‘ఓహో… మేఘమాలా… నీలాల మేఘమాల’ అంటూ ప్రియ సఖి, సఖుడిని ఉద్దేశించి పాడిన నాయికా నాయికలకు తెలుగు సినిమాలలో కొదవలేదు. ‘నీలి మేఘమా.. జాలీ చూపుమా… ఒక నిమిషమాగుమా’ అంటూ అర్ధించేది ఒకరయితే, ‘మనసు తెలిసిన మేఘమాలా’ అంటూ తమ గోడు చెప్పుకున్న బావా మరదళ్లు మరొకరు. పక్షులకే గాక ప్రేమ పక్షకులకు కూడా నేస్తాలయిన మేఘాలు మానవ సమాజానికి ప్రకృతి ప్రసాదించిన అద్వితీయమైన వరం.
ప్రపంచ వ్యాపితంగా వివిధ వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా ఏర్పడిన మేఖాల రూపాలను కెమెరా కంటితో బంధించి మన ముందుంచారు ఫోటోగ్రాఫర్లు. రకరకాల రూపాల్లో మేఘాలు ఏర్పడతాయన్నది తెలిసిందే అయినా ఆయా రూపాలు ఎందుకు ఏర్పడుతాయో కూడా శాస్త్రం నిర్ధారించిందన్న సంగతి మనలో చాలామందికి తెలియదు.
భూమి పైన ఉండే వాతావరణం తీరు తెన్నులను బట్టే మేఘాలు ఒక ఆకృతిని సంతరించుకుంటాయట. సముద్రమూ, నేలా కలుసుకునే చోట ఒక రూపంలో మేఘాలు ఏర్పడితే, కొండలపైన ఉండే వాతావరణానికి అనుగుణంగా మరో రూపాన్ని మేఘాలు ధరిస్తాయి. వర్షం రావడానికి ముందు ఏర్పడే మేఘాలది ఒక రూపం అయితే ఎక్కడో పని ఉన్నట్లు పరుగెత్తుకుపోయే మేఘాలది మరొక రూపం. ఉరుములు, మెరుపులకు అనుగుణంగా ఒక రూపం, తమలోని తేమ, ధూళిల నిష్పత్తులకు అనుగుణంగా మరొక రూపం మేఘాలు ధరిస్తాయట. ఈ మేఘాల లక్షణాలను బట్టి వివిధ తరగతులుగా విభజించి పేర్లు కూడా పెట్టేశారు మన శాస్త్రవేత్తలు.
మనం తరచుగా వినేది, మన టి.వి ఛానళ్ళ వాళ్ళు ఈ మధ్య తరచుగా చెబుతున్న పేరు ‘క్యుములోనింబస్’ మేఘాలు. తుఫాను వస్తుందనడానికి సంకేతంగా మేఘాలు క్యుములోనింబస్ రూపం సంతరించుకుంటాయట. పెద్ద మొత్తంలో తేమను నిలవ చేసుకుని తీవ్రమైన చీకటి, వెలుతురు రంగులతో ఇవి కూడి ఉంటాయి.
క్యుములోనింబస్ మేఘాలకు కింద వైపు ఏర్పడేవి గోడ మేఘాలు (Wall clouds) ట! క్యుములోనింబస్ మేఘాల కింద గోడ మేఘాలు ఏర్పడితే గనక ఇక అక్కడ వర్షం కురవదట. అంటే వర్షం కురవకుండా సైంధవుడిలా అడ్డుపడేవి గోడ మేఘాలు అన్నట్లు! అలాగే క్యుములోనింబస్ మేఘాలలో ఏర్పడే సుడి దిశ పైకి ఉందా, కిందకి ఉన్నదా అన్నదానిపై ఆధారపడి కూడా వర్షం కురవడం ఉంటుందిట. ఇంగ్లండ్ లోని బెవర్లీ పైన ఏర్పడ్డ క్యుములోనింబస్ మేఘం సుడులు పై దిశలో ఉన్నాయిట. అందుకని అక్కడ వర్షం పడలేదని ఫోటోలు ప్రచురించిన మటాడర్ నెట్ వర్క్ వెబ్ సైట్ వాళ్ళు చెప్పారు.
కొండలపైన పుట్టగొడుగుల కళాకృతిలో ఏర్పడేవి లెంటిక్యులార్ మేఘాలు అంటారు. జపాన్ లోని ఫ్యుజి కొండ పైన ఏర్పడిన లెంటిక్యులర్ మేఘాన్ని మొదటి బొమ్మలో చూడవచ్చు. వీటిని యు.ఎఫ్.ఓ (Unidentified Flying Objects) మేఘాలు అని కూడా అంటారు.
మనకు కాస్త అరుదుగా కనిపించేవి మమ్మాటస్ మేఘాలు. వీటిలో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయని కింద ఫోటోల ద్వారా తెలుస్తోంది. భారీ ఉరుములకు ఇవి ప్రాణం పోస్తాయి. ఇవి ఏర్పడితే ఎంత త్వరగా ఇంటికి చేరుకుంటే అంత మంచిదిట. యాస్పరేటస్ మేఘాలు చాలా చాలా తరచుగా అదీ న్యూజీలాండ్ లాంటి చోట్ల మాత్రమే ఏర్పడతాయిట. ఈ మేఘాలకు ఈ పేరుని మీటియోరాలజిస్టులు ఇంకా నిర్ధారించలేదని తెలుస్తోంది. అంటే ఈ మేఘాల లక్షణాలు ఏమిటో వారికింకా అంతుబట్టలేదనే అర్ధం?
ఆర్కస్ మేఘాలు గుండ్రటి రూపాల్లో ఏర్పడతాయి. వీటిలో ఒకే ఒక గొట్టం తరహాలో ఏర్పడేవి కొన్నయితే గొట్టాలు పక్క పక్కన పేర్చినట్లు ఏర్పడేవి కొన్ని. ఇలా ట్యూబ్ షేపులో ఏర్పడే మేఘాలను రోలర్ మేఘాలు అంటారు. తల్లి మేఘంతో కలిసి ఉందా లేక విడిపోయి ఉందా అన్న దాన్ని బట్టి ఆర్కస్ మేఘాల తరగతి మారుతుంది. తల్లి మేఘంతో కలిసి ఉంటే వాటిని షెల్ఫ్ క్లౌడ్ అంటారు. విడిపోతే రోలర్ క్లౌడ్ అంటారు. ఇవి రెండూ ఆర్కస్ మేఘంలో భాగమే.
వివిధ ప్రాంతాల్లో సముద్ర ప్రవాహాలు వేరు వేరు పీడనాలు కలిగి వేరు వేరు ప్రవాహాలు కలిగి ఉంటాయన్నది తెలిసిందే. ఇలా రెండు ప్రాంతాల్లోని సముద్రాల పైన ఉండే గాలులు వివిధ వేగాలతో ప్రయాణిస్తే ఏర్పడేవి ఆల్టోక్యుములస్ మేఘాలు. ఇవి భూమికి చాలా ఎత్తులో ఏర్పడతాయి. ఇవి నిజానికి అనేక విడి విడి మేఘాల కలయిక. అన్నీ కలిసి సముద్రం ప్రవాహం, గాలి వేగాలను ప్రత్యేక రూపాలను ఏర్పరుస్తాయి.
కొండలపైన కాకుండా కొండలకు ఆనుకుని వాటి చుట్టూ ఏర్పడేవి స్ట్రాటస్ మేఘాలు. భూమికి అతి తక్కువ ఎత్తులో ఇవి ఏర్పడతాయి. వీటిని పొగమంచు అని కూడా మనం పిలుస్తాము. అంటే మనం పొగ మంచు అని పిలిచేది మేఘాలనన్నమాట!
హోల్ పంచ్ క్లౌడ్ అని మరొక రకం ఉంది. ఇది ఆస్ట్రియాలో ఏర్పడినట్లు కింద ఫొటోల్లో చూడవచ్చు. సిర్రో క్యుములస్ మేఘాలు గానీ, ఆల్టో క్యుములస్ మేఘాలు గానీ ఘనీభవించి భూమి మీదికి పడిపోవడం ప్రారంభించినప్పుడు ఈ తరహా మేఘాలు ఏర్పడతాయి. లేదా క్యుములస్ మేఘాలలో ఒక భాగం ఆవిరైనప్పుడు కూడా ఇవి ఏర్పడతాయి. వీటిని ఫాల్ స్ట్రీక్ క్లౌడ్ అని కూడా అంటారు.
బాగా ఎత్తున ఏదో పనున్నట్లు పరుగెట్టుకుంటూ పోయే మేఘాలను సిర్రో క్యుములస్ మేఘాలు అంటారు. చిన్న మంచు స్ఫటికాలతో ఇవి కూడుకుని ఉంటాయి.
ఈ ఫోటోలను మాడర్ నెట్ వర్క్ వెబ్ సైట్ ప్రచురించింది.
Reblogged this on ugiridharaprasad.
పింగ్బ్యాక్: పుడమి తల్లి భావాల లీల, నీలాల మేఘమాల | ugiridharaprasad
మేఘమ వేగమా కురవకే నీవిలా,
కురిసినా, మెరిసినా, కరుగు నీ జీవనం!