ఎలక్షన్ కమిషన్: భద్రతా భయంతో గూగుల్ ఒప్పందం రద్దు


Google

భారత ఎలక్షన్ కమిషన్ ఒక భేషయిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాల వల్ల కాని పని తనకు చేతనవునని చాటుకుంది. ఓటర్ల సేవల నిమిత్తం గూగుల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం ప్రకటించింది.

అమెరికా, బ్రిటన్ గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, జి.సి.హెచ్.క్యూ లు ప్రపంచ ఇంటర్నెట్ వినియోగదారులందరి పైనా గూఢచర్యం సాగిస్తున్నాయని, దీనికి గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ తదితర అమెరికన్ ఇంటర్నెట్ కంపెనీలన్నీ పూర్తిగా సహకరిస్తున్నాయని ఎడ్వర్డ్ స్నోడెన్ పత్రాల ద్వారా వెల్లడి అయిన నేపధ్యంలో ఇ.సి నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత ప్రధాని మన్మోహన్ సింగ్ సెల్ ఫోన్ సంభాషణలను సైతం అమెరికా గూఢచార సంస్ధలు రికార్డు చేశాయని వెల్లడి అయినప్పటికీ ప్రధాని ఉలకలేదు, పలకలేదు. విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అయితే అదేమంత పెద్ద విషయం కాదని కొట్టిపారేశాడు. కాని ప్రభుత్వ అధికారులు, పాలకులు జరుపుకునే అధికార సంభాషణలు, ఈ మెయిళ్ల భద్రత కోసం దేశీయంగా సరికొత్త వ్యవస్ధ నెలకొల్పడానికి నిర్ణయం తీసుకున్నామని ఐ.టి మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించారు. ప్రజల ఏకాంత హక్కులను హరించివేస్తున్న అమెరికా గూఢచర్యం విషయంలో మాత్రం సిబాల్ కూడా మౌనం పాటించారు. తమ భద్రత భద్రంగా ఉండాలనీ, ప్రజల భద్రత మాత్రం ఏమైపోయినా ఫర్వాలేదని ఈ విధంగా ప్రభుత్వం చెప్పినట్లయింది.

ఈ నేపధ్యంలో ఎలక్షన్ కమిషన్ ముందుగానే జాగ్రత్త పడింది. ఈ వారంలోనే గూగుల్ కంపెనీ తాము అందించే సేవల గురించి ఇ.సి కి ప్రజెంటేషన్ ఇచ్చింది. ఓటర్లకు వివిధ సౌకర్యాలను, సేవలను సమకూర్చడానికి తమకు కాంట్రాక్ట్ ఇవ్వాలని గూగుల్ ప్రతిపాదించింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున ఇ.సి కూడా ఒప్పందానికి మొగ్గు చూపింది.

ఈ సంగతి తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన ప్రకటించాయి. తన నిర్ణయం మార్చుకోవాలని ఇ.సి ని కోరాయి. జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడవచ్చన్న అనుమానం వ్యక్తం చేశాయి. గూగుల్ తో కాంట్రాక్టు వలన జాతీయ భద్రతకు ఎలా ప్రమాదం ఏర్పడుతుందో, పార్టీలు అలా ఎందుకు భావిస్తున్నాయో వివరాలు లభ్యం కాలేదు.

న్యూ ఢిల్లీలో గురువారం సమావేశం అయిన ఇ.సి ఈ అంశాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సి.ఇ.సి) వి.ఎస్.సంపత్, ఇతర కమిషనర్లు హెచ్.ఎస్.భ్రహ్మ, ఎస్.ఎన్.ఏ.జైది లు హాజరయిన ఈ సమావేశం గూగుల్ తో ఒప్పందం గురించి చర్చించిందని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి నిర్ణయించిందని అనంతరం పత్రికలకు తెలిపారు.

ఎన్నికల సమాచారాన్ని మరింత మెరుగైన పద్ధతుల్లో తెలుసుకోవడానికి తగిన సేవలు అందజేస్తామని గూగుల్ ప్రతిపాదించిందని ఎన్నికల కమిషన్ ఈ సందర్భంగా తెలిపింది. పౌరులకు ఎన్నికల జాబితాలో వివరాలను వెతుక్కునే సౌకర్యం కల్పించడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఇ.సి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించడం తదితర సేవలను అందజేయడానికి గూగుల్ ప్రతిపాదించిందని తెలిపింది.

గూగుల్ తో ఒప్పందానికి కాంగ్రెస్, బి.జె.పి లు సైతం అభ్యంతరం చెప్పడం విశేషం. పార్టీలుగా ఒక మాట, అధికారం చేజిక్కిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరించడం ఈ పార్టీలకు ఉన్న అలవాటు. అధికారం సంపాదించడానికి ప్రజల ఓట్లు కావాలి కాబట్టి వారికి అనుకూలంగా హామీలు ఇవ్వడం అధికారం చేజిక్కిన తర్వాత తమ హామీలకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం వీరి సహజ లక్షణం. అందుకే ఎఎపి లాంటి పార్టీలకు పట్టం గట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నది నేటి వాస్తవం.

కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఈ విషయమై గతంలో ఇ.సి కి లేఖ రాసినట్లు తెలుస్తోంది. గూగుల్ తో ఒప్పందం పై భద్రతా పరమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రక్రియ పైనా, జాతీయ భద్రతకూ దీనివల్ల ప్రభావం పడబోదన్న ఆశాభావం ఈ లేఖద్వారా కాంగ్రెస్ వ్యక్తం చేసిందని ది హిందు తెలిపింది. ఈ విషయాన్ని మొదట అఖిల పక్ష సమావేశంలో చర్చించి ఉండాల్సిందని బి.జె.పి అభిప్రాయపడింది.

అయితే ఈ రెండు పార్టీలు గూగుల్ తో ఒప్పందాన్ని నేరుగా తిరస్కరించకపోవడం గమనార్హం. కనీసం జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్నా సూచన/సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రమాదం ఏమీ ఉండదన్న ఆశాభావం కాంగ్రెస్ వ్యక్తం చేస్తే, బి.జె.పి యేమో అన్ని పార్టీలతో చర్చించి వారి అభిప్రాయాలూ తీసుకొని ఉండాల్సిందని సూచించింది. సమావేశం పెడితే తాము ఎ అభిప్రాయం చెప్పేవారిమో ఆ పార్టీ చెప్పినట్లు లేదు.

అయితే ఇ.సి చర్యను కొందరు సైబర్ నిపుణులు నిలదీశారు. భారతీయులకు సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం సరైన నిర్ణయం కాదని వారు ఇ.సి కి లేఖ కూడా రాశారు.

ఈ భూగోళంపై నివసించే ప్రతి ఒక్క మనిషి వివరాలు తన గుప్పెట్లో ఉండాలన్నది గూగుల్ ఆశ, కల, లక్ష్యం. ఈ విషయాన్ని గూగుల్ సి.ఇ.ఓ ఎరిక్ స్మిత్ చాలా సంవత్సరాల క్రితమే వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో వ్యక్తం చేశాడు. గూగుల్ అందజేసే వివిధ రకాల ఉచిత సేవలకు ఇదే పరమ లక్ష్యం అని ఆయా సేవలను వినియోగించుకునేవారు జాగ్రత్తగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది.

వినియోగదారుల నుండి ఆ వంక, ఈ వంక చెప్పి వారి సెల్ ఫోన్ నెంబర్లను గూగుల్ సేకరిస్తుంది. పాస్ వర్డ్ మర్చిపోతే కొత్త పాస్ వర్డ్ సృష్టించుకోడానికి ఉపయోగం అని చెప్పి సెల్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేనివారికి మరో ఆప్షన్ లేదు అన్నంత వాతావరణం సృష్టిస్తుంది. సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వకుండా తదుపరి స్క్రీన్ కు పోదలుచుకున్నవారికి ‘స్కిప్’ అన్న ఆప్షన్ ఇస్తుంది గానీ ఆ అక్షరాలు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సినంత చిన్నవిగా చేస్తుంది.

వేరే పని తొందరలో ఉన్నవారు లేదా ఆ పనిని త్వరగా పూర్తి చేయాలని భావించేవారు గబుక్కున సెల్ నెంబర్ ఇచ్చేసి తదుపరి స్టెప్ కు వెళ్ళే పరిస్ధితి కల్పిస్తుంది. మొత్తం మీద సెల్ నెంబర్ ని ఎలాగైనా సంపాదిస్తుంది. తర్వాత ఫోటో, అసలు పేరు, లొకేషన్, మిత్రుల ఫోటోలు, ఫ్రెండ్స్ ఇలా అందరి వివరాలు మననుండి సేకరించేలా ఉచిత సేవలు అందజేస్తుంది.

ఇదంతా ఎందుకు? ముందే చెప్పినట్లు ఈ భూ మండలం పై ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు తన గుప్పెట్లో పెట్టుకోవడం గూగుల్ లక్ష్యం. ఐ.టి యుగంలో సమాచారమే ఒక శక్తి అని చాలా కంపెనీల కంటే ముందే గూగుల్ గ్రహించింది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, వారి ఆసక్తులు, కొనుగోళ్ళు, అలవాట్లు, స్నేహితులు… ఇలా సమస్త వివరాలు దగ్గర పెట్టుకోవడం ద్వారా గూగుల్ ఇతర కంపెనీల కంటే వేగంగా అభివృద్ధి చెందింది. జిమెయిల్, బ్లాగింగ్, పికాసా, ప్లస్, గూగుల్ టాక్, గ్లాస్, నెక్సస్, క్రోమ్, యాండ్రాయిడ్, స్ట్రీట్ వ్యూ, గూగుల్ మేప్, న్యూస్, కేలండర్  తదితర అనేక డజన్ల సేవలు ఉచితంగా ఇవ్వడం ద్వారా వినియోగదారుల డబ్బు ఖర్చు అలవాట్లను సేకరిస్తుంది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కొక్క ఐ.డి కేటాయించి వారి సమస్త వివరాలు ఆ ఐ.డి కింద భద్రం చేసుకుంటుంది. ఫ్లాష్ (వీడియో) సేవల ద్వారా అడోబ్ కంపెనీ ఫ్లాష్ కుకీలను బ్రౌజర్ల ద్వారా వినియోగదారుల కంప్యూటర్లలో స్ధాపించి వాటి ద్వారా వివరాలు సేకరించడం అడోబ్ చేస్తున్న పని. ఈ ఐ.టి కంపెనీల మధ్య పరస్పరం సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యాపార సంబంధాలు ఉండడంతో ఈ సమాచారం కూడా అంతిమంగా గూగుల్ కి చేరుతోంది.

వినియోగదారులకు అనేక ఆశలు చూపి, చివరికి అబద్ధాలు కూడా చెప్పి సమాచారం సేకరించడం గూగుల్ ప్రత్యేకత. ఇతర కంపెనీలు కొంతవరకే ప్రయత్నం చేసి వదిలేస్తే గూగుల్ మాత్రం సమాచారం ఇచ్చేదాకా వెంటపడుతుంది. కాకపోతే ఆ సంగతి మనకి తెలియదు.

ఇలాంటి గూగుల్ అమెరికా గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఎ, సి.ఐ.ఎ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి. గూగుల్ చేసే అనేక వ్యాపార మోసాలను అమెరికా ప్రభుత్వం, రెగ్యులేటర్లు చూసీ చూడనట్లు వదిలేస్తే అందుకు ప్రతిఫలంగా తనవద్ద ఉన్న సమాచారాన్ని గూఢచార కంపెనీలకు ఇవ్వడం జరుగుతోందని ఎడ్వర్డ్ స్నోడెన్ కంటే ముందే వివిధ నిపుణులు హెచ్చరించారు. కానీ ఉచిత సేవలు వాడుకునే రందిలో ఉన్న జనం గూగుల్ ని వ్యతిరేకించే బదులు అభిమానులుగా మారిపోతున్నారు. వివిధ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ, ఇంటర్నెట్ ఫోరం లలోనూ తమకు అనుకూలంగా ప్రచారం చేసే పి.ఆర్ కంపెనీలను కూడా గూగుల్ నియమించుకుందని కాస్పరస్కీ లాంటి యాంటీ వైరస్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

తస్మాత్ జాగ్రత్త!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s