రైతుల భూములు లాక్కొని తిరిగివ్వని కోకొకోల


ఉత్తర ప్రదేశ్ లో రైతులపై కోకొకోల కంపెనీ సాగిస్తున్న దౌర్జ్యన్యం ఇది. గ్రామ రైతులు ఉమ్మడిగా వాడుకునే భూమిని అక్రమంగా ఆక్రమించిన కంపెనీ రైతులు ఆందోళన చేసినా ఆక్రమించిన భూమిని వెనక్కి ఇవ్వలేదు. చివరికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కంపెనీకి నోటీసు ఇచ్చి గడువు విధించింది. గడువు ముగిసినా ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయని కోలా కంపెనీ రైతులపై ఎదురుదాడికి తెగబడింది. ఆక్రమించిన భూమిని కొన్న భూమిగా వాదిస్తోంది. కోకోకోలా నీటి చౌర్యానికి వ్యతిరేకంగా దాదాపు 15 గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి.

వారణాసికి 20 కి.మీ దూరంలో ఉన్న మెహ్ది గంజ్ గ్రామంలో  కోకొకోల కంపెనీ బాట్లింగ్ ఫ్యాక్టరీ నెలకొల్పింది. గ్రామ సభకు చెందిన భూమిని ఇది రెండు విడతలుగా ఆక్రమించింది. 1999లో ఒకసారి, మళ్ళీ 2011 లో ఒకసారి. ఆక్రమించిన భూమి ఒక భిగా ఉంటుందని తెలుస్తోంది. దీనిని వెనక్కి ఇచ్చేయాలని స్ధానిక జిల్లా ప్రభుత్వం డిసెంబర్ 17 తేదీన నోటీసు ఇచ్చింది. వారం లోపు ఇవ్వాలని గడువు విధించగా ఇంతవరకు కంపెనీ నుండి స్పందన లేదు.

ఆక్రమణ వలన బాధితులైన రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తహసిల్దారు పట్టించుకోలేదు. దానితో జిల్లా యంత్రాంగం కలుగజేసుకుంది. ‘లోక్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్ధ నేతృత్వంలో రైతులు అనేక దఫాలుగా ఆందోళన నిర్వహించాకనే జిల్లా యంత్రాంగం కదిలింది.

“పెద్ద కంపెనీలు దేశ చట్టాలను ఎలా గౌరవిస్తాయో కంపెనీ, పాలనా వ్యవస్ధల వైఖరిని బట్టి అర్ధం అవుతుంది. రోడ్డు పక్క వ్యాపారం చేసుకునే చిన్న చిన్న యూనిట్లను కూల్చివేయడానికి పాలనా యంత్రాంగం మహా ఆసక్తి ప్రదర్శిస్తుంది. వారణాసి లోని ఘాట్ల నుండి పేద హాకర్లను ఖాళీ చేయించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. వారి వల్ల ఘాట్లు మురికి అవుతున్నాయని చీదరిస్తుంది. కానీ వ్యాపార ప్రయోజనం కోసం రైతుల భూములు ఆక్రమించే పెద్ద పెద్ద వ్యాపార కంపెనీల విషయానికి వచ్చేసరికి చేష్టలుడిగిపోతుంది. ప్రభుత్వం కంపెనీల ఒత్తిడితో పని చేస్తోందని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. లేదా కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగానే చట్టం పని చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు” అని లోక్ సమితి కార్యకర్త నంద్ లాల్ మాస్టర్ ఆరోపించారని ది హిందు తెలిపింది.

2006-07 లో ఇలాంటి కేసులోనే కంపెనీ ఉన్నత కోర్టును ఆశ్రయించిందని, తమ వాదన వినిపించుకోకుండా ఆదేశాలిచ్చారని వాదించిందని దానితో ఉన్నత కోర్టు స్టే ఇచ్చిందని నంద్ లాల్ తెలిపారు. “కానీ ఈసారి పాలనా యంత్రాంగమే స్వయంగా ఇరువైపులా వాదనలు విని నోటీసు ఇచ్చింది. అయినా బదులు లేదు” అని నంద్ లాల్ తెలిపారు.

కోకోకోలా ప్రతినిధులు అధికారికంగా ఆరోపణలు తిరస్కరిస్తూ ప్రైవేటుగా మాత్రం ఆక్రమణ చేసింది వాస్తవమేనని అంగీకరించడం విశేషం. “మేము భూమి ఆక్రమించామన్న ఆరోపణలతో మేము అంగీకరించం. భూమిని మేము రైతుల నుండి కొన్నాము. రుజువు చేయడానికి మా వద్ద పత్రాలూ కున్నాయి. కాబట్టి ప్రభుత్వం తిరిగి కొలవడానికి పూనుకుంటే మాకు అభ్యంతరం లేదు” అని కోకాకోలా ప్రతినిధి కళ్యాణ్ రంజన్ చెప్పారని పత్రిక తెలిపింది.

 

అయితే కంపెనీ వర్గాలు అంతర్గతంగా వేరే సంగతి చెబుతున్నారని పత్రిక వెల్లడించింది. తాము మరింత సమయం కోసం ప్రయత్నిస్తున్నామని ఈ లోపు ప్రత్యామ్నాయ భూములు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. ప్రత్యామ్నాయ భూములు సంపాదించాక దాన్ని రైతులకు ఇస్తామని తద్వారా ఆక్రమిత భూమిలో చేసిన నిర్మాణాలను కూల్చివేయాల్సిన అవసరం తప్పుతుందని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆక్రమిత భూమి ఉమ్మడి వినియోగానికి చెందిన భూమి కనుక దానినే తిరిగి ఇవ్వాలని లోక్ సమితి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రైతుల నుండి కొనుగోలు చేసిన భూమి గురించి తాము అడగడం లేదని, ఆక్రమించిన భూమినే అడుగుతున్నామని నంద్ లాల్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం తమకు తగిన బలగాలను సమకూర్చలేదని, అందువలన ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోలేకపోయామని తహసీల్దారు చెప్పినట్లు తెలుస్తోంది. పాత తహసీల్దారు స్ధానంలో వచ్చిన కొత్త అధికారి ఈ విధంగా చెప్పారు. తగినంతమంది బలగాలను సమకూర్చితే భూమి స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. బహుశా సోమవారం నాటికి బలగాలు అందుబాటులో ఉండవచ్చని ఆయన తెలిపారు.

కేరళలో కూడా కొక కోలా కంపెనీ ఇదే తరహా దౌర్జన్యానికి పాల్పడింది. అక్కడయితే ఈ కంపెనీ వలన చుట్టుపక్కల రైతుల పొలాలకు నీరు లేకుండా పోయింది. భూగర్భ జలాలు తోడివేయడంతో రైతుల వినియోగానికి జలాలు అందుబాటులో లేకుండా పోయాయి. కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినప్పటికీ, పాలనా యంత్రాంగం, కోర్టులు అంతా కంపెనీ పక్షానే నిలిచారు.

మెహ్ది గంజ్ లో కూడా ఇదే పరిస్ధితి నెలకొంది. సంవత్సరానికి 50,000 లీటర్ల భూగర్భ నీరు తోడుకోవడానికి ప్రభుత్వాలు కంపెనీకి అనుమతి ఇచ్చాయి. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాల పొలాలకు నీరు కరువైంది. భూగర్భ జలమట్టం 7.9 మీటర్ల లోతుకు పడిపోయింది. దానితో 15కు పైగా గ్రామాల ప్రజలకు తాగునీరు కరువయింది. చేతి పంపులు, బావులు, బోర్ వేల్స్, చెరువులు తదితర నీటి వనరులన్నీ ఎండిపోయాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని నీటికి క్లిష్టమైన ప్రాంతంగా ప్రకటించి జనానికి కొత్త పంపులకు అనుమతి ఇవ్వడం నిరాకరించింది.

కానీ కోకోకోలా మాత్రం గత ఏప్రిల్ (2013) లో సంవత్సరానికి వాడుకోగల నీటిని 2,50,000 లీటర్లకు పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును తిరస్కరించాలని 15 గ్రామ పంచాయితీలు తీర్మానం చేసి ప్రభుత్వాలకు పంపాయి. వీటిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ లోపు ఆక్రమించిన భూముల్లో కంపెనీ నిర్మాణాలను పూర్తి చేసుకుని మరింత నీటిని తోడుకుంటోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s