మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ


నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.

యువతిపై అక్రమ గూఢచర్యానికి పాల్పడమంటూ అమిత్ షా చేత పురమాయించబడిన పోలీసు అత్యున్నత అధికారి అప్పటి సంభాషణలన్నింటినీ వందలాది టేపుల రూపంలో సి.బి.ఐ కి అప్పజెప్పడంతో నిందితులు మరియు బాధితురాలి తండ్రి చెబుతున్న కుంటి సాకుల బండారం బట్టబయలవుతోంది. గుజరాత్ యువతిపై అమిత్ షా చేయించిన అక్రమ గూఢచర్యం పై విచారణ జరిపించడానికి ఈ రోజు కేంద్ర కేబినెట్ నిర్ణయించడంతో మోడి ప్రధాని మంత్రిత్వం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. కాగా కేంద్రం నిర్ణయానికి రాజకీయ రంగు పులమడానికి బి.జె.పి ప్రయత్నిస్తోంది.

కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం, సెక్షన్ 3 కింద గుజరాత్ ప్రభుత్వం సాగించిన అక్రమ గూఢచర్యంపై విచారణ చేయడానికి కమిషన్ ను నియమించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కమిషన్ కు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. 3 నెలల్లో ఈ కమిషన్ నివేదిక ఇవ్వాలని కేబినెట్ ఆదేశిస్తుంది. అంటే 2014 ఎన్నికలకు ముందే మోడి గాలిని తుస్సుమానిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది కాబోలు! కాంగ్రెస్-బి.జె.పి రాజకీయ శతృత్వం ఎలా ఉన్నా ఒక అమాయక యువతి పైనా, ఆమె కుటుంబ సభ్యుల పైనా, చివరికి ఆమెకు కాబోయే భర్త, ఇతర పరిచయస్తులపైనా కూడా ఫోన్ మరియు భౌతిక గూఢచర్యానికి పాల్పడడం అత్యంత అమానుషం. ప్రజలు అప్పగించిన అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక కుటుంబాన్ని బజారుకీడ్చే విధంగా ఉపయోగించడం తీవ్రంగా ఖండనార్హం. కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు చేసినంత మాత్రాన ఈ నేరాన్ని కప్పి పుచ్చడం పూర్తిగా అవాంఛనీయం.

ఒక యువతి విషయంలో తనపైన కక్ష కట్టిన గుజరాత్ ముఖ్యమంత్రి తనపైన అక్రమంగా అవినీతి కధలు అల్లి సస్పెండ్ చేశారనీ, తనను గుజరాత్ ముఖ్యమంత్రి వేధిస్తున్నారనీ, తనను కాపాడాలనీ గుజరాత్ రాష్ట్ర సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రదీప్ శర్మ రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. ప్రదీప్ శర్మ ప్రస్తావించిన యువతి 2009లో ‘సాహెబ్’ ఆదేశాల మేరకు అమిత్ షా గూఢచర్యం చేయించిన యువతి ఇరువురూ ఒకరే అని మంగళవారం తాము వెల్లడి చేసిన మరిన్ని ఆడియో టేపుల ద్వారా స్పష్టం అయిందని గులాయిల్ వెబ్ పోర్టల్ చెప్పడం గమనార్హం.

‘స్నూప్ గేట్’ గా ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యవహారాన్ని కోబ్రా పోస్ట్, గులాయిల్ లు రెండు నెలల క్రితమే వెలుగులోకి తెచ్చాయి. సరిగ్గా తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారం వెలుగులోకి రావడానికి కాస్త ముందు కాలంలోనే గుజరాత్ స్నూపింగ్ వ్యవహారం కూడా వార్తలకెక్కింది. గుజరాత్ పోలీసు అధికారి జి.ఎల్.సింఘాల్ ఈ సంవత్సరం ఆరంభంలో సి.బి.ఐకి అప్పజెప్పిన 250కి పైగా ఆడియో టేపులు కోబ్రా, గులాయిల్ లకు కూడా చిక్కడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

గుజరాత్ హోమ్ మంత్రి అమిత్ షా, అప్పటి యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏ.టి.ఎస్) ఎస్.పి జి.ఎల్.సింఘాల్ ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు ఈ ఆడియో టేపుల్లో ఉన్నాయి. యువ ఆర్కిటెక్ట్ అయిన మాధురి (అసలు పేరు కాదు. కోబ్రా పోస్ట్, గులాయిల్ లు ఈ పేరుతో ఆమెను ప్రస్తావిస్తున్నాయి) ఎక్కడెక్కడికి వెళుతున్నది, ఎవరితో మాట్లాడుతున్నదీ తదితర సమస్త వివరాలు తెలుసుకోవాలని సాహెబ్ ఆదేశించడం, ఆ ఆదేశాల మేరకు హోమ్ మంత్రి అమిత్ షా ఏ.టి.ఎస్ ఎస్.పి కి పురమాయించడం, అనంతరం ఈ విషయంలో ఒక నెల రోజుల పాటు జరిగిన టెలిఫోన్ సంభాషణలు ఈ ఆడియో టేపుల్లో రికార్డు అయ్యాయి. ఏ.టి.ఎస్ ఎస్.పి జి.ఎల్ సింఘాల్ స్వయంగా సంబాషణలను రికార్డు చేశారు. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆయన ఇలా రికార్డు చేశారో తెలియదు.

ఆడియో టేపుల్లో మాధురిపై అక్రమ గూఢచర్యం చేసిన వ్యవహారంతో పాటు, టెర్రరిస్టుల పేరుతో అనేకమందిని గుజరాత్ పోలీసు ఉన్నతాధికారులు బూటకపు ఎన్ కౌంటర్లలో చంపిన వ్యవహారానికి సంబంధించిన సమాచారం కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బూటకపు ఎన్ కౌంటర్ల కేసుల్లో అప్పటికి డి.ఐ.జి డి.జి.వంజార తదితర పోలీసు ఉన్నతాధికారులు విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్నారు. కొందరు బెయిల్ పై విడుదలయ్యారు. హోమ్ మంత్రి అమిత్ షా కూడా బూటకపు ఎన్ కౌంటర్ల కేసులోనే కొన్ని నెలలు జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్ పై విడుదలయిన అమిత్ షా, మోడి ఆదేశాల మేరకు 2014 ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్ బి.జె.పి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆడియో టేపులు మొదటి విడత గులాయిల్ ద్వారా బైటపడినపుడు బి.జె.పి నాయకులు వివిధ రకాల సమర్ధనలు వినిపించారు. గుజరాత్ ప్రభుత్వం అక్రమ గూఢచర్యంపై విచారణ చేయడానికి ద్వి సభ్య కమిషన్ వేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేయాలని అనేకమంది డిమాండ్ చేశారు. వారిలో సహజంగానే కాంగ్రెస్ నేతలూ ఉన్నారు. ఈ డిమాండ్ ను బి.జె.పి తోసిపుచ్చింది. ఇది రాష్ట్ర అంతర్గత వ్యవహారం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి విచారణ చేసే అధికారం లేదని వాదించింది. కేంద్రం విచారణకు ఆదేశిస్తే రాష్ట్రాల అధికారాల్లోకి అక్రమంగా చొరబడడమే అని వాదించింది. ఒక యువతి ప్రైవేటు జీవితంలోకి అక్రమంగా చొరబడడానికి రాష్ట్ర ప్రభుత్వం హక్కు ఉన్నదా అన్న విషయంపై మాత్రం వారేమీ చెప్పలేదు. ఒకవైపు తరుణ్ తేజ్ పాల్ పై కేసులు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తూ గుజరాత్ వ్యవహారంపై మాత్రం ‘మీకేం పని?’ అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

పైగా యువతి రక్షణ కోసమే ఏ.టి.ఎస్ పోలీసులు గూఢచర్యం చేశారని బి.జె.పి వాదించింది. తద్వారా ఆడియో టేపుల్లో అమిత్ షా, పోలీసు అధికారులు చెప్పిన ‘సాహెబ్’ అంటే నరేంద్ర మోడియే అని వారు నిర్ధారించారు. యువతికి రక్షణ ఎందుకు కల్పించాల్సి వచ్చిందో బి.జె.పి నేతల వద్ద సరైన సమాధానం రాలేదు. ఆమె జీవితానికి భయం (threat) ఉన్నదనీ అందుకే రక్షణ కల్పించారని చెప్పారు. అందుకు సమర్ధనగా మాధురి తండ్రిని కూడా రంగంలోకి దించారు. తమ కూతురుకి రక్షణ కల్పించాల్సిందిగా తానే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశానని మాధురి తండ్రి ప్రకటించారు. రక్షణ కోరాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆయనా చెప్పలేదు. ఇవేమీ తెలియని మాధురి మాత్రం తన మానాన తాను తన పనులు చేసుకుంటూ పోయారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అసలు మాధురి ఎవరో తెలియదని ఏదో ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె భాగస్వామ్యం వహిస్తున్నారని తెలుసు తప్ప వ్యక్తిగతంగా ఆమెను ఎన్నడూ చూడలేదని బి.జె.పి నాయకులు చెప్పారు. మాధురి తండ్రి ప్రేమ్ లాల్ సోనీ మాత్రమే మోడీకి తెలుసని చెప్పారు. కానీ డిసెంబర్ 24 తేదీన గులాయిల్, కోబ్రా పోస్ట్ పోర్టల్స్ మరిన్ని ఆడియో టేపులను తమ వెబ్ పోర్టల్స్ లో ప్రచురించడంతో అది ఒట్టి అబద్ధమని తేలింది. నరేంద్ర మోడి స్వయంగా మాధురితో మాట్లాడుతుండగా తీసిన ఫోటోలను కూడా గులాయిల్ ప్రచురించింది. ఈ ఫోటోలో మాధురి మొఖం కనపడకుండా పోర్టల్ జాగ్రత్త పాటించింది. ఆ ఫోటోలను కింద చూడవచ్చు.

 

ఈ ఫోటోలు అక్టోబర్ 2005 నాటివి. కచ్ జిల్లాలో శరద్ ఉత్సవ్ జరిగిన సందర్భంగా మోడి అక్కడ హాజరయ్యారు. గుజరాత్ ప్రభుత్వం నుండి అక్రమ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ.ఏ.ఎస్ అధికారి ప్రదీప్ శర్మ కూడా ఈ ఫొటోల్లో ఉన్నారు. ఈ ఫోటోల ద్వారా 2009 నుండి మాత్రమే కాకుండా 2005 నుండే మోడీకి మాధురి తెలుసని నిర్ద్వంద్వంగా రుజువయింది. అంటే మాధురి కదలికలపై అక్రమ నిఘా వేయమని 2009లో ఆదేశించడానికి నాలుగైదు సంవత్సరాల ముందే మాధురి, మోడిల మధ్య పరిచయం ఉన్నది. 2003 నుండి 2005 వరకు కచ్ జిల్లా కలెక్టర్ గా ప్రదీప్ శర్మ పని చేసిన విషయం ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలి.

ఐ.ఏ.ఎస్ అధికారి ప్రదీప్ శర్మ మే 2011లో సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఇలా పేర్కొన్నారు. “కచ్ జిల్లాలో హిల్ గార్డెన్ ను ప్రారంభించానికి ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడి కచ్ సందర్శించారు. ఈ సమయంలోనే మిస్ సోని ముఖ్యమంత్రికి పరిచయం అయ్యారు. శ్రీ మోడి ఇంకా ఏమన్నా సూచనలు ఉంటే తనకు ఈ మెయిల్ చేయాలని ఆహ్వానిస్తూ తన వ్యక్తిగత ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. తదనంతరం హిల్ గార్డెన్ ను సందర్శించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మిస్ సోనీ శ్రీ మోడి గారికి రాశారు. అక్టోబర్ 2005లో జరిగిన శరద్ ఉత్సవ్ వరకు ఇరువురి మధ్యా ఈ మెయిల్స్ నడిచాయి. తాను బెంగుళూరుకు తిరిగి వెళ్లడానికి నిర్ణయించుకున్నానని మిస్ సోనీ పిటిషనర్ (ప్రదీప్ శర్మ) కు తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన సంభాషణ గురించి కూడా తెలిపారు. ఈ సమయంలో మిస్ సోనీ తాను ఈవెంట్ (ఉత్సవ్) లో పాల్గొంటానని కోరుతూ కలెక్టరేట్ ను కోరారు. అతిధులను ఆహ్వానించే బాధ్యత ఆమెకు అప్పగించబడింది. ఆమె సేవలకు ప్రతిఫలంగా తగిన మొత్తం కూడా ఏర్పాటు చేయబడింది. అదే సమయంలో మిస్ సోనీ, శ్రీ మోడి లు పరస్పరం పాఠ్య సందేశాలు (SMS) పంపుకోవడం మొదలు పెట్టారు. ఆ సందేశాలను కూడా ఆమె పిటిషనర్ కు ఆమె కమ్యూనికేట్ చేశారు. తాను ముఖ్యమంత్రిని కలవనున్నట్లు ఆమె తెలిపారు. ఆమె తన స్ధాయి దాటి అతిక్రమిస్తున్నారేమోనన్న దృష్టితో, ఆమె క్లయిమ్ లను అనుమానిస్తూ పిటిషనర్ ఈ విషయం ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో మాట్లాడాలని సూచించారు. ఆ తర్వాత రోజు శరత్ ఉత్సవ్ దినాన ఉదయం 7 గంటల ప్రాంతంలో పిటిషనర్ శ్రీ మోడి సమక్షంలో ఉండగా మిస్ సోనీ అక్కడికి వచ్చారు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణను బట్టి వారు వ్యక్తిగతంగా పాఠ్య సందేశాలు, ఈ మెయిళ్ళు, మరియు/లేదా ప్రత్యక్ష సంభాషణలు జరుపుతున్నారని అర్ధం అయింది.”

గులాయిల్ ప్రకారం మూడు రోజుల శరద్ ఉత్సవ్ ను ప్రారంభించడానికి అక్టోబర్ 2005 మొదటివారంలో మోడి అహ్మదాబాద్ నుండి భుజ్ వచ్చారు. ఇది టూరిజంను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించినది. ఈ ఉత్సవ్ కోసం ఎడారి మధ్యలో ప్రత్యేక గుడారాలు నిర్మించారు. ఒక గుడారంలో ఒక రాత్రి మోడి బస చేశారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆయన వెళ్ళిపోయారు. అలా వెళ్లడానికి ముందు మోడి మిస్ సోనీని కలిశారు. ఈ విషయంలో మరిన్ని వివరాల కోసం ప్రదీప్ శర్మను గులాయిల్ సంప్రదించింది. అంతకుముందు రోజు తనను మోడి ఉదయం కలవమన్నారని మిస్ సోనీ చెప్పారని, కానీ భద్రత అధికారులు ఆమెను అనుమతించరని భావించానని ప్రదీప్ శర్మ తెలిపారు. తాను ఆమెను ‘మీరు బెంగుళూరు వెళ్తానన్నారు కదా, ఏమయింది?’ అని అడిగానని  తెలిపారు. ఆ రాత్రి మాధురి కూడా ఒక గుడారంలో ఉన్నారని ప్రదీప్ శర్మ గులాయిల్ కు తెలిపారు.

దీనిని బట్టి మాధురిని మోడి ఎన్నడూ కలవలేదన్న బి.జె.పి వాదన అబద్ధం అని తేలుతోంది. శరద్ ఉత్సవ్ లో ఆతిధ్య సమన్వయకర్త (guest coordinator) గా పని చేసిన మాధురిని మోడి ప్రదీప్ శర్మ సమక్షంలో కలిశారని స్పష్టం అవుతోంది. ప్రదీప్ శర్మ అఫిడవిట్ పై విచారణ పూర్తి కానందున దాన్ని పక్కన పెట్టినా ఫోటోలను పక్కన పెట్టలేము.

అసలు మాధురి పైన నిఘా పెట్టాల్సిన అవసరం ‘సాహెబ్’ కు ఎందుకు వచ్చింది? ఆమె ప్రతి కదలిక పైనా గుజరాత్ పోలీసులు ఎందుకు నిఘా పెట్టారు.  తాము నిఘా పెట్టడమే కాకుండా ఆమె బెంగుళూరు వెళ్ళినపుడు కూడా నిఘా పెట్టాలని కర్ణాటక పోలీసులను ఎందుకు కోరారు? గులాయిల్ ప్రకారం ‘సాహెబ్’ కు మాధురిని మోహించారు. కానీ ఆమె తన జీవితం ఏదో తాను గడుపుతున్నారు. ఒక వ్యక్తిని పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. దీనిని ‘సాహెబ్’ సహించలేకపోయారు. ఎంతగా అంటే మాధురి ఫియాన్సీని కూడా ఏదో వంకతో జైల్లో పెట్టాలని ఆదేశించేంతగా. డి.జి.వంజార ఎంతకాలం జైలులో ఉన్నారో అంతకాలం మాధురి వుడ్ బి ని జైల్లో పెట్టాలని అమిత్ షా ఒక దశలో ఆదేశించారని గులాయిల్ తెలిపింది. దానికి సంబంధించిన ఆడియో టేపులను సైతం గులాయిల్ పబ్లిష్ చేసింది.

బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లోనూ, మాధురి స్నూప్ గెట్ వ్యవహారంలోనూ గుజరాత్ ఐ.పి.ఎస్ అధికారి, ఏ.టి.ఎస్ ఎస్.పి జి.ఎల్. సింఘాల్ నిందితుడు. కానీ ఆయన అప్రూవర్ తరహాలో నిజాలన్నింటినీ సాక్ష్యాలతో సహా బైటపెట్టారు. ఆయనను చట్టబద్ధంగా అప్రూవర్ గా గుర్తించినట్లు ఎక్కడా సూచనలు లేవు. పత్రికల నుండి అటువంటి సమాచారం ఏదీ లేదు. అసలు ఆయన టెలిఫోన్ సంభాషణలను ఎందుకు రికార్డ్ చేశారో తెలియదు. బహుశా తనను తాను చట్టం నుండి కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ పని చేసి ఉండవచ్చని ఊహించడమే ఇప్పటి వరకూ ఎవరైనా చేయగలిగేది.

మాధురి పైన నిఘా పెట్టడంలో గుజరాత్ పోలీసులు చాలా ఘోరంగా వ్యవహరించారని ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడికి పోలీసులు రహస్యంగా వెళ్ళేవారు. జి.ఎల్.సింఘాల్ బృందం సరిగ్గా నిఘా పెట్టలేకపోతున్నారని అమిత్ షా తరచుగా సింఘాల్ ను ఆక్షేపించేవారు. ‘సాహెబ్’ సొంతగా ప్రైవేటు నిఘా బృందాన్ని ఏర్పరుచుకున్నారని, వారి ద్వారా ఎప్పటికప్పుడు మాధురికి సంబంధించిన అన్నీ విషయాలు ఆయన తెలుసుకుంటున్నారనీ, మనమే వెనకబడి ఉన్నామని అమిత్ షా తరచుగా సింఘాల్ ను ఆక్షేపించారు. సొంత ప్రైవేటు నిఘా కూడా పెట్టేంతగా ఒక అత్యున్నత స్ధాయి ప్రజా ప్రతినిధి దిగజారడం అంటే…. ఎంత ధౌర్భాగ్యం? ఇలాంటి వ్యక్తుల చేతుల్లోనా రాష్ట్రాలు, దేశాలు నడుస్తోంది?

మాధురి సోనీ కర్ణాటకలో ఉన్నపుడు కూడా ఆమెపై నిఘా వేయడానికి గుజరాత్ పోలీసులు ప్రయత్నించారని రెండో విడత గులాయిల్ బైట పెట్టిన టేపుల ద్వారా తెలుస్తోంది. గుజరాత్ పోలీసుల కోరికను కర్ణాటక ప్రభుత్వం ఒకసారి తిరస్కరించిందని టేపుల ద్వారా తెలుస్తోంది. పౌరుల టెలిఫోన్ సంభాషణలను ట్యాప్ చేయాలంటే కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి గానీ, రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి గానీ అనుమతి ఇవ్వాలని గులాయిల్ తెలిపింది. కానీ గుజరాత్ పోలీసులు మాత్రం ఈ నిబంధనను ఏ మాత్రం ఖాతరు చేయలేదని జూనియర్ స్ధాయి పోలీసు అధికారులే నేరుగా ప్రైవేటు సెల్ ఫోన్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చి నిఘా పెట్టేరని తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది ఒక సందర్భంలో. ఇతర సందర్భాల్లో వారు అంగీకరించారా అన్నది తెలియలేదు. కానీ సాహెబ్ స్వయంగా ఒక ప్రైవేటు నిఘా బృందాన్ని ఏర్పరచుకున్నారని, ఆ బృందం బెంగుళూరు కూడా వెళ్లిందని ఆడియో టేపుల ద్వారా తెలుస్తున్నది.

కాబట్టి ఇది ఇక ఎంత మాత్రం గుజరాత్ కు మాత్రమే పరిమితం అయిన కేసు కాదు. కర్ణాటకకు కూడా విస్తరించిన కేసు. కాబట్టి కేంద్ర విచారణ పరిధిలోకి వచ్చినట్లే. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ లలో ప్రభుత్వ అనుమతి లేకుండా జరిగిన నిఘా కార్యకలాపాలను విచారించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బి.జె.పి విమర్శించింది. తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిని వారు సమర్ధించుకోవచ్చు గానీ నేరాన్ని ఎలా సమర్ధించగలరు? ఒక అమాయక యువతి పట్ల ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే వ్యవహరించిన అమానుష తీరులో దోషులను శిక్షించాలని ఆ పార్టీ కోరవద్దా?

గులాయిల్ పత్రిక గుజరాత్ స్నూప్ గెట్ కు సంబంధించి ఇంకా అనేక అంశాలను తెలిపింది. ఓపిక ఉన్నవారు కింది వీడియో ద్వారా వాటిని తెలుసుకోవచ్చు.

 

 

4 thoughts on “మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

  1. కామ్రెడ్.. వార్తాను వార్తాలా రాయి అంతే కాని … పిచ్చి పిచ్చి రాతలు రాయకు ఇది…నీ విలువను దిగజార్చుతుంది…కామ్రెడ్ అర్థం చేసుకో… మనిషిలా మారు… నీ సమాదానం మార్పులో చూద్దామని అనుకుంటున్నా… కామ్రెడ్… అభిప్రాయం వ్యక్తిగతం…రాసే రాత నిలిచి ఉంటుంది… కాబట్టి జాగ్రత్తగా రాయి కామ్రెడ్…

  2. సంజయ్

    పిచ్చి పిచ్చి పనులు చేసేవారికి మీ నీతులు చెప్పాలి. నాక్కాదు. మీ నాయకుడ్ని మనిషిలా మారమని చెప్పండి. మనిషిలా ప్రవర్తించలేని వారిని వెనకేసుకొస్తూ మీరూ అలానే వ్యవహరిస్తున్నట్లున్నారు. మీ అభిమానాన్ని అడవిగాచిన వెన్నెల చేస్తూ, నా మీద ఉక్రోషపడి ఏమి లాభం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s