గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!


Narendra_Modi

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె సవాలును మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. తద్వారా సిట్ నిర్ణయాన్ని కోర్టు సమర్ధించ్చినట్లేనని సిట్ లాయర్ భాష్యం చెప్పారు.

కోర్టు తీర్పుతో తాను విముక్తుడిని అయినట్లు భావిస్తున్నానని మోడి తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. గుజరాత్ అల్లర్ల మరణాల బాధ్యతను తన ఇంటి వాకిట నిలిపినందుకు తాను మొదలంటా కదిలిపోయానని మోడి ఈ సందర్భంగా ప్రకటించారు. “అంతటి అమానుషత్వాన్ని చూడవలసివచ్చినందుకు తాను అనుభవించిన ఖాళీతనం (emptiness) ను వర్ణించడానికి, ‘దుఃఖం’, ‘విచారం’, ‘యాతన’, ‘బాధ’, ‘కష్టం’, ‘పరితాపం’, ‘ఆవేదన’… ఇలాంటి సాధారణ పదజాలం ఏదీ సరిపోదని మోడి చెప్పుకున్నారు.

“వ్యక్తిగత స్ధాయిలో నేను అనుభవించిన భయంకరమైన యాతనను ఈ పదజాలం ద్వారా నేను పంచుకోవడం ఇదే మొదటిసారి” అని కూడా మోడి అంగీకరించారు. గుజరాత్ అల్లర్ల పైన మోడి ఇంతవరకు విచారం ప్రకటించలేదనడానికి మోడి ఒప్పుకోలుకు మించిన సాక్ష్యం అవసరం లేదు. కాబట్టి మోడి భక్తాగ్రేసరులకు ఆ విషయంలో ఆయన్ను సమర్ధించే భారం తప్పిపోయింది. కానీ ఈ సంగతి ఎంతమంది మోడి సమర్ధకుల దృష్టిలో ఉన్నదీ అనుమానమే.

“దేశంలో అంతకుముందు జరిగిన అల్లర్లలో పోలిస్తే గుజరాత్ అలర్ల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగానూ, నిర్ణయాత్మకం గానూ స్పందించింది… ఈ దేశ అత్యున్నత న్యాయ స్ధానం పర్యవేక్షణలో మున్నేన్నడూ ఎరగని రీతిలో సాగిన స్క్రూటినీ ప్రక్రియకు నిన్నటి తీర్పుతో ముగింపు పలికినట్లయింది. గుజరాత్ ఎదుర్కొన్న 12 యేళ్ళ అగ్ని పరీక్ష అంతిమంగా ముగిసింది. నేను విముక్తి చెందినట్లుగా, శాంతి చేకూరినట్లుగా భావిస్తున్నాను” అని మోడి పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఈ తీర్పు తన వ్యక్తిగత గెలుపుగా చూడడం లేదనీ, తన మిత్రులను, ముఖ్యంగా వ్యతిరేకులను కూడా అలానే చూడాలని కోరుతున్నానని మోడి కోరుకున్నారు.

ఇప్పుడు తీర్పు ఇచ్చింది మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. ఈ తీర్పుపై హై కోర్టును ఆశ్రయించే అవకాశం జకియా జాఫ్రికి చట్ట రీత్యా ఉన్నది. అక్కడా న్యాయం జరగలేదని భావిస్తే ఆమె సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు. సుప్రీం కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరగలేదని భావిస్తే ఆ తీర్పును సమీక్షించాలని కోరే హక్కు కూడా ఆమెకు ఉన్నది. ఈ లోపే అంతిమ తీర్పు వచ్చేసిందని మోడి చెప్పడం ద్వారా ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్లు? ఈ తీర్పు అనంతరం సంబరాలు జరుపుకుంటున్న బి.జె.పి నాయకులు దేశానికి ఏ సందేశం ఇస్తున్నారు?

తాను 37 రోజుల పాటు సద్భావనకోసం నిరాహార దీక్ష నిర్వహించాననీ, సానుకూల తీర్పును నిర్మాణాత్మక చర్యలలోకి మార్చడానికి, సమైక్యత, సద్భావనలు సమాజానికి చేకూరాలని దీక్ష ప్రార్ధించానని మోడి చెప్పుకున్నారు? మూడు రోజుల సద్భావన దీక్ష గురించి ప్రచారం చేశారు కాబట్టి దాని గురించి తెలుసు. కానీ ఈ 37 రోజుల నిరాహార దీక్ష ఎప్పుడు జరిగింది? ఎవరికీ చెప్పకుండా అన్ని రోజులు మోడి నిరాహార దీక్ష చేశారా? ఈ దీక్ష పత్రికలకు ఎందుకు తెలియజేయలేదు?

“ఏ సమాజం లేదా రాష్ట్రం లేదా దేశం యొక్క భవిష్యత్తు అయినా కేవలం సమైక్యతలోనే ఉంటుందని నేను లోతుగా నమ్ముతున్నాను. ప్రగతి, సౌభాగ్యాలను నిర్మించగలిగేది కేవలం ఈ పునాది పైన మాత్రమే. కావున, అటువంటి సమైక్యతవైపుగా కృషి చేయడానికీ, ప్రతి ఒక్కరి మోములో చిరునవ్వులు పూయించడానికీ చేతులు కలపాల్సిందిగా ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను” అని నరేంద్ర మోడి పేర్కొన్నారు.

ఇంతకీ ఈ దుఃఖం, విచారం, యాతన, బాధ, కష్టం, పరితాపం, ఆవేదన… ఇలాంటివన్నీ నరేంద్ర మోడీకి కలగడానికి లేదా ఆ నాడే తనకివన్నీ కలిగాయని చెప్పడానికి 12 యేళ్ళ సమయం కావాలా? మతం పేరుతో కుత్తుకలు ఉత్తరించుకోవద్దనీ, కేవలం సమైక్యత పునాదుల మీదనే గుజరాత్ రాష్ట్ర ప్రగతి, సౌభాగ్యం నిర్మించగలమని ఈ నరేంద్ర మోడి ఫిబ్రవరి 28, 2002 తేదీనే చెప్పి ఉంటే వేలాది ప్రాణాలు అత్యంత అమానుష రీతిలో అర్పించబడి ఉండేవా? హిందూ మతం పేరు చెప్పుకున్న రాక్షస మూకల వికృత నెత్తుటి హేలకు వందలాది అమాయక స్త్రీలు, పిల్లల జీవితాలు బలై ఉండేవా? మాయా కొడ్నాని, బాబూ భజరంగి లాంటి పరమ హీన పాశవిక గుంపుల రక్త దాహానికి అమాయక జీవులు ఆహుతై ఉండేవారా?

గుజరాత్ అల్లర్లు తనను మొదలంటా కదిలించాయని చెబుతున్న మోడి ఇకనైనా సంజయ్ భట్ లాంటి పోలీసు అధికారుల పైన కక్ష సాధింపు చర్యలను నిలిపేస్తారా? డి.ఎల్.సింఘాల్ లాంటి అప్రూవర్లు వెల్లడి చేస్తున్న ‘మాధురి’ వాస్తవాలను మోడి అంగీకరిస్తారా? నరోదపాటియా పాడు పడిన బావిలో కుక్కిన శవాలను వెలికి తీసి వారి డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా ఎవరెవరు చనిపోయారో నిర్ధారించి వారి కుటుంబాలకు న్యాయం చేస్తారా? మాజీ గుజరాత్ డి.ఐ.జి డి.జి.వంజార చెప్పినట్లు మోడి పేరు మీద జరిగిన బూటకపు ఎన్ కౌంటర్లు గుజరాత్ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరిగాయాన్న నిజాన్ని మోడి అంగీకరిస్తారా?

ఇవేవీ చేయకుండా మెట్రోపాలిటన్ కోర్టు తీర్పును తనకేదో పెద్ద సర్టిఫికేట్ అయినట్లు మోడి, ఇతర బి.జె.పి నాయకులు పెడుతున్న ఫోజులన్నీ పూర్తిగా అర్ధరహితం. అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగడానికి సహకరించనంతవరకూ మోడీ చెబుతున్న సద్భావన ఒట్ఠి బూటకమే కాగలదు. ప్రధాన మంత్రి పదవి కోసం ప్రకటించే సద్భావనలు మోడి భక్తాగ్రేసరుల ఛాతీలు మరిన్ని అంగుళాలు వ్యాకోచించడానికి దోహదం చేయవచ్చు. మరిన్ని ఓట్లు కురిపిస్తే కురిపించవచ్చు. చివరికి ఆయన ప్రధాన మంత్రి పదవీ ప్రయాణానికి నిచ్చెన మెట్లను కూడా పరచవచ్చు. కానీ గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం మాత్రం చేకూర్చలేవు.

2 thoughts on “గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

  1. This Judgment from a lower court is not surprising. Some time back, in Best Bekary burning case, where 14 people were burnt alive, a Gujarath lower court acquitted all the accused, saying there is no evidence. But when the case was transferred to a higher court out side Gujarath, the same accused got convicted with life term imprisonments. Those chanting ‘Satyamev jayate’ should react in a same when the case comes to a higher court. But sure, they’ll try to project it as a political conspiracy then..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s