అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి


Representative image

Representative image

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు.

“కాంగ్రెస్, బి.జె.పి లాంటి అవినీతి రాజకీయ పార్టీల వ్యవస్ధకే ఆయన కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వాటికి ప్రత్యామ్నాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు” అని ఎఎపి నేత, సుప్రీం కోర్టులో అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ అన్నారు. ముంబైలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ తర్వాత ముంబై పైన ఎఎపి దృష్టిసారించిందని పత్రికలు ఊహాగానాలు చేసిన నేపధ్యంలో ప్రశాంత్ భూషణ్ ముంబైలో విలేఖరుల సమావేశం పెట్టడం గమనార్హం.

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్ధి ఎవరన్న ప్రశ్నకు భూషణ్ సమాధానం ఇచ్చారు. “సగటు మనిషి ఎవరైనా ప్రధాన మంత్రి కావచ్చు. ఆ పదవికి తగిన వారు మా వద్ద అనేకమంది ఉన్నారు. కానీ ఆ విషయంలో మా పార్టీ ఎలాంటి ప్రకటనా చేయబోవడం లేదు” అని ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ప్రాంతీయ పార్టీలను కూడా ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్ధకు ప్రాంతీయ పార్టీలు కూడా ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యవస్ధను మార్చగల సామర్ధ్యం ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉన్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. “ఎఎపి తరహాలో ప్రత్యామ్నాయం సమకూర్చగలగడం ప్రాంతీయ పార్టీలకు అసాధ్యం. ప్రాంతీయ పార్టీలు అత్యంత అవినీతిమయం. మాకు మాత్రమే వ్యవస్ధను మార్చగల శక్తి ఉన్నది” అని ఆయన విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు నిన్న హఠాత్తుగా అవినీతిపై సమర శంఖం పూరించారు. ఎఎపి నేతకు ప్రాంతీయ పార్టీల పట్ల ఉన్న అవగాహన గురించి ఆయన ఏమంటారో గానీ తాను మాత్రం అవినీతిని సహించేది లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అవినీతిపై పోరాడడానికి ప్రతి కుటుంబం నుండి ఒకరు బయలుదేరాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఎన్.టి.ఆర్ ప్రభుత్వాన్ని ఆయన కూలదోసిందే లిక్కర్ మాఫియా కోసం అన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అవినీతి కుట్రల గురించి ఆయన తోడల్లుడు ఏకంగా పుస్తకమే రాసినట్లుంది కూడాను.

చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇత్యాది వీరులంతా ఇప్పుడు అవినీతి నిర్మూలన మంత్రం జపిస్తున్నారంటే ఆ క్రెడిట్ ఎఎపికే దక్కుతుంది. చివరికి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా లోక్ పాల్ బిల్లును ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకోవడానికి కారణం ఢిల్లీ ఎన్నికల ఫలితాలే అని అనేకమంది విశ్లేషించారు. దేశ రాజకీయాల్లో అవినీతిని ఒక ప్రధాన అంశంగా ఎజెండా మీదికి తేవడంలో ఎఎపి సఫలం అయింది. కానీ అవినీతి మూలాల జోలికి వెళ్లకపోవడమే ఎఎపి తో ఉన్న సమస్య.

ముంబైపై దృష్టి సారించిన ఎఎపి మహారాష్ట్రలోని పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి అధికారం పంచుకుంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శను కేంద్రీకరించింది. దేశంలో అత్యంత అవినీతి రాజకీయ పార్టీల్లో ఎన్.సి.పి ఒకటని ఎఎపి జాతీయ కమిటీ సభ్యుడు మయాంక్ గాంధీ విమర్శించారు.

2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. మహారాష్ట్రలో ఎంతమందిని వీలయితే అంత ఎక్కువమందిని నిలబెట్టాలని తాము యోచిస్తున్నామని అందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. “అవినీతి లేని, క్రిమినల్ కానీ, మతతత్వం జోలికిపోని అభ్యర్ధుల నుండి మేము దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. భారత రాజ్యాంగానికి, మా పార్టీ ఆదర్శాలకు కట్టుబడి ఉండేవారు దరఖాస్తు చేసుకోవచ్చు” అని ప్రశాంత్ తెలిపారు.

మహా రాష్ట్ర లోని ఒక పార్టీ స్వాభిమాని షేత్కారీ సంఘటన్ (ఎస్.ఎస్.ఎస్) తో ఎఎపి చర్చలు జరుపుతున్నట్లుగా ది హిందూ తెలిపింది. అయితే ఎస్.ఎస్.ఎస్ పార్టీ బి.జె.పి-శివసేన కూటమితో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తామా, బి.జె.పి కూటమా ఏదో ఒకటే తేల్చుకోవాలని ప్రశాంత్ షరతు విధించారు. “కూటమి విషయంలో వారు ఒక స్పష్టతకు రావాలి. ఇరువురితోనూ చర్చిస్తామంటే అది వీలుకాదు” అని చెప్పారాయన.

అవినీతి పార్టీల అహంభావాన్ని ఢిల్లీ ఎన్నికలు తుడిచిపెట్టేశాయని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పార్టీ 30 అంశాలపైన 30 నిపుణుల కమిటీలను నియమించిందని వారు తమ నివేదికలు ఇచ్చిన తర్వాత వాటిని ప్రజల అభిప్రాయం కోసం చర్చకు పెడతామని తెలిపారు.

అతి పెద్ద ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకోవడమే గానీ భారత దేశంలో ప్రజల అభిప్రాయానికి రాజకీయ పార్టీలు ఏనాడూ విలువ ఇచ్చిన పాపాన పోలేదు. డబ్బు, మద్యం, తాయిలాల మీదనే ఆధారపడే అవినీతి పార్టీలు తాము డబ్బు ఇచ్చాము కాబట్టి ప్రజలకు జవాబుదారీ గా ఉండాల్సిన పని లేదని కూడా భావిస్తాయి. ఎఎపి ఆచరణ ఇందుకు భిన్నంగా ఉండడం గమనించాల్సిన అంశం. ఆ మేరకు ఎఎపి ప్రవేశ పెడుతున్న ప్రజాస్వామ్య పద్ధతులను ఆహ్వానించాలి. అదే సమయంలో ఆ పార్టీకి ఉన్న పరిమితులను కూడా తప్పనిసరిగా గుర్తించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s