బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా


(బాలి సదస్సు గురించి రాసిన ఆర్టికల్ పై మరింత వివరించాలని ఉమేష్ పాటిల్ అనే పాఠకులు కోరారు. ఆ కోరికను కూడా ఈ ఆర్టికల్ నెరవేర్చగలదు. )

దోహా రౌండ్ చర్చలను పునఃప్రారంభించే రందిలో ఉన్న భారత ప్రభుత్వం ‘గేమ్ ఛేంజర్’ గా చెప్పుకుంటున్న ఆహార భద్రతా చట్టానికి తానే తూట్లు పొడిచేవైపుగా వ్యవహరించింది. ఇండోనేషియా నగరం బాలిలో ఈ నెలలో  ‘దోహా రౌండ్’ చర్చలు పునః ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి చెందిన దేశాల భారీ వ్యవసాయ సబ్సిడీలను తగ్గించాలన్న డిమాండ్ తో మూడో ప్రపంచ దేశాలు ఒకటి కావడంతో, పశ్చిమ దేశాలు దోహా రౌండ్ చర్చలను ప్రతిష్టంబనకు గురిచేశాయి. చివరికి అమెరికా, ఈ.యూల పంతమే నెగ్గిందని బాలి సమావేశాల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ వాణిజ్యంపై కేంద్రీకరించిన బాలి సమావేశాల ఆమోదం కోసం ముసాయిదా రూపకల్పనకై అంతకుముందు జెనీవాలో జోరుగా చర్చలు సాగాయి. అమెరికా, ఐరోపాల ఒత్తిళ్లను ఇముడ్చుకుని రూపొందిన ఒప్పందం వలన భారత ఆహార భద్రతా చట్టం ప్రమాదంలో పడుతుందని సమావేశాలకు ముందు స్వయంగా వాణిజ్య మంత్రి ఆనంద శర్మ ఆందోళన ప్రకటించడం పరిస్ధితి తీవ్రతకు అద్దం పట్టింది. తీరా సమావేశాలు ముగిశాక భారత్ విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. వాస్తవంలో ధనిక దేశాల ఒత్తిడికి ఇండియా లొంగిపోయిందనీ వివిధ స్వచ్చంధ సంస్ధలతో పాటు రాజ్య సభ ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ కూడా తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

రైతులు పండించే పంటలకు భారత ప్రభుత్వం ప్రకటించి అమలు చేసే కనీస మద్దతు ధరలకూ, ఆహార సబ్సిడీలకు ముసాయిదాలో రక్షణ ఏర్పాట్లు చేయనట్లయితే బాలి సమావేశం ఎటువంటి ఒప్పందం కుదరకుండా విఫలం అవుతుందని వాణిజ్య మంత్రి ధనిక దేశాలను సమావేశాలకు ముందు హెచ్చరించారు. కానీ వాస్తవంలో పశ్చిమ దేశాల ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ బహిరంగంగానే విమర్శించారు. ఇండియా కోరుకున్న అంశాలు ముసాయిదాలో లేనప్పటికీ బాలి చర్చలు విఫలం కాకుండా చూడడం అత్యవసరం అని భావిస్తున్నట్లు భారత ప్రతినిధులు చెప్పడంతో ఈ విమర్శ నిజమే అని పలువురు అనుమానించారు. జి33 గ్రూపు దేశాల నాయకుడుగా వర్ధమాన దేశాల పరిమిత ఆహార సబ్సిడీలను కాపాడుకోడానికి, ధనిక దేశాల అలవిమాలిన సబ్సిడీలను తగ్గించడానికి దోహా రౌండ్ చర్చల్లో కృషి చేస్తున్నట్లు ఇండియా చెప్పింది. తీరా ఒప్పందం కుదిరే దశలో దేశ రైతుల, ఆహార వినియోగదారుల ప్రయోజనాలను ఫణంగా పెడుతూ అమెరికా, ఐరోపాల ఒత్తిడికి లొంగిపోయిందని ఇ.ఎ.ఎస్ శర్మ ఘాటుగా విమర్శించారు.

డబ్ల్యూ.టి.ఒ 9వ మంత్రుల స్ధాయి సమావేశాలు డిసెంబర్ 3 నుండి 6 వరకు బాలిలో జరిగాయి. రెండేళ్లకొకసారి జరిగే ఈ సమావేశాల్లో ఈసారి ఎలాగైనా ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ దేశాలు దృఢంగా భావించాయి. ఒప్పందం ముసాయిదాకు తుదిరూపు ఇవ్వడానికి ముందు జెనీవాలో చర్చలు జరిగాయి. మూడో ప్రపంచ దేశాలు తమ రైతులకు, ప్రజలకు ఇస్తున్న వ్యవసాయ, ఆహార సబ్సిడీలపై పరిమితులు విధించాలని అమెరికా, ఐరోపా దేశాలు నిర్దేశిస్తూవచ్చాయి. తద్వారా తమ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ పెంచుకోవడం వారి లక్ష్యం. ఇండియా, ఇండోనేషియా లాంటి దేశాల నేతృత్వంలో మూడో ప్రపంచ దేశాలు అమెరికా, ఈ.యూల ఒత్తిడిని ప్రతిఘటిస్తున్నట్లు తెలిపాయి. దోహా రౌండ్ చర్చలు 2008 నుండి స్తంభించడానికి ఈ ప్రతిఘటనే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

భారత వాణిజ్య మంత్రి ఆనంద శర్మ నవంబర్ 19 తేదీన డబ్ల్యూ.టి.ఒ డైరెక్టర్-జనరల్ రాబర్టో అజీవిడోకు ఫోన్ చేసి అభివృద్ధి చెందిన దేశాల ప్రతిపాదనలు ఇండియాకు ఆమోదయోగ్యం కాబోవని స్పష్టం చేశారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ముసాయిదా యధాతధంగా ఆమోదం పొందితే మన రైతులు పొందే కనీస మద్దతు ధరలు, 80 కోట్లమంది (67 శాతం) ప్రజానీకానికి లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ డబ్ల్యూ.టి.ఓకు విరుద్ధం అవుతాయి. ఈ దృష్ట్యా, ఆహార సబ్సిడీలను, కనీస మద్దతు ధరలను శాశ్వతంగా కాపాడుకునేందుకు వీలయిన నిబంధనలను ముసాయిదాలో చేర్చడానికి భారత అధికారులు జెనీవాలో ధనిక దేశాలతో బేరసారాలు సాగించారు. అయితే భారత దేశ డిమాండ్లు పట్టించుకోలేదని ఒప్పందం ద్వారా స్పష్టం అయింది. వ్యవసాయ సబ్సిడీలపై పరిమితులు విధించడాన్ని ఇండియా నేతృత్వంలోని జి33 (46 దేశాలు ఇందులో సభ్యులు) గ్రూపు వ్యతిరేకిస్తున్నప్పటికీ తదనుగుణమైన నిబంధనలకు ముసాయిదాలో చోటు దొరకలేదు. దానితో డబ్ల్యూ.టి.ఒపై నియమించబడిన కేబినెట్ కమిటీని అత్యవసరంగా సమావేశపరచాలని ఆనంద శర్మ కోరారు. ఈ సమావేశంలో ఏమి చర్చించారో గానీ అంతిమంగా పశ్చిమ దేశాల ముసాయిదాకే ఇండియా ఆమోద ముద్ర వేసింది.

జి33 దేశాల ఆందోళనలను సంతృప్తిపరచడానికి ‘పీస్ క్లాజ్’ పేరుతో ఓ నిబంధన ప్రవేశ పెట్టారు. కానీ దీనితో ఒనగూరే లబ్ది తాత్కాలికమే. 11వ మంత్రుల స్ధాయి సమావేశం వరకు అనగా మరో 4 సంవత్సరాల వరకు కనీస మద్దతు ధరలకు ధాన్యం సేకరించే అవకాశం ఇండియాకు ఉంటుంది. డబ్ల్యూ.టి.ఒ పరిమితులను ఏ దేశమైనా అతిక్రమించినా ఏ ఇతర దేశమూ దానికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించకుండా నిబంధన ఈ క్లాజ్ లో ఉన్నదని భారత అధికారులు చెబుతున్నారు. ఎన్ని క్లాజ్ లు ఉన్నా అవి 4 యేళ్ళ వరకే. ఆ తర్వాత చచ్చినట్లు డబ్ల్యూ.టి.ఒ పరిమితులకు అనుగుణంగా చట్టాలు మార్చుకోవలసిందే. అదీ గాక ఈ క్లాజు ‘డబ్ల్యూ.టి.ఒ వ్యవసాయ ఒప్పందం’కు మాత్రమే వర్తిస్తుంది. ‘సబ్సిడీలు మరియు సరితూగు (countervailing) చర్యలపై డబ్ల్యూ.టి.ఒ ఒప్పందం’ కు వర్తించదు. అనగా ఆహార భద్రతా చట్టానికి తాత్కాలిక ఊరట లభించినా ఇతర వ్యవసాయ సబ్సిడీల విషయంలో నిబంధనలకు లోబడాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ చట్టాలు, రాజ్య పాలన డబ్ల్యూ.టి.ఓకు లోబడేపనైతే ఇక మన స్వతంత్రం ఎవరిని ఉద్ధరించడానికి? ఇలాంటి ఒప్పందాలను అంగీకరించే బదులు అసలు చర్చల నుండే బైటికి రావడం ఉత్తమం అంటున్న ఇ.ఏ.ఎస్ శర్మ సూచన శిరోధార్యం కాదా? పీస్ క్లాజ్ పేరుతో తాత్కాలిక శాంతిని, శాశ్వత అశాంతిని దేశంలో నింపే అసమాన ఒప్పందాలను భారత ప్రభుత్వం తిరస్కరించాల్సింది పోయి బాలి సమావేశాల్ని సఫలం చేసే బాధ్యత నెత్తిన వేసుకోవడం గర్హనీయం.

డబ్ల్యూ.టి.ఓ మంత్రుల స్ధాయి సమావేశాల్లో కనీస మద్దతు ధరల పరిమితిని పెంచాలన్న కోరికతో భారత ప్రతినిధులు సంతృప్తిపడ్డారు. నిజానికి ఇప్పటి మరిమితి 1980ల నాటి ప్రపంచ ధరల ఆధారంగా నిర్ణయించినది. ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆహార ధరలు, ద్రవ్యోల్బణమూ భారీగా పెరిగాయి. కనుక పాత పరిమితులను తాజాకరించడమో లేదా పునఃపరిశీలించడమో చేయాలని మనవాళ్లు కోరారు. కానీ ఇది అసలు సమస్యను కప్పిపుచ్చడమే. భారత రైతులకు, ప్రజలకు ప్రభుత్వాల మద్దతును సాధ్యమైనంతగా తగ్గించేసి తద్వారా ఖాళీ అయ్యే మార్కెట్ ను తాము ఆక్రమించడం ధనిక దేశాల లక్ష్యం. అమెరికా, ఈ.యులలో బహుళజాతి వ్యవసాయ కంపెనీలకు భారీగా ముడుతున్న సబ్సిడీలు వాటి వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ లో గట్టి పోటీదారులుగా నిలబెడుతున్నాయి. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన పద్ధతుల వల్ల వారు భారీ స్ధాయిలో ఉత్పత్తులు చేయగలరు. కానీ భారత దేశంలో సబ్సిడీలూ తక్కువే, మెజారిటీ వ్యవసాయదారుల ఉత్పత్తి పద్ధతులూ వెనుకబడినవే. ఫలితంగా ప్రపంచీకరణ యుగంలో పోటీపడే సామర్ధ్యం వారికి లేదు. ఈ సమస్యను అధిగమించాలంటే రైతులకు, ప్రజలకు ప్రభుత్వ మద్దతు తప్పనిసరి. ప్రభుత్వ మద్దతు లేకుండా దేశీయ మార్కెట్ కూడా మెరుగుపడదు. వ్యవసాయ, ఆహార సబ్సిడీలు ప్రజల కొనుగోలు శక్తిని ఇతర రంగాల్లో ఉద్దీపింపజేస్తాయి. విద్య, వైద్య రంగాల్లో వినియోగం పెరిగి కుటుంబాల సంతులిత పురోభివృద్ధిని సుసాధ్యం చేయడానికి దోహదపడతాయి. తద్వారా చిన్నా, పెద్దా వ్యాపారులూ లాభపడతారు. ఈ అంశాలను విస్మరించడం జాతి ప్రయోజనాలను కాంక్షించేవారికి సాధ్యంకాని పని. మన పాలకులకు మాత్రం అది శుభ్రంగా సాధ్యపడింది.

భారత ఆహార భద్రతా చట్టం వలన 82 కోట్ల మంది లబ్ది పొందేదీ నిజమే అయితే, అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండదలుచుకుంటే ఇప్పటి ఆహార ధాన్యాల సేకరణను ప్రభుత్వం స్ధిరంగా కొనసాగించాల్సి ఉంటుంది. ఫోర్బ్స్ పత్రిక అంచనా ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం కోసం సంవత్సరానికి 62 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కనీస మద్దతు ధరలను స్ధిరంగా ఇవ్వగలిగితేనే రైతులు ధాన్యం పండించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా లబ్దిదారులను 44.5 శాతం నుండి 67 శాతానికి పెంచనున్నారు. కానీ తలసరి ఆహార సరఫరాను మాత్రం 7.9 కి.గ్రా నుండి 5 కి.గ్రా కు తగ్గిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆహార సరఫరా ఇప్పుడున్న 51.3 మిలియన్ టన్నుల నుండి 52 మిలియన్ టన్నులకు మాత్రమే పెరుగుతుంది. అనగా చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనంగా చేస్తున్న మేలు ఏమీ లేదు. ఈ కాస్త లబ్ది కూడా డబ్ల్యూ.టి.ఓ బలిపీఠానికి అర్పించడం జాతి వ్యతిరేకమే.

బాలి ఒప్పందం ద్వారా భారత ఆహార భద్రతా కార్యక్రమాన్ని స్క్రూటినీ చేసే అపరిమిత అధికారాలు డబ్ల్యూ.టి.ఓ కు కట్టబెట్టారని రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. “భారత రైతులకు, పేదలకు ఏది మంచిది అని నిర్ణయించే అధికారం ఇక ఎంతమాత్రం భారత పార్లమెంటు చేతుల్లో లేదు. అది ఇతర దేశాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. డబ్ల్యూ.టి.ఓ ఒప్పందం నిర్దేశించిన కఠిన నిబంధనల వలన మన చట్టాలపై అంతర్జాతీయ స్క్రూటినీ పెరిగిపోతుంది. భారత దేశంలో ప్రజా పంపిణీ నిమిత్తం కొనసాగించే ఆహార నిల్వల పరిణామాలను ఇప్పుడిక బైటి దేశాలు నిర్దేయిస్తాయి” అని అరుణ్ జైట్లీ వివరించారు. ఇందుకు ఉదాహరణగా క్లాజ్ 4 ను ఆయన ఎత్తిచూపారు. “ఈ క్లాజు మోసపూరితమైనది. ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడింది. ఇండియాలో ఎవరిని పేదలుగా పరిగణించాలో, వారికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలో, వారికి ఎంతమేరకు ఆహార సబ్సిడీ ఇవ్వాలో కూడా ఈ క్లాజ్ నిర్దేశిస్తుంది. వీటికి సంబంధించి ఇంకా అనేక అంశాలలో కూడా ఈ క్లాజ్ కలుగజేసుకుంటుంది” అని అరుణ్ జైట్లీ తెలిపారు.

క్లాజ్ 6 కూడా ఇలాంటి నిబంధనలనే ఇండియాపై రుద్దుతోంది. దీని ప్రకారం భారత ఆహార నిల్వలను ఏ స్ధాయిలో నిర్వహిస్తున్నదీ ఇతర డబ్ల్యూ.టి.ఓ సభ్యదేశాలు తెలుసుకోగోరితే భారత ప్రభుత్వం తప్పనిసరిగా అందుకు అనుమతి ఇవ్వాలి. కాదనడానికి వీలు లేదు. మన ఆహార భద్రతా చట్టం అమలు చేసే విధానంపైన ఇతర దేశాల పెత్తనాన్ని అంగీకరించేది లేదని వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ అదే పనిగా బీరాలు పోయారు. చివరికి సరిగ్గా దానికి విరుద్ధంగా ఉన్న ఒప్పందాన్ని అంగీకరించి వచ్చారు. పైగా ఒప్పందం భారత ఆందోళనలను ఇముడ్చుకుందని, మనం విజయం సాధించామని చెప్పుకున్నారు. భారత దేశం విజయం సాధించిందన్న భారత ప్రభుత్వ వాదన పచ్చి అబద్ధమని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ ఇచ్చిన వివరాలే స్పష్టం చేస్తున్నాయి.

వివిధ పౌర సంస్ధల గ్రూపులు కూడా బాలి ఒప్పందం దేశ వ్యతిరేకం అని స్పష్టం చేశాయి. ఆహార సేకరణ, నిల్వల విషయంలో ఇండియా తన సార్వభౌమాధికారం కోల్పోయిందని, ఆహార, వ్యవసాయ సబ్సిడీలపై షరతులను ఆమోదించారని వారు విమర్శించారు. “అమెరికా ఒత్తిడికి ఇండియా లొంగిపోయింది. జి-33 ప్రతిపాదనలో భాగం కానీ పీస్ క్లాజ్ షరతులకు అంగీకరించింది” అని ‘రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్’ సంస్ధ విమర్శించింది. “సబ్సిడీ పరిమితుల గురించి చర్చలు జరిపే ఊబిలోకి ఇండియా పడిపోయింది. భారత దేశంలో ఆకలి, పోషకారలోపం అంశాల ప్రాతిపదికన చర్చలు చేయాల్సిందిపోయి వ్యవసాయంలో మద్దతు ధరలపై పరిమితి విధించడంపై మనవాళ్లు చర్చలను కేంద్రీకరించారు. ఆ విషయంలో మనవాళ్లు ఏమన్నా ప్రతిపాదన చేసినా దానిని డబ్ల్యూ.టి.ఓ పరిధి నుండి తప్పించడంలో ధనిక దేశాలు విజయం సాధించాయి. ఇండియా విజయం గురించి చెబుతున్న మాటలన్నీ బూటకం” అని జీన్ క్యాంపెయిన్ సంస్ధ నేత సుమన్ సహాయ్ విమర్శించారు. “మరింత వాణిజ్య సరళీకరణకు వ్యవసాయ రంగాన్ని గురిచేసే విధంగా పీస్ క్లాజ్ కి అంగీకరించే బదులు అసలు స్వేచ్ఛా వాణిజ్యాన్నే ఆడిట్ చేయాలని ఇండియా డిమాండ్ చేసి ఉండాల్సింది” అని నవధాన్య సంస్ధ నేత ప్రొఫెసర్ వందనా శివ విమర్శించారు.

ప్రపంచ వాణిజ్య సంస్ధ కుప్పకూలకుండా నిరోధించడాన్నే బాలి సదస్సు విజయంగా భారత పాలకులు చెబుతున్నారు. కానీ డబ్ల్యూ.టి.ఓ కు అతీతంగా పశ్చిమ దేశాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ మరియు ‘ట్రాన్స్ పసిఫిక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్’ లను కుదుర్చుకున్న సంగతిని ఇండియా విస్మరిస్తోంది. మొదటిది అమెరికా-ఐరోపా దేశాల మధ్యా, రెండవది అమెరికా-జపాన్ ల మధ్యా కుదిరింది. వీటి ద్వారా ఇండియాలాంటి దేశాలను బెదరగొట్టడంలో అమెరికా, ఐరోపాలు సఫలం అయ్యాయి. ఫలితంగా ప్రపంచ ప్రజల ప్రయోజనాలకు పరమ విరుద్ధమయిన డబ్ల్యూ.టి.ఓ ను సజీవంగా నిలిపే బాధ్యతను మూడో ప్రపంచ దేశాలే నెత్తిన వేసుకున్న విపరీత పరిస్ధితి సాధ్యమయింది.

3 thoughts on “బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా

  1. పింగ్‌బ్యాక్: బాలి సదస్సు: పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు లొంగిన ఇండియా | ugiridharaprasad

  2. దేశంలో అన్నదాతల విషయంలో జాలిలేని ప్రభుత్వం బాలీ సదస్సును బంతిలా కాలితో తన్ని చేతకాని కబుర్లు చెబుతుంది. అవగాహన లేని సదస్సులు అర్ధంచేసుకోవడానికి మన మేధస్సులు సరిపోవు. నలుగిరితో పాటు నారాయణ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s