ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి


Delhi Assembly

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో ఎఎపి నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం మొదటి పరీక్ష నెగ్గింది.

నాలుగున్నర గంటల చర్చ అనంతరం ఓటింగు జరిగింది. చర్చ చివరలో అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగం నిండిన స్వరంతో సభ మద్దతు కోరారు. సభ్యులు తమ రాజకీయాలను వదిలిపెట్టి ప్రజా ప్రతినిధులుగా ఓటు వేయాలని కోరారు. తాము ఏవైపు నిలబడతారో తేల్చుకోవాలని కోరారు. “మూడు అమాలను మీ ముందు ఉంచుతున్నా. జాతీయ రాజకీయాలు ఎటువైపు ప్రయాణం చేయాలన్న విషయాన్ని తెలియజేయడానికి ఢిల్లీ సామాన్యుడు ఒక దారి చూపిస్తున్నాడు. రాజకీయాల్లో సత్యం, నిజాయితీ కోసం జరిగే పోరాటంలో ఏవైపు నిలబడతారో తేల్చుకోమని వారు కోరుతున్నారు. అటువంటి పోరాటంలో భాగస్వామ్యం వహిస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నారు” అని తన 25 నిమిషాల ప్రసంగంలో అరవింద్ సభకు తెలిపారు.

రాజకీయాలు ప్రయాణం చేయవలసిన దిశ, సత్యం-నిజాయితీల కోసం జరిగే పోరాటంలో ఎటు నిలబడతారు, సదరు పోరాటంలో స్వయంగా భాగస్వామ్యం వహిస్తారా లేదా… అన్న మూడు అంశాలను సభ ముందు ఉంచుతున్నానని అరవింద్ తెలిపారు.

కాంగ్రెస్ నుండి 7గురు, ఎఎపి నుండి 28 మంది, ఒక జె.డి(యు) సభ్యుడు, మరొక ఇండిపెండెంట్ సభ్యుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. బి.జె.పి కి చెందిన 31 మంది సభ్యులు, బి.జె.పి మిత్రపక్షం అకాలీదళ్ కి చెందిన ఒకరు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్ కి చెందిన మరొక సభ్యుడు మాతిన్ అహ్మద్ ప్రొ-టెమ్ స్పీకర్ గా విధి నిర్వర్తించారు. చర్చ అనంతరం ప్రభుత్వం విశ్వాసం నెగ్గిందని ప్రకటించిన ప్రొ-టెమ్ స్పీకర్ అనంతరం సభను వాయిదా వేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గానీ. బి.జె.పి నియంత్రణలో ఉన్న ఎం.సి.డి (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) లలో గానీ ఎవరు అవినీతికి పాల్పడినట్లు తేలినా కఠిన చర్యలు తీసుకోకుండా వదిలేది లేదని అరవింద్ హామీ ఇచ్చారు. అవినీతి కాంగ్రెస్ మద్దతు స్వీకరించడం ద్వారా ఎఎపి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కిందన్న విమర్శకు అరవింద్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. తమ పార్టీకి గానీ, తమ ప్రభుత్వానికి గానీ మద్దతు ఇవ్వాలని తాము కోరడం లేదనీ కేవలం ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మద్దతు అడుగుతున్నామని అరవింద్ సభకు తెలిపారు.

ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేత అర్విందర్ సింగ్ లవ్లీ చర్చకు ముందే చెప్పడంతో విశ్వాసం తీర్మానం నెగ్గడం ఖాయమయింది. ప్రజల సమస్యల కోసం పనిచేసినంతవరకు ఎఎపి కి మద్దతు ఇస్తామనీ, అవసరం అయితే అయిదేళ్లూ మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ మద్దతు అవసరం రాని సందర్భం ఎఎపి ప్రభుత్వానికి ఏమై ఉంటుందో అర్విందర్ మాటల్లో స్పష్టం కాలేదు.

బి.జె.పి మాత్రం అవినీతి కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం ద్వారా ఎఎపి రాజీ పడిందని నిందించింది. అధికారం కోసం రాజీకి సిద్ధపడ్డారని ఆరోపించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిపై మౌనం పాటిస్తున్నారని ఎత్తి చూపింది.

ఆమ్ ఆద్మీ అంటే ఎవరన్నదీ అరవింద్ మొదటిసారిగా నిర్వచనం ఇచ్చారు. “సత్యం, నిజాయితీలతో బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సామాన్యుడే. వారు ధనికులైనా, పేదలైనా సరే” అని ఆయన నిర్వచించారు. “వారంతా సామాన్యులే. మేమంతా ఎవరం? అందరం బైటివారమే. ఎటువంటి సామర్ధ్యమూ లేని చిన్నవారం మేము” అని అరవింద్ తమను తాము అభివర్ణించుకున్నారు.

నేరాలు ప్రవేశించడం వలన రాజకీయాలు అవినీతిమయం అయ్యాయని అరవింద్ తెలిపారు. అవినీతి రాజకీయాల వలన విద్య, ఆరోగ్యం, రోడ్లు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. “రాజకీయాలను శుభ్రం చేయడానికి మనం అంతా ఒకటి కావాలి. రాజకీయాల్లోకి ప్రవేశించి మీ సొంత చట్టాలు చేసుకోవాలని మమ్మల్ని సవాలు చేశారు. అప్పటికి పోరాటం అసాధ్యంగా ఉంది. గెలుపుకు జీరో అవకాశం ఉంది. కానీ మేము రాజకీయాలను శుద్ధి చేయడానికి రంగంలోకి దూకడానికే నిర్ణయించుకున్నాము…

“సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎక్కడిది అనుకుని పెద్ద పార్టీలు పెద్ద తప్పు చేశాయి. మేమిక ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాము. మమ్మల్ని హేళన చేశారు. కానీ డిసెంబర్ 4, 8 తేదీల్లో అద్భుతం జరిగింది. నేను నిజానికి నాస్తికుడిని. కానీ దేవుడు ఉన్నాడని ఇప్పుడు నమ్ముతున్నాను. నిజం ఓడిపోదని ఢిల్లీ ప్రజలు నిరూపించారు” అని కేజ్రీవాల్ భావోద్వేగం నిండిన స్వరంతో ఢిల్లీ ప్రజలను కీర్తించారు. అవినీతి రాజకీయాల నుండి దేశాన్ని విముక్తి చేసే దిశలో ఢిల్లీ ప్రజలు మొదటి అడుగు వేశారన్నారు.

హోమ్ లెస్ షెల్టర్లు

ఢిల్లీలో నివాసం లేని వారికి నెలకొల్పిన షెల్టర్లను మరుగుపరచడానికి అరవింద్ ఆదేశాలు ఇచ్చారు. రాత్రి షెల్డర్లన్నింటినీ ప్లాస్టిక్ గుడారాలకు బదులు పోర్టా కేబిన్ (పోర్టబుల్ కేబిన్) లుగా మార్చాలని ఆదేశం ఇచ్చారు. ప్లాస్టిక్ గుడారాల వల్ల చలి నుండి రక్షణ లేకపోవడంతో ఇల్లు లేనివారు అందులో ఉండడానికి ఇష్టపడడం లేదు. మెజారిటీ ఫ్లై ఓవర్ వంతెనల కిందనే నివసిస్తున్నారు.

ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం 150 వరకు రాత్రి షెల్టర్లను నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయగా కొన్ని తాత్కాలికంగా నెలకొల్పారు. ఇలాంటి షెల్టర్లను తనిఖీ చేసి తగిన సౌకర్యాలు ఉన్నదీ లేనిదీ చూడాలని అరవింద్ కేజ్రీవాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లకు ఆదేశాలు ఇచ్చారు. ఫ్లై ఓవర్లను తనిఖీ చేసి అక్కడ నివసిస్తున్నవారికి షెల్టర్లకు తరలించాలని కోరారు. కొత్తగా ఎక్కడెక్కడ షెల్టర్లు కావాలో జాబితా తయారు చేయాలని ఆదేశించారు. జనవరి 4 లోపు జాబితా ఇవ్వాలని కోరడం గమనార్హం. కొన్ని ఎన్.జి.ఓ సంస్ధలకు కూడా తనిఖీ బాధ్యతలను అరవింద్ అప్పజెప్పారు.

“ప్రభుత్వం నడుపుతున్న అనేక షెల్టర్లు ప్లాస్టిక్ గుడారాల్లో నడుస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. చలి నుండి కాపాడడంలో అవి విఫలం అవుతున్నాయి. అలాంటి గుడారాల స్ధానంలో పోర్టా కేబిన్ లు 3-4 రోజుల లోపల ఇవ్వాలని ఈ రోజు ఆదేశం ఇచ్చాము. మా మంత్రులు మనీష్ సిసోడియా, రాఖీ బిర్లాలు 45 రాత్రి షెల్టర్లను తనిఖీ చేశారు. అనేకమంది అక్కడ కాకుండా ఫ్లై ఓవర్ల కింద ఉంటున్నట్లు వారు గమనించారు. వారు రాత్రి షెల్టర్లకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. అందువలన అక్కడికక్కడే పోర్టా కేబిన్ లు ఇవ్వాలని నిర్ణయించాము” అని కేజ్రీవాల్ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఢిల్లీ అర్బన్ షెల్టర్ బోర్డు ను ఢిల్లీ హై కోర్టు ఇటీవలనే తీవ్రంగా తప్పు బట్టిన సంగతి గమనార్హం. ఇల్లు లేనివారికి ఎలాంటి ఏర్పాట్లు చేసిందీ సమాచారం ఇవ్వడంలో బోర్డు విఫలం అయిందని ఆక్షేపించింది. అన్ని ప్రభుత్వ సంస్ధలు, వివిధ ఎన్.జి.ఓ లతో సమావేశం జరిపి రాత్రి షెల్టర్లను మెరుగుపరచాలని కూడా కోర్టు ఆదేశించింది. కానీ ఇంతవరకు ఆ విషయంలో ఎలాంటి చర్యలూ లేవు.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాపులిస్టు విధానాలుగా బి.జె.పి నేతలు ఆక్షేపిస్తున్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఈ విధంగా విమర్శించారు. ‘పాపులిస్టు విధానాలు’ అన్న పదబంధమే పెద్ద మోసం. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కేవలం వ్యాపార కంపెనీలు, ధనికుల కోసమే పని చేయాలన్న అవగాహన నుండి ఉద్భవించిన పదబంధం ఇది. సమాజాన్ని ఉద్ధరించేది కేవలం ధనికులు, కంపెనీలేననీ, వారికి కాకుండా ఇతర ప్రజలకు లబ్ది చేకూర్చే ప్రతి చర్యా పాపులిస్టు విధానమే అన్నది ఈ అవగాహన చెబుతుంది. తద్వారా ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాలను ‘పాపులిస్టు’ అన్న ముద్ర వేసి ఖండించడం ఈ అవగాహనలో భాగం.

కానీ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రభుత్వాలు ప్రజలకు కాక ఇంకెవరికి సౌకర్యాలు కల్పిస్తాయి? బడ్జెట్ లోటు, జి.డి.పి వృద్ధి, కరెంటు ఖాతా లోటు… ఇలాంటి అంకెలు గొప్పగా చూపే విధానాలే సరైన విధానాలని, మిగిలినవన్నీ అనవసరపు ఖర్చులనీ ఇలాంటి పండితులు చెప్పబోతారు. కానీ ప్రజల పరిస్ధితిని మెరుగుపరచలేని అంకెలు ఎవరిని ఉద్ధరించడానికో వీరు చెప్పరు. నిజానికి ఈ అంకెలన్నీ మార్కెట్ ఎకానమీలో కంపెనీల బాగు కోరే అంకెలు. బడ్జెట్ అంతా కంపెనీల కోసమే ఖర్చు చేయాలని ఈ అంకెలు అంతిమంగా ప్రబోధిస్తాయి. కంపెనీలకు కాకుండా ప్రజల విద్యా, వైద్య సౌకర్యాలకు ఖర్చు చేస్తే అవి బడ్జెట్ లోటు పెంచుతాయనీ, దానితో ఆర్ధిక వ్యవస్ధ కుంటుబడుతుందని చెబుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రబోధిస్తాయి. ప్రజల కష్టాలకు వీరి వద్ద ఎన్నడూ సమాధానం ఉండదు.

ప్రజలకు ఉపాధి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా అరవింద్ తన ప్రభుత్వ విధానాలను కేంద్రీకరించడం తక్షణ అవసరం. ప్రజల ఆర్ధిక పరిస్ధితిని మెరుగుపరిచే ప్రతి చర్యా, కంపెనీలకు వ్యతిరేకంగా కనిపిస్తుంది. ప్రజలకోసం ఒక రూపాయి ఖర్చు చేస్తే అది తమకు దూరం అయినట్లే అని సి.ఐ.ఐ, ఫిక్కీ, ఆసోచాం లాంటి సంస్ధలకు తెలుసు. ఇలాంటి సంస్ధల విమర్శలను, హేళనలను తీసి పెక్కనపెట్టగలిగితేనే ఎఎపి ప్రభుత్వం నిజంగా ప్రజా ప్రభుత్వంగా తేలుతుంది. లేదంటే త్వరలోనే ప్రజల విశ్వాసం కోల్పోతుంది.

4 thoughts on “ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

  1. When I was reading the article, I notice that you suddenly shifted from the information to opinion. Please check the 3rd para from bottom. First 2 lines give the information and you started to give your opinion in the same para and continued till the end of the article.

    Don’t you think your opinion should start in a different paragraph. I am just a beginner. Let me know if this assumption is wrong.

  2. పింగ్‌బ్యాక్: ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s