పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా


అమెరికా ప్రస్తుతం ‘పోలార్ వొర్టెక్స్’ చలి కౌగిలిలో వణికిపోతోంది. మధ్య పశ్చిమ (Midwest) అమెరికా రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఆర్కిటిక్ చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత -52o C వరకు నమోదయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావద్దని ప్రభుత్వాలు కోరాయి. తీవ్ర చలిగాలులు ఉన్న చోట బైటికి వెళితే తెలియకుండానే గడ్డకట్టుకుని చనిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కెనడా మీదుగా ఆర్కిటిక్ ధ్రువం నుండి వచ్చిపడిన చలి మంచు తుఫాను ఈ పరిస్ధితికి కారణంగా తెలుస్తోంది.

ఈ వాతావరణ పరిస్ధితిని ‘పోలార్ వొర్టెక్స్’ గా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగ్రహానికి ఉత్తర ధృవ ప్రాంతం అయిన ఆర్కిటిక్ ధృవ కేంద్రం నుండి అత్యంత తీవ్రమైన చలిగాలులు దక్షిణ దిశగా కెనడా, అమెరికాల మీదికి వీయడాన్ని ‘పోలార్ వొర్టెక్స్’ అంటారని వారు వివరిస్తున్నారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావం సోమవారం నుండి అమెరికాలో తీవ్రంగా కనిపిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల వరకు ఇది కొనసాగుతుందని, పరిస్ధితి క్రమంగా మరింతగా దిగజారుతుందని వాతావరణ అధికారులను ఉటంకిస్తూ వివిధ పత్రికలు తెలిపాయి.

అమెరికా జనాభాలో సగం మంది పోలార్ వొర్టెక్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలకు తోడు గాలులు వీస్తున్నాయని, ఉత్తర రాష్ట్రాల్లో -50 డిగ్రీల (సెంటి గ్రేడ్) వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని సమాచారం అందుతోంది. అమెరికా జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రస్తుత చలి వాతావరణాన్ని ‘చారిత్రకం మరియు ప్రాణాంతకం’ అని అభివర్ణించింది. సోమవారం వేలాది ఇళ్లకు విద్యుత్ శక్తి కూడా కరువైందని ది హిందు తెలిపింది. మధ్య పశ్చిమ రాష్ట్రాల నుండి ఈశాన్యంలోని పెన్సిల్వేనియా, న్యూయార్క్ తదితర రాష్ట్రాల వరకు విస్తరించిన చలి మంచు తుఫాను వలన ఈ విధంగా విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

తీవ్ర చలిగాలుల ఫలితంగా ప్రయాణాలు కష్టభరితంగా మారాయి. దాదాపు 4,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 11,200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అమెరికా ఆధ్వర్యంలోని ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’ (International Space Station -ISS)కు వాణిజ్య సరఫరాలు చేరవేయాల్సి ఉండగా తీవ్ర స్ధాయి కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా దానిని వాయిదా వేసుకున్నారు.  వర్జీనియా లోని నాసా కేంద్రం నుండి ‘ఆర్బిటల్ సైన్సెస్ సిగ్నస్’ పేరుగల అంతరిక్ష కార్గో నౌక ద్వారా ఈ సరఫరాలు జరగవలసి ఉంది. బుధ లేదా గురువారం వరకు దీనిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

చికాగో, మినీయాపులీస్, ఇండియానాపొలిస్ తదితర రాష్ట్రాలకు తీవ్ర చలి, మంచు కొత్త కాకున్నప్పటికీ కెనడా మీదుగా వీస్తున్న చలి గాలుల బెడద భిన్నంగా ఉన్నదని ఆ ప్రాంతంలోని ప్రభుత్వాలు, ప్రజలు చెబుతున్నారు. ఇండియానాపొలిస్ లో భారీ స్ధాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 20 యేళ్లలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ పరిస్ధితి తమను భయపెడుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ బాలార్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా సరైన రక్షణ దుస్తులు ధరించకుండా ఇంటిబయట కొద్ది నిమిషాలు గడిపితే వారికి తెలియకుండానే ఫ్రాస్ట్ బ్రైట్ (చలికి కండలు గడ్డగట్టుకుని కుళ్లిపోయే జబ్బు) కు గురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. “సరైన దుస్తులు ధరించకపోతే 10 నిమిషాల్లోనే మీరు చనిపోతారు” అని ఆయన తెలిపారు. ఇటువంటి వాతావరణం వలన ప్రయాణాలపై పరిమితులు విధించారు.

ఉష్ణోగ్రతలు ఏ స్ధాయికి పడిపోతాయో అంచనా వేయడంలో మీటీయోరాలజిస్టులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారని ది హిందు తెలిపింది. నార్త్ డకోటా లోని ఫార్గోలో సోమవారం ఉషోగ్రత -51 oC గా నమోదయింది. ఉత్తర-మధ్య రాష్ట్రం మిన్నెసోటాలో పాఠశాలలు మూసేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. చలి మంచుకు కొత్త కానీ మిన్నెసోటాలో చలి కారణంగా పాఠశాలలు మూసివేయడం 17 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. మంగళవారం పాఠశాలలు తెరిసేదీ లేనిదీ ఆయా జిల్లాల అధికారులకు వదిలివేశారు. చలి తీవ్రత దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని కూడా హెచ్చరికలు జారీ చేశారు.

చలి గాలులు మధ్య పశ్చిమ రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వైపుకు కదలవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక్కడ 36 అంగుళాల మేరకు మంచు కురుస్తుందని, ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోవచ్చని అంచనా వేశారు. రోడ్లు మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణాలు విరమించుకుని ఇళ్ళల్లో ఉండిపోవాలని గవర్నర్ ప్రజలకు సలహా ఇచ్చారు. న్యూయార్క్ ఆర్మీ కి చెందిన 300 మంది బలగాలను, ఎయిర్ నేషనల్ గార్డ్ బలగాలను అత్యవసర పరిస్ధితి నిమిత్తం అప్రమత్తం చేశారు. చలి మంచు తుఫాను తీవ్రం కావడంతో ఈ చర్య తీసుకున్నారు. 3,800 ఫీల్డ్ వర్కర్లను కూడా సిద్ధం చేశారు. విద్యుత్ సరఫరా విఫలం అయితే వీరు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.

మిన్నెసోటా లోని డులూత్ లో ఉష్ణోగ్రత -56 డిగ్రీలకు పడిపోయిందని రష్యా టుడే తెలిపింది. దక్షిణ రాష్ట్రాల్లోని హంట్స్ విల్లే, అలబామా తదితర చోట్ల -14 డిగ్రీల ఉషోగ్రత నమోదయింది. పోలార్ వొర్టెక్స్ తీవ్రత ధాటికి  అట్లాంటిక్ సముద్రం అంతటా అల్పపీడనం విస్తరించడంతో బ్రిటన్ నైరుతి తీరంలో సముద్రం ఉప్పొంగి భయపెడుతోంది. “అమెరికాలోని చలి మంచు తుఫానుకు కారణం అయిన వాతావరణ వ్యవస్ధతో బ్రిటన్ లో ఎగసి పెడుతున్న భారీ అలలు సంబంధం కలిగి ఉన్నాయి. ఈ వాతావరణమే అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మంచును ఎత్తిపోస్తోంది. వేలాది విమానాలు రద్దయ్యాయి” అని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ తెలిపింది.

ఉష్ణోగ్రత -10 డిగ్రీల లోపు స్ధాయికి పడిపోవడం, చలి గాలులు -20 డిగ్రీల ఉష్ణోగ్రతతో విస్తుండడంతోనూ ప్రజలు బైటికి రావద్దని ఇండియానా, కెంటకీ ప్రభుత్వాలు హెచ్చరించాయి. మధ్య-అట్లాంటిక్, మధ్య పశ్చిమం మరియు దక్షిణ భాగంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ ఇంకా పెరుగుతుందని కాబట్టి ఈ ప్రాంతాల్లోని 61 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని ఫెడరల్ ప్రభుత్వం కోరింది. ఇండియానాలో అప్పుడే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 40,000 కుటుంబాలు చీకటిలో ఉన్నాయి. విద్యుత్ కంపెనీలు సరఫరా పునరుద్ధరణ చేయడం కోసం వీరు ఎదురు చూస్తున్నారు.

అట్లాంటిక్ సముద్రంలోని లోని జెట్ స్ట్రీమ్ ఈ వాతావరణ పరిస్ధితికి మూలకారణం అని తెలుస్తోంది. ఇదే ఒకవైపు సముద్రాన్ని అల్లకల్లోలం కావిస్తూ మరోవైపు ఆర్కిటిక్ నుండి చలిగాలులను మోసుకొస్తోందని ఆర్.టి తెలిపింది. సాధారణ స్ధాయి కంటే అధికంగా చలిగాలులను ఈసారి ఇది మోసుకొస్తోందని అందుకే వాతావరణం విపరీతంగా మారిందని తెలిపింది. “తాగుబోతులో వ్యవహరిస్తున్న జెట్ స్ట్రీమ్ దీనికి మౌలిక కారణం. ఉత్తర భూగోళార్ధాన్ని ఇది అతలాకుతలం చేస్తోంది” అని రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త జెన్నిఫర్ ఫ్రాన్సిస్ వివరించారని ఆర్.టి తెలిపింది.

పోలార్ వర్టెక్స్ ఈ విధంగా అదుపు తప్పి ప్రవర్తించడానికి గ్లోబల్ వార్మింగ్ ప్రధాన కారణమని ఫ్రాన్సిస్ తెలిపారు. పోలార్ వర్టెక్స్ ప్రతి సంవత్సరం సంభవించేదే అయినా గ్లోబల్ వార్మింగ్ వలన ఆర్కిటిక్ బాగా కరిగిపోవడంతో అదుపు తప్పిందని ఫలితంగా చివరి దక్షిణ  ప్రాంతాల వరకు చలి మంచు తుఫాను వ్యాపించిందని ఆయన వివరించారు. పోలార్ వర్టెక్స్ వలన మామూలుగా అయితే దక్షిణ రాష్ట్రాలకు చలి మంచు గాలులు ఇంత తీవ్రంగా వ్యాపించవని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వలన పోలార్ వర్టెక్స్ సాధారణం కంటే ఎక్కువసార్లు సంభవిస్తోందని, ‘గ్లోబల్ వార్మింగ్’ పై పరిశోధనలు నిర్వహిస్తున్న ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు.

Photos: Daily mail

 

2 thoughts on “పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా

  1. పింగ్‌బ్యాక్: పోలార్ వొర్టెక్స్: అమెరికాపై చలి పులి పంజా | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s