ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం.
మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి పత్రికలను ఆకర్షించాడు. ఢిల్లీ తరహాలో ముంబైలో కూడా ఛార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటించాడు. 500 యూనిట్ల వరకు వాడుకునే వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు సగానికి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ కు ఆయన లేఖ కూడా రాశారు.
కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే సంజయ్ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఈ డిమాండ్ ముందుకు తెచ్చే అవకాశం లేదని, ఇప్పుడిక చవాన్ కొద్ది రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఛార్జీలు తగ్గించడమే మిగిలి ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విషయాన్ని విలేఖరులు తన దృష్టికి తెచ్చినపుడు అరవింద్ కేజ్రీవాల్ సంతోషం ప్రకటించాడు. “సంజయ్ నిరుపమ్ డిమాండ్ పట్ల నాకు సంతోషంగా ఉంది. రాజకీయాలు ఎలా చేయాలో వారికి నేర్పుతామని మేము చెప్పాము కూడా… గత ప్రభుత్వాలు నాలుగేళ్లలో చేయలేనివి మేము రెండు రోజుల్లో చేసి చూపాము” అని అరవింద్ వ్యాఖ్యానించాడు. అరవింద్ వ్యాఖ్యలు మొరటుగా ఉన్నాయని కాంగ్రెస్ పెద్దలు యాష్టపోవడం విశేషం.
కాంగ్రెస్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం కూడా ఎఎపి నిర్ణయాలను అనుసరించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని ది హన్స్ ఇండియా పత్రిక తెలిపింది. కాంగ్రెస్ కు గట్టి పట్టు ఉన్న హర్యానాలో పునాది కోల్పోకుండా ఉండాలంటే ఎఎపి విధానాలను అనుసరించడం వినా మార్గం లేదని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని పత్రిక తెలిపింది. ఎఎపి ని కాపీ చేస్తున్నారన్న అపప్రధ వచ్చినా సరే, బలం కోల్పోవడం కంటే అదే మంచిదని ఆయన భావిస్తున్నారని తెలిపింది.
ఎఎపి నుండి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందని రాహుల్ గాంధీ స్వయంగా కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించడం గమనార్హం.
బి.జె.పి పరిస్ధితి మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉంది. అత్యధిక సీట్లు గెలుచుకున్నా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేక, ఎఎపి పలుకుబడి విస్తరిస్తుంటే చూస్తూ ఓర్వలేక ఆ పార్టీ ఉడికిపోతోంది. ఢిల్లీ బి.జె.పి నేత హర్ష వర్ధన్ చేస్తున్న ప్రకటనలు ఈ సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎఎపి పై ఉందని చెప్పిన బి.జె.పి, తీరా కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశాక విమర్శలకు దిగారాయన. పచ్చి అవినీతి పార్టీ అని ఆరోపించిన కాంగ్రెస్ తోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం వలన అరవింద్ పై తమకు గౌరవం పోయిందంటూ ప్రకటించడం తప్ప బి.జె.పి ప్రస్తుతం చేసేదేమీ లేకపోయింది.
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు 30 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చిన బి.జె.పి 50 శాతం తగ్గించడాన్ని సమర్ధించలేకపోతోంది. అసలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా హర్ష వర్ధన్ ఎంపికే ఎఎపి ని అనుకరిస్తూ చేశారని విశ్లేషకుల అభిప్రాయం. ఏ మచ్చాలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూపడం ద్వారా తామూ పరిశుద్ధమైన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని బి.జె.పి ప్రయత్నించిందని అనేక పత్రికలు విశ్లేషించాయి.
బిజెపి లో ఐఐటి విద్యార్ది గోవా ముఖ్యమంత్రి మనోహర్ పార్రికర్ నిజాయితీ గురించి మీడియాకు కనపడలేదేమో! గత పది రోజులు గా ఇంగ్లిష్ మీడీయా వెబ్ సైట్ ఒపెన్ చేస్తే అరవింద్ గారి ముఖారవిందమే 24X7. అలా కవర్ చేస్తున్నారంటే మీడీయా వారికి ఎంత డబ్బులొచ్చి పడుతున్నాయో! .
@ sriram : karudu gattina matha thatva vadula party otla kosam .. manushal madhya chichu pette rakshasa party ayyena bjp candidati ki …… desham antha entho ashaa ga eduruchusthunna AAP ki theda .. mundhu telusuko media gurunchi taruvathaaa cahrinchachu ..