ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు.
ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు అది సక్రమంగా సాగకపోవడంతో ఎన్.జి.ఓ లనే రాజకీయాల్లోకి దించాయి. ఈ ప్రక్రియలో ప్రజలకు అంతిమంగా మేలు జరుగుతుందా లేక కీడు జరుగుతుందా అన్నది తేలడానికి బహుశా పెద్దగా సమయం అవసరం లేదు. ఎన్.జి.ఓలే రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో రెండు, మూడేళ్లలో తేలిపోవచ్చు. కాంగ్రెస్, బి.జె.పి నేతలు పనిమంతులైతే ఇంకా తక్కువ సమయంలో తేలవచ్చు.
ఈ లోపు ఎన్.జి.ఓ పార్టీలు నిలబడడానికి బలం కావాలి. ఎ.ఎ.పి కి ఇప్పుడా బలం ఇస్తున్నది సగటు మనిషే. స్ధిరపడిన రాజకీయ పార్టీలు ప్రజలను గొర్రెల మందగా తీసిపారేయడానికి అలవాటు పడ్డాయి. ఎఎపి సరిగ్గా అక్కడే జొరబడింది. ఏ సగటు మనిషినయితే అవి తీసేశాయో ఆ సగటు మనిషినే చేరదీసి పట్టం కట్టడం ద్వారా ఎఎపి మొదటి విజయం సాధించింది.
ధన బలం, కండబలం లేకుండా ఎన్నికల్లో నెగ్గడం అసాధ్యమని స్ధిరపడిపోయిన చోటనే ఎఎపి నెగ్గుకు రావడం సామాన్యమైన విషయం కాదు. ఎన్నికలకు ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ప్రజలను గొర్రెలని భావించడానికి బదులు వారికే అగ్రపీఠం ఇచ్చినవారిని ఆ ప్రజలు నిరాశపరచరు అని ఎఎపి ద్వారా రుజువయింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఎఎపి ఇప్పుడు చేయాల్సిన పని.
రధులు, అతిరధులు మహారధులు అనేకమంది వైరి పార్టీల నుండి మోహరించి ఉన్న పరిస్ధితుల్లో పాలనలోనూ సగటు మనిషికే పట్టం గడతానని చూపడానికి ఎఎపి వద్ద ఉన్న అస్త్రాలకు కొదవ లేదని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ప్రారంభ చర్యలు చెబుతున్నాయి. ఎఎపి కి వ్యతిరేకించినవారు ఎంత అతిరధ, మహారధులైనా వారికీ సగటు మనిషి ఓటు కావాలి. ఈ అంశాన్నే ఎఎపి పదే పదే తన చర్యల ద్వారా ఎత్తి చూపుతోంది. తద్వారా తాను ప్రజలకు కట్టుబడి ఉన్నానని చాటుతోంది.
మద్యం మాఫియా అకృత్యానికి బలై చనిపోయిన సాధారణ కానిస్టేబుల్ కు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడం ద్వారా తాను సగటు మనిషి కోసమే పని చేస్తున్నట్లు అరవింద్ సింబాలిక్ గా చాటి చెప్పారు. అదే సమయంలో తన స్ధానాన్ని రాజకీయంగా కూడా సుస్ధిరం చేసుకునేవైపుగా ఆయన మరో అడుగు వేశారు.
నీటి మీటర్ ఉన్నవారికి నెలకు 20 కి.లీ నీరు ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పిన అరవింద్, అసలు నీటికి వెలకట్టడం ఏమిటన్న మౌలిక ప్రశ్నను వేయడంలో విఫలం అయ్యారు. పైగా 20 కి.లీ పరిమితి దాటి వినియోగించుకుంటే అన్నిరకాల ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేయడం ద్వారా నీటి చార్జీల వసూలుకు న్యాయబద్ధతను అంటగట్టారు. యూజర్ చార్జీల పేరుతో నీటి ఛార్జీలు వసూలు చేయాలని చెప్పింది ప్రపంచ బ్యాంకు అన్న సంగతి ఈ సందర్భంగా విస్మరించరాదు.
ప్రజా పాలన అంత తేలికైన విషయం ఏమీ కాదు. అందునా వ్యతిరేక శక్తులు అన్ని దిశల నుండి పొంచి ఉన్నపుడు ఇంకా కష్టం. ఈ సవాళ్లను అధిగమించాలంటే రాజకీయ పార్టీలకు ఒక సైద్ధాంతీక దృక్పధం ఉండాలి. ప్రజల్ని ఆ దృక్పధం చుట్టూ సమీకరించగలగాలి. ప్రజా వ్యతిరేకం అయినా కాంగ్రెస్, బి.జె.పి లకు అలాంటి దృక్పధాలు ఉన్నాయి. అవి ప్రజల కోసమే అని నమ్మించగలుగుతున్నాయి. కానీ ఎఎపికి అలాంటిదేమీ లేదు. ఒక దృక్పధం లేని పార్టీ ప్రజలను ఎల్లకాలం కలిపి ఉంచడం సాధ్యం కాదు.
ఎన్.జి.ఓ లు రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉదాహరణలు పశ్చిమ దేశాల్లోనూ, అరబ్ వసంతం పేరుతో జరిగిన తిరుగుబాట్లలోనూ ఇప్పటికే చోటు చేసుకున్నాయి. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ప్రజల్లో నానాటికీ ఆదరణ తగ్గిపోతున్నందున ధనిక వర్గాలు ఈ విధంగా ఎన్.జి.ఓ లను దొడ్డిదారిని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాయని అక్కడ రుజువయింది.
ఎఎపి కూడా అలాంటి పార్టీయేనా అని ఇప్పుడే నిర్ధారించడం కంటే ఆ పార్టీ ఆచరణను ఎంచి చెప్పడమే న్యాయం. అంతవరకు ఆమ్ ఆద్మీని అంటి పెట్టుకుని ఉన్నంతవరకు ఎఎపి కి ఢోకా ఉండబోదు.
ఎఎపి ఆమ్ ఆద్మీని అంటిపెట్టుకుని ఉండటం అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాన్ని
భ్రమలలో ఉంచగలగటమే. విదేశీ కంపెనీలకు స్వదేశీ సైనికులైన ఎన్జీవోలు ఆ పని చేయగలిగితే హంటింగ్టన్ political order in changing societies కి కొత్త అధ్యాయం చేర్చగలుగుతాడు.
వివిన మూర్తి గారూ, నిజం చెప్పారు. సాంప్రదాయక రాజకీయ పార్టీలు వదులుతున్న ఖాళీని భర్తీ చేయలేని స్ధితిలో ప్రజా శక్తులు ఉన్నాయి. వారికా శక్తి వచ్చేవరకూ ఈ పరిస్ధితి తప్పదు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు శేఖర్ గారు.
తిరుపాలు గారూ, ధన్యవాదాలు. మీక్కూడా. మీ ప్రోత్సాహం కొనసాగాలని కోరుకుంటున్నాను.