పోలార్ వర్టెక్స్ వలన అమెరికాలో అత్యంత కనిష్ట స్ధాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానితో అక్కడ ప్రజా జీవనం దాదాపు స్తంభించిపోయింది. -56 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని పత్రికలు చెబుతున్నాయి. ది హిందూ పత్రిక ఈ ఉష్ణోగ్రతలను సెంటీ గ్రేడ్ లలో చెప్పగా రష్యా టుడే ఫారెన్ హీట్ లలో తెలిపింది. –50o C వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే మాత్రం 56o F కనిష్ట ఉష్ణోగ్రత నమోదయినట్లు తెలిపింది.
ఇంతకీ పోలార్ వర్టెక్స్ అంటే ఏమిటన్న ప్రశ్న సహజం. సమశీతోష్ణ ప్రాంతం అయిన ఇండియాలో ఇలాంటి వాతావరణం ఏర్పడదు. పోలార్ వర్టెక్స్ ఆర్కిటిక్ ధృవ ప్రాంత లక్షణం కనుక అమెరికా, కెనడా, యూరప్, రష్యా దేశాల్లో మాత్రమే పోలార్ వర్టెక్స్ ప్రభావం కనిపిస్తుంది.
పోలార్ వర్టెక్స్ అనేది ఆర్కిటిక్ లో చలి తుఫాను వలన ఏర్పడుతుందని కొందరు, ఉత్తర కెనడాలో పోలార్ వర్టెక్స్ ఏర్పడడం వలన అమెరికాలో చలి పెరిగిందని కొందరు వివిధ పత్రికల్లో రాస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదని తెలుస్తోంది.
పోలార్ వర్టెక్స్ అనేది దానికదే చెడ్డ వాతావరణం కాదు. పైగా ఆర్కిటిక్ ధృవ ప్రాంతంలో ఏర్పడే అత్యంత చలి తుఫానుల నుండి ఇది సమీప దేశాలను కవచంలా కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ వలన పోలార్ వర్టెక్స్ బలహీనపడడంతో ఆర్కిటిక్ కేంద్రంలో కేంద్రీకృతం అయి ఉండే చలి గాలులు దక్షిణ దిశవైపుకు ఒలికిపోయి తీవ్రమైన వాతావరణ పరిస్ధితులకు దారి తీస్తుంది.
పోలార్ వర్టెక్స్ ఆర్కిటిక్ ధృవ ప్రాంత వాతావరణం లోని ఒక లక్షణం. ఇది ఆర్కిటిక్ ధృవ కేంద్రం చుట్టూ పశ్చిమం నుండి తూర్పు దిశకు ప్రవహించే గాలుల సమూహం. ఇది భూమి చుట్టూ (ఆర్కిటిక్ ధ్రువం చుట్టూ) తిరుగుతూ ఒక కవచాన్ని ఏర్పరుస్తాయి. ఆర్కిటిక్ ధృవ కేంద్రంలో ఉండే అత్యంత చల్లని చలిగాలులను దక్షిణం వైపుకు జారిపోకుండా ఈ కవచం అడ్డుకుంటుంది. లేదా ఉత్తర ధ్రువం చుట్టూ ఒక బందిఖానా లాంటిది ఏర్పరిచి అక్కడి చలి వాతావరణాన్ని అక్కడే బంధించివేస్తుంది.
అయితే అప్పుడప్పుడూ ఈ వొర్టెక్స్ బలహీనపడుతుంది. దాని ఫలితంగా ధృవ ప్రాంతంలోని తీవ్ర చలి గాలులు బలహీన పడిన కవచాన్ని దాటుకుని దక్షిణ వైపుగా ప్రయాణించి కెనడా, అమెరికాల మీదికి వస్తాయి. ఒక్కోసారి ఈ గాలుల సమూహం మధ్యకు చీలిపోయి రష్యా, తూర్పు యూరప్ దేశాల మీదికి సైతం వస్తాయి. కిందికి వచ్చిన చలి వాతావరణం జెట్ స్ట్రీమ్ ను కూడా మరింత దక్షిణానికి నెట్టివేస్తుంది. జెట్ స్ట్రీమ్ అంటే పసిఫిక్ సముద్రం నుండి అమెరికా మీదుగా వీచే వాతావరణ ప్రవాహం. దానితో దక్షిణ ప్రాంతాలు కూడా తీవ్రమైన చలి మంచుతో నిండిపోతాయి.
ఈ సందర్భంగా జెట్ స్ట్రీమ్, పోలార్ వర్టెక్స్ పరస్పరం తలపడతాయి. జెట్ స్ట్రీమ్ బలంగా ప్రతిఘటిస్తే గనుక అందులోని తేమ భారమైన మంచుగా భూమిని చేరుతుంది. 2010 ఫిబ్రవరిలో ఇలాంటి పరిస్ధితే ఏర్పడడంతో వాషింగ్టన్ డి.సి నగరం దాదాపు మూసివేతకు గరయింది. దీనిని అప్పట్లో స్నోమగెడ్డాన్ (snowmageddon) అని కూడా పిలుచుకున్నారు.
పోలార్ వర్టెక్స్ బలహీన పడడం వలన శీతల వాతావరణం కిందికి వస్తుంది సరే. అసలు అదెందుకు బలహీనపడాలి అన్నది ప్రశ్న. ఇక్కడే గ్లోబల్ వార్మింగ్ తన తడాఖా చూపిస్తోంది. క్రమంగా ప్రతి వేసవి లోనూ ఆర్కిటిక్ ధృవ ప్రాంతంలోని మంచు వేగంగా కరిగిపోవడం పెరుగుతూ వస్తోంది. ఆర్కిటిక్ మంచు మరింత కరిగే కొందీ ఆర్కిటిక్ సముద్రం మరింత వెచ్చగా మారుతోంది. చలికాలంలో సముద్రం ఈ అదనపు వేడిని వాతావరణంలోకి నెట్టివేస్తుంది. ఫలితంగా పోలార్ వొర్టెక్స్ బలహీనపడుతోంది.
గత దశాబ్దకాలంలో సేకరించిన ఆర్కిటిక్ వాతావరణ వివరాలు శాస్త్రవేత్తలకు పోలార్ వొర్టెక్స్ విపరీత ప్రవర్తనపై ఒక అవగాహన ఇచ్చాయి. ఒక వేసవిలో ఆర్కిటిక్ ధృవ మంచు పెద్ద మొత్తంలో కరిగినప్పుడు తదుపరి వచ్చే చలికాలంలో పోలార్ వొర్టెక్స్ బలహీనపడుతున్న విషయాన్ని ఈ వివరాల ద్వారా శాస్త్రవేత్తలు గ్రహించారు. ఉత్తర అట్లాంటిక్ సముద్రం మీది వాతావరణం దీనికి సహకరించినపుడు పరిస్ధితి తీవ్రంగా మారుతోంది.
అమెరికా, కెనడాల్లో నెలకొన్న పరిస్ధితులు పైకి చూడడానికి గ్లోబల్ వార్మింగ్ కు విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో అవి గ్లోబల్ వార్మింగ్ ఫలితమే. భూగ్రహం తనపైన నివసించే మానవాళి రక్షణకు తనకు తానుగా ఏర్పరిచిన రక్షణ కవచాలను ఈ విధంగా మనిషే నాశనం చేస్తున్నాడు. తద్వారా తనకు తానే చేటు తెచ్చుకుంటున్నాడు.
సైంటిఫిక్ అమెరికన్ పత్రిక ప్రకారం ఈ విధంగా ఆర్కిటిక్ గాలులు సమీప దేశాలలోకి విరుచుకుపడిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. 2010 మరియు 2011లలో అమెరికా, ఉత్తర యూరప్ దేశాలలోనూ, జనవరి 2012లో తూర్పు యూరప్ లోనూ ఈ పరిస్ధితులు ఏర్పడ్డాయి. 2012-13లో ఉత్తర అమెరికా, యూరప్ లలో ఏర్పడిన వాతావరణ పరిస్ధితులు పోలార్ వొర్టెక్స్ విజృంభణకు సహకరించాయని ఈ పత్రిక తెలిపింది.
పింగ్బ్యాక్: పోలార్ వర్టెక్స్ అంటే? | ugiridharaprasad
ప్రపంచ దేశాలలొ అత్యధిక కాలుష్యం వెదజల్లె అమెరికా ఆ ఫలితాల్ని ఇప్పుడు ఇకపై కూడా అనుభవిస్తుంది.ఇతర దేశాలకు సుద్దులు చెప్పకుండా అమెరికా తన ఉద్గారాలను నియంత్రించాలి……