నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం


AFP Photo / Patrick Baz

‘టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం’లో నిండా మునిగిన అమెరికా సైనికులు 4 సంవత్సరాల వయసుగల టెర్రరిస్టును కాల్చి చంపి కాలరెగరేశారు. ఆనక ప్రమాదవశాత్తూ చంపామని ప్రకటించారు. దుమ్ము దట్టంగా ఉండడంతో 4 యేళ్ళ పిల్లాడు తమ మీదికి దాడికి వస్తున్నాడని భావించి కాల్చి చంపామని సైనికులు చెప్పారని స్ధానిక ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలకు హామీ ఇస్తే తప్ప అమెరికాతో ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందాని’కి ఒప్పుకునేది లేదని చెబుతున్న అధ్యక్షుడు కర్జాయ్ తాజా ఘటనతో స్వరం మరింత పెంచాడు.

“వాతావరణం నిండా దుమ్ము ఉండడం వలన మెరైన్ బలగాలు నాలుగేళ్ల పిల్లాడిని శత్రువు అని భావించారట. దానితో వాళ్ళు కాల్పులు జరిపారు. ఫలితంగా బాలుడు చనిపోయాడు” అని హెల్మండ్ రాష్ట్ర గవర్నర్ ఒమర్ జ్వాక్ చెప్పాడని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. సంఘటనపై విచారణ జరిపిస్తామని నాటో ప్రకటించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లు కనిపించడం నాటో/అమెరికా సాయినికులకు ఆఫ్ఘన్ లో అలవాటే. ఇళ్ళల్లో జొరబడి పిల్లల్ని, మహిళల్ని కాల్చి చంపడం, ఆ తర్వాత మతి భ్రమించి చేశారని సాకులు చెప్పడం కూడా అమెరికాకు అలవాటే. అలా మతి భ్రమించినవారు ఆ తర్వాత ఏ ఆసుపత్రిలో చేరిన దాఖలా కనపడదు. ఒక్కోసారి తామే విచారించి శిక్ష వేసేశామ్ అని చెబుతారు గానీ అందుకు సాక్ష్యాలేవీ కనపడవు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అమెరికా సైనికుల దుష్కృత్యం పట్ల ఆగ్రహం ప్రకటించాడు. పౌరుల ఆవాసాల్లో మిలట్రీ ఆపరేషన్లను వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశాడు. అంటే నేరుగా పౌరుల ఇళ్ల వద్దనే అమెరికా సైనికులు మిలట్రీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారన్నమాట! వారి కార్యకలాపాలు టెర్రరిస్టులపై కాదన్నమాట! ఇలాంటి వీరులను ‘శాంతి ప్రక్రియ పట్ల నిబద్ధత చూపించాలని’ ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరుతోంది.

“ISAF (ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆసిస్టెన్స్ ఫోర్స్)/NATO మిలట్రీ బలగాలు ఇళ్లపైనా, గ్రామాలపైనా సాగిస్తున్న ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడుల వలన అమాయక పిల్లలు, పౌరులు మరణిస్తున్నారు” అని కర్జాయ్ ప్రతినిధి అయిమల్ ఫైజీ ప్రకటించారని రష్యా టుడే తెలిపింది.

‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ (Bilateral Security Agreement -బి.ఎస్.ఏ) విషయంలో అమెరికా, ఆఫ్ఘన్ ల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొని ఉంది. డిసెంబర్ 31 లోపల ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని అమెరికా గడువు పెట్టినప్పటికీ హమీద్ కర్జాయ్ దానిని లెక్క చేయలేదు. పౌరుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని హామీ ఇవ్వాలని, ఇళ్లపై పడి దాడులు చేయరాదని కర్జాయ్ తన షరతులుగా చెబుతున్నారు. ఒప్పందం ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉండిపోయే అమెరికా సైనికులు హత్యలు చేస్తే విచారించే అధికారం తమకు ఉండాలని కూడా కర్జాయ్ డిమాండ్ చేస్తున్నాడు.

హమీద్ కర్జాయ్ తో భారత పాలకులకు కూడా మిత్రత్వం ఉంది. ఫ్రంట్ లైన్ పత్రిక ప్రకారం ద్వైపాక్షిక భద్రతా ఒప్పందంపై సంతకం చేయడానికి హమీద్ కర్జాయ్ నిరాకరించడం వెనుక ఇండియా ప్రోద్బలం కూడా ఉందని అమెరికా భావిస్తోంది. దేవయాని ఖోబ్రగదే వ్యవహారంలో అమెరికా వ్యవహరించిన తీరుకు ఇదీ ఒక కారణమే అయి ఉండవచ్చని ఫ్రంట్ లైన్ అభిప్రాయపడింది. ఆఫ్ఘన్ లో వివిధ నిర్మాణ, రోడ్డు కాంట్రాక్టులను భారత కాంట్రాక్టు కంపెనీలు నిర్వహిస్తున్నాయి.

2014 డిసెంబర్ నాటికి అమెరికా బలగాలను ఉపసంహరిస్తామని అధ్యక్షుడు ఒబామా తమ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికా సైనికులు కొందరు ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగించడానికి బి.ఎస్.ఏ వీలు కల్పిస్తుంది. ఇలా మిగిలిపోయే సైనికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదట్లో 50,000 సైనికులు ఉంటారని అంచనా వేయగా ఆ తర్వాత 30,000కూ అనంతరం 20,000 కూ తగ్గిపోయింది. తాజా అంకె 8,000 కు చేరింది. కనీసం 8,000 సైనికులైనా ఆఫ్ఘనిస్తాన్ లో లేకపోతే అమెరికా ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్ధాన్ అస్ధిరత నెలకొంటుందని టెర్రరిస్టులు చెలరేగిపోతారని అమెరికా వాదిస్తోంది. అమెరికా సైన్యమే లేకపోతే 12 సంవత్సరాలకు పైగా ఇల్లూ (అమెరికా ఆర్ధిక వ్యవస్ధ), ఒల్లూ (వేలాది అమెరికా సైనికుల మరణం) గుల్ల చేసుకుని కూడా అమెరికాకు ప్రతిఫలం ఏదీ దక్కనట్లే అవుతుంది. ఈ నేపధ్యంలో కఠినంగా వ్యవహరించడం ద్వారా అమెరికా నుండి సాధ్యమైనంత ఎక్కువ సహాయం రాబట్టడానికి కర్జాయ్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

తాము లేకపోతే టెర్రరిస్టులు చెలరేగుతారన్న అమెరికా వాదనను ఆఫ్ఘన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. అమెరికా వాదనకు ఆధారాలు లేవని తిరస్కరించింది. అసలు భద్రతా ఒప్పందమే అవసరం లేదనీ దీని వెనుక అమెరికాకు చెడు ఉద్దేశ్యాలు ఉన్నాయని కర్జాయ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. “ఇలాంటి వాదనలు తప్పని గతంలోనూ రుజువయ్యాయి. వీటిని మేము గట్టిగా తిరస్కరిస్తున్నాము” అని కర్జాయ్ ప్రతినిధి ఫైజీ అన్నాడని రాయిటర్స్ తెలిపింది. 

ఆఫ్ఘన్ ప్రజల ప్రాణాలంటే అమెరికాకు లెక్కే లేదని అమెరికా సైనికుల క్రూరత్వం ఇలాగే కొనసాగితే అమెరికాతో భద్రతా ఒప్పందానికి అంగీకరించేది లేదని కర్జాయ్ వివిధ సందర్భాల్లో స్పష్టం చేస్తున్నాడు. అమెరికా సలహాతో జైలులో ఉంచిన 72 మంది ఖైదీలను కర్జాయ్ విడుదల చేయడానికి నిర్ణయాయించడాన్ని అమెరికా తప్పు పట్టింది. వారు టెర్రరిస్టు నేరాలకు పాల్పడ్డారని కాబట్టి విడుదల ఆపాలని అమెరికా కోరుతోంది. దీనిని కూడా కర్జాయ్ తిరస్కరించాడు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి అమాయకులను నిర్బంధించడం తమ విధానం కాదని ఆయన ఈ సందర్భంగా అమెరికాను ఎత్తిపొడిచాడు.

One thought on “నాలుగేళ్ల ఆఫ్ఘన్ పిల్లాడిన చంపేసిన అమెరికా సైన్యం

  1. కర్జాయ్ అమెరికాను…ఎదిరించి మాట్లాడుతున్నాడంటే తప్పక ఏదో రహస్యం దాగి ఉంటుంది. తన ప్రజల రక్షణ కోసమే అమెరికా సైన్యాన్ని ఎదిరిస్తున్నాడంటే…అది ఇవాళ కొత్తగా తెలిసి వచ్చిందా..?
    కచ్చితంగా వీలైనంత ఎక్కువ ప్రతిఫలం రాబట్టడమే కర్జాయ్ గారి పథకం అయి ఉంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s