మరో ప్రతీకారం: అమెరికా రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం


Khobragade

దేవయాని దేశం విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించడంతో ఇండియా మరో ప్రతీకార చర్య ప్రకటించింది. దేవయాని ర్యాంకుకు సమానమైన అమెరికా రాయబార అధికారిని ఇండియా విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయంలో దేవయాని ప్రస్తుతం నియమితురాలయిన సంగతి తెలిసిందే. ఐరాసలో భారత తరపు అధికారిగా దేవయాని పూర్తిస్ధాయి రాయబార రక్షణకు అర్హురాలు. రెండు రోజుల క్రితమే (జనవరి 8) దేవయానికి ఈ హోదా ఇస్తూ అమెరికా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

దేవయాని కేసుకు సంబంధించిన వ్యవహారాలను ఇండియా నుండి పర్యవేక్షించిన అమెరికా రాయబార అధికారి, దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశించిన అమెరికా అధికారి ఒకరేనని తెలుస్తోంది. దేవయాని వ్యవహారం ఈ మలుపు తీసుకోవడానికీ, అమెరికా ఏక పక్షంగా వ్యవహరించడానికీ ఈ అధికారే కారణమని భారత ప్రభుత్వం భావిస్తోందని ది హిందు తెలిపింది.

న్యూయార్క్ కు చెందిన గ్రాండ్ జ్యూరీ దేవయాని పైన రెండు కౌంట్లలో నిందితురాలుగా అభియోగాలు మోపిందని న్యూయార్క్ అటార్నీ ప్రీత్ భరార చెప్పారు. వీసా ఫ్రాడ్ కు పాల్పడినందుకు ఒక కౌంటు, తప్పుడు పత్రాలు సమర్పించినందుకు మరొక కౌంటు అభియోగాలను జ్యూరీ మోపింది. దేవయాని భారత్ కు వెళ్ళినప్పటికీ ఈ నేరారోపణలు కొనసాగుతాయని జ్యూరీ స్పష్టం చేసిందని ప్రీత్ తెలిపారు.

అభియోగాలు మోపిన అనంతరం దేవయానికి కట్టబెట్టిన పూర్తిస్ధాయి రాయబార రక్షణను ఉపసంహరించుకోవాలని అమెరికా, ఇండియాను కోరింది. దీనిని ఇండియా తిరస్కరించింది. దానితో దేవయాని అమెరికా విడిచి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. జనవరి 8 తేదీన దేవయానికి పూర్తి రాయబార రక్షణ కల్పిస్తూ అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇవ్వగా సదరు రక్షణను తొలగించాలని జనవరి 9 న అమెరికా ప్రభుత్వం కోరింది.

దేవయానిని ఐరాసకు బదిలీ చేస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస రెండు వారాల క్రితమే ఆమోదించింది. ఈ సమాచారాన్ని అమెరికా అధికారులకు ఐరాస చెప్పినప్పటికీ అమెరికా జనవరి 8 వరకు ఏ సంగతి తేల్చలేదు. ఆమెపై అభియోగాలు మొపేంత సమయాన్ని న్యూయార్క్ అటార్నీ కార్యాలయానికి ఇచ్చి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకుంది. ఈ సంగతి గ్రహించే అభియోగాల మోపుదలను మరో నెల రోజులు వాయిదా వేయాలని దేవయాని లాయర్ కోర్టును కోరారు. దీనిని అటార్నీ ప్రీత్ భరార తిరస్కరించారు. ప్రీత్ భరార తిరస్కరణను పరిగణలోకి తీసుకున్న కోర్టు దేవయానికి మరో నెల గడువు ఇవ్వడానికి తిరస్కరించింది.

గడువు ఇవ్వడానికి ఆమోదించినట్లయితే ఈ లోపాలే ఐరాస బదిలీని ఆమోదించాల్సిన అవసరం అమెరికాకు కలిగి ఉండేది. అనగా అభియోగాలు మోపడానికి ముందే ఆమెకు పూర్తిస్ధాయి రాయబార రక్షణ ఇవ్వాల్సివచ్చేది. పూర్తిస్ధాయి రాయబార రక్షణ వచ్చాక ఇక దేవయానిపై అభియోగాలు మోపడానికి వీలుపడేది కాదు. అనగా దేవయానిపై ఎలాగైనా అభియోగాలు మోపడానికే అమెరికా కట్టుబడి పని చేసింది. అనుకున్నట్లుగానే అభియోగాలు మోపడం, అనంతరం ఐరాస బదిలీ ఆమోదించడం, రాయబార రక్షణ ఉపసంహరించాలని అమెరికా కోరడం, దానిని ఇండియా తిరస్కరించడం, దేశం విడిచి వెళ్లాలని కోరడం జరిగిపోయింది.

ఈ నేపధ్యంలోనే అమెరికా ఎంబసీలోని ఒక అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఇండియా కోరింది. అమెరికా ఈ విధంగా ఏకపక్షంగా కేసు మోపడానికి పరిస్ధితి తీవ్రం కావడానికి సాగిన ప్రక్రియలో ఈ అధికారి ముఖ్య పాత్ర పోషించారని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు పత్రికలు చెబుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఇండియా వరుసగా ప్రతీకార చర్యలు ప్రకటిస్తూ వచ్చింది. అమెరికా ఎంబసీ చుట్టూ ఏర్పరిచిన బ్యారికేడ్లను తొలగించి సాధారణ ట్రాఫిక్ ను అనుమతించిన భారత ప్రభుత్వం అమెరికా కాన్సల్ అధికారుల హోదాను తగ్గించి అమెరికాలో ఇండియా కాన్సల్ అధికారుల హోదాతో సమానం చేస్తూ కొత్త ఐ.డి కార్డులు జారీ చేసింది. రాయబారుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కార్డులను వెనక్కి తీసేసుకుంది. కాన్సల్, ఎంబసీ అధికారులకు గతంలో లాగా 3 యేళ్ళ పాటు సరుకులను దిగుమతి చేసుకునే సౌకర్యం ఉండగా దానిని జెనీవా ఒప్పందం నిర్దేశించిన 6 నెలకు కుదించింది. అమెరికా ఎంబసీ అధికారులకు భారత విమానాశ్రయాల్లో కల్పించిన ప్రత్యేక పాసులను కూడా రద్దు చేసుకుంది. దానితో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ కొన్ని ప్రయాణాలను రద్దు చేసుకుంది. ప్రత్యేక పాసు ద్వారా తనిఖీ చేయకుండా పంపితే తప్ప ఆమె ఎక్కడికి ప్రయాణం చేయరని దీని ద్వారా అర్ధం అయింది.

ఇవి కాకుండా గత కొద్ది రోజుల్లో ఇండియా మరిన్ని చర్యలు ప్రకటించింది. అమెరికా ఎంబసీలో దశాబ్దాలుగా నడుస్తున్న క్లబ్ ను జనవరి 16 లోపు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇండియాలో పని చేస్తున్న అమెరికన్లకు ఇది మక్కా లాగా పని చేస్తూ వచ్చింది. స్విమ్మింగ్ ఫూల్స్, బౌలింగ్ క్రీడా వసతులు, షటిల్, టెన్నిస్ ఆటలు, బార్ తదితర వసతులు ఈ క్లబ్ లో ఉన్నాయి. ఈ క్లబ్ ద్వారా అమెరికా ఎంబసీకి సంవత్సరానికి 3 మిలియన్ డాలర్ల (1800 కోట్ల రూపాయలు) ఆదాయం వస్తుందని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఈ క్లబ్ ను మూసేయాలని, ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలేవీ జరగరాదని భారత్ ఆదేశించింది.

ఈ నేపధ్యంలో అమెరికా ఎనర్జీ కార్యదర్శి ఎర్నెస్ట్ మోనిజ్ నేతృత్వంలోని వాణిజ్య బృందం ఇండియా రావలసి ఉండగా తన పర్యటనను రద్దు చేసుకుంది. ఈ పర్యటన వాస్తవంగా అత్యధిక ప్రాధాన్యత కలదిగా ఇరు దేసాలూ గుర్తించిన పర్యటన. ఈ పర్యటన కూడా రద్దు కావడంతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s