యంలో అధిక భాగం ఇంటర్నెట్ ఆధారంగా జరిగినదే. అయినప్పటికీ నెట్ వర్క్ తో సంబంధం లేని కంప్యూటర్లపై కూడా నిఘా పెట్టి సమాచారం దొంగిలించే కార్యకలాపాలను కూడా ఎన్.ఎస్.ఏ సాగించింది. సాధారణంగా ఇలాంటి గూఢచర్యానికి చైనా పాల్పడుతోందని అమెరికా ఆరోపించడం కద్దు. వాస్తవంలో అమెరికా సంస్ధలే ఈ రంగంలో నిష్ణాతులని పైగా ఈ తరహా గూఢచర్యానికి ప్రధాన బాధితురాలు చైనాయే అని రష్యా టుడే తెలిపింది.
చిన్న చిన్న సర్క్యూట్ బోర్డుల ద్వారా విలువడే రహస్య రేడియో తరంగాలు, లక్ష్యిత కంప్యూటర్లలో రహస్యంగా అమర్చిన యు.ఎస్.బి కార్డులు తదితర సామాగ్రి సహాయంతో ఇంటర్నెట్ తో సంబంధం లేని కంప్యూటర్లపై ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టింది. ఈ పరికరాల ద్వారా భౌగోళిక రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా భావించే దేశాలలోనే కాకుండా తన మిత్రులుగా చెప్పుకునే దేశాలపైన కూడా ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టగలిగింది. సైబర్ దాడుల నుండి సొంత కంప్యూటర్లను, అందులోని సమాచారాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకంగా వివిధ చర్యలు తీసుకున్న దేశాలను, కంప్యూటర్లను ఈ తరహా గూఢచర్యానికి అమెరికా లక్ష్యంగా చేసుకుంది. రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ వినియోగించాలంటే సాధారణంగా గూఢచారులు స్వయంగా పరికరాలను అమర్చవలసి ఉంటుంది. ఈ పరికరాలను అమర్చేవారు తెలిసే ఆ పని చేయాల్సిన అవసరం లేదు.
చొరబాటు సాఫ్ట్ వేర్, రేడియో టెక్నాలజీల ద్వారా గూఢచర్యం నిర్వహించే ప్రోగ్రామ్ ను ఎన్.ఎస్.ఏ ‘క్వాంటం’ అని పేరు పెట్టిందని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాల ద్వారా వెల్లడి అయింది. అయితే ఈ తరహా గూఢచర్యం లోతుపాతులు ఎడ్వర్డ్ స్నోడేన్ పత్రాల ద్వారా పెద్దగా వెల్లడి కాలేదని తెలుస్తోంది. అమెరికా కంపెనీలు, ప్రభుత్వ ఏజన్సీల పైన ఇటువంటి గూఢచర్యానికి చైనా పాల్పడుతోందని అమెరికా అనేకసార్లు ఆరోపించింది. ఎన్.ఎస్.ఏ కూడా తరచుగా చైనాపై ఆరోపణలు గుప్పించింది.
“ఇక్కడ కొత్తదనం ఏమిటంటే, ఇంతవరకు బైటి వారికి గానీ, ఏ విధమైన నెట్ వర్క్ లకు గానీ ఎవ్వరికీ అందుబాటులో లేని కంప్యూటర్లలోకి చొరబడే అత్యాధునిక సామర్ధ్యాన్ని గూఢచార సంస్ధలు సాధించడం. ఈ తరహా సామర్ధ్యాలు ఇటీవల కాలంలో ఇతరులకూ పెరిగిన మాట వాస్తవమే. కానీ సాఫ్ట్ వేర్ ను చొప్పించడానికి వీలుగా ఆయా కంప్యూటర్ వ్యవస్ధలలోకి చొరబడడం ఎలాగో నేర్చుకోవడం, రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా అది చేయడం ఎలాగో నేర్చుకోవడం… లాంటి చర్యలను కలగలిపి అభివృద్ధి చేయడం ద్వారా అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత గూఢచార సామర్ధ్యం సమకూరింది” అని వాషింగ్టన్ లోని ‘సెంటర్ ఫర్ స్ట్రేటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ అనే సంస్ధలో పని చేసే సైబర్ నిపుణుడు జేమ్స్ ఆండ్రూ పేర్కొన్నారని ‘ది టైమ్స్’ పత్రిక తెలిపింది.
ప్రధాన టార్గెట్ చైనా
క్వాంటం ప్రోగ్రామ్ కు తరచుగా చైనా సైన్యమే ప్రధాన టార్గెట్ అని తెలుస్తోంది. కానీ చైనా సైన్యం అమెరికా పారిశ్రామిక, మిలట్రీ లక్ష్యాలలోకి అనేక సార్లు చొరబడిందని అమెరికా తరచుగా చేసే ఆరోపణ. ఈ చొరబాటు ద్వారా అమెరికా కంపెనీలు మేధో సంపత్తి హక్కులు కలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా దొంగిలించిందని అమెరికా ఆరోపించింది.
క్వాంటం దాడులకు ప్రధాన లక్ష్యం చైనా ఆర్మీకి చెందిన ఒక సైబర్ యూనిట్. అమెరికాపై జరిగిన అనేక సైబర్ దాడులకు ఈ యూనిట్ బాధ్యురాలన్నది అమెరికా ఆరోపణ. చైనా మాత్రం సైబర్ దాడులకు తానే ప్రధాన బాధితురాలినని చెబుతుంది. స్నోడెన్ పత్రాల ప్రకారం చైనాలో రెండు రహస్య డేటా సెంటర్లను అమెరికా నెలకొల్పింది. ఈ సెంటర్ల నుండే చైనాలోని అనేక కంప్యూటర్లలోకి వైరస్ తదితర మాల్ వేర్ ను అమెరికా చొప్పించింది. తమ క్వాంటం కార్యక్రమం చైనా లాగా ఆర్ధిక ప్రయోజనాలకు ఉద్దేశించింది కాదని స్నోడెన్ పత్రాల వెల్లడి తర్వాత అమెరికా సమర్ధించుకుంది. చైనా చేస్తే చెడ్డ ఉద్దేశ్యం, అమెరికా చేస్తే మంచి ఉద్దేశ్యం అన్నమాట! హిపోక్రసీకి సిసలు చిరునామా అమెరికాయే మరి!
స్నోడెన్ లీక్ చేసిన పత్రాల ప్రకారం అమెరికా, హాంగ్ కాంగ్, మధ్య ప్రాచ్యం తదితర చోట్ల నెలకొల్పిన ఫైబర్ ఆప్టిక్స్ పై నిఘా పెట్టడానికి అమెరికా 20 ప్రోగ్రామ్ ల వరకు రూపొందించుకుంది. స్నోడెన్ పత్రాలలోని 2008 నాటి ఒక పటం (మేప్) ప్రకారం అమెరికా అప్పటికి ప్రపంచవ్యాపితంగా 50,000 వరకు రహస్య పరికరాలను (implants) అమార్చింది. 2013 చివరి నాటికి ఈ సంఖ్య 85,000 పై మాటే అని ఇటీవల విడుదల అయిన ఒక బడ్జెట్ పత్రం ద్వారా తెలిస్తోందని ఆర్.టి తెలిపింది. అయితే ఒక సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఈ సంఖ్య 1,00,000కు పైనే ఉంటుందని ది టైమ్స్ తెలిపింది.
అమెరికాను టార్గెట్ చేస్తూ సైబర్ దాడులు జరిగినట్లయితే అలాంటి దాడుల గురించి ముందే హెచ్చరికలు చేయడానికి ఈ పరికరాలు అమర్చామని అమెరికా అధికారులు ఇప్పుడు చెబుతున్నారు. కొంతమందయితే శత్రు దేశాల సబ్ మెరైన్ల కదలికలను పట్టుకోవడానికి అమర్చామని సమర్ధించుకున్నారు. చైనా మాత్రం ఆర్ధిక ఆధిపత్యం కోసం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే సైబర్ నిపుణుల ప్రకారం ఆర్ధిక సానుకూలత సంపాదించుకోవడం చైనాకు జాతీయ భద్రతతో సమానం. ఆ మాట కొస్తే ఏ దేశానికి కాదు? సవాలక్షా యుద్ధాలు, రాయబారాలు, దౌత్యాలు, గూఢచర్యాలు అన్నీ ఆర్ధికంగా పై చేయి సాధించుకోవడానికే కదా?
దూది మూతి?
జర్మనీకి చెందిన ప్రముఖ పత్రిక డేర్ స్పీజెల్ క్వాంటం లో భాగంగా ఎన్.ఎస్.ఏ వినియోగించిన ఎలక్ట్రానిక్ పరికరాల వివరాలను వెల్లడి చేసింది. ఈ పరికరాల్లో ‘కాటన్ మౌత్ I’ (Cottonmouth I) అనేది ఒకటి. ఇది చూడడానికి సాధారణ యు.ఎస్.బి ప్లగ్ లాగే కనిపిస్తుంది. ఇందులో ట్రాన్సీవర్ అమర్చి ఉంటుంది. ఇది రహస్య ఛానెల్ ద్వారా కంప్యూటర్ లోని సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా ప్రసారం చేస్తుంది. ఆ విధంగా నిర్దిష్ట సమాచారం లేదా డేటా లక్ష్యిత కంప్యూటర్ లో ప్రవేశ పెట్టడానికి, తొలగించడానికి ఇది సహాయపడుతుంది. అనగా కంప్యూటర్ లోని సమాచారం దొంగిలించడమే కాకుండా మార్చడం కూడా చేస్తుంది.
ఈ విధంగా అమర్చబడిన పరికరాలు కొన్ని కనిపెట్టబడ్డాయని కనిపెట్టే నాటికి అవి 5 సంవత్సరాల క్రితం తయారు చేసినవిగా కనుగొన్నారని ది టైమ్స్ పత్రిక తెలిపింది. అనగా కనీసం 5 యేళ్ళ నుండి ఈ తరహా గూఢచర్యం జరుగుతోంది అన్నట్లు. వీటిని ఇన్ స్టాల్ చేసి 5 సం.లు అయినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వచ్చారని తద్వారా మళ్ళీ కొత్తగా పరికరాలను అమర్చే అవసరం లేకుండా చేసుకున్నారని ఆర్.టి తెలిపింది. డేర్ స్పీజల్ తో పాటు వివిధ ఐరోపా వార్తా సంస్ధలు ఈ వివరాలను ప్రచురించాయి. ఈ వార్తలపై స్పందించడానికి ఎన్.ఎస్.ఏ సహజంగానే నిరాకరించింది. పైగా ఈ సమాచార ప్రచురణ అమెరికా జాతీయ భద్రతకు హానికరం అని ఆక్షేపించింది. ఈ చర్యల ద్వారా అమెరికా ఎన్ని దేశాల జాతీయ భద్రతలను అతిక్రమిస్తున్నదో సమాధానం చెప్పేవారెవరు?
అమెరికాకీ ప్రమాదమే
సాధారణ సాఫ్ట్ వేర్ లో ఉండే భద్రతా లోపాలను వినియోగించి గూఢచర్యానికి పాల్పడడం అమెరికాకు కూడా ప్రమాదకరమే అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ క్రిప్షన్ టెక్నాలజీని శాశ్వతంగా అధిగమించే ఉపకరణాలను అమెరికా అభివృద్ధి చేసిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ హెచ్చరికకు ప్రాధాన్యత ఉన్నది. అమెరికా ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధి చేసుకోగలిగితే ఇతర దేశాలు కూడా అందుకు సిద్ధపడతాయి. అణు బాంబు అమెరికాతోనే ఆగిందా? ఆ తర్వాత అది రష్యాకు చేరింది. అనంతరం ఇతర యూరోపియన్ దేశాలు అణు సామర్ధ్యం సంతరించుకున్నాయి. చివరికి ఇజ్రాయెల్, పాకిస్ధాన్, ఇండియాలకు కూడా అణు సామర్ధ్యం చేరుకుంది.
ఎన్ క్రిప్షన్ టెక్నాలజీ అనేది ఇంటర్నెట్ వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా కాపాఉకునేందుకు ఉపయోగిస్తున్న టెక్నాలజీ. దీనిని అతిక్రమించే సాఫ్ట్ వేర్ ని తయారు చేసుకున్నాక అది తయారీదారుల వద్దనే ఉండిపోదు. ఎప్పటికైనా అది అందరికీ చేరుతుంది. లేదా ఎవరికి వారు సొంత అతిక్రమణ టెక్నాలజీ తయారు చేసుకుంటారు. ఇక వినియోగదారులకు భద్రతకు ఎక్కడిది? ఎవరైతే కాపలాదారులుగా రక్షణ ఇవ్వాలో వారే అతిక్రమణ నేరాలకు పాల్పడితే ఎవరికీ రక్షణ ఉండదు. ఇక అందరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం మానుకుని రక్షణ కోసం రాతి యుగాలకు ప్రయాణం కట్టాల్సి ఉంటుంది.
ఈ బుద్ధి అమెరికా పాలకులకు ఎప్పటికైనా వస్తుందా అన్నది అనుమానమే.
ఈ నిఘా దృష్టి ఆఫ్ లైన్ కంప్యూటర్లపై కూడా ఎప్పుడో పడిందన్నమాట! ఇలాంటి ధోరణులు భవిష్యత్తులో ఇంకా మితిమీరతాయి.
Sir,Offline computers ni America hack cheyalante vallaku kavalsina chips or some material mana yoka system lo vallu insert cheyali kada,America kaku parayi desam computer lo aa hijacking material yela insert cheyagalgindi