మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్


Aravind power protest before elections

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే.

ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సబ్సిడీ చెల్లించినప్పటికీ అది నూతన ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే తక్కువ. అరవింద్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలో గత ప్రభుత్వం చెల్లించిన సబ్సిడీ కూడా కలిసి ఉంది.

జనవరి 1, 2014 నుండి అమల్లోకి వచ్చే ధరల ప్రకారం 1-200 యూనిట్ల మధ్య వినియోగించే కుటుంబాలు యూనిట్ కి రు. 3.90 పై.ల బదులు రు 1.95 పై.లు చెల్లించాలి. 200-400 యూనిట్ల మధ్య వాడుకునేవారు యూనిట్ కు 5.80 పై.ల బదులుగా రు. 2.90 పై.లు చెల్లించాలి.

షీలా దీక్షిత్ ప్రభుత్వం కూడా సబ్సిడీ ధరలకు కింది తరగతులకు విద్యుత్ సరఫరా చేసింది. సబ్సిడీ అనంతరం 200 యూనిట్ల లోపు వాడకందారులు యూనిట్ కి రు 2.70 పై.లు చెల్లించగా 200-400 యూనిట్ల వాడకందారులు యూనిట్ కు రు. 4.80 పై.లు చెల్లించారు. అనగా షీలా ప్రభుత్వం కంటే అరవింద్ ప్రభుత్వం 1-200, 200-400 యూనిట్ల శ్లాబ్ లకు యూనిట్ కు వరుసగా రు. 0.85 పై.లు, రు 1.90 పై.ల మేర తక్కువ ధరలు వసూలు చేస్తుంది.

400 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వరాదని మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించిందని పత్రికలు తెలిపాయి. ప్రస్తుత సబ్సిడీ ధరలు ఈ ఆర్ధిక సంవత్సరం వరకే వర్తిస్తాయి. నూతన ఆర్ధిక సంవత్సరంలో ఛార్జీలు ఎంత వసూలు చేసేదీ మళ్ళీ కేబినెట్ నిర్ణయిస్తుంది.

ప్రైవేటు విద్యుత్ కంపెనీల ఆర్ధిక స్ధితిగతులపై ఆడిట్ చేయించడానికి కూడా ఢిల్లీ కేబినెట్ నిర్ణయించింది. అవసరం లేకపోయినా, ఆర్ధిక పరిస్ధితి భేషుగ్గా ఉన్నా ప్రైవేటు కంపెనీలు విద్యుత్ ధరలు పెంచాయని ఆరోపణలు వెల్లువెత్తిన నేపధ్యంలో సి.ఎ.జి (కాగ్) చేత ఆడిట్ చేయించాలని ఎఎపి పార్టీ ఎన్నికల ముందు డిమాండ్ చేసింది. బి.జె.పి కూడా ఈ డిమాండ్ ను సమర్ధించింది. ఆడిట్ చేయిస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదు.

“సి.ఎ.జి ఆడిట్ పై అభ్యంతరాలు ఉన్నట్లయితే ప్రైవేటు కంపెనీలు చెప్పుకోవడానికి రేపటి వరకు (బుధవారం) గడువు ఉంది. ఆడిటింగ్ చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకునే వరకు వినియోగదారులకు 50 శాతం సబ్సిడీ ఇస్తాము” ఈ సబ్సిడీ 400 యూనిట్ల లోపు వాడకందారులకు వర్తిస్తుంది. మొత్తం 34.6 లక్షల వినియోగదారుల్లో 28 లక్షల మంది వినియోగదారులకు ఈ సబ్సిడీ వల్ల లబ్ది చేకూరుతుంది” అని అరవింద్ కేజ్రివాల్ కేబినెట్ సమావేశం అనంతరం విలేఖరులకు తెలిపారు.

విద్యుత్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని రెండు రోజుల క్రితమే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (డి.ఇ.ఆర్.సి) అట్టహాసంగా ప్రకటించింది. డి.ఇ.ఆర్.సి ప్రకటన చేసిన 48 గంటల లోపే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ధరల నిర్ణయం నియంత్రణ సంస్ధ పరిధిలోనిదని కాబట్టి ప్రభుత్వం తగ్గించలేదని డి.ఇ.ఆర్.సి తెలిపింది. కానీ అరవింద్ ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధంగా చేసింది. నేరుగా ఢీకొట్టే సాహసానికి అరవింద్ ప్రభుత్వం దిగకపోవడం గమనార్హం. 

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు కాలం నుండి విద్యుత్ ధరల పెంపుదల అంశం తమ చేతుల్లో లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. వినియోగాన్ని బట్టి ధరలను నిర్ణయించే అధికారం నియంత్రణా సంస్ధలకు అప్పజెప్పారని కాబట్టి జనం చెల్లించాల్సిందేనని ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఇటీవల ఒకే నెలలో మూడుసార్లు ధరలు పెంచిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే సాకు చెప్పి తీవ్ర భారాన్ని ప్రజలపై మోపింది.

నిజానికి విద్యుత్ నియంత్రణ సంస్ధలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవే. నియంత్రణ సంస్ధల అధికారం ప్రభుత్వాల అధికారానికి లోబడేవే తప్ప అతీతం కాదు. అయినప్పటికీ తప్పు తమపైన లేకుండా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లో లేదంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నాయి.

అరవింద్ ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. విద్యుత్ టారిఫ్ లను నిర్ణయించే అధికారం తమకు లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించాడు. కానీ సబ్సిడీలు చెల్లించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని ఆయన చెప్పారు. అంటే విద్యుత్ కంపెనీల నిలువు దోపిడీ న్యాయసమ్మతమేనని ఆయన పరోక్షంగా చెబుతున్నట్లు. కాకపోతే సదరు దోపిడీలో సగం ప్రభుత్వం భరిస్తుందని ఆయన చెబుతున్నారు. అనగా ప్రైవేటు కంపెనీలకు వచ్చే నష్టం ఏమీ లేదు. కంపెనీల అక్రమ లాభాలు యధావిధిగా కొనసాగుతాయి. అక్రమ లాభాల్లో సగభాగం ప్రభుత్వం చెల్లిస్తుంది.

కానీ ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎవరిది? అదీ ప్రజల సొమ్మే. కంపెనీల దోపిడీని అరికట్టినట్లయితే ప్రభుత్వం మీద కూడా భారం పడదు కదా? విద్యుత్ కంపెనీల లాభదాహాన్ని తీర్చే బదులు ఆ సొమ్ముని మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించవచ్చు. కంపెనీల అక్రమ లాభాలను ఆడిట్ ద్వారా అరికడతామని బహుశా అరవింద్ ప్రభుత్వం పరోక్షంగా చెబుతున్నట్లు కనిపిస్తోంది. కాగ్ పని కూడా అందులోని అధికారుల నిజాయితీ పైనే ఆధారపడి ఉంటుంది తప్ప అదేమీ పులుగడిగిన ముత్యం కాదు. నియంత్రణ సంస్ధల విధి కంపెనీల అక్రమాలను నియంత్రించడం అని చెప్పి ఏర్పాటు చేశారు. వాస్తవంలో అవి కంపెనీల కోసమే పని చేస్తున్నాయి. కాగ్ కూడా అలాంటిదే.

అరవింద్ ప్రభుత్వం వ్యవస్ధ మౌలిక లోపాల సంగతి అటుంచి కనీసం విధానాల మౌలిక లోపాల జోలికి కూడా పోవడం లేదు. నియంత్రణ సంస్ధల ఏర్పాటు ప్రపంచ బ్యాంకు షరతుల మేరకు జరిగింది. ‘రెగ్యులేషన్’ పేరుతో అక్రమాలను చట్టబద్ధం చేయడం ఈ సంస్ధల ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం. ప్రభుత్వంలోని ఏ విభాగం తీసుకున్నా రెగ్యులేటరీ సంస్ధల పని అంతిమంగా క్రోనీ కేపిటలిస్టుల అక్రమాలను చట్టబద్ధం చేయడమే.

అప్ డేట్

“ఆడిట్ ద్వారా కంపెనీల అక్రమ లాభాలను అరికడతామని అరవింద్ పరోక్షంగా చెబుతున్నట్లు కనిపిస్తోంది” అని పైన రాశాను. పరోక్షంగా కాదు నేరుగానే ఈ రోజు ఆయన చెప్పారు. ఆడిట్ ముగిసిన తర్వాత సబ్సిడీల అవసరం ఉండదని బుధవారం అరవింద్ చెప్పారు. ఆడిట్ ముగిసేలోగా ప్రజలకు ఊరట ఇవ్వడానికే సబ్సిడీ భరించడానికి ప్రభుత్వం నిర్ణయించిందనీ, నిజానికి సబ్సిడీ చెల్లించడం ద్వారా ధరలు తగ్గించడం తెలివైన పని కాదని ఆయన అంగీకరించారు. అటువంటి భారాన్ని ప్రభుత్వం ఎంతోకాలం భరించలేదని ఆయన వ్యాఖ్యానించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s