మోడి రాతలపై బాధితుల ఆగ్రహం


Parzania

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు.

గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం గుజరాత్ లో చెలరేగిన మారణకాండకు ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రోత్సాహం ఇచ్చారని జకియా జాఫ్రీ ఆరోపీంచారు. మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు నియమించిన సిట్ వాటిని విస్మరించిందని, కుంటి సాకులు చెప్పి పరిగణించలేదని జకియా జాఫ్రీ ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను పరిగణించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు.

ఆమె పిటిషన్ ను విచారించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సిట్ అభిప్రాయాన్ని సమర్ధించింది. హిందువులు తమ ఆగ్రహాన్ని తీర్చుకోడానికి స్వేచ్ఛ ఇవ్వాలని మోడి స్వయంగా ఆదేశాలు ఇచ్చారని, ఆ ఆదేశాలు ఇచ్చిన సమావేశానికి తానూ హాజరయ్యానని పోలీసు ఉన్నతాధికారి సంజీవ్ భట్ ఇచ్చిన సాక్ష్యం నమ్మదగింది కాదన్న సిట్ వాదనతో కోర్టు ఏకీభవించింది.

అహ్మదాబాద్ లోని గుల్బర్గ్ సౌసైటీ హత్యాకాండలో జకియా జాఫ్రీ భర్త, కాంగ్రెస్ ఎం.పి ఎహసాన్ జాఫ్రీ దుర్మరణం చెందారు. ఆయనతో పాటు ఆయన ఇతర కుటుంబ సభ్యులు, ఆయన ఇంటిలో శరణు పొందిన ఇతర ముస్లిం, హిందూ కుటుంబాలు సజీవదహనానికి గురయ్యారు. తమకు సహాయం అందించాలని ఎహసాన్ జాఫ్రీ అనేకసార్లు పోలీసు కంట్రోల్ రూమ్ కి ఫోన్లు చేసినప్పటికీ వారికి సాయం అందలేదు. హిందువుల ఆగ్రహాన్ని అనుమతించడానికి వీలుగా పోలీసు కంట్రోల్ రూమ్ లో ఇద్దరు మంత్రులను మోడి నియమించినట్లు జకియా ఆరోపించారు. ఈ మేరకు పత్రికలు కూడా అనేక వివరాలు వెల్లడి చేశాయి. అయితే సాక్ష్యాలు లేవన్న కారణంతో సిట్ గానీ, కోర్టులు గానీ ఈ ఆరోపణలను పరిగణించలేదు.

మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు అనంతరం మోడి తన బ్లాగ్ లో గుజరాత్ మారణకాండపై మొదటిసారి తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. “ప్రియమైన సోదరీ సోదరులారా” అంటూ ప్రారంభించిన మోడి గుజరాత్ అల్లర్ల వల్ల తనకు కలిగిన ఖాళీతనం భావనను వర్ణించడానికి దుఃఖం, విచారం, యాతన, బాధ, కష్టం, పరితాపం, ఆవేదన మొదలైన పదాలేవీ సరిపోవని చెప్పుకొచ్చారు.

మోడి రాతలను అల్లర్ల బాధితులు నిరసించారు. “12 సంవత్సరాల తర్వాత ఆయన తన వ్యక్తిగత భావాలను వెల్లడించడం ఒక విషయం. ప్రతి ఒక్క పౌరుడి ధన, మాన, ప్రాణాలను కాపాడవలసిన, ముఖ్యంగా 2002 అల్లర్ల బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నప్పటికీ దానిని నిర్వర్తించకపోవడం మరో విషయం” అని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్, జస్టిస్ అండ్ పీస్ సంస్ధ కార్యకర్త ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్ అన్నారు.

గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ అనంతరం తన కుమారుడి ఆచూకీ గల్లంతయిన రూప మోడి అహ్మదాబాద్ నుండి మాట్లాడుతూ మోడి రాతలను మొసలి కన్నీళ్లుగా అభివర్ణించారని ది హిందు తెలిపింది. ఆమె కుమారుడు అదృశ్యం అయిన కధ ఆధారంగా ‘పర్జానియా’ పేరుతో హిందీ సినిమా నిర్మించారని తెలుస్తోంది. గుల్బర్గ్ సొసైటీలోని ఎహసాన్ జాఫ్రీ ఇంటిపై హిందూ సంస్ధలకు చెందిన మూకలు దాడి చేసినపుడు రూప మోడి, ఆయన కుమారుడు ఆ ఇంటిలోనే తలదాచుకున్నారు.

“మోడి తన సొంత బాధను చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఏ క్షణంలోనూ ఆయన క్షమాపణలు కోరలేదు. ఆయన అనుభవించానని చెప్పుకుంటున్న బాధ ఎలాంటిది? 12 సంవత్సరాల పాటు బైటికి చెప్పని ఆయన బాధ, ఇప్పుడు ఒక కోర్టు తీర్పు విన్న తర్వాత మహా సంరంభంగా వెల్లడి చేయడానికి నిర్ణయించుకున్న ఆయన బాధ ఎలాంటిది? ఆ మనిషిది రాతి గుండె. బాధను అనుభవించే సామర్ధ్యం ఆయనకు లేదు. తన కొడుకు ఉన్నాడో లేడో కూడా తెలియని తల్లిని నేను. నాకు బాధ ఉండేది. ఆయనకు కాదు” అని రూప మోడి తీవ్ర స్ధాయిలో తన నిరసన వ్యక్తం చేశారు.

“మేము అత్యంత సీనియర్ పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బతిమాలాము. ఎస్.ఆర్.పి ని బతిమిలాడాము. మేము విన్నదల్లా ‘మీకు ఈ రోజు చావు రాసి పెట్టి ఉంది. మిమ్మల్నందరిని చంపేయాలని మాకు పై నుండి ఆదేశాలు ఉన్నాయి’ అని మాత్రమే” అని రూప మోడి తెలిపారు. తన పాలనలోని ప్రజలని చంపేయాలని ఆదేశాలిచ్చే ఇటువంటి ‘పై పాలకులు’ ఎంత దుర్మార్గులై ఉండాలి? ఎంత దురాత్ములై ఉండాలి? ఎంత పచ్చి నెత్తురు తాగే తోడేళ్లయి ఉండాలి? ఎహసాన్ జాఫ్రీ ముఖ్యమంత్రి మోడీకి కూడా ఫోన్ చేశారని రూప మోడి కోర్టులో సాక్ష్యం చెప్పారు. కానీ నిందితుడు ఆమె సాక్ష్యం కంటే శక్తివంతుడు.

నరోడ పాటియా బాధితుల భయానకమైన గాధ మరింతగా గుండెల్ని చెదిరిస్తుంది. మాయా కొడ్నాని, బాబూ భజరంగి లాంటి నరరూప రాక్షసుల నేతృత్వంలో ఇక్కడ కత్తికొక కండగా ముస్లిం పేదలను నరికి ఒక పాడుపడిన బావిలో కుక్కారు. పారిపోతున్నవారిని ఆ బావిలో దాక్కోమని దారి చూపి మరీ చంపి ఆ బావిలోనే పాతి పెట్టారు. ఈ బావిని తవ్వి మృతులను గుర్తించాలన్న డిమాండ్ ఇంతవరకు నెరవేరలేదు.

నరోడ పాటియా కు చెందిన బాధితులు ఖాటూన్ అప ఇప్పటికీ తన చెవుల్లో ఆనాటి మూకల కేకలు మారుమోగుతూనే ఉన్నాయని తెలిపారు. “చంపండి, చంపండి, కాల్చిపారేయండి, దహనం చెయ్యండి” అంటూ తమను తరిమి తరిమి చంపారని తెలిపారు.

“మోడి గనుక ఆనాడే ‘ఆపండి’ అని ఆదేశాలు ఇచ్చినట్లయితే హత్యాకాండలన్నీ ఆగిపోయి ఉండేవి. కానీ ఆయన ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు తనకు బాధ కలిగిందని చెప్పడమా. ఆయన ఒక అబద్ధాలకోరు. ప్రజల్ని ఫూల్స్ చెయ్యడానికే ఈ రాతలు ఇప్పుడు రాశారు. హిందువులు కూడా ఆయన ఒక పెద్ద అబద్ధాలకోరన్న సంగతిని తెలుసుకుంటున్నారు” అని ఖాటూన్ తెలిపారు.

రూప మోడి దృష్టిలో మోడి బ్లాగ్ రాతలు ఒక రాజకీయ ఆట. ఒక పబ్లిసిటీ స్టంట్. తనకు బాధ కలిగిందని చెబితే ప్రధాని పదవి దక్కుతుందని మోడి ఆశిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. “ఇదంతా రాజకీయ ఆట. ఒక పబ్లిసిటీ స్టంట్… తనకు బాధ కలిగిందని చెబితే ప్రధాన మంత్రి పదవి దక్కించుకోగలనని భావిస్తున్నారు. కానీ అది జరగదు” అని ఆమె మోడిని శపించారు.

బాధితుల శాపనార్ధాలు వారికి సంతృప్తినివ్వగలవేమోగానీ అవి కోర్టులను కరిగించవు. మోడి పూనకంతో ఊగిపోతున్న మతోన్మాద మూకలను అసలే కదిలించవు. మోడి ప్రధాని అయితే తమకేదో ఒరుగుతుందని ఈ మూకలు ఆశిస్తున్నాయి. కానీ మాయా కొడ్నాని, బాబూ భజరంగి, డి.జి.వంజారా, డి.ఎల్.సింఘాల్ మొదలైన వారిని వాడుకుని వదిలేసినట్లే తమ పరిస్ధితి కూడా అవుతుందని ఈ మూకలకు ఇప్పుడప్పుడే తెలిసే పరిస్ధితి లేదు.

3 thoughts on “మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

  1. ఆరుషి కేసులో 26 ఇన్స్‌ డెన్స్‌ యిల్‌ సాక్ష్యాలను దృవికిరణ సాక్ష్యాలగా పరిగనించి ఆరుషి తల్లిదండ్రులకు శిక్షలు వేసిన కోర్టులు, సిట్‌ వారు గుజరాత్‌ విషయంలో ప్రత్యక్ష సాక్షులైన ఒక ప్రభుత్వ అధికారిది గానీ,రూపా మోడి ది గాని ఎందుకు పరిగనలోకి తీసుకోలెదు? మీరు నిన్న రాసిన పోష్టులో ఉన్నాట్లు మీడియా ప్రభావం తీర్పులు చెప్పే జడ్జీలమిద వున్నట్లైతే గుజరాత్‌ అల్లర్ల ను పెద్ద ఎత్తున ప్రచారం గావించన మీడియ ప్రభావం నరేంద్రమోడి కేసుల విషయం ఎందుకు లేవొ అర్ధంకావడంలేదు. మీడియా కంటే ఎక్కువగా నరేంద్ర మోడి న్యాయరంగాన్ని ప్రభావితం చేస్తున్నాడా? అవుననే జవాబు చెప్పుకోవలసి ఉంటుందేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s