రేమండ్ డేవిస్ ని గుర్తు చేసుకో అమెరికా! -పాక్ మాజీ రాయబారి


Husain_haqqani

Hussain Haqqani

అమెరికాలోని పాకిస్తాన్ ఎంబసీలో మాజీ అత్యున్నత రాయబారిగా పని చేసిన హుస్సేన్ హక్కాని అమెరికా పౌరుడు, సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపిన కేసు విషయంలో పాక్ ప్రభుత్వ అసంతృప్తికి గురై ఉద్వాసన పొందడం విశేషం.

“అనేక దేశాలలో అమెరికా రాయబారులకు అక్కడి చట్టాలకు అతీతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి… విదేశాల్లోని ప్రతి అమెరికా రాయబార భవనం చుట్టూ రక్షణ నిర్మాణాలు (barriers) అమర్చి ఉంటాయి. సాధారణంగా ఈ నిర్మాణాలు ప్రజల ఉమ్మడి ఆస్తులలోనే మున్సిపల్ చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్మితమై ఉంటాయి.

“విమానాలు ఎక్కడానికీ, విమానాశ్రయాల నుండి బైటికి పోవడానికి ఇతర ప్రయాణీకులతో కలిపి కాకుండా భిన్నమైన మార్గాలను అమెరికా రాయబారులకు అందుబాటులో ఉంచుతారు. ఈ సౌకర్యాలు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులను టెర్రరిస్టు బెదిరింపుల నుండి కాపాడతాయి.

“మరో విదేశీ రాయబారిని గానీ లేదా కాన్సలార్ అధికారిని గాని అరెస్టు చేసి మరో తుఫాను సృష్టించే ముందు అమెరికాలో చట్టాలను అమలు చేసే విభాగాలు ఈ సమకాలీన వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి” అని ద డైలీ బీస్ట్ అనే పత్రికకు రాసిన వ్యాసంలో హక్కానీ పేర్కొన్నారు.

రేమండ్ డేవిస్ కేసులో ఉద్వాసనకు గురయిన రాయబారిగా హుస్సేన్ హక్కాని లబ్ద ప్రతిష్టుడు. రేమండ్ డేవిస్ కేసు విషయం ఈ సందర్భంగా కాస్త వివరంగా పరిశీలించడం అవసరం.

రేమండ్ డేవిస్ పాకిస్తాన్ లో సి.ఐ.ఏ యాక్టింగ్ హెడ్ గా నియమించబడిన గూఢచారి. జనవరి 2011లో ఆయన ఇద్దరు పాక్ పౌరులను లాహోర్ లోని ఒక ట్రాఫిక్ జంక్షన్ లో కాల్చి చంపాడు. తనను దోచుకోవడానికి వారు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం డేవిస్ వారిద్దరిని కాల్చి చంపాడని పశ్చిమ పత్రికలు ఊదరగొట్టాయి.

వాస్తవానికి రేమండ్ డేవిస్ చంపిన ఇద్దరు వ్యక్తులు ఐ.ఎస్.ఐ కోసం పని చేస్తున్న (గూఢచార ఉద్యోగులు కాదు) యువకులు. పాక్ లో రేమండ్ డేవిస్ కార్యకలాపాలపై వారు నిఘా పెట్టారు. రేమండ్ డేవిస్ కార్యకలాపాలు పాకిస్ధాన్ జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారాయని అప్పటికి ఐ.ఎస్.ఐ గుర్తించింది. ఆ సంగతి గుర్తించిన డేవిస్ తన ఐడెంటిటీ బైటపడకుండా ఉండడానికే వారిని కాల్చి చంపాడని ఆ తర్వాత పాక్ ప్రభుత్వ విచారణలో తేలింది. ఆయన వద్ద ఉన్న రహస్య చిత్రాలు, పత్రాలు అన్నీ పాకిస్ధాన్ ప్రభుత్వ జాతీయ భద్రతకు సంబంధించినవి. (అణు కర్మాగారాల సైట్ ఫోటోలు, అణ్వాయుధాలు నిల్వ ఉంచిన స్ధలాల ఫోటోలు, నిషేధిత పాక్-ఇండియా సరిహద్దుకు సంబంధించిన వివరణాత్మక మేప్ లు మొ.వి)

పాక్ పౌరులను కాల్చి చంపిన తర్వాత కారులో పారిపోతుండగా డేవిస్ ను మరో ట్రాఫిక్ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేసి లాహోర్ పోలీసులకు అప్పజెప్పారు. అతన్ని కాపాడడానికి మరో సి.ఐ.ఏ బృందం వేగంగా అక్కడికి వచ్చి వన్-వే-రూట్ లో ఎదురు వెళ్ళి మరో పౌరుడిని యాక్సిడెంట్ చేసి చంపేశారు. రేమండ్ డేవిస్ అసలు ఐడెంటిటీని దాచిపెట్టిన అమెరికా ఆయన తమ కాన్సలేట్ అధికారి అని చెప్పి విడుదల చేయాలని పాక్ ను డిమాండ్ చేసింది.

కాన్సలార్ అధికారిగా వియన్నా అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం డేవిస్ కు రాయబార రక్షణ వర్తిస్తుందని, కాబట్టి ఆయనపై హత్య కేసు రద్దు చేసి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా స్వయంగా డిమాండ్ చేశాడు. అంటే అమెరికా అధ్యక్షుడే స్వయంగా పచ్చి అబద్ధం చెప్పి తమ దేశానికి చెందిన హంతకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. మరో పౌరుడి మరణానికి కారణం అయిన అమెరికన్లను కూడా తమకు అప్పజెప్పాలని పాక్ కోరినా అమెరికా ఒప్పుకోలేదు. గుట్టు చప్పుడు కాకుండా వారిని దేశం దాటించి తీసుకెళ్లింది.

రేమండ్ డేవిస్ తమ జాతీయులు ఇద్దరినీ పట్టపగలే కాల్చి చంపడంతో పాక్ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దేశవ్యాపితంగా ఆందోళనలు పెల్లుబుకాయి. దానితో రేమండ్ డేవిస్ ను విడుదల చేయాలన్న అమెరికా ఒత్తిడిని పాక్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. దాదాపు ఏడు వారాలు ఆయనను నిర్బంధించిన ఐ.ఎస్.ఐ తమ పద్ధతుల్లో విచారించి అసలు నిజాలు రాబట్టింది. ఈ లోపు అమెరికా ప్రభుత్వ వర్గాల్లో అధికారులకు బి.పి పెరిగిపోయింది. పాకిస్ధాన్ పైన వారు వరుస ప్రతీకార చర్యలను ప్రకటించారు.

అమెరికాలోని పాక్ ఎంబసీకి అమెరికా ప్రభుత్వానికి మధ్య అన్నీ సంబంధాలను రద్దు చేసుకున్నారు. పాకిస్ధాన్ తో రక్షణ సంబంధాలు రద్దు చేసుకుంటామని బెదిరించారు. ఉమ్మడి మిలట్రీ డ్రిల్లులు ఇక ఉండవని అమెరికా నుండి వచ్చిన కాంగ్రెస్ బృందం సభ్యులు పాక్ ను బెదిరించారు. అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు టాం డోనిలాన్ పాక్ ఎంబసీకి ఫోన్ చేసి పాక్ రాయబారి హుస్సేన్ హక్కానిని నిర్బంధిస్తామని బెదిరించాడని ఏ.బి.సి న్యూస్ అప్పట్లో తెలిపింది. ఈ వార్తను హక్కాని ఎన్నడూ నిరాకరించలేదు. పాకిస్ధాన్ లో అమెరికా కాన్సలేట్లను మూసేస్తామనీ, పాక్ అధ్యక్షుడు జర్దారీ అమెరికా పర్యటనను సైతం రద్దు చేస్తామని టాం బెదిరించాడని ఏ.బి.సి తెలిపింది.

ఈ ఒత్తిళ్లకు తల ఒగ్గిన అప్పటి పాక్ అధ్యక్షుడు జర్దారీ రేమండ్ డేవిస్ కు రాయబార రక్షణ ఉన్నది కాబట్టి కేసు రద్దు చేసి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. కానీ అప్పటి పాక్ విదేశీ మంత్రి ఖురేషీ రేమండ్ డేవిస్ విడుదలకు నిరాకరించాడు. అమెరికా ఎంబసీ సిబ్బంది జాబితాలో గానీ, కాన్సలేట్ సిబ్బంది జాబితాలో గానీ రేమండ్ డేవిస్ పేరు లేదని కాబట్టి ఆయనకు రాయబార రక్షణ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. పాక్ పౌరుల హత్య తర్వాతే అమెరికా రాయబార సిబ్బంది జాబితాలో డేవిస్ పేరు వచ్చి చేరిందని కూడా ఆయన వెల్లడి చేశాడు. అంటే రేమండ్ డేవిస్ కి రాయబార హోదా లేకపోయినప్పటికీ అప్పటికప్పుడు ఇచ్చి ‘రాయబార రక్షణ’ పేరుతో కేసు లేకుండా చేయాలని అమెరికా ప్రయత్నించిందన్నమాట!

రేమండ్ డేవిస్ రహస్యం పాక్షికంగా వెల్లడి చేయడమే కాక విడుదలకు నిరాకరించినందుకు ఖురేషీ పదవి ఊడిపోయింది. మరో వైపు రేమండ్ డేవిస్ కాన్సలర్ అధికారి కాదని, నిజానికాయన సి.ఐ.ఏ కాంట్రాక్టర్ అనీ బ్రిటన్ కి చెందిన ది టెలిగ్రాఫ్, ది గార్డియన్ లాంటి పత్రికలు వెల్లడించాయి. దానితో అమెరికా ప్రభుత్వం కూడా డేవిస్ సి.ఐ.ఏ యాక్టింగ్ హెడ్ అని అంగీకరించక తప్పలేదు. అనంతరం పాక్ కోర్టులో విచారణ ప్రారంభం అయింది. జర్దారీ ప్రభుత్వం డేవిస్ విడుదలకు పధకం రచించి అమలు చేసింది. హత్యకు గురయిన యువకుల కుటుంబాలకు 2.4 మిలియన్ డాలర్లు ఇప్పించారు. డేవిస్ ను క్షమిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యుల చేత కోర్టులో చెప్పించారు. పాక్ ఇస్లామిక్ చట్టాల ప్రకారం హతుడి బంధువులు క్షమిస్తే పరిహారం చెల్లించి నిందితులు స్వేచ్ఛగా విడుదల కావచ్చు. ఆ విధంగా రేమండ్ డేవిస్ బతికి బైటపడ్డాడు.

కానీ అమెరికా చెల్లించిన పాపపు డబ్బు హతుల్లోని ఒకరి కుటుంబంలో చిచ్చు రేపింది. హతుని భార్య తిరిగి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించింది. మరో వివాహం చేసుకుంటే హతుని సోదరుడినే చేసుకోవాలని హతుడి తండ్రి షరతు పెట్టాడు. కానీ ఆమె అప్పటికే మరొకరిని వివావమాడింది. ఇది తెలిసి ఆమెనూ, ఆమె తల్లినీ హతుడి తండ్రి చంపేశాడు. మరో హతుని భార్య రేమండ్ డేవిస్ విడుదల అవుతున్నాడని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఆ విధంగా రేమండ్ డేవిస్ ప్రత్యక్షంగా ఇద్దరినీ పరోక్షంగా 4గురిని చంపి తాను హాయిగా బతుకుతున్నాడు.

పాక్ ఎంబసీ అధిపతి హుస్సేన్ హక్కాని కూడా అప్పట్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరించాడు. పాక్-అమెరికాల మధ్య సంబంధం చెడిపోకూడదన్న వాదనను ముందుకు తెచ్చి జర్దారీకి మద్దతుగా వచ్చాడు. దానితో ఐ.ఎస్.ఐ, దాని పోషకురాలయిన పాక్ మిలట్రీ ఆయనపై పగబట్టారు. పాక్ మిలట్రీ మళ్ళీ పాక్ లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని, ఒకవేళ అదే జరిగితే అమెరికా ఆడుకోవాలనీ ఆయన అమెరికాకు రాసినట్లుగా ఒక మెమో అప్పట్లో బైటికి వచ్చింది. (మెమో గేట్ గా ఈ ఉదంతం సుప్రసిద్ధం) ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని హుస్సేన్ చేత రాజీనామా చేయించడంలో ఐ.ఎస్.ఐ, మిలట్రీ సఫలం అయ్యాయి. హుస్సేన్ హక్కానీ రాజీనామాకు అమెరికా పత్రికలు తీవ్రంగా బాధపడ్డాయి. ఒక మంచి అధికారిని పాకిస్ధాన్ ప్రభుత్వం దూరం చేసుకుందని కన్నీళ్లు కార్చాయి.

అలాంటి హుస్సేన్ హక్కాని కూడా ఇప్పుడు అమెరికాకు సుద్దులు చెప్పాల్సిన పరిస్ధితి వచ్చింది. రేమండ్ డేవిస్ ఉదంతానికి, భారత రాయబారి దేవయాని ఉదంతానికి కొన్ని పోలికలు, తేడాలు ఉండడం గమనించవచ్చు. అప్పటికీ, ఇప్పటికీ అమెరికా కర్ర పెత్తనమే ప్రముఖంగా కనిపించే అంశం. అప్పుడు అమెరికాకు రైటయింది ఇప్పుడు తప్పయింది. అప్పుడు అమెరికాకు తప్పయింది ఇప్పుడు రైటయింది.

రేమండ్ డేవిస్ విషయంలో అప్పటికప్పుడు రాయబార హోదా కల్పించిన అమెరికా ఆ హోదాను పాత తేదీల నుండి వర్తింపజేయాలని పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. రేమండ్ డేవిస్ కు పాత తేదీలతో రాయబార హోదా కల్పించాలని అధ్యక్షుడు జర్దారీ ఒత్తిడి తేగా విదేశీ మంత్రి ఖురేషీ నిరాకరించాడు. దానితో విచారణ అనివార్యం అయింది. ఇక్కడ పాత్రధారి ఖురేషీ అయినా అసలు ప్రయోక్త పాక్ మిలట్రీ. (పాకిస్ధాన్ లో పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ, న్యాయ వ్యవస్ధలు ఒక పాలక వర్గ గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తే రాజకీయ పార్టీలు మరో గ్రూపుకు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి. అమెరికా ప్రాపకం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతూ తమలో తాము కలహించుకుంటాయి. వీరి మధ్య వైరుధ్యాలు ఒక్కొక్కరు ఒక్కోసారి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడినట్లు భ్రమింపజేస్తాయి.) 

రేమండ్ డేవిస్ కాన్సలార్ అధికారి కాబట్టి డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ ఇవ్వాలని డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు నిజంగానే కాన్సలార్ అధికారి అయిన దేవయానికి అదే ఇమ్యూనిటీ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. రేమండ్ డేవిస్ కు వెనుక తేదీ నుండి రాయబార హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు దేవయానికి వెనుక తేదీ నుండి దేవయానికి ఐరాస రాయబార హోదా ఎలా ఇస్తామని ప్రశ్నిస్తోంది. రేమండ్ డేవిస్ అమెరికన్ కాబట్టి, రాయబారి కాబట్టి ఆయనతో ప్రత్యేకంగా గౌరవంగా ప్రవర్తించాలని డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు దేవయాని కేసుకి వచ్చేసరికి ‘అమెరికా చట్టం ముందు అందరూ సమానమే’ అని నీతులు వల్లిస్తోంది. పైగా భారత న్యాయ వ్యవస్ధ గురించి అవాకులు చవాకులు పేలుతోంది.

1963 నాటి వియన్నా సదస్సు ఆమోదించిన అంతర్జాతీయ ఒప్పందం లోని ఆర్టికల్ 41(1) ఇలా చెబుతోంది. 

Consular officers shall not be liable to arrest or detention pending trial, except in the case of a grave crime and pursuant to a decision by the competent judicial authority

దీనర్ధం “కాన్సలర్ అధికారులు తీవ్రమైన నేరం చేస్తే తప్ప వారిపై విచారణ పెండింగ్ లో ఉండగా, న్యాయాధికారుల నిర్ణయం వెలువడడానికి ముందు అరెస్టు చేయరాదు.” అని. అనగా కోర్టులో అంతిమ న్యాయ నిర్ణయం వెలువడేవరకూ, విచారణ జరుగుతుండగా, అది తీవ్రమైన నేరం అయితే తప్ప కాన్సలార్ అధికారిని అరెస్టు చేయకూడదు.

రేమండ్ డేవిస్ పాకిస్తాన్ లో చేసిన, చేయించిన అరాచకాలకు అంతు లేదు. పాకిస్ధాన్ లో జరిగిన అనేక డ్రోన్ హత్యలకు ఆయన ప్రత్యక్ష బాధ్యుడు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులో పాక్ గిరిజన ప్రాంతాలలో నివసించే అనేకమంది అమాయక గిరిజనులు అమెరికా డ్రోన్ దాడుల్లో హతులయ్యారు. వారిలో స్త్రీలు, పిల్లలే ఎక్కువ. టెర్రరిజం పై యుద్ధం పేరుతో అమెరికా/రేమండ్ డేవిస్ ఇదంతా చేశారు.

2011 నాటి కేసులో ఇద్దరు పాక్ పౌరులను రేమండ్ డేవిస్ తానే కాల్చి చంపాడు. తన గూఢచార కార్యకలాపాలను వారు పసిగట్టారని గ్రహించి హత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు పౌరులను చంపడం కంటే మించిన తీవ్రమైన నేరం మరొకటి ఏముంటుంది? కాబట్టి రేమండ్ డేవిస్ వాస్తవంలో అత్యంత తీవ్రమైన హంతక నేరస్ధుడు. కనుక ఆయన కాన్సలార్ అధికారి అయినప్పటికీ అరెస్టుకు అతీతుడు కాదు. కానీ అమెరికా అతీతుడే అని వాదించింది.

దేవయాని ఒక డాక్టర్. ఆమె తండ్రి కూడా ఒక ఐ.ఏ.ఎస్ అధికారి. ఆమె భర్త ఫిలాసఫీ ప్రొఫెసర్. ఇద్దరు చిన్న పిల్లలకు ఆమె తల్లి. భారత కాన్సలేట్ లో డిప్యూటీ కాన్సల్ జనరల్. అనేక దేశాలలో విధులు నిర్వర్తించిన తర్వాత ఆమె అమెరికాలో నియమితులయ్యారు. ఆమె నెల వేతనం 6,500 డాలర్లు మాత్రమే. కాబట్టి పని మనిషికి 4,500 డాలర్లు చెల్లించడం ఏ విధంగా చూసినా సాధ్యం కాదు. భారత చట్టాల ప్రకారం చూస్తే ఆమెకు చెల్లించిన నెల వేతనం (30,000/-) ఎక్కువే. పోనీ అమెరికా చట్టాల ప్రకారం చూసినా అది పెద్ద నేరం కాదు. అందుకే అమెరికా తెలివిగా వేతనం తక్కువ చెల్లించిన కేసు కాకుండా వీసా మోసం కేసు పెట్టింది. తద్వారా ఆమె తీవ్రమైన నేరానికి పాల్పడ్డారన్న కృత్రిమ వాతావరణం కల్పించే ప్రయత్నం చేసింది. కార్మికవర్గం తరపున నిలిచేవారి సానుభూతి పొందడానికి కూడా ఈ కేసు ద్వారా అమెరికా ప్రయత్నించింది. తద్వారా అసలు విషయాన్ని కప్పి పెట్టి తానే మోసానికి పాల్పడింది. ఇంత చేసి దేవయాని వియన్నా ఒప్పందం పరిధిలోకి రాదని, పాత తేదీ నుండి ఐరాస రాయబార హోదా వర్తించదని వాదిస్తోంది.

అమెరికా ద్వంద్వ నీతికి, కపట బుద్ధికి, కర్ర పెత్తనానికి, బిగ్ బ్రదర్ ధోరణికి, వంచనకు ఇంతకు మించిన సాక్ష్యాలు కావాలా?

(సంగీతా రిచర్డ్ కుటుంబం అమెరికా కోసం పని చేసే గూఢచార కుటుంబం. గతంలో గే భాగస్వామిని ఇండియాకు తెచ్చుకున్న ఒక అమెరికా రాయబార ఉద్యోగిని భారత అధికారి ప్రశ్నించినందుకు ప్రతీకారంగానే అమెరికా తాజా సంక్షోభానికి తెరతీసింది. వివరాలు మరో ఆర్టికల్ లో)

One thought on “రేమండ్ డేవిస్ ని గుర్తు చేసుకో అమెరికా! -పాక్ మాజీ రాయబారి

  1. విశేఖర్ గారూ,
    ఈ రోజే ఆంధ్రప్రభ.కామ్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన కింది వ్యాసం చూడండి. నాకయితే చదవగానే ఒక్కసారిగా రక్తం మరిగినట్లయింది. దేవయాని ఆస్తులు పోగేసుకుందని, చాలా చోట్ల స్థిరాస్థులున్నాయని ఆరోపణలు చేస్తున్నవారు అసలు వాస్తవాన్ని విస్మరిస్తున్నారని ఈ కింది వ్యాసం అత్యంత స్పష్టంగా చెబుతోంది. ఇది ఇండియన్‍ఎక్స్‌ప్రెస్.కామ్ లోని ఒరిజినల్ వ్యాసానికి అనువాదం. రచయిత వి. సుదర్శన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు పత్రికలకు రాస్తున్నారు.

    ఈ వ్యాసాన్ని వీలైనంత మంది చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను.

    నా (అ) ప్రియమైన అమెరికా!
    http://www.andhraprabha.com/columns/my-(un)-dear-america/8613.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s