బాల్టిక్ రిపబ్లిక్కుల్లో ఒకటయిన లాత్వియా యూరో జోన్ తీర్ధం పుచ్చుకుంది. తద్వారా 18 వ యూరో జోన్ సభ్య దేశంగా అవతరించింది. లాత్వియా ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈ.యు) సభ్యురాలు. ఉమ్మడి ‘యూరో’ కరెన్సీ కలిగిన ఈ.యు దేశాలను యూరో జోన్ గా వ్యవహరిస్తారు. 20 లక్షల జనాభా కలిగిన లాత్వియాను ఆర్ధికంగా కూడా కలుపుకోవడం ద్వారా ఈ.యు ప్రభావం మరింత తూర్పుకు జరిగినట్లయింది.
లాత్వియా ప్రభుత్వం యూరో జోన్ లో చేరడానికి నిర్ణయించినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం మెజారిటీ దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల డిసెంబర్ 27 తేదీన జరిగిన సర్వేలో 50 శాతం ప్రజలు యూరో జోన్ చేరికను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి అయింది. అయితే ఇది గత అక్టోబర్ లో జరిగిన సర్వేతో పోలిస్తే 8 శాతం తక్కువ.
లాత్వియా, లిధుయేనియా, ఎస్తోనియా… ఈ మూడు చిన్న దేశాలను బాల్టిక్ రిపబ్లిక్కులు అంటారు. సోషలిస్టు రష్యా ఆమోదించిన ‘జాతులకు విడిపోయే హక్కు’ ద్వారా ఈ మూడు దేశాలు 1920లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. కానీ సోషలిస్టు రష్యాలోనే తమకు రక్షణ ఉంటుందని గ్రహించి మూడేళ్లలోనే అవి సోవియట్ రష్యాలో కలిసిపోయాయి.
అయితే 1954లో స్టాలిన్ మరణానంతరం పెట్టుబడిదారీ వ్యవస్ధవైపు ప్రయాణం కట్టిన సోవియట్ రష్యా అనతికాలంలోనే ‘జాతుల బంధిఖానా’ గా మారింది. ఫలితంగా వివిధ జాతులు విడిపోవడానికి పోరాటం చేశాయి. 1990లో సోవియట్ విచ్ఛిన్నం అయ్యాక మళ్ళీ స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి.
అమెరికా నేతృత్వంలోని పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు తూర్పు వైపుకు తమ ప్రభావాన్ని విస్తరించడం ద్వారా రష్యా, చైనా లకు చెక్ పెట్టడానికి కృషి చేస్తున్నాయి. పాత సోవియట్ రష్యాలో రష్యా తర్వాత అత్యంత పెద్ద దేశం అయిన ఉక్రెయిన్ కూడా ఈ.యు లో చేరుతుందని అందరూ భావించారు. కానీ రష్యా ఎత్తుగడల ఫలితంగా ఉక్రెయిన్ ఆ ప్రయత్నాల నుండి ప్రస్తుతానికి విరమించుకుంది. అయితే పూర్తిగా విరమించుకోలేదని తగిన ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చినట్లయితే ఈ.యు లో చేరే అంశం పరిగణిస్తామని ఉక్రెయిన్ నేతలు చెబుతున్నారు.
లాత్వియా చేరికతో యూరో జోన్ దేశాల సంఖ్య 18 కి చేరుకుంది. యూరోజోన్ ఋణ సంక్షోభం పూర్తిగా సమసిపోకముందే సదరు కూటమిలో చేరడం వలన తమ ఆర్ధిక పరిస్ధితికి నష్టం వాటిల్లుతుందని లాత్వియన్లు భయపడుతున్నారు. ఈ భయాలకు ఆధారం లేదని, దేశ ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుందని, లాత్వియా యాక్టింగ్ ప్రధాని వాల్దిస్ దొంబ్రోవ్శ్కిస్ అభయం ఇచ్చాడు.
“లాత్వియా ఆర్ధిక అభివృద్ధికి ఇదొక పెద్ద అవకాశం” అని ఆయన పేర్కొన్నారు. లాత్వియా రాజధాని రిగాలో ఒక ఏ.టి.ఎం నుండి 10 యూరోల నోటు విత్ డ్రా చేయడం ద్వారా యూరో జోన్ లో చేరికను ఆయన లాంఛనంగా ప్రకటించారు. ఆర్ధిక అభివృద్ధికి అవకాశమే గానీ సంపద పెరిగిపోతుందని తాను గ్యారంటీగా చెప్పలేనని ఆయన ముక్తాయించడం గమనార్హం.
యూరోను జాతీయ కరెన్సీగా స్వీకరించడం వలన ధరలు పెరిగిపోతాయని 83 శాతం లాత్వియా ప్రజలు భయపడుతున్నారని యూరోపియన్ కమిషన్ సర్వే తెలిపింది. ఆర్ధిక మంత్రి కూడా ధరలు 2.3 శాతం పెరుగుతాయని నిర్ధారించాడు. కానీ ఆర్ధిక వ్యవస్ధ 4.2 శాతం వృద్ధి చెందుతుందని ఆర్ధిక మంత్రి ఊరించాడు. జి.డి.పి వృద్ధి కంపెనీలకే గానీ జనానికి ఒరగబెట్టేది ఏమీ ఉండదన్న సంగతి వీరు ప్రజలకు చెప్పరు.
యూరో జోన్ లో చేరిక వలన లాత్వియాను ఇక ఐరోపా దిగుమతులు ముంచెత్తుతాయి. అనగా దేశీయ ఉత్పత్తి పడిపోతుంది. అనగా స్ధానిక ఉత్పత్తిదారులు దెబ్బ తింటారు. కానీ విదేశీ సరుకుల వ్యాపారంపై ఆధారపడే దళారులు లాభపడతారు. దళారుల చేతుల్లోనే ప్రభుత్వం ఉండడంతో ప్రజల వ్యతిరేకత లెక్కలోకి రాలేదు. ప్రజలను మభ్యపుచ్చడానికి లాత్వియా సెంట్రల్ బ్యాంకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ఫలితంగా వ్యతిరేకత కొద్దిగా తగ్గింది. కానీ ఇంకా సగం మంది ఆగ్రహంతోనే ఉన్నారు.
“యూరోను లాత్వియన్లపై బలవంతంగా రుద్దారు. వారి అభిప్రాయాలూ చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. మెజారిటీ ప్రజలు దీనిని దృఢంగా వ్యతిరేకిస్తున్నారు… యూరో జోన్ చేరిక ఫలితంగా లాత్వియా చౌక సరుకులను దిగుమతి చేసుకుంటుంది. అంటే లాత్వియా స్వంతంగా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్ధ నాశనం అవుతుంది” అని యాంటీ-గ్లోబలిస్ట్ అసోసియేషన్ నేత యాండ్రిస్ ఒరోల్స్ విశ్లేషించారని రష్యా టుడే తెలిపింది.
ఈ.యు లో చేరినప్పుడే యూరో జోన్ లో చేరడానికి లాత్వియా అంగీకరించిందని కాబట్టి యూరో జోన్ చేరిక అనివార్యమని లాత్వియా రాజకీయ నాయకులు ప్రజలకు నచ్చజెపుతున్నారు. 2005లో ఈ.యూలో చేరిన లాత్వియా బ్యాంకుల్లో ఇప్పటికీ రష్యా డిపాజిట్లే ఎక్కువ. వీటిని ప్రమాదకరంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) భావిస్తోంది.
మూడు బాల్టిక్ రిపబ్లిక్ లలో ఎస్తోనియా ఇప్పటికే యూరో జోన్ లో చేరింది. ఇప్పుడు లాత్వియా చేరికతో లిధుయేనియా ఒక్కటే మిగిలింది. లిధుయేనియా కూడా 2015 నాటికి చేరవచ్చని భావిస్తున్నారు.