“ధన్యవాదాలు, ఢిల్లీ! ప్రజాస్వామిక ఓటింగ్ తీర్పును పక్కన పెట్టినందుకు…”
అవినీతి వ్యతిరేక నినాదంతో వినూత్న రీతిలో ఢిల్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. పార్టీ స్ధాపించిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎ.ఎ.పి ఎన్నికల అనంతరం కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.
అతి పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి, ఎ.ఎ.పి ధాటికి హార్స్ ట్రేడింగ్ కి తెగబడలేక ప్రభుత్వం ఏర్పాటు తమ వల్ల కాదంటూ తోక ముడిచింది. విచిత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎ.ఎ.పి పైనే ఉందని వాదిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎ.ఎ.పి కి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంతో డైలమాలో పడడం ఎ.ఎ.పి నాయకుల వంతయింది.
కానీ కేజ్రీవాల్ వెనకడుగు వేయలేదు. బి.జె.పి, కాంగ్రెస్ పార్టీల మద్దతు స్వీకరించడానికి సిద్ధం అని చెబుతూనే 18 షరతులు విధించి ఇరు పార్టీలను మహా ఇరకాటంలో పడవేశారు. కేజ్రీవాల్/ఎ.ఎ.పి విధించిన షరతులు పక్కా ప్రజానుకూలమైన షరతులు. ఇవి ఎంతగా ప్రజల ప్రయోజనాలను కాంక్షించేవంటే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన కాంగ్రెస్, బి.జె.పి లు వాటిని అంగీకరించలేకపోయాయి. తద్వారా ఆ పార్టీల నిజమైన ప్రజా వ్యతిరేక స్వభావాన్ని ఈ షరతులు పచ్చిగా ప్రజల ముందు పరిచాయి.
ఆచరణ సాధ్యం కాదంటూ కాంగ్రెస్, బి.జె.పిలతో పాటు ఎకనమిక్ టైమ్స్ లాంటి ధనికవర్గానుకూల కార్పొరేట్ పత్రికలు సైతం తిరస్కరించిన షరతులు నిజానికి పాలకవర్గ పార్టీలు నిరంతరం వాగ్దానం చేసేవే. వీటిలో కొన్ని ఆ పార్టీల మేనిఫెస్టోలలో కూడా ఉన్నాయి. ఐనా తిరస్కరించాయంటే ఆ పార్టీల స్వభావం ప్రజలకు వ్యతిరేకం కాదా? ఈ వాస్తవాన్ని ప్రజల ముందు శక్తివంతంగా రుజువు చేసిన ఎ.ఎ.పిని అభినందించాల్సిందే.
ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఎ.ఎ.పి/కేజ్రీవాల్ వేస్తున్న అడుగులు అనుమానాస్పదంగా మారాయి. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజల అభిప్రాయం సేకరించే పేరుతో సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల ద్వారా ఎ.ఎ.పి మరో ఎన్నికకు తెర తీశారు. బ్యాలట్ ద్వారా ఇప్పటికే ఒకసారి తీర్పు ఇచ్చిన ఓటర్లను మరో పద్ధతిలో తీర్పు కోరుతున్నారు. రిఫరెండం పేరుతో విస్తృతంగా అభిప్రాయ సేకరణ జరుపుతున్నామని ఎ.ఎ.పి నాయకులు చెబుతున్నారు.
మనల్ని మళ్లీ ఓటింగ్ కు రావాలని అడుగుతున్నాడా ఈ కేజ్రీవాల్?
***
రిఫరెండం అంతిమ ఫలితాలు సోమవారం చెబుతామని ఎ.ఎ.పి ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే ఎ.ఎ.పి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, బి.జె.పి ల మద్దతు తీసుకోవద్దని కొంతమంది చెబుతున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా కొందరు చెబుతున్నారని ఎ.ఎ.పి నాయకులు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భయపడి తాము షరతులు విధించినట్లు కొందరు భావిస్తున్నారని వారు ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమేనని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. లాంఛనప్రాయ ప్రకటనే మిగిలిందని అవి సూచిస్తున్నాయి. అంటే బ్యాలట్ ఓటు కంటే సోషల్ మీడియా ఓటుకే ఎ.ఎ.పి ఎక్కువ విలువ ఇచ్చినట్లు అర్ధమా?
ఈ సూచనను ఎ.ఎ.పి తిరస్కరిస్తోంది. తాము ప్రతిపాదించిన విధానాలను ఖచ్చితంగా అమలు చేస్తామనీ ఒకవేళ వాటికి కాంగ్రెస్ అభ్యంతరం చెబితే ఆ పార్టీయే ప్రజల్లో పలచనవుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నాడు. కనీసం 2014 జాతీయ ఎన్నికల వరకైనా కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తుందని, తాము చేసి చూపగలమని చెప్పడానికి ఈ మాత్రం సమయం చాలని ఎ.ఎ.పి నాయకులు స్పష్టం చేస్తున్నారు.
కేజ్రీవాల్/ఎ.ఎ.పి వాదనల్లో కొంత నిజం లేకపోలేదు. కానీ అరవింద్ ఎత్తులకు పై ఎత్తులు వేయలేని స్ధితిలో కాంగ్రెస్ గానీ, బి.జె.పి గానీ ఉన్నాయంటే అది అమాయకత్వమే కాగలదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ధనికవర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్మితమై ఉన్నది తప్ప సామాన్య ప్రజల కోసం కాదు. ఎ.ఎ.పి నిజంగానే నిజాయితీగా వ్యవహరిస్తే అలాంటి పార్టీలను మట్టి కరిపించే అస్త్రాలు లేదా లూప్ హోల్స్ ఈ వ్యవస్ధలో బోలెడు ఉన్నాయి.
కార్పొరేట్ మీడియా దగ్గర్నుండి రాజ్యంలోని సమస్త అంగాలు ఎ.ఎ.పి నిజాయితీకి వ్యతిరేకంగా మోహరించే అవకాశాలు ఈ వ్యవస్ధలో పుష్కలంగా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఇవన్నీ ఒక్కటై ఎ.ఎ.పి ని ఒంటరిని చేయడం ఖాయం. ఎ.ఎ.పి నిజాయితీ నిజమే అయితే ఆ పార్టీ ప్రజలను నమ్ముకోవడమే ఉత్తమం. ప్రజలు తమకోసం పని చేసే వారిని ఎన్నడూ నిరాశపరచరు.
కానీ ఎ.ఎ.పి నిజంగా ప్రజలకు కట్టుబడి ఉన్న పార్టీయేనా అన్నదే అసలు సమస్య.