ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) కంపెనీ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాద స్ధాయి కంటే 8 రెట్లు పెరిగిందని అణు ధార్మికత నిండిన నీరు ట్యాంకర్ల నుండి లీక్ అవుతుండడమే దీనికి కారణం అని టెప్కో తెలిపింది. టోక్యో, జపాన్ ప్రజలకే కాకుండా అమెరికాకు కూడా వణుకు పుట్టిస్తున్న రేడియేషన్ లీకేజిని అరికట్టడానికి కంపెనీ వద్ద ఆధారపడదగిన ప్రణాళిక ఏమీ లేకపోవడంతో తల పట్టుకుని కూర్చోవడం జపాన్ ప్రభుత్వం వంతయింది.
టెప్కో కంపెనీ జారీ చేసిన ప్రకటన ప్రకారం ఫుకుషిమా -1 కర్మాగారం పరిసరాల్లో అణు ధార్మికత సంవత్సరానికి 8 మిల్లీ సీవర్టులుగా రికార్డయింది. జపాన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణం మేరకు ఈ రీడింగు సంవత్సరానికి 1 మిల్లీ సీవర్టుకు మించకూడదు.
జపాన్ ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ రెగ్యులేషన్ ఆధారిటీ శుక్రవారం సమావేశమై పెరుగుతున్న రేడియేషన్ గురించి చర్చిందని రష్యా టుడే (ఆర్.టి) తెలిపింది. కర్మాగారానికి దక్షిణ భాగంలో రేడియేషన్ వేగంగా పెరుగుతోందని దీన్ని అరికట్టడానికి తగిన చర్యలను అన్వేషించడానికి సమావేశం ప్రయత్నించిందని తెలుస్తోంది. అయితే సమావేశం కనుగొన్న పరిష్కారం ఏమిటో, అసలు పరిష్కారం వారికి ఏమన్నా తోచిందో లేదో కూడా తెలియలేదని పత్రికలు వ్యాఖ్యానించాయి.
అణు ధార్మికతతో కలుషితమైన నీటిని ప్రత్యేకంగా తయారు చేసిన స్టోరేజి ట్యాంకర్లలో కంపెనీ నిలవ చేస్తోంది. ఈ ట్యాంకర్ల నుండి నీరు లీక్ అవుతుండడంతో రేడియేషన్ వాతావరణంలో కలుస్తోంది. స్టోరేజి ట్యాంకర్ల లోని నీటిలో స్త్రోంటియమ్-90 అనే అణు ధార్మిక ఐసోటోపులు ఉన్నాయని ఇవి న్యూక్లియర్ ఫిషన్ ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ అణు ధార్మిక పదార్ధం ట్యాంకర్లు తయారు చేయబడిన పదార్ధంతో రసాయన చర్య జరిపి ప్రమాదకర X కిరణాలను విడుదల చేస్తోందని కంపెనీ తెలిపింది. కర్మాగారం వద్ద అణు ధార్మికత పెరగడానికి ఇది ప్రధాన కారణం అని తెలిపింది.
ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద లీక్ అవుతున్న అణు ధార్మిక కలుషిత నీరు జపాన్ కే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకే పెను సమస్యగా మారిందని నిపుణులు ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారు. ఈ హెచ్చరికలను మొదట జపాన్ ప్రభుత్వం, టెప్కో కంపెనీ బేఖాతరు చేశాయి. కానీ ఇప్పుడు వీరే ఈ ప్రమాదాన్ని అంగీకరిస్తున్నారు. వరుసగా తలెత్తుతున్న సమస్యలకు కంపెనీ, ప్రభుత్వం వద్ద పరిష్కారం లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది.
అణు ధార్మికతతో కలుషితం అయిన నీరు భూగర్భ ట్యాంకర్ల నుండి లీక్ అవుతున్న సంగతి అంగీకరించిన తర్వాత టెప్కో కంపెనీ ఆ నీటిని సేకరించి ట్యాంకులలో నింపుతోంది. ఇలా నిల్వ చేసిన నీటిలో అణు ధార్మికతను సాధ్యమైనంతగా తగ్గించడానికి టెప్కో కంపెనీ ALPS (Advanced Liquid Processing System) అనే ప్రత్యేక యంత్ర వ్యవస్ధల వినియోగిస్తోంది. 14 స్టీల్ సిలిండర్లతో కూడి ఉండే ఈ వ్యవస్ధ గుండా అణు ధార్మికత నీటిని ఫిల్టర్ చేస్తున్నారు. ఇలా వడకట్టిన అణు ధార్మికత ద్రవాన్ని అనంతరం మరింత కట్టుదిట్టమైన పాత్రలలోకి పంపి నిలవ చేస్తున్నారు. ఈ పాత్రలను భద్రమైన చోటికి తరలించి నిలవ చేస్తున్నామని టెప్కో చెబుతోంది.
ఈ విధంగా మొదటి దశలో సేకరించిన కలుషిత నీటినంతటిని ఫిల్టర్ చేయడానికి మార్చి 2015 లక్ష్యంగా కంపెనీ విధించుకుంది. అయితే ఈ పధకానికి అప్పుడే సమస్యలు తలెత్తాయి. ఎంతో నమ్మకం పెట్టుకున్న ALPS యంత్రాలు నాలుగు రోజులుగా పని చేయడం మానేశాయి. కలుషిత నీటిని ALPS యంత్రం వద్దకు, మళ్ళీ అక్కడి నుండి వెనక్కి మోసుకు వచ్చే క్రేన్ లు కూడా మూలాన పడ్డాయి. వీటికి రిపేర్లు చేసి నిన్ననే (శుక్రవారం) మళ్ళీ వినియోగంలోకి తెచ్చారు.
ఫుకుషిమా శుభ్రత టెప్కో కంపెనీ కి తలకు మించిన భారంగా మారింది. పూర్తిగా శుభ్రం చేయడానికి 30 సంవత్సరాల పాటు పడుతుందని ప్రకటించిన టెప్కో, ఆది నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఊహించని ప్రమాదాలు, పరిణామాలు ఎదురవుతుండడంతో ఖర్చు అంతకంతకు పెరుగుతోంది. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి కంపెనీ తీసుకుంటున్న పొదుపు చర్యలు ప్రక్రియ మరింత వెనకబడడానికి, పరిస్ధితి మరింత ప్రమాదకరం కావడానికి దారి తీస్తోంది.
దీనితో జపాన్ ప్రభుత్వం కూడా ఒక చెయ్యి వేయడానికి నిర్ణయించుకుని ఆ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. జపాన్ ప్రభుత్వం తాను ఇప్పటివరకు 473 మిలియన్ డాలర్లు ఖర్చు చేశానని చెప్పింది. అణు సంక్షోభంతో కంపెనీ వ్యవహరిస్తున్న పద్ధతి సక్రమంగా లేదని జపాన్ ప్రభుత్వాధికారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో కంపెనీ, ప్రభుత్వం బాధ్యతలు పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఐడియా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం నీటిని శుభ్రం చేసే కార్యక్రమం, రియాక్టర్లను డీ కమిషన్ చేసే కార్యక్రమం లను ప్రభుత్వానికి అప్పజెప్పాలి. ప్రభుత్వ కంపెనీలు ఇక నుండి ఈ కార్యక్రమం చేపడతాయి. కంపెనీ యేమో కార్మాగారం మేనేజ్ చేయడం, నష్ట పరిహారం చెల్లించడం లాంటి కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పని విభజన ఎంతవరకు అమలులోకి వస్తుందో, ప్రభుత్వ సంస్ధల పని ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే. ప్రపంచ వ్యాపితంగా ఉన్న అణు పరిజ్ఞాన వర్గాలు మాత్రం ఫుకుషిమా వైపు ఆందోళనగానే ఇంకా చూస్తున్నారు.