ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ


Arvind_Keijriwal

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం రుజువు చేసుకోవడమే ఇక మిగిలింది.

“మా వద్ద అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవు. సమస్యలను వెంటనే పరిష్కరించడానికి మావద్ద మంత్ర దండం ఏమీ లేదు” అని కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ అన్నారని పత్రికలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గానీ, బి.జె.పి గానీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు గానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుల్లో చెప్పే మాటలు కావా ఇవి?

అయితే ఇన్నాళ్లూ అధికారం వెలగబెట్టిన ధనికవర్గ పార్టీల నేతలు ఈ మాటల్ని చెప్పడంలోనూ, నూతనంగా అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పడంలో తేడా ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ పై ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. తమ రోజువారీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు. వారి ఆశల్ని, కలల్ని ఆచరణాత్మకంగా ఎదుర్కొనే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం ఇదే మొదటిసారి. కాబట్టి పాత పార్టీల నేతల మాటలనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్పినంత మాత్రాన వీరూ వారే అనుకోవాల్సిన అగత్యం ఇప్పుడే లేదు. కానీ కోట్లాది కళ్ళు ఆ పార్టీ ప్రభుత్వాన్ని పహారా కాస్తున్నాయన్న సంగతిని వారు విస్మరించరాదు. ఇక నుండి వారు పలికే ప్రతి మాటా, వేసే ప్రతి అడుగూ, తీసుకునే ప్రతి చర్యా అత్యంత తీవ్ర స్ధాయిలో పరిశీలనకూ, పరీక్షకూ గురవుతాయని వారు గమనంలో ఉంచుకోవాలి.

ఒక విధంగా అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలు అర్ధం చేసుకోదగినవే. సమస్యలను వెంటనే పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదన్న మాట నిజమే. కానీ మంత్రదండం చేతబట్టి తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలేమీ అనుకోవడం లేదు. తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈ రోజు కాకపోతే రేపయినా పరిష్కారం అవుతుందన్నా నమ్మకం వారికి కలిగితే అందుకు ఎదురు చూడడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. 66 యేళ్ళు ఆగినవారు మరో ఆరు నెలలు, లేదా సంవత్సరం లేదా రెండు మూడేళ్లు ఆగలేరా? ఖచ్చితంగా ఆగుతారు.

కానీ అరవింద్ ప్రభుత్వం ఏ దిశలో నడుస్తున్నదీ తెలియడానికి నెల రోజులు చాలవా? పోనీ ఆరు నెలలు చాలవా? ఇంకా కావాలంటే రెండేళ్లు చాలవా? నెల రోజుల్లో తేలే అంశాలు కొన్ని ఉంటాయి. ఆరు నెలల్లో తేలే అంశాలు కొన్ని ఉంటాయి. సంవత్సరంలో, రెండు, మూడు, నాలుగు, ఐదు సంవత్సరాల్లో తేల్చాల్సినవి మరికొన్ని ఉంటాయి. కానీ అన్నం ఉడికిందని భావించడానికి నాలుగు మెతుకుల్ని పరీక్షించినట్లే ఎ.ఎ.పి పాలన ప్రజల దిశలోనే వెళ్తోందని భావించడానికి ఐదేళ్లు ఆగాల్సిన పనిలేదు. ఈ సంగతి అరవింద్ బృందం దృష్టిలో ఉండడం ఆవశ్యం.

“మావద్ద అన్ని సమస్యలకు పరిష్కారం లేవు” అన్న మాట మాత్రం ఆమోదించలేము. ఆ మాట చెప్పదలుచుకుంటే అది ఎన్నికల ముందే ఆయన చెప్పి ఉండాలి. ఏయే సమస్యలకు వారి వద్ద పరిష్కారాలు లేవో వారు చెప్పి ఉండాలి. నిజానికి పరిష్కారం లేని సమస్య, సమస్య కాజాలదు. సమస్య ఉందంటేనే దానికి ఏదో ఒక పరిష్కారం ఉందని అర్ధం. ఆ పరిష్కారం వెతకడంలో వివిధ వ్యక్తులు, బృందాలు, పార్టీలూ కనబరిచే చిత్త శుద్ధి, ప్రయత్నాలపైనే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నది తేలుతుంది తప్ప, ఫలానా సమస్యకు పరిష్కారం లేదు అన్నారంటే అందులో పైకి చెప్పని విషయం ఏదో ఉన్నట్లే. తమ పని తీరు అంతా తెరిచిన పుస్తకంలా ఉంటుందని చెబుతున్న ఎ.ఎ.పి నేతలు పరిష్కారం లేదు అనడానికి బదులు పరిష్కారం వెతుకుతాము అనగలిగితే వారు ప్రయత్నాలు చేస్తారని నమ్మగలం.

అధికారం చేతికి వచ్చింది గదాని అహంకారం తలకు ఎక్కించుకోవద్దని అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలకు సూచన ఇచ్చినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. పెద్ద పార్టీల అహంకారాన్ని నిర్మూలించడానికే తమ పార్టీ పుట్టిందనీ, తమకు ప్రత్యామ్నాయంగా మరో పార్టీ పుట్టాల్సిన అవసరం ఉండరాదని ఆయన చెప్పారని తెలుస్తోంది. ఇటువంటి ధోరణి నిస్సందేహంగా ఆహ్వానించదగినది.

ముందే చెప్పినట్లు మంత్రదండంతో తమ సమస్యల్ని పరిష్కరిస్తారని, మాయా దర్పణాలు తెచ్చి తమ అందమైన భవిష్యత్తును చూపిస్తారని, మాయా దీపాలను రుద్ది జీనిలను విముక్తి చేసి వారిచేత చందమామల్ని కిందికి దించుతారని ప్రజలు ఆశించరు. తాము సమస్యల పరిష్కర్తలమని, ప్రజలు సమస్యలు సృష్టికర్తలని పాలకులు భావించడంలోనే పరమ దోషం ఉన్నది. మానవ సమాజం ఏక శిలా సదృశం కాదు. ఏక శిలా సదృశమే అయితే దానిని సమాజం అనే అనకపోము. మానవ సమాజ పరిణామ క్రమంలో కొద్ది మంది ధనికవర్గంగా అవతరించి మానవ సమాజం నడకనే తమ గుప్పిట్లో పెట్టుకున్న ఫలితంగానే సామాజిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ధనిక వర్గాలు అనుభవిస్తున్న సౌకర్యాలను సహస్రాబ్దాల తరబడి శాశ్వతం చేసుకోవడానికే శ్రమ జీవులను అనేక మతాలుగా, కులాలుగా, ప్రాంతాలుగా విడదీసి వివక్షలను ఉనికిలోకి తెచ్చారు. ఈ సమస్యలకు మూలం ధనిక, తేడా విభజనలోనే ఉన్న సంగతి గమనించలేని ఏ రాజకీయ ప్రక్రియ అయినా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం కాక తప్పదు.

యుగాల తరబడి కొనసాగిన బానిస సమాజం, ఫ్యూడల్ సమాజం, పెట్టుబడిదారీ సమాజం ధనిక, పేద తేడాలకు కాపలా కాస్తూ వచ్చాయి. పెట్టుబడిదారీ సమాజం అగ్ర పీఠాన తిష్టవేసి ప్రపంచ ప్రజల తలరాతల్ని శాసిస్తున్న సామ్రాజ్యవాద ప్రభువులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఈ తేడాలు మరింత లోతుగా కొనసాగాలనీ, అలా కొనసాగాలంటే ప్రజల దృష్టి తమ ఆధిపత్యం మీదికి మరలకుండా ఉండడానికి కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో తన్నుకుని చావాలని కోరుకుంటారు. కోరుకోవడమే కాదు, అందుకు తగిన పరిస్ధితులను ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉన్నారు. సామాజిక సమస్యలకు మూలం అయిన ఇటువంటి తేడాల వ్యవస్ధను అంగుళం కూడా కదల్చకుండా సమస్యల్ని పరిష్కరిస్తామని చెబితే వారు తమ వద్ద మంత్రదండం ఉన్నదని చెప్పినట్లే లెక్క. సమస్యల మూలాలు చూడకుండా, అలా చూడడానికి నిరాకరిస్తూ ‘తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని’ చేతులు ఎత్తేసినా జనం మెచ్చరు.

ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పూనుకుంటే ఈ సామాజిక మూలాలకు తప్పనిసరిగా చేరుకుంటారు. అలా చేరుకున్ననాడు తామ నిజమైన ప్రజాస్వామిక వ్యవస్ధలో లేమనీ, తమకు కనిపిస్తున్నదంతా భ్రమాజనిత ప్రజాస్వామ్యమనీ, ఈ ప్రజాస్వామ్యంలో ధనిక వర్గాలు ఎక్కువ సమానమనీ గుర్తించక తప్పదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి అధికారంలోకి రావడం కాదనీ ప్రతి చివరి సామాన్యుడి పాత్ర వ్యవస్ధ నడకలో ఉండేలా చూడడమే అనీ ఏ.ఏ.పి పార్టీ నేతలు అర్ధం చేసుకోవాలి. అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటి వ్యవస్ధలో నిర్మించబూనుకుంటే చూస్తూ ఊరుకోని వర్గాలే సమాజాన్ని శాసిస్తున్నాయి. కాబట్టి ఏ.ఏ.పి పాలన నల్లేరు మీద నడక కాదు. అది కఠిన కంటక ప్రాయం. ముళ్ళ మీద నడిచే క్రమంలో ఏ.ఏ.పి విశ్వాసం తీసుకోదగ్గ ఏకైక వర్గం ప్రజలే. ప్రజల్ని వదిలి పెట్టుబడిదారుల్ని, భూస్వాముల్నీ, బ్యూరోక్రాట్ నిరంకుశ వర్గాలనూ ఆశ్రయిస్తే ఏ.ఏ.పి కూడా ‘ఆ తానులో ముక్కే’ అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చి తీరుతారు.

4 thoughts on “ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

  1. ఆమ్ ఆద్మికి చిత్తశుద్ధితో పాటు విత్త శుద్ధి కావాలి. సామాన్యుడి కోరికల సాఫల్యానికి రాయతీలుతో కాంగ్రెస్ చేతిలో రాయిని గాలిలోకి విసిరి ఎవరిమీద పడినా తమదగ్గరికే వస్తుందన్న ధీమాకు కేజ్రివాల్ గండికొట్టి గద్దె దక్కించుకున్నా ఎంతకాలం మాటలతో కాపలాకాస్తాడు? సింహాసనం అధిరోహించిన వ్యక్తి కనకం కావచ్చు కాని వివిధ పార్టీలు శునకాల్లా కాచుకుని మాంసపు ముక్కను కరచుకునే ప్రయత్నంలో ప్రజలను ఉసికొలిపి కొలువుకు యెసరుపెట్టే ప్రయత్నంలో నిత్యం నిమగ్నమయివుంటారు. రాజకీయానికి మోసం,దగా, ఆడినమాట తప్పడం, దోచుకోవడం, దాచుకోవడం, పంచప్రాణాలు. దెబ్బ గట్టిగా ఒకోసారి తగిలినా ఆ పంచ ప్రాణాలు ఆయుషునిచ్చి రాజకీయాన్ని నిలబెడతాయి కాని ఆమ్ఆద్మి రాజకీయం కేవలం ప్రజల ఊపిరినే ఆయుషుగా భావిస్తోంది. బొక్కసంలో విత్తం నిండుకునే మార్గం లేకుండా పరిపాలన చిత్తం ప్రజా సంస్కరణలకు లోబడి పాలించలేదు. ఉచిత విద్యుత్, కిలో బియ్యం, ధరల సంస్కరణల ఫలితాలు లాంటి ఇత్యాది ప్రభుత్వ పధకాలు పురిటిలోనే సంధికొట్టాయి. మద్యపాన నిషేధం విశేషాకర్షణ సామన్యుడికి సైతం కాలకూట విషంలా గోచరించి చివరకు ఓటు వినియోగకాలంలో అమృతంలా పరిణమించి ఒక్క చుక్క నోట్లో పోసుకుని ఐదు సంవత్సర చుక్కల కాలం ప్రభుత్వాలకు అమృతమయ జీవనాన్ని ప్రసాదిస్తున్నారు. కాంగ్రెస్ ఊతంతో ఏ ఇతర పార్టి ప్రభుత్వం పూర్తికాలం పాలనయోగం అనుభవించలేదు. పక్కలో బల్లెంతో కేజ్రివాలా తన పక్కకు తానే నిప్పంటిచుకునే తప్పుచేశాడా,లేదన్నది కాలమే నిర్ణయించాలి. తస్మాత్ జాగ్రత!

  2. పింగ్‌బ్యాక్: ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s