ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్


AAP Kashmir policy

“మన కాశ్మీరు పాలసీ పైన జనాభిప్రాయం ఏమిటో ఎస్.ఎం.ఎస్, ట్విట్టర్ ల ద్వారా తెలుసుకోవాల్సింది కాదా?”

కాశ్మీరు విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సాధారణ విధానం నుండి పక్కకు తప్పుకుంది. ప్రతి పనికీ ప్రజల అభిప్రాయాన్ని కోరే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అటువంటి విధానం కాశ్మీరు ప్రజలకు మాత్రం వర్తించదని తన వింత విధానం ప్రకటించారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద్వంద్వ విధానం కలిగి ఉందన్నట్లే, ముఖ్యంగా కాశ్మీరు విషయంలో.

కాశ్మీరులో ప్రజల దుంప తెంచుతున్న AFSPA చట్టాన్ని ఎత్తివేయాలా లేదా అన్న సంగతిని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ అభిప్రాయం చెప్పడంతో అరవింద్ కేజ్రీవాల్ ద్వంద్వ విధానం బైటికి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ దృష్టిలో ఢిల్లీ ప్రజలకు ఒక న్యాయం, కాశ్మీరు ప్రజలకు ఒక న్యాయమూనా? ఎందుకని అలా? కాశ్మీర్ ప్రజలు ముస్లింలు అయినందువల్లనా?

అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన కారణం కాంగ్రెస్, బి.జె.పి పార్టీలకు బాగా సంతోషం కలిగించి ఉండాలి. ప్రశాంత్ భూషణ్ అభిప్రాయాన్ని ఆ పార్టీలు తీవ్రంగా ఖండించాయి కూడాను. జాతీయ సమగ్రత గురించి ఆలోచించాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయనీ, అలాంటి సందర్భాల్లో కాశ్మీరు కూడా ఒకటనీ అరవింద్, కాంగ్రెస్, బి.జె.పి లు ముక్తకంఠంతో టి.వి లు ముందు సూక్తులు వల్లించారు. వీరి దృష్టిలో కాశ్మీరీల జాతీయ సమగ్రతకు పూచిక పుల్లంత విలువ కూడా లేదు మరి! కాశ్మీరీల జాతి సమగ్రత అటుంచి కనీసం వారి రోజువారీ జీవనానికి కూడా వీరి దృష్టిలో విలువ లేదని కూడా అర్ధం అవుతోంది.

పాకిస్తాన్ బూచి చూపి కాశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను సైనిక బూట్ల కింద అణచివేయడాన్ని ఇన్నాళ్లూ భారత పాలకులు అనుసరిస్తున్న విధానం. దీనికి జాతీయ సమగ్రత అనీ, దేశ రక్షణ అనీ పేర్లు పెట్టుకున్నారు. AFSPA (సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం) అడ్డం పెట్టుకుని కాశ్మీరులోనూ, మణిపూర్ లోనూ భారత సైనికులు పాల్పడుతున్న అరాచకాలకూ, అత్యాచారాలకూ అరవింద్ ఏమి సమాధానం చెబుతారో ఇంకా తెలియదు.

కాశ్మీరు ప్రజలంతా AFSPA ను ఎత్తివేయాలని అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి కొత్తేమీ కాదు. వారి రక్షణ కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 370 ని సైతం నామమాత్రం చేసిన తర్వాత కాశ్మీరీలకు కనీస రక్షణ ఏనాడో కొడిగట్టింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ప్రతినిధులు (interlocutors) కూడా AFSPA ను ఎత్తివేయాలని, తద్వారా కాశ్మీరు ప్రజల సాధారణ జీవనానికి సహకరించాలని సిఫారసు చేసిన సంగతి ఎఎపి దృష్టిలో ఉన్నదా?

తాము నియమించిన ప్రతినిధుల కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అడ్డంగా నిరాకరించింది. దానికి కేంద్ర మంత్రి పి.చిదంబరం చెప్పిన కారణం AFSPA ని ఎత్తివేయడానికి సైన్యం అస్సలు ఒప్పుకోవడం లేదని. మాంసాహారం మానేయాలని పులిగారికే విన్నపాలు సమర్పించుకుంటే ఆ పులిగారు ఏమి చెబుతారు? సరే అంటారా? చిదంబరం గారి సమాధానం కూడా అలాగే ఉంది.

కాశ్మీర్ అంటే మట్టి కాదనీ, కాశ్మీర్ అంటే అక్కడి ప్రజలని తెలియడానికి అక్కడి ప్రజలు ఏం చేయాలి? వారి ప్రజాస్వామిక ఆకాంక్షలు సంతృప్తి పడకుండా ప్రపంచంలోనే అతి పెద్ద  ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మన దేశ ప్రజాస్వామ్యం వృధా అని మన పాలకులకు ఎప్పటికీ తెలిసేను?

అరవింద్ కేజ్రీవాల్ ‘ప్రజాభిప్రాయ సేకరణ’ విధానం కాశ్మీరు ప్రజలకు వర్తించదని చెప్పడం అంటే ఆయన ప్రభోదించే విలువలనే అపహాస్యం చేస్తున్నట్లు అర్ధం. బహుశా ఆయన ప్రజా తత్వంలోని బోలుతనానికి ఇది మొదటి సూచకం కావచ్చు.

8 thoughts on “ఎఎపి కాశ్మీరు (ద్వంద్వ) విధానం -కార్టూన్

  1. అమ్మయ్య ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నామో!
    ఇప్పటికి దొరికారు.
    ఎందుకని అలా? కాశ్మీర్ ప్రజలు ముస్లింలు అయినందువల్లనా?
    అవును మరి కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్లు మనుషులు కాదు కదా. వారి గురించి అప్పుడూ ఎవరూ అడగలేదు ఇపూడూ ఎవరూ పట్టించుకోరు

  2. దొరకడం ఏమిటి? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? నా అభిప్రాయాల్ని నేను దాచుకోను. కాబట్టి ఎదురు చూపులు మానండి.

    కాశ్మీరు విషయంలో నా అభిప్రాయాలు బోలెడు సార్లు చెప్పాను. పండిట్ల గురించి కూడా రాశాను. బహుశా మీరూ చూసి ఉండాలి.

    నేను దొరకాలని కోరుకోవడం బదులు విషయాన్ని అరమరికలు లేకుండా చర్చించడానికి సిద్ధపడితే ఉపయోగం.

  3. saaru, who is not doing justice to them based on kashmiri muslims, are you joking or sleeping or dreaming that someone is doing injustice to kashmiri muslims, did you ever bothered that kashmir has 370 article. So you feel that we should not bother about the national security and we should withdraw army from kashmir so that you will happy and your friends will be double happy so that we happily forget kashmir forever, you are right

  4. @sashank

    నిద్ర, ఊహలు, కలలు… ఇలాంటి వాటిల్లో మునిగిపోయింది నీలాంటి వాళ్ళే. కాస్త మర్యాదగా రాయలేనివాడివి నీకు లింకులు ఇయ్యాలేం? బుర్ర ఏమన్నా ఉంటే చర్చకు ప్రయత్నించు. అదేమీ లేకపోతే అడుగు, చెప్పడానికి ప్రయత్నిస్తా. కల్లు తాగిన కోతిలా చిందులు వెయ్యదలిస్తే మరో చోటు చూసుకో. ఎన్నిసార్లు చెప్పినా నీలాంటి చచ్చుగాళ్లకు బుద్ధిరాదేమిటాని?

    ఆర్టికల్ 370 ఒక జీవఛ్ఛవం. రాష్ట్రపతి ఉత్తర్వులు అనీ, జాతీయ భద్రత అనీ దాన్ని ఎప్పుడో చంపేసారు. ఆ సంగతి తమరు తెలుసుకోవాలి. చచ్చిన శవాన్ని ఇక పారేయాలని మతోన్మాదులు డిమాండ్ చేస్తుంటే, కాంగ్రెస్ లాంటి పార్టీలతో కుమ్మక్కయిన బాపతేమో ఆ శవాన్నే పాతిపెట్టకుండా అట్టానే ఉంచాలని డిమాండ్ చేస్తారు. ఇద్దరి డిమాండ్లలో పెద్ద తేడా ఎమీ లేదు.

    కాశ్మీరు నీదీ నాదీ కాదు. అక్కడి ప్రజలది. అక్కడ ఏ చట్టం అమలు చేసినా అక్కడి ప్రజల్ని సంతోషపెట్టాలి. వారి అభివృద్ధికి దోహదపడాలి. నిన్నూ, నీ మిత్రులనీ కాదు. ప్రజాస్వామ్యం అంటే అదే. అర్ధం అయిందా?

    ఢిల్లీ ప్రజల్ని అభిప్రాయాలు కోరిన అరవింద్ కాశ్మీరు విషయంలో దానికి భిన్నంగా చెబుతున్నారని రాశాను. నీ కంటికి కనపడిందా లేదా? అది అన్యాయం అని తోచడం లేదా? ద్వంద్వ నీతి అని తోచడం లేదా?

    కాశ్మిర్ లో వేలాది యువకుల్ని ఇంటినుండి పట్టుకుపోయి అదృశ్యం చేస్తున్నారన్న సంగతి నీలాంటి వాళ్ల తలలకి ఎప్పుడైనా ఎక్కుద్దా? టెర్రరిజంతో సంబంధం లేకపోయినా ప్రమోషన్ల కోసం అమాయక యువకుల్ని చంపుతున్న సంగతి ఎప్పుడన్నా చదివావా? ‘లొంగిపోండి, భద్రత కల్పిస్తాం, జీవనాధారం కల్పిస్తాం’ అని ఆహ్వానించి తీరా లొంగిపోయాక వారిని చిత్రహింసలు పెట్టి కేసుల్లో ఇరికిస్తున్న సంగతి నీకు తెలుసా? అఫ్జల్ గురు అలా ఇరుక్కున్నవాడే. సుప్రీం కోర్టే అఫ్జల్ పైన సాక్ష్యాలు లేవని చెబుతూనే దేశ ఆత్మ శాంతించాలంటే ఉరి శిక్ష వేయాలని చెప్పి ఉరేసిన సంగతి ఎప్పుడన్నా చదివావా?

    అనేకమంది యువకుల్ని ఎన్ కౌంటర్లలో చంపెయ్యడం వలనా, మాయం చెయ్యడం వలనా కాశ్మీర్ లో 2001 లెక్కల్లో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువయ్యింది. ఈ సంగతి చెప్పకుండా కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల జనాభాలను ప్రకటించడం ఆపేశారు. ఈ విషయం ఎప్పుడన్నా నీ దృష్టికి వచ్చిందా? కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల జాతుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నిరుత్సాహపరచడానికీ, అణచివేయడానికి లైంగిక అత్యాచారాల్ని ఒక ఆయుధంగా, విధానంగా అమలు చేసిన సంగతి తెలుసా నీకు? మనోరమ, సోపూర్ లాంటి ఉదంతాలు పత్రికల ద్వారా దేశం దృష్టికి వచ్చినవి మాత్రమే. రానివి బోలెడు.

    ఇవన్నీ అన్యాయం కాదా? ఇంత ఘోరమైన బతుకు బతకడానికి మించిన అన్యాయం మరొకటి ఉంటుందా? ఈ వాస్తవాలని పక్కనబెట్టి ‘నా తల్లి నుదుటి సింధూరం’, జాతీయ సమగ్రత అంటూ ఎన్ని చచ్చు కబుర్లు చెప్పినా ఏం ప్రయోజనం?

    మళ్ళీ చెబుతున్నా. కాశ్మీర్ అనేది కొండలు, గుట్టలు, గడ్డి, గాదం కాదు. జనం. కాశ్మీరీ జాతి జనం. వాళ్లు ఎప్పటినుండో స్వతంత్ర రాజ్యంగా ఉన్నారు. ఇండియాలో వాళ్లు భాగం కాదు. పాకిస్ధాన్ మెర్సినరీస్ నుండి తమను తాము కాపాడుకోవడానికి తాత్కాలికంగా ఇండియాలో కలిసారు. అది కూడా పూర్తిగా కాదు. కేవలం మూడు శాఖల్ని (విదేశాంగం, డిఫెన్స్, కమ్యూనికేషన్స్) మాత్రమే ఇండియాకు అప్పజెప్పారు. పాకిస్ధాన్ ప్రమాదం నుండి బైటపడ్డాక ఫ్లెబిసైట్ జరుపుతామని ఇండియా వాగ్దానం ఇచ్చింది. ఐదారేళ్లు కాశ్మీర్ కి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఉన్నారు. అంటే ఏమిటి అర్ధం? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు.

    పండిట్ల సంఖ్య కాశ్మీరు లోయలో ఎప్పుడూ రెండు, మూడు లక్షలకు మించలేదు. లక్షలాది మంది వలసపోయారని ఒకడంటే మిలియన్ల మంది వలసపోయారని మరొకడంటాడు. ఎక్కడ్నించి ఈ లెక్కలు తెస్తారో అర్ధం కాని విషయం. కాశ్మీరీ పండిట్ల వలస ఈ మధ్య మొదలయింది కాదు. అది శతాబ్దాల నాటి లక్షణం. వారి ఉన్నత విద్య వలన వారిని భారత భూభాగం లోని అనేకమంది రాజులు, సంస్ధానాలు ఆహ్వానించి పదవులు ఇచ్చారు. కాశ్మీరీ బ్రాహ్మణులకు పండిట్ అన్న బిరుదిచ్చిందే అక్బర్. కాశ్మీర్ లోయలో ముస్లింలు, హిందువులు కలిసి మెలిసి జీవించిన చరిత్ర ఉంది. కాశ్మీరీలు స్వతహాగా సెక్యులర్ జీవన విధానం కలిగి ఉన్న జాతి. ముస్లిం పాలకులు కూడా వారికి గౌరవమర్యాదలు ఇచ్చి నెత్తిన పెట్టుకున్న చరిత్ర ఉంది. కాశ్మీర్ ని రెండుగా విడగొట్టి ఇండియా, పాక్ చెరోముక్కా పంచుకున్న దగ్గర్నుండే సమస్యలు మొదలయ్యాయి.

    కాశ్మీర్ ప్రజలు స్వయం పాలనకోసం పోరాటం చేస్తున్నారు. పాక్ ప్రోద్బలంతో ఇందులోకి మతతత్వ శక్తులు కూడా జొరబడ్డారు. కానీ వారి సంఖ్య తక్కువ. మెజారిటీ కాశ్మీరీలు కోరేది అటు పాకిస్ధాన్ కాదు, ఇండియా కాదు. స్వతంత్రం. ఇండియాలో భాగంగా ఉండాలని భావిస్తే ముందు వారి మనసుల్ని గెలవాలి. వారి హక్కులకు గ్యారంటీ ఇవ్వాలి. వారి వనరులు వారికే దక్కుతాయన్న గ్యారంటీ ఉండాలి. దానికి బదులు సైన్యాన్ని పంపి హత్యలు, అత్యాచారాలు, మాయాలు చేస్తే ఏ జాతి అయినా తిరగబడుతుంది. అది సహజ ప్రకృతి సూత్రం. అది నీలాంటి బాపతుకి ఎన్ని జన్మలెత్తినా అర్ధం అయ్యే విషయం కాదు.

  5. నేనన్నది మీరు దొరికారని కాదు.
    ఆప్ పార్టీ వాళ్ళు దొరికారని.
    millions of skeptics want them to fail!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s