ఎడారి అంటే మనకి చులకన. అక్కడ ఏమీ పండదనీ, ఇసుక తప్ప మరేమీ కనపడదనీ, అక్కడ మనుషులు బ్రతకడం దుర్లభం అనీను. ఇవన్నీ కొంతవరకు నిజమే అయినా ఎడారి దేశాల్లోనూ నాగరికతలు విలసిల్లిన వాస్తవాన్ని చరిత్ర రికార్డు చేసింది. నీరు దొరకని ఎడారుల్లో ప్రయాణించడానికి ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ‘ఎడారి ఓడ.’ ఒయాసిస్సులు ఎడారి దేశాలకు ఆభరణాలై వర్ధిల్లగా నాగరికతలు మాత్రం ఎందుకు వర్ధిల్లవు?
ఈ ఫోటోలు ఈజిప్టు ఎడారి సహారాకు చెందినవి. పశ్చిమ ఈజిప్టులో విస్తరించిన సహారా ఎడారి పచ్చదనం లేకున్నా ఎన్నో సుందర దృశ్యాలకు నిలయం అని ఈ ఫోటోలు రుజువు చేస్తున్నాయి. క్వింటిన్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయన తన ఫోటోలకు కాపీ రైట్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదుగావాల్ను, వాటర్ మార్క్ లేని ఫోటోలు దొరకలేదు.
క్వింటిన్ తన ఫోటోలను భారీ మొత్తాలకు అమ్ముకుంటున్నారని ఆయన వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. ఒక్కో ఫోటో 60 సెం. మీ X 40 సెం. మీ సైజువి ఒక్కొక్కటి 195 బ్రిటిష్ పౌండ్లు అని తన వెబ్ సైట్ లో ప్రకటించారు. అంటే ఒక్కొక్క ఫోటో దాదాపు 19,000 రూపాయలు అన్నట్లు! ఇంత ధర పెట్టి ఈ ఫోటోలు కొనే మహానుభావులు ఎవరో గానీ వారి కళా తృష్ణ ఖరీదు ఎన్నదగినదే.
తరిచి చూస్తే ఎడారికి ఇన్ని సహజ సిద్ధ అందాలు సమకూర్చింది ఇసుక, వెలుతురు, గాలి అని అర్ధం అవుతోంది. ఎన్ని ఎడారి తుఫానులు ఆ పుట్టగొడుగుల్లాంటి రాతి నిర్మాణాలను చెక్కి ఉంటాయి. ఎన్ని బిలియన్ల వేడి రాత్రులు పగళ్ళు ఈ ఎడారి రేణువులను సృష్టించి ఉండాలి! సూర్యుడి వెలుతురు, ఆ వెన్నంటిన నేడా లేకపోతే ఆ ఇసుక కుప్పలకు అంత అందం ఎక్కడిది?
క్వింటిన్ కాకుండా మిగిలిన ఫోటోలను మటాడార్ నెట్ వర్క్ (Matador network) వాళ్ళు ప్రచురించారు. స్వతంత్ర మీడియా కంపెనీగా తమను తాము చెప్పుకున్న ఈ నెట్ వర్క్ వాళ్ళు ట్రావెల్ ఏజన్సీ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రావెల్ పబ్లిషర్ అని కూడా చెప్పుకున్నారు. వీళ్ళు మాత్రం ఉచితంగానే ఫోటోలు అందించారు.
ఈజిప్శియన్ సహారా ఎడారి అందాలు చూడండిక!