అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా తదితర అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు. చీపురు చేతబట్టి రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆప్ కు ఢిల్లీ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేశారు. 8 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరో విధంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది.
చీపురు ఊడ్చిన చెత్త ఎక్కడికి చేరుతుంది? చెత్త బుట్టకి చేరుతుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ చీపురు ఊడ్చి పారేసిన చెత్తగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల చరిత్ర ఏర్పాటు చేసుకున్న చెత్త బుట్టలోకి చేరింది. అలాంటి కాంగ్రెస్ తో నిండిన చెత్త బుట్టే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, తన ముఖ్యమంత్రి సీటుగా మార్చుకున్నారని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఎంత అద్భుతమైన పోలికో కదా!
ఇది ఒక కోణంలో తెగడ్త, మరో కోణంలో పొగడ్త. ఏ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా అయితే ఆప్ పోరాటం చేసి, ఎండగట్టి రెండో అతి పెద్ద పార్టీకి అవతరించిందో అదే పార్టీ మద్దతుతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్న విమర్శ ఇందులో ఉన్నది. ఇది తెగడ్త. ఏ కొత్త పార్టీ అయితే తనను నిలువెత్తు లోతు గోతిలో పాతి పెట్టిందో అదే పార్టీకి బేషరతు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి సీటుగా మారాల్సిన పరిస్ధితి కాంగ్రెస్ కు ఆ;ప కల్పించిందన్న సూచన కూడా ఇందులో ఉన్నది. ఇది పొగడ్త.
కానీ ప్రజలకు ఆప్ ఇస్తున్న సందేశం ఏమిటి? ఎన్నికల ప్రచారంలో పచ్చి అవినీతి పార్టీగా తిట్టిపోసిన కాంగ్రెస్ తో కూడా రాజకీయంగా జంట కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న సందేశం ఆప్ ఇవ్వడం లేదా? తన షరతుల మేరకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామనీ, తమ మేనిఫెస్టోను మాత్రమే తమ ప్రభుత్వం అమలు చేస్తుందనీ, ఒకవేళ దానికి కాంగ్రెస్ అడ్డు పడితే ప్రభుత్వాన్ని త్యాగం చేయడానికి తాము సిద్ధమేనని ఆప్ చెబుతోంది. దానిని ఆప్ అక్షరాలా పాటించగలిగితే భేషైన వ్యూహమే.
కానీ కాంగ్రెస్ అంత తేలికగా బుట్టలో పడుతుందా? ఈ చెత్త బుట్టే తిరగబడి అరవింద్ ను తనలోకి లాక్కోకుండా ఉంటుందా? తనలోకి లాక్కోవడం అంటే అరవింద్ కాంగ్రెస్ లో చేరుతారని కాదు. అరవింద్ చెత్త బుట్టలోకి వెళ్తారని. అప్పుడే తీర్పు ఇచ్చేయడం అన్యాయమే అవుతుంది. చూద్దాం! అరవింద్, ఆప్ తమ మాటలకు ఎంతవరకు కట్టుబడి ఉంటారో! అధికారం రుచి మరిగిన ఆప్ నాయకులు తమ ఎత్తులకు లొంగకుండా ఉంటారా అన్న కాంగ్రెస్ ఆశలను ఎలా నిరాశగా మార్చగలరో చూడవలసిందే.
అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల్లో ఎక్కువ మంది బిజెపి మద్దతుదారులు. మన్మోహన్ సింగ్ కంటే నరేంద్ర మోదీ గ్లోబలైజేషన్ విధానాలని పక్కాగా అమలు చేస్తాడని వాళ్ళ ఆశ. అందువలన వాళ్ళు కాంగ్రెస్‌ని ఓడించడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అయితే బిజెపి నాయకులకి మాత్రం అవినీతి నిర్మూలనపై ఆసక్తి ఉండదు. అది కూడా కాంగ్రెస్‌లాగే పాలక వర్గ పార్టీయే కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సహాయంతో అధికారంలోకి రావడం బిజెపి అభిమానులకి మింగుడుపడని విషయమే.
ఆప్ పార్టికి ప్రజలు బ్రహ్మ రధం పట్టారంటే అన్ని పార్టీలతో విసిగి వేసారిన ప్రజలు ఒక నూతనోత్తేజంకోరకు ఎదురు చూస్తున్నారని అర్ధం. నిజాయితి గల పార్టీ అని నమ్మితే ఆప్ పార్టి నేతని 2014 ఎన్నికల్లో ప్రధాని మత్రిని చేయడానికి కూడా వెనుకాడరు. అది దాని నిజాయితి మీద ఆధారపడి ఉంటుందేమో. లేకపోతే చిరంజీవి పార్టీలా మూన్నాళ్ల ముచ్చటే.
ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడానికి కారణం బిజెపి అభిమానుల అత్యుత్సాహమే. బిజెపి కూడా కాంగ్రెస్‌లాగే ఒక పాలక వర్గ పార్టీ, దానికి అవినీతి నిర్మూలనపై ఆసక్తి ఉండదు అనే నిజాన్ని గ్రహించకుండా అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో కాంగ్రెస్‌ని ఓడించడానికి అన్నా హజారేకి సపోర్ట్ ఇచ్చారు. ఆ పథకం బెడిసి కొట్టి బిజెపియే ఇరకాటంలో పడింది. అవినీతి కంటే పెద్ద సమస్య అయిన గ్లోబలైజేషన్ ఉండగా వీళ్ళు అవినీతిని మాత్రమే వ్యతిరేకించడం చూసినప్పుడు నాకు విషయం అర్థమైంది.