దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం


Dr Khobragade

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని తరపు లాయర్ వాదిస్తున్న నేపధ్యంలో మరిన్ని ఆధారాలు సేకరించడానికి అమెరికా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దేవయాని లాయర్ ప్రకారం దేవయాని-సంగీత రిచర్డ్స్ ల మధ్య కుదిరిన వేతన కాంట్రాక్టును న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు తప్పుడు అర్ధం తీశారు. మొదటి కాంట్రాక్టులో నెలకు 4,500 డాలర్లు కనీస వేతనం చెల్లించడానికి దేవయాని అంగీకరించినట్లు అమెరికా వాదిస్తోంది. అయితే ఇది వాస్తవం కాదని, దేవయాని బేసిక్ పే 4,500 డాలర్లుగా కాంట్రాక్టులో పేర్కొన్నారని, దానిని సంగీత రిచర్డ్స్ కు ఇవ్వజూపిన మొత్తంగా అమెరికా ప్రాసిక్యూటర్లు తప్పుడు అర్ధం తీశారని డాన్ ఆర్షక్ వాదించారు. ఈ వాదనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించిందని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ పత్రిక మంగళవారం (డిసెంబర్ 31) తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ప్రీత్ భరార విజయంగా సదరు పత్రిక అభివర్ణించింది.

దేవయానితో యు.ఎస్ మార్షల్స్ వ్యవహరించిన పద్ధతికి తాము బాధ్యులం కాదని ప్రీత్ భరార కార్యాలయం వాదిస్తోంది. అసలు కేసును తమ వద్దకు తెచ్చిందే అమెరికా విదేశాంగ శాఖ అనీ, కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, పత్రాలు, ఆధారాలు అన్నీ సేకరించింది అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటే అని న్యూయార్క్ అటార్నీ కార్యాలయం చెప్పిందని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. దేవయాని, అమెరికా చట్టాలను అగౌరవపరచడమే కాకుండా తీవ్రంగా ఉల్లంఘించారనేందుకు గట్టి సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని, మరిన్ని సాక్ష్యాలు సేకరిస్తున్నామని అటార్నీ కార్యాలయంను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది.

దేవయాని లాయర్ వాదిస్తున్నట్లుగా వీసా దరఖాస్తులో పేర్కొన్న వేతనం (4,500 డాలర్లు) దేవయాని వేతనం కాదని, సంగీత వేతనమేనని అమెరికా విదేశాంగ శాఖ నిర్ధారిస్తోంది. తన వేతనాన్ని దేవయాని పొందుపరిచినట్లయితే వీసా దరఖాస్తు ఫారంను ఆమె అర్ధం చేసుకోనట్లేనని, అందుకు తాము బాధ్యులం కాదని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అరెస్టు విషయంలో తాము ఆపాలజీ చెప్పే సమస్యే లేదని, రూల్స్ బుక్ ప్రకారమే మార్షల్స్ వ్యవహరించారని మరోసారి వారు స్పష్టం చేశారు.

అమెరికా చట్టాల ప్రకారం కనీస వేతనం $1374.75 కాగా దేవయాని అంతకంటే ఎక్కువే చెల్లించినట్లు ఇండియా టుడే పత్రిక మూడు రోజుల క్రితం తెలిపింది. బ్రిటిష్ పత్రిక మెయిల్ టుడే ప్రకారం దేవయాని చెల్లించిన అన్ని సౌకర్యాలను లెక్క గడితే నెలకు 2,000 డాలర్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించినట్లు తేలుతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పత్రాలు మెయిల్ టుడే వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.

వివిధ పత్రాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, క్రెడిట్ కార్డు రసీదులు, బ్యాంకు ఖాతా పత్రాలు తదితర సాక్ష్యాల ఆధారంగా అమెరికా వాదనను పూర్వపక్షం చేయడానికి దేవయాని లాయర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాక్ష్యాల ప్రకారం అమెరికా కోర్టులో కేసు నిలవదని భారత ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే కేసును ఉపసంహరించుకోవాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది.

ఇండియా టుడే ఇచ్చిన వివరాల ప్రకారం దేవయాని సంగీతా రిచర్డ్స్ కు కేబుల్ టి.వి నిమిత్తం 145 డాలర్లు చెల్లించారు. దేవయాని ఇంటి వినియోగం నిమిత్తం చెల్లించిన $250 విద్యుత్ చార్జీలలో $60 సంగీత రిచర్డ్స్ కోసం చెల్లిస్తున్నట్లుగా పత్రాలు ఉన్నాయి. దేవయాని వేతన పత్రంలో ఈ వివరాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇవి కాక సంగీతకు రెండు విడతలుగా $200 డాలర్లు చెల్లించినట్లు రసీదులు ఉన్నాయి. ఈ రసీదులు నెలవారీగా ఉన్నాయా లేక ఆమె పని చేసిన 6 నెలల కాలానికా అన్నది తెలియలేదు. ఇవి కాకుండా ప్రతి నెలా $573 మొత్తం ఇండియాలోని సంగీత కుటుంబానికి చెందిన SBI ఖాతాలో జమ చేస్తున్నారు. సంగీత టెలిఫోన్, రీఛార్జ్ చెల్లింపులకు కూడా తగిన పత్రాలు ఉన్నాయి. $1000 లాడ్జింగ్ ఛార్జీలు ఇందులో కలిసి లేవు. వివిధ సందర్భాలలో సంగీతకు ఇచ్చిన బహుమతుల ఛార్జీలను కూడా ఇందులో కలపలేదని ఇండియా టుడే తెలిపింది. బహుమతులకు ఛార్జీలు వసూలు చేస్తే అవి బహుమతులు ఎలా అవుతాయో అర్ధం కాని సంగతి.

ఈ విధంగా లెక్కలు వేసుకున్న తర్వాత నెలవారి సంగీతకు చెల్లిస్తున్న మొత్తం $2400 పైనే ఉన్నదని ఇది అమెరికా కనీస వేతనం $1374.75 కంటే ఎక్కువే గనుక కేసు నిలవదని భారత ప్రహుత్వం భావిస్తోంది. అయితే న్యూయార్క్ అటార్నీ ఆఫీసు ప్రకారం వైద్య, ఆరోగ్య ఖర్చులు వేతనంలో కలవవు. లాడ్జింగ్ బెనిఫిట్స్ కూడా వేతనంలో కలవ్వు. అదీకాక కాంట్రాక్టు పత్రంలో $4,500 చెల్లిస్తానని దేవయాని అంగీకరించారని వారు వాదిస్తున్నారు. వారి వాదనలోని ప్రధాన అంశం ఇదే. అమెరికాకు సమర్పించిన కాంట్రాక్టులో గంటకు $9.75 చెల్లిస్తామని చెప్పిన దేవయాని వీసా పొందిన తర్వాత 3 డాలర్ల చిల్లర మాత్రమే చెల్లిస్తూ మరో కాంట్రాక్టు ఎందుకు కుదుర్చుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దేవయానిని తాత్కాలిక సలహాదారుగా నియమించిన అంశంపై న్యూయార్క్ అటార్నీ అవగాహన ఏమిటన్నదీ తెలియలేదు. బహుశా కేసు నుండి బైటపడడానికి దేవయానికి ఇది ప్రధాన ఆయుధం కావచ్చు. లేదా ఐరాసలోని భారత శాశ్వత కార్యాలయానికి దేవయానిని బదిలీ చేసినందున ఆ హోదా ద్వారా అయినా ఆమె బైటపడవచ్చు. కానీ కేసు నుండి మాత్రం ఆమెకు విముక్తి దొరికే అవకాశం కనిపించడం లేదు. అమెరికా రాయబారులకు సంబంధించి ఇండియా ఇప్పటికే వివిధ ప్రతీకార చర్యలు తీసుకుంది. వీటిని ఇండియా ఉపసంహరించుకునే అవకాశం లేదు. కాబట్టి అమెరికా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు.

అయితే దేవయాని బదిలీ ద్వారా దేవయానికి పూర్తి స్ధాయి రాయబార రక్షణ లభిస్తుంది. ఈ రక్షణ ఉన్నంతవరకూ ఈ కేసు విషయంలో ఆమెకు కోర్టు విచారణ, పోలీసు విచారణల నుండి రక్షణ ఉంటుంది. ఈ రక్షణ ఆధారంగా ఆమె ఇండియాకు వచ్చేయవచ్చు. కానీ ఆమె మళ్ళీ అమెరికా వెళ్తే కేసు ఎదురు చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె భర్త అమెరికా పౌరుడు. అక్కడ ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఆయన పని చేస్తున్నారు. ఆమె భర్త ద్వారా ఆమె అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్. ఈ అంశం దేవయాని విముక్తిని సంక్లిష్టం కావించింది.

దేవయాని కేసు చూడడానికి వ్యక్తిగత స్ధాయిలో కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో ఇది రెండు వ్యవస్ధల మధ్య జరుగుతున్న ఘర్షణ. ఇండియాలో అమెరికా రాయబారులలో ఒకరు గే. ఆయన తన పార్టనర్ ను ఇండియా తెచ్చుకోగా అందుకు భారత అధికారి ఒకరు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు అమెరికా చూపినట్లుగానే ఇండియా రూల్ బుక్ ని ఆమె చూపారు. ఆమె కూడా అమెరికాలో భారత కాన్సల్ ప్రతినిధిగా పని చేస్తుండగా సరిగ్గా దేవయాని తరహాలోనే పని మనిషి విషయంలో అవమానం ఎదుర్కొన్నారు. కాకపోతే అప్పుడు ప్రభుత్వం ముందుగా మేల్కొని ఆమెను వెనక్కి రప్పించుకుంది. భారత విదేశీ మంత్రి చెప్పినట్లు దేవయాని కేసు వెనుక ఉన్న చరిత్ర ఇదే.

ఇండియా కంటే కాస్త అడ్వాన్స్ అయిన అమెరికా వేతన వ్యవస్ధ, పని మనుషులకు, కూలీలకు, కార్మికులకు ఇంకా అమానవీయంగా ఉంటోన్న భారత వేతన వ్యవస్ధ మధ్య ఉన్న వ్యత్యాసం అమెరికాకు అవకాశంగా అంది వచ్చింది. ఈ కేసు ద్వారా అమెరికాతో సంబంధాలను చెరుపుకునే స్ధాయికి భారత పాలకులు వెళ్లరు. అమెరికా ధైర్యం అదే. కేసును కొనసాగిస్తూ తాను వెనక్కి తగ్గలేదన్న సందేశం ఇస్తూనే పరిస్ధితి మరింత దిగజారకుండా అమెరికా జాగ్రత్త తీసుకోవచ్చు.

One thought on “దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

  1. దేవయాని నేరారోపణల విషయంలో అమెరికా కచుని పాత్ర పోషిస్తోంది. కచదేవయాని సంవాదం భారత్ గౌరవ ప్రతిష్టలకు పెను సవాల్. వేచి చూడటం తప్ప భారత్ కు వేలుపెట్టి ప్రయోజనం లేదు. అమెరికా విషయంలో భారత్ ప్రయత్నాలు తాత్కాలిక ఉపశమనం తప్ప మరొకటి కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s