‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’ అని సామెత! కానీ పులులకు పాడుకాలం దాపురించింది. పులుల వైభోగం చూసి నక్కలు వాటిని అనుకరించడానికి బదులు గొర్రెల వైభోగానికి పులులే ఈర్ష్య పడాల్సిన చేటుకాలం దాపురించింది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, ఎం.పిలే రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం మనం ఎరుగుదుమా?
ఎఎపి అనే గొర్రె ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి విద్యుత్ ఛార్జీల్ని సగానికి తగ్గించేయడంతో కాంగ్రెస్ పులి కూడా తన చారల్ని చెరిపేసుకుని గొర్రెలా కనిపించడానికి తంటాలు పడుతున్న విపరీత దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్న నేటి భారతంలో మనం ఉన్నామంటే నమ్మి తీరాలి మరి!
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎం.పిలు సంజయ్ నిరుపమ్, ప్రియా దత్ ఇతర ఎమ్మెల్యేల నాయకత్వంలో ముంబైలో పెద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది. వీరందరూ ఊరేగింపుగా రిలయన్స్ ఎనర్జీ కంపెనీకి బయలెళ్ళారు. వీరి డిమాండ్ ఏమిటయ్యా అంటే ముంబై ప్రజలకు విద్యుత్ ఛార్జీలు భారంగా పరిణమించాయట. కాబట్టి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలనేది వీరి డిమాండ్.
“ముంబైలో అమలులో ఉన్న అన్యాయమైన విద్యుత్ సుంకాలను సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు న్యాయం దక్కేవరకూ కంపెనీకి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది” అని నిరసన ప్రదర్శనలో పాల్గొంటూ కాంగ్రెస్ ఎం.పి సంజయ్ నిరుపమ్ స్పష్టం చేశారని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఈ ర్యాలీలో ఉత్తర ముంబైలోని ప్రతి ఒక్క కార్పొరేటర్ పాల్గొన్నారట. కాంగ్రెస్ ఎమ్మేల్యేలు అందరూ కూడా పాల్గొన్నారుట.
“ఔరా, విధి ఎంతటి వైపరీత్యము కలిగినట్టిది? కరెంటు భారము మోయలేకున్నామని గొర్రెలు ఆరోపించిన తోడనే, న్యాయాన్యాయములు విచారింపకనే సుంకములు తగ్గింపవలేనంటూ వీధులకెక్కు ఇలాంటి పులి రాజములు ఉండిననేమి, మండిననేమి?” అంటూ రిలయన్స్ కంపెనీ అధినేత అనీల్ అంబానీ వారు కాటి కాపరి దృశ్యాలు ప్రదర్శించదగు కాలము వచ్చినట్లేనా?
కాంగ్రెస్ ఎం.పిలు, ఎమ్మేల్యేలు, కార్పొరేటర్లు మొదలైన సామాన్యులంతా అష్ట కష్టాలు పడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం తమలో తాము ఒక ప్రతినిధి బృందాన్ని ఎన్నుకుని రిలయన్స్ కంపెనీ అధికారులతో చర్చించడానికి పంపారని పత్రికలు చాటాయి. కంపెనీ అధికారులతో చర్చించిన తర్వాత తమ సమస్యలు పరిష్కరించడానికి 5 రోజుల గడువు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రజలు నిర్ణయించుకుని ఆందోళన విరమించారు.
సోమవారం నాటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముందే ఎం.పి సంజయ్ నిరుపమ్ గారు శనివారమే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నేత అనీల్ అంబానికి లేఖ రాశారట. రిలయన్స్ ఎనర్జీ కంపెనీ, ఈ రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీలో భాగమే. సోమవారం తాము నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని తమ ఆందోళనపై కంపెనీ అవగాహన ఏమిటో చెప్పడానికి కంపెనీలోనే ఉండాలని ఆయన తన లేఖలో కోరారని ది హిందు తెలిపింది.
అకటకటా, మందభాగ్యులగు సంపన్న సామాన్యులనెన్ని కంటకములు గుచ్చుచున్నవి? దేశాభివృద్ధిలో క్షణము తీరికలేని పులి రాజములకు ఆఫ్ట్రాల్ సుంకముల గురించి కూడా పట్టించుకోవలెనన్న విపరీత పరితాములు తప్పవా? ఒక్కొక్క క్షణమును బిలియన్లాది రూప్యములలో కొలుచుకొనెడి రాజ్యాధీశుల కాలమును ఇట్టి హీన ఘట్టములకు ఖర్చు చేయు విపత్కర పరిస్ధితికి నెట్టివేయుట తగునా?
ఆందోళనకారులు తాము ఏ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారో ఆ కంపెనీ అధినేతనే తమ ఆందోళనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఆజ్ఞాపించిన అపురూప దినాలు ఈ దేశానికి వచ్చేశాయన్నమాట! ఈ రకంగా ఉన్నపళంగా ఛార్జీలు తగ్గించెయ్యాలని ప్రైవేటు కంపెనీలని, అందునా ఈ దేశానికే గర్వకారణమైన అత్యంత సంపన్న కుటుంబంలోని సభ్యుడిని డిమాండ్ చేసేస్తే దేశంలోని పెట్టుబడి వాతావరణం ఏం కావాలి? ఈ సంగతి ‘కాంగ్రెస్ ప్రజలు’ ఆలోచించారా?
కార్మిక సంఘాలు సమ్మెలు చేస్తేనో, వామపక్షాలు బంద్ లు ప్రకటిస్తేనో, నొయిడా కార్లకంపెనీల కార్మికులు సంఘాలు పెట్టుకుంటామని పని మానేస్తేనో దేశంలోని పెట్టుబడి వాతావరణం గురించీ, విదేశీ పెట్టుబడుల ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ గురించీ మహా బాధపడిపోతూ కన్నీరు కార్చే ప్రధాని మన్మోహన్ వారు తమ ‘పార్టీ ప్రజలు’ పాల్పడుతున్న అరాచకాన్ని గమనిస్తున్నారా, లేదా?
మరో విచిత్రమును ప్రస్తావించకుండా వదిలి పెట్టడం ఏ మాత్రం ధర్మ సమ్మతము కానేరదు. అదేమనిన, ‘కాంగ్రెస్ ప్రజానీకం’ రిలయన్స్ ఎనర్జీ కంపెనీ సమీపానికి చేరకుండా ఉండుటకు పోలీసులు తీవ్రంగా శ్రమించితీరి. అందు నిమిత్తం భారీ ఆటంకాలను (బ్యారీకేడ్లు) కూడా వారు నిర్మించితిరి. ఫలితముగా ‘కాంగ్రెస్ ప్రజల’కూ పోలీసు భటులకూ తీవ్ర పోరాటము సంభవించినది. అటుల ఎలాగో ఈ బృహత్ప్రమాదమును పోలీసు భటులు ఎటులనో నివారించి ఊపిరి పీల్చుకొంటిరి.
మరికొద్ది రోజుల్లో ములాయం, లాలూ ప్రసాద్, ధాకరేలు, కరుణానిధి, చాంది, దిగ్విజయ్ సింగ్ తదితర అగ్రనాయకులంతా ప్రజల సమస్యల్ని పరిష్కారించాలంటూ తమపై తామే నిరసన ప్రదర్శనలు నిర్వహించే ప్రమాదం బాగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కదులుతున్నంత వేగంగా బి.జె.పి కదలకపోవడమే ప్రస్తుతానికి ఒక విచిత్రం.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ చార్జీల విషయంలో ఒక కమిటీ వేసేసింది. పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే నేతృత్వంలోని ఈ కమిటీ విద్యుత్ సుంకాలను 10 నుండి 20 శాతం దాకా తగ్గించాలని సిఫారసు కూడా చేసింది. కానీ ‘కాంగ్రెస్ ప్రజలకు’ ఇది సంతృప్తి కలిగించలేదు. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏకంగా 50 శాతం తగ్గించేస్తే పది, ఇరవై శాతానికి ఒప్పేసుకుంటే ఎఎపి ని అడ్డుకోవడం ఎలా సాధ్యం?
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముంబై పాలకులకు చాలా కష్టాల్నే తెచ్చి పెట్టింది. ఎఎపి నుండి నేర్చుకోవాల్సింది తమకు చాలా ఉందని యువరాజా వారు అంగీకరించినపుడు ఇంకేదో అనుకున్నాం గానీ ఇలా వీధి నాటకాలకు దిగుతారని మాత్రం అనుకోలేదు. మునుముందు ఇంకెన్ని విచిత్రాలు సంభవిస్తాయో?!