ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర రాష్ట్రంలోని సినబాంగ్ అగ్ని కొండ ఇంకా మండుతూనే ఉంది. తానే రగిలే వడగాలై అగ్ని కిలలు విరజిమ్ముతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి భారీ పరిణామాల్లో బూడిద, లావా, మంటలు ఆకాశంలోకి ఊస్తున్న సినబాంగ్ కొండ ధాటికి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలస పోవాల్సిన పరిస్ధితి.
సినబాంగ్ కొండ చిమ్ముతున్న బూడిద పరిమాణాలను చూస్తే అక్కడేదో అణు బాంబు పేలినట్లే కనిపిస్తోంది. పైరో క్లాస్టిక్ వాయువు, బూడిద, మంటలు అని పిలుస్తున్న ఈ భూగోళ విసర్జకాలు చుట్టు పక్కల వాతావరణాన్ని వేడెక్కించింది. వేల ఎకరాల్లో పంటలను బూడిదతో కమ్మేసింది. ముఖ్యంగా వరి గింజలు బూడిదలో మునిగిపోయి వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి.
తాజాగా జనవరి 4 నుండి సినబాంగ్ కొండ వరుస పేలుళ్ళను నమోదు చేస్తోంది. అప్పటి నుండీ దాదాపు కొన్ని వందలాసార్లు సినబాంగ్ అగ్ని పర్వతం పేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ వేల టన్నుల బూడిద, లావా చిమ్ముతూనే ఉందని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దాదాపు 20,000 మందికి పైగా ఇళ్ళు వదిలి శరణార్ధి శిబిరాలకు తరలి వెళ్లారు.
ఒంటికి ప్లాస్టిక్ సంచులు తగిలించుకుని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి జనం ఇటీవల అలవాటు పడ్డారు. కానీ పరిస్ధితి తీవ్రరూపం దాల్చడంతో సమీప గ్రామాలను తప్పనిసరిగా ఖాళీ చేయిస్తున్నారు. తమకు తాము తరలి వెళ్ళడం ఒక ఎత్తైతే తమ గొడ్డు, గోదా, ఇతర పెంపుడు జంతువులను తీసుకెళ్ళడం జనానికి సమస్యగా మారింది.
మౌంట్ సినబాంగ్ మహోగ్రరూపాన్ని చూపుతున్న ఈ ఫోటోలను అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.