బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను


బ్రిటన్ ను పెను తుఫాను వణికిస్తోంది. తుఫాను ఫలితంగా 30 అడుగుల ఎత్తున అలలు విరుచుకుపడుతున్నాయి. దానితో తీర ప్రాంత నగరాలు నీటి సముద్రాలుగా మారాయి. అనేక చోట్ల రోడ్లు తెగిపోగా రేస్ కోర్సులు, మైదానాలు, స్టేడియంలు సైతం నీటితో నిండిపోయాయి. దక్షిణ, పశ్చిమ తీరాలు ప్రధానంగా పెను తుఫాను తాకిడికి గురవుతున్నాయి. తుఫాను తీవ్రత తగ్గలేదని సోమవారం వరకు కొనసాగుతుందని పర్యావరణ శాఖ తెలిపింది. ఇంగ్లాండ్ వ్యాపితంగా 100 కుపైగా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతంలో జారీ అయిన హెచ్చరికలకు ఇవి అదనం. ఆదివారం మరింత తీవ్రమైన తుఫాను ఇంగ్లండ్ ను చుట్టుముడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రం నుండి రాక్షస అలలు తీరాల్ని ముంచెత్తుతున్నాయి. కొన్నిచోట్ల లైట్ హౌస్ కు మించిన ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. డబుల్ డెక్కర్ బస్సుల కంటే రెండు రెట్లు ఎత్తులో అలలు తీరంలోని రోడ్లను ముంచెత్తాయని డెయిలీ మెయిల్ తెలిపింది. వరదనీరు అనేక ఇళ్లను ముంచివేసింది. రోడ్లు, రైల్వే వంతెనలు దెబ్బ తిన్నాయి. భారీ వంతెనలు కూడా దెబ్బతిన్నవాటిలో ఉన్నాయని రష్యా టుడే తెలిపింది. బలమైన గాలుల వలన హీత్రో విమానాశ్రయంలో దిగడానికి విమానాలు చాలా కష్టపడుతున్నాయి.

శనివారం ఉదయం పర్యావరణ సంస్ధ 100కు పైగా వరద హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో నాలుగు హెచ్చరికలు అత్యంత తీవ్రమైనవని తెలుస్తోంది. శుక్రవారం 20 వరకు తీవ్రవరద హెచ్చరికలు జారీ అవడం గమనార్హం. శనివారం వీటి సంఖ్య తగ్గినప్పటికీ ఆదివారం మరింత తీవ్ర తుఫాను సంభవించనుందని తెలుస్తోంది. “మరింత కష్టభరితమైన వాతావరణం ఆదివారం ఎదురుకానుంది. నదులన్నీ వరద నీటితో పొంగిపొర్లుతాయి” అని పర్యావరణ శాఖ చెప్పిందని ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. దేవోన్, కార్న్ వాల్ తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతినవచ్చని, డార్సెట్, వేల్స్, స్కిల్లీ ఐసిల్స్ తీరాలు కూడా భారీ నష్టం చవి చూస్తాయని పర్యావరణ శాఖ హెచ్చరించిందని ఆర్.టి తెలిపింది.

1997 తర్వాత అత్యంత ఎత్తైన అలలు వేల్స్ తీరాన్ని ముంచెత్తుతాయని వేల్స్ రాష్ట్ర సహజ వనరుల శాఖ హెచ్చరించింది. సౌత్ వేల్స్ లో కొన్ని ఇండ్ల నుండి జనాన్ని ఖాళీ చేయించారు. బ్రిటన్ వ్యాపితంగా అనేకచోట్ల పసుపు పచ్చ హెచ్చరిక జారీ చేశారు. వీరంతా లగేజీ సిద్ధం చేసుకోవాలని, అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధపడాలని ప్రభుత్వం కోరింది. ఉత్తర ఐర్లాండ్ ను కూడా వరదలు తాకాయి. బెల్ ఫాస్ట్ పోలీసులు ఇసుక బస్తాలను వరద తాకిడి ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్రంగా మారిని వాతావరణాన్ని పరిశీలించడానికి ఔత్సాహికులు ధైర్యం చేసి సముద్ర తీరంలో తిష్టవేశారు. వీరిలో కొందరు గల్లంతయ్యారని ఫిర్యాదు అందడంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. దేవోన్ లోని ప్లే మౌత్ లో యువకులు గల్లంతయ్యారని పత్రికలు తెలిపాయి.

భారీ శక్తితో తీరాన్ని తాకుతున్న అలలు అక్కడ ఉన్నవారిని లోపలికి లాక్కెళ్తాయని అందువలన దూరంగా ఉండాలని పర్యావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. జాతీయ ఎమర్జెన్సీ పరిస్ధితిని వరదలు కల్పించాయని కామన్స్ ఎన్విరాన్ మెంట్ సెలెక్ట్ కమిటీ ప్రకటించింది. సముద్రం, నదుల నుండి జనం దూరంగా ఉండాలని కోరింది. ఇప్పటివరకు బ్రిటన్ వ్యాపితంగా 4 తీవ్ర వరద హెచ్చరికలు, 103 హెచ్చరికలు 237 అప్రమత్తతలు జారీ అయ్యాయని డెయిలీ మెయిల్ తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో దక్షిణ ఇంగ్లండ్ ను వరదలు తాకుతాయని, వర్షాలు క్రమంగా భారీ మంచును తెస్తాయని మెట్ ఆఫీస్ తెలిపింది. ఆర్కిటిక్ నుండి తీవ్ర చలిగాలుల వలన అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

ఆది వారం గంటకు 70 మైళ్ళ (110 కి.మీ) వేగంతో కూడిన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం ఇవి ఉచ్ఛ స్ధితికి చేరుతాయని పర్యావరణ శాఖ అంచనా వేస్తోంది.

గత సంవత్సరం బ్రిటన్ కు వాతావరణ పరంగా అత్యంత గడ్డు సంవత్సరంగా రికార్డయింది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో తీవ్రమైన వర్షాలు, తుఫానులు, మంచు తుఫానులు విరుచుకుపడ్డాయి. అత్యంత కనిష్ట స్ధాయి ఉష్ణోగ్రతల మధ్య క్రిస్టమస్ పండుగను జరుపుకున్నారు. అయినప్పటికీ పర్యావరణ శాఖ నుండి 1700 ఉద్యోగాలను రద్దు చేయడానికి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పొదుపు విధానాల పేరుతో ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు హరించుకుపోయిన బ్రిటన్ లో కొత్తగా వస్తున్న ఉద్యోగాలు అత్యంత కనిష్ట వేతనాలతోనూ, అబధ్రత పరిస్ధితులతోనూ కూడి ఉంటున్నాయి. ఫలితంగా ప్రజల మరిస్ధితి అటు ప్రకృతి నుండి, ఇటు ప్రభుత్వాల నుండి దాడులను ఎదుర్కొంటున్నారు.

Photos: Daily Mail 

2 thoughts on “బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను

  1. పింగ్‌బ్యాక్: బ్రిటన్ తీరాల్ని ముంచెత్తిన పెను తుఫాను | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s