దేవయాని ఖోబ్రగదే అరెస్టు విషయం కొత్త మలుపు తిరిగింది. వియన్నా ఒప్పందం ప్రకారం కాన్సలార్ సిబ్బంది పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు కాదని కాబట్టి ఆమె అరెస్టు, తదనంతరం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చట్టబద్ధమే అని అమెరికా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని దేవయానిని న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా నియమించింది. ఈ హోదాలో ఆమె పూర్తి రాయబార రక్షణకు అర్హురాలు అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ అంశాన్ని అమెరికాతో చర్చిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించగా ఇండియా నుండి సమాచారం అందిందని అమెరికా తెలిపింది.
ఐరాస జనరల్ అసెంబ్లీ 68వ సెషన్ సమావేశాలు సెప్టెంబర్ 17న ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉన్నత స్ధాయి సమావేశాలు అక్టోబర్ మొదటివారంలో ముగిశాయి. ఈ సమావేశాలలో ఇతర సభ్య దేశాధినేతలతో పాటు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశాల నిమిత్తం న్యూయార్క్ లోని ఐరాస భారత శాశ్వత కార్యాలయానికి సలహాదారుగా దేవయానిని 26 ఆగస్టు 2013 తేదీన నియమించింది. ఈ పదవిలో ఆమె 31 డిసెంబర్ 2013 వరకు కొనసాగుతారు. ఐరాస సమావేశాలకు సంబంధించిన వియన్నా ఒప్పందం ప్రకారం వివిధ దేశాల ప్రభుత్వాలు నియమించే సలహాదారులకు పూర్తి స్ధాయి రాయబార రక్షణ ఉంటుంది.
జీ న్యూస్ ప్రకారం ‘ఐక్యరాజ్య సమితి సౌకర్యాలు రక్షణలపై సదస్సు’ ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందంలోని ఆర్టికల్ 4, సెక్షన్ 11ఎ ఇలా చెబుతోంది. “ఐరాస సభ్య దేశాలన్నింటి ప్రతినిధులు అన్నిరకాల రక్షణలకు అర్హులు. వ్యక్తిగత అరెస్టు నుండి లేదా నిర్బంధం నుండి మరియు వారి వ్యక్తిగత సరంజామాను స్వాధీనం చేసుకోవడం నుండి వారికి రక్షణ ఉంటుంది. ‘ప్రతినిధులు’ పరిధిలోకి డెలిగేట్లు, డిప్యూటీ డెలిగేట్లు, సలహాదారులు, సాంకేతిక నిపుణులు మరియు ప్రతినిధి బృంద కార్యదర్శిలు వస్తారు.”

సంగీతా రిచర్డ్స్, ఫిలిప్ రిచర్డ్స్ దంపతులు
“కావున డిసెంబర్ 12, 2013 తేదీన దేవయాని అరెస్టు ఆమె హోదాకు విరుద్ధం” అని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని పత్రికలు తెలిపాయి. దేవయాని అరెస్టు నాటికే పూర్తిస్ధాయి రాయబార రక్షణలను కలిగి ఉన్నందున ఆమెను అరెస్టు చేయడం, బట్టలు విప్పించి తనిఖీ చేయడం, కేవిటి సర్చ్ కు పాల్పడడం… మొదలైన చర్యల ద్వారా అమెరికా వియన్నా సదస్సు ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
క్రిస్టమస్ సెలవుల్లో ఉన్నందున అమెరికా ప్రభుత్వం ఈ అంశాన్ని శుక్రవారం చేపడుతుందని ది హిందు తెలిపింది. దొరికిందే అవకాశం అన్నట్లుగా దేశీయ చట్టాలను అడ్డం పెట్టుకుని అత్యుత్సాహంతో అంతర్జాతీయ చట్టాలను అడ్డంగా ఉల్లంఘించిన అమెరికా ఇప్పుడు ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.
ఎన్.డి.టి.వి ప్రకారం అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ విషయమై స్పందించారు. “ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు భారత ప్రభుత్వం తరపున హాజరయిన ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా దేవయానిని ఐరాసకు నోటిఫై చేసినట్లు భారత ప్రభుత్వం మాకు

Marie Harf
సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం మేము ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాము” అని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పారని ఎన్.డి.టి.వి తెలిపింది.
భారత ప్రభుత్వం సూచన మేరకు దేవయానికి ఐరాస అక్రెడిషన్ జారీ చేసింది. ఇది 26 ఆగస్టు నుండి అమలులోకి వచ్చింది. 31 డిసెంబర్ 2013 వరకు అమలులో ఉంటుంది. ఈ సంవత్సరం ఐరాస సమావేశాలకు భారత ప్రధాని హాజరు కావడం వలన ఈ సమావేశాలకు ఇండియా ప్రాముఖ్యతను ఆపాదించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను ప్రధాని కలిశారు. ఈ దృష్ట్యా భారత విదేశాంగ శాఖ సిబ్బంది అనేకమంది ఐరాస అక్రెడిషన్ కోసం దరఖాస్తు చేయాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు దేవయాని కూడా దరఖాస్తు చేయడం, సలహాదారు హోదాను ఐరాస దేవయానికి కట్టబెట్టడం జరిగింది.
ఈ అంశం అమెరికా దృష్టిలో లేకపోవడం ఒక విషయం కాగా భారత ప్రభుత్వ అధికారులకు కూడా ఇంతవరకు తట్టకపోవడం ఒక వింత. ఐరాస కార్యకలాపాలు ఎంత మొక్కుబడిగా జరుగుతాయో ఈ అంశం తెలియజేస్తోంది. ఈసారి సమావేశాలకు భారత ప్రభుత్వమే ప్రాముఖ్యత ఆపాదించినప్పటికీ వాస్తవంలో ప్రాముఖ్యత ఇవ్వలేదని అర్ధం అవుతోంది.
పింగ్బ్యాక్: కొత్త మలుపు: అరెస్టు నాటికి పూర్తి రక్షణకు దేవయాని అర్హురాలే | ugiridharaprasad