ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం


అమెరికా, ఐరోపాలు నెలకొల్పిన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఇరాక్ లో మూడు పేలుళ్లు, అరవై చావులుగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దేశాల నుండి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్… ఇత్యాది దేశాల సైనిక మూకలు మోసుకొచ్చిన ఆధునిక విలువలు ఇరాక్ ను ఆధునిక నరకంగా మార్చివేశాయి. 8 యేళ్ళ పాటు తిష్ట వేసిన నాటో కూటమి సైన్యాలు నాటిన సెక్టేరియన్ విద్వేషాలు ఇప్పుడక్కడ ఆత్మాహుతి దాడులుగా, బాంబు పేలుళ్లుగా, వేలాది హత్యలుగా పుష్పించి విరాజిల్లుతున్నాయి. 2008 తర్వాత అత్యంత రక్తపాత సంవత్సరంగా 2013 రికార్డు పుటలకు ఎక్కి ఇరాకీయుల భవిష్యత్తును లక్ష భూతాల నీడై, కోటి శాపాల పీడై  భయపెడుతోంది. ఐరాస లెక్కల ప్రకారం ఇరాక్ లో 2013 అంతటా సాగిన వికృత మారణకాండలలో 8,868 మంది చనిపోగా వారిలో 7,818 మంది అమాయక పౌరులే. వీరిలో స్త్రీలు, పిల్లల సంఖ్యకు లెక్కలేదు.

ఇరాక్ పైకి దురాక్రమణ దాడికి దిగబోయే ముందు అమెరికా చెప్పిన సాకు ‘ఇరాక్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పుతానని.’ సద్దాం హుస్సేన్ నియంతృత్వం కింద ఇరాక్ ప్రజలు నలిగిపోతున్నారని, సద్దాం పీడ నుండి విముక్తి చేస్తామని తండ్రీ కొడుకులు (జార్జి బుష్ సీనియర్, జార్జి డబ్ల్యూ.బుష్) ఇద్దరూ ప్రపంచానికి చెప్పారు. ప్రపంచాన్ని నాశనం చేసే సామూహిక విధ్వంసక మారణాయుధాలను సద్దాం హుస్సేన్ పోగేసుకున్నాడని, 45 ని.ల వ్యవధిలో అమెరికాను భస్మీపటలం చేసేందుకు వాటిని సిద్ధం చేశాడని ఐరాసలో దొంగ సాక్ష్యాలు ప్రవేశపెట్టి మరీ దాడికి తెగబడింది అమెరికా. చివరికి 9/11 టెర్రరిస్టు దాడుల్లో సైతం సద్దాం కు భాగస్వామ్యం ఉందని పచ్చి అబద్ధాలు సృష్టించి ప్రపంచం మీదికి వదిలారు.

2003లో ఇరాక్ పై దాడి చేసిన అమెరికా, ఐరోపా దేశాలు ఆ దేశ మౌలిక నిర్మాణాలను సర్వ నాశనం చేశాయి. రోడ్లు, వంతెనలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు… ఇరాకీయుల సహస్రాబ్దాల శ్రమ ఫలితాన్ని బూడిద చేశాయి. యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల వెంట విలసిల్లిన ప్రాచీన మెసోపోటేమియా నాగరికతా స్మారక నిర్మాణాలను సైతం నేలమట్టం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ఇరాక్ ను తిరిగి పాత రాతియుగానికి తీసుకెళ్లి వదిలిపెట్టారు.

ఇరాక్ ప్రజలు సహాస్రాబ్దాల తరబడి నిర్మించుకున్న సౌకర్యాలను సర్వనాశనం చేయడం ఒక ఎత్తయితే వారి సామాజిక ముఖచిత్రాన్ని విధ్వంసం కావించడం మరొక ఎత్తు. ప్రజాస్వామ్యం స్ధాపిస్తానని ప్రతిజ్ఞ చేసిన అమెరికా వాస్తవంలో అక్కడ సెక్టేరియన్ విష బీజాలను నాటి అవి చక్కగా పెరిగి కాయలు కాసేవరకూ కాపలా కాసింది. సద్దాం పాలనలో కుర్దుల సమస్య తప్ప మరో తగాదాను ఇరాక్ చూసి ఎరగదు. చమురు ఆదాయం ద్వారా ప్రభుత్వం కల్పించిన అద్భుతమైన మౌలిక వసతులను ఇరాకీయులు అనుభవించారు. ప్రపంచంలోనే మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలను ఉచితంగా అనుభవించారు. స్త్రీల హక్కులను కాపాడడంలోనూ, పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో ప్రవేశం కల్పించడం లోనూ అగ్రపీఠిన నిలిచి ఐరాస ప్రశంసలు అందుకున్న దేశం ఇరాక్.

ఇప్పుడు అదంతా నేలమట్టం అయింది. భవనాలు, విమానాశ్రయాలు, రోడ్లు, వంతెనలతో పాటు అరమరికలు లేని సామాజిక నిర్మాణాలు సైతం నేలమట్టం అయ్యాయి. ఇరాక్ లో తిష్ట వేసినన్నాళ్లూ షియా, సున్నీ తెగల మధ్య తీవ్ర వైషమ్యాలను అమెరికా పెంచి పోషించింది. వివిధ జాతుల మధ్యా, మతాల మధ్యా, తెగల మధ్యా తంపులు పెట్టి తమాషా చూసింది. ఆ విధంగా సామ్రాజ్యవాద దురాక్రమణ అమెరికా రగిలించిన షియా-సున్నీ రావణ కష్టం అక్కడ నిత్యాగ్నిహోత్రమై ఇంకా రగులుతూనే ఉంది.

ఫలితంగా షియా-సున్నీల పరస్పర హననంలో బాంబు పేలుళ్ళు రోజువారీ కార్యక్రమం అయ్యాయి. ఆత్మాహుతి దాడులు రికార్డు కాని దినం అరుదైపోయింది. 2013 సంవత్సరం ఇరాకీ ప్రజల పాలిట అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా రికార్డయింది. 2008 తర్వాత అత్యధిక సంఖ్యలో పౌరులు గత సంవత్సరం మరణించారు. ఐరాస లెక్కల ప్రకారం మొత్తం 8,868 మంది చనిపోయారు. వారిలో 7,818 మంది అమాయక పౌరులే. ఇరాక్ బాడీ కౌంట్ (ఐ.బి.సి) అనే సంస్ధ లెక్క ప్రకారం 2013 లో జరిగిన హింసాకాండలో 9,500 పైగా పౌరులు మరణించారు.

యు.ఎన్ ఆసిస్టెన్స్ మిషన్ ఫర్ ఇరాక్ (UNIRAQ) సంస్ధ ఇరాక్ హింసాకాండ మృతల సంఖ్యను రికార్డు చేసింది. ఈ సంస్ధ ప్రకారం ఒక్క డిసెంబర్ లోనే 759 మంది ఇరాకీయులు చనిపోగా మరో 1,345 మంది గాయాలపాలయ్యారు.

ఈ దాడులకు ప్రధాన బాధ్యులు ఆల్-ఖైదా సంస్ధ అని ఐరాస చెబుతుంది. ఆల్-ఖైదా అంటే సౌదీ అరేబియా మద్దతుతో సున్నీ ఆధిపత్యం కోసం హీసాకాండకు పాల్పడడం. సున్నీ ఆధిపత్యం అనగానే మతం కనిపిస్తుంది. కానీ వాస్తవానికి దీనిని సౌదీ అరేబియా ప్రాంతీయాధిపత్యంగా గుర్తించాలి. సౌదీ పాలకులు పోషించే టెర్రరిస్టు ముఠాలు ఇరాక్ లో హింసాకాండను ప్రజ్వలింపజేస్తూ షియా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వారికి ప్రతిగా షియాలు సాగించే మారణకాండకు ఇరాన్ మద్దతు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇరాక్ లో షియాలు మెజారిటీ. సద్దాం హుస్సేన్ హయాంలో సున్నీలే ప్రభుత్వంలో అధిక స్ధానాలను ఆక్రమించారు. కాని ఇరు మతాల మధ్య ఘర్షణలు చెలరేగిన ఉదాహరణలు లేవు. అమెరికా దురాక్రమణ దాడికి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటుకు షియాలు ప్రధాన నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటుకు ఇరాన్ అండదండలు అందించింది. ఫలితంగా అమెరికా దురాక్రమణ ముగిసిన తర్వాత కూడా అక్కడ షియాలదే రాజ్యం అయింది. అనగా ప్రాంతీయంగా ఇరాక్ లో కూడా ఇరాన్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇరాన్ బలం పెరిగింది. సౌదీ-కతార్-టర్కీ-అమెరికా-ఐరోపా-ఇజ్రాయెల్ కూటమి ప్రాపకంలో నడుస్తున్న సిరియా కిరాయి తిరుగుబాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వానికి ఇరాక్ కూడా తగిన సహాయం అందజేసింది.

ఫలితంగా సిరియా కిరాయి తిరుగుబాటు ప్రభావం ఇరాక్ పై తీవ్రంగా పడింది. సౌదీ-ఇరాన్ ల మధ్య ప్రాంతీయాధిపత్యం కోసం సాగిన వైరం ప్రాక్సీయుద్ధ రూపం తీసుకుని ఇరాక్ ప్రజలకు నరకాన్ని చూపిస్తోంది. దీనికి తగిన బీజాలను దురాక్రమణ కాలంలో అమెరికా బలగాలు, సి.ఐ.ఏ గూఢచారులు నాటారు.

2013లో మే నెల అత్యంత హింసాత్మక నెలగా నమోదయింది. ఆ నెలలో మొత్తం 963 మంది చనిపోగా 2,191 మంది గాయపడ్డారు. ఏప్రిల్ నుండి నెలవారి హింస సగటు 1,700 (మరణాలు, తీవ్ర గాయాలు కలుపుకుని) గా నమోదయింది.

“ఆల్-ఖైదా ఇన్ ఇరాక్ సంస్ధ ఇరాక్ లో తన టెర్రరిస్టు చర్యలకు సారవంతమైన నేలగా భావిస్తోంది. పోలీసులు, సైనిక బలగాలపై కూడా దాడులు చేయడం ద్వారా అది ఇరాక్ ప్రభుత్వం పైనే దాడి చేస్తోంది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, షియా ప్రజలు దాని హింసా యజ్ఞంలో సమిధలు అవుతున్నారు. గత ఆరు నెలల్లో జరిగిన హింసాకాండను చూస్తే మొత్తం కుటుంబాలకు కుటుంబాలనే మట్టుపెట్టారు. వారు నిద్రిస్తుండగా, ప్రార్ధనా స్ధలాలకు ప్రయాణం చేస్తుండగా దాడులు చేసి చంపేశారు. ఒక్కోసారి 5గురు, కొన్నిసార్లు ఏకంగా 12 మంది చొప్పున ఒకే కుటుంబ సభ్యులను అంతం కావించారు…” అని ఇటీవల విడుదల అయిన ఐ.బి.సి నివేదిక పేర్కొంది.

డజన్ల కొద్దీ మరణించడమో, గాయపడడమో జరక్కుండా ఇరాక్ లో ఇప్పుడు ఒక్క రోజూ గడవడం లేదు. ఎక్కడా పేలుడు శబ్దం వినబడకపోతేనే ఆశ్చర్యంగా మారింది. పాఠశాలలు, మసీదులు, రద్దీ మార్కెట్ లు… ఇలా రక్తపాతం జరగని స్ధలమే లేదు.  విచక్షణారహితంగా మూకలు సాగిస్తున్న దహనకాండలో స్త్రీలు, పిల్లలు తేలిక టార్గెట్ గా మారారు.

అమెరికా చెప్పిన ప్రజాస్వామ్య సంస్ధాపన ఎక్కడ అని ప్రపంచం అడగాల్సి ఉండగా ఆ ఊసు ఎత్తేవారే లేరు. ఇరాక్ పై దురాక్రమణ యుద్ధానికి మద్దతు పలికిన అమెరికా ప్రజ ఇప్పుడు ఆ యుద్ధాలు మోపిన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఫలితం అనుభవిస్తున్నారు. పార్లమెంటరీ  ప్రజాస్వామ్యమా, సోషలిస్టు ప్రజాస్వామ్యమా లేక మరో సామాజిక వ్యవస్ధా అన్నది నిర్ణయించుకోవలసింది ఆయా దేశాల ప్రజలే గానీ తమకు ఏ విధంగానూ సంబంధం లేదని అమెరికా ప్రజలు ఇప్పటికన్నా గ్రహించారా అన్నది అనుమానమే.

One thought on “ఇరాక్: అమెరికా అంటించిన రావణ కాష్టం

  1. అమెరికా ప్రజలు గ్రహించినంత మాత్రాన ఒరిగేదేమిటి.. వారి ఓట్లతో నెగ్గిన ఏలికలు వారి ఏలికలైన వ్యాపారుల లాభాల కోసమే పాలిస్తన్నపుడు.. దానికి ప్రజాస్వామ్యం, వ్యక్తిస్వేచ్ఛ, స్వేచ్ఛావిపణి అన్న ముసుగులు తొడిగినపుడు.. ఆ విచిత్ర స్వరూపానికి ప్రపంచమంతా దాస్యం చేస్తున్నపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s