ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు.
సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా సరిపోనంత మంది రావడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. కాంగ్రెస్, బి.జె.పి ప్రభుత్వాలు జనానికి ఏమి ఒరగబెట్టాయో జనతా దర్బార్ కి హారయిన జనసంఖ్య స్పష్టంగా తెలియజేసింది.
ప్రతి శనివారం జనతా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సమావేశం ఈ శనివారం జరిగింది. ఉదయం 9 నుండి 11:30 వరకు దర్బార్ జరుగుతుందని ప్రకటించగా విజ్ఞాపనలు స్వీకరించడానికే సమయం సరిపోలేదు. ఈసారి సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని ఈ సారికి ఇళ్లకు వెళ్ళండని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రజల్ని కోరడంతో జనం ఇంటి ముఖం పట్టారు.
“ఇప్పటికీ ఇంటికి వెళ్ళండి. ఈ (దర్బార్) వ్యవస్ధను దారిలో పెట్టడానికి కొంత గడువు ఇవ్వండి. మీ సమస్యలన్నింటినీ మేము పరిగణిస్తాము. ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేస్తాము” అని కేజ్రివాల్ ప్రజలను కోరారు. ఎక్కడా చోటు లేకపోవడంతో సెక్రటేరియట్ ప్రహరీ గోడపై నిలబడి కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ప్రజలు తోసుకుని రావడంతో పోలీసులు అరవింద్ ను లోపలికి లాక్కుపోయారు. లోపలికి తీసుకెళ్లి కొంతసేపు ఆయన కార్యాలయంలో కూర్చోబెట్టారు. అంతకంతకు పెరిగిపోయిన జనం బ్యారీకేడ్లను నెట్టుకుని రావడంతో భద్రతా కారణాల రీత్యా ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. కేజ్రీవాల్ పోలీసుల వివరణను ధృవీకరించారు.
“ఏర్పాట్లను ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఈ చోటి నుండి నేను వెళ్లకపోయి ఉన్నట్లయితే పెద్ద తొక్కిసలాట జరిగే అవకాశం కనిపించింది. ప్రతి ఒక్కరూ నన్ను కలవాలని కోరుకున్నారు. దీనిని దారికి తెచ్చి ఇలాంటి పరిస్ధితి మళ్ళీ ఏర్పడకుండా చూస్తాము. కొంత మంది నన్ను అభినందించడానికే వచ్చినట్లు కనిపిస్తోంది” అని కేజ్రీవాల్ జనాన్ని ఉద్దేశిస్తూ చెప్పారు.
ఇంద్రప్రస్ట ఎక్స్ టెన్షన్ లోని సెక్రటేరియట్ ఎదురుగా ఏర్పాటు చేసిన జనతా దర్బార్ కు మొత్తం ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం హాజరయింది. ఆఫీసుల్లో, ఎ.సి గదుల్లో, అనేకానేక తెరల మాటున కూర్చొని విజ్ఞాపనలు పట్టుకుని వచ్చే జనాన్ని ఆ వంకా, ఈ వంకా చెప్పి తిప్పి పంపడమో, చీదరించుకోవడమో చేయడానికి అలవాటు పడ్డ అధికార గణం అంతా ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు రోడ్డు పైన బల్లలు వేసుకుని కూర్చోవడం విశేషం. ఢిల్లీ కేబినెట్ సభ్యులందరూ దర్బార్ లో పాలుపంచుకున్నారు.
జనతా దర్బార్ నిర్వహణ మంచి ప్రయోగం అనీ ఇది కొనసాగాలని ఢిల్లీ న్యాయ మంత్రి సోమ్ నాధ్ భారతి వ్యాఖ్యానించారు. భారీగా హాజరయిన ప్రజలనుండి లిఖిత విజ్ఞాపనలను ఆయన ఓపికగా స్వీకరించారు. అనేకమంది నిరుత్సాహపడినప్పటికీ నమ్మకం కోల్పోలేదని వారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని పత్రికలు తెలిపాయి.
“మాకు పెద్ద మొత్తంలో వాటర్ బిల్లులు వస్తున్నాయి. ఈ సంగతి సి.ఎంకు చెబుదామని వచ్చాను. కానీ వినతి పత్రం ఇవ్వలేకపోయాను. నాకు నిరుత్సాహం కలిగినమాట నిజమే” అని లక్ష్మి నగర్ నివాసి రమేష్ గార్గ్ చెప్పారని ది హిందు తెలిపింది. తూర్పు ఢిల్లీ లోని మందవాలి నుండి సునీత కపూర్ అనే ఆవిడ ఉదయం 6 గంటలకే అక్కడికి వచ్చి కూర్చున్నారు. 9:30 కి కార్యక్రమం మొదలవుతుందని ముందే చెప్పినా ఆమె ఉదయాన్నే వచ్చారు. తన ఫ్లాట్ ను మరొకరు బలవంతంగా ఆక్రమించారని వారిని ఖాళీ చేయించాలని ఆమె కేజ్రివాల్ ను కోరారు. “నా సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు” అని ఆమె చెప్పారని పత్రిక తెలిపింది.
వివిధ ప్రభుత్వ విభాగాలలోని కాంట్రాక్టు కార్మికులు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. డి.టి.సి, విద్యుత్ కంపెనీ బి.ఎస్.ఈ.ఎస్, వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, మునిసిపల్ కార్పొరేషన్ల నుండి కాంట్రాక్టు కార్మికులు హాజరై తమ సమస్యలు వివరించారు.
అవినీతి వ్యతిరేక హెల్ప్ లాన్
అవినీతి అధికారులపై ఫిర్యాదులు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే అవినీతికి పాల్పడే వారి వ్యవహారాన్ని ఎలా రికార్డు చేయాలో అవినీతి విభాగం వారు చెబుతారని అరవింద్ రెండు రోజుల క్రితం తెలిపారు. హెల్ప్ లైన్ కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం అంటూ ఉండదని, దానికి విచారణ లాంటి తతంగం అవసరమని కేజ్రీవాల్ చెప్పారు. హెల్ప్ లైన్ ద్వారా అవినీతికి పాల్పడే వారికి హెచ్చరిక చేయడమే ప్రధాన లక్ష్యం అని ఆయన వివరించారు.
హెల్ప్ లైన్ కు అపూర్వ స్పందన లభించిందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గురువారం పని చేయడం ప్రారంభం అయిన 7 గంటల లోపు 4,000 కాల్స్ వచ్చాయని ముఖ్యమంత్రి అరవింద్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారుల సలహా మేరకు కొందరు కాలర్లు ఇప్పటికే తమదైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారని వారిపై చర్యలు తీసుకుంటున్నామని అరవింద్ తెలిపారు.
“8 ఎ.ఎం నుండి 3 పి.ఎం వరకు మొత్తం 3,904 కాల్స్ వచ్చాయి. తగినంత మంది సిబ్బంది, ఫోన్ చానల్స్ లేనందున వీటిలో 824 కాల్స్ ని మాత్రమే పరిశీలించాము. వీటిలో 53 ఫిర్యాదులు తీవ్రమైనవి. స్టింగ్ నిర్వహించే అవకాశం వీటికి ఉంది. కానీ 53 మందిలో 15 మంది స్టింగ్ నిర్వహించడానికి నిరాకరించారు. 38 మంది స్టింగ్ చేయడానికి అంగీకరించారు. నెంబర్లు చెప్పను గాని కొంతమంది ఇప్పటికే స్టింగ్ నిర్వహించారు కూడా” అని అరవింద్ తెలిపారు.
“వివిధ కాలర్లు నిర్వహించిన స్టింగ్ లు చాలా చక్కగా వచ్చాయని అవినీతి నిరోధక విభాగం అధికారులు నాకు చెప్పారు. ప్రొఫెషనల్స్ స్ధాయిలో చేశారని చెప్పారు. ఈ కేసుల్లో ఇప్పటికే చర్యలు ప్రారంభించాము” అని అరవింద్ తెలిపారు. కాల్ సెంటర్ ఎక్కడ నెలకొల్పిందీ చెప్పడానికి ఆయన నిరాకరించారు. అది తెలిస్తే అవినీతిపరులు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని అందుకు వెల్లడి చేయబోవడం లేదని చెప్పారు. ప్రారంభంలో 10 సీట్లతో నిర్వహించామని ఆ తర్వాత 15 కు, అనంతరం 30కు పెంచామని తెలిపారు. 30 సీట్లు 60 (ఫోన్) చానెళ్లు ప్రస్తుతం పని చేస్తున్నాయని చెప్పారు.
లాగే రహో అరవింద్ కేజ్రీవాల్!