దేవయాని కేసు రద్దు చేసేది లేదు -అమెరికా


Devyani_Khobragade

భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా దేవయాని ఖోబ్రగదే పైన మోపిన కేసులను రద్దు చేయబోమని అమెరికా నిర్ద్వంద్వంగా ప్రకటించింది. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పింది. సంగీతా రిచర్డ్స్ పై ఢిల్లీలో నమోదు చేసిన కేసు విషయంలో భారత ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ అమెరికా పట్టించుకోలేదన్న ఆరోపణను కూడా అమెరికా తిరస్కరించింది. భారత ప్రభుత్వంతో తాము నిరంతరం సమాచారం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నామని అమెరికా వాదించింది. పైగా ఇండియాయే తమ లేఖలకు స్పందించలేదని స్పష్టం చేసింది.

దేవయానికి పూర్తి రాయబార రక్షణ కల్పించడానికి వీలుగా ఐరాసకు తరలించినప్పటికీ కేసు మాత్రం యధావిధిగా కొనసాగుతుందనీ, ఐరాస నియామకానికి ముందు నమోదయిన కేసుకు రాయబార రక్షణ వర్తించదని కూడా అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు భారత ప్రభుత్వ మంత్రులు మాత్రం ‘ఒట్టి అపాలజీ చాలదు, కేసులు రద్దు చేయాల్సిందే’ అని ప్రకటించడం మాత్రం మానలేదు. అసలు ఆపాలజీయే చెప్పలేదు పొమ్మంటుంటే ఆపాలజీ చాలదని బింకం ప్రదర్శిస్తున్న మన కేంద్ర మంత్రుల వ్యవహారమే అర్ధం కాకుండా ఉంది.

ఇంతకీ ఎవరు ఎవరితో ఎన్నిసార్లు సంభాషణలు జరిపారు? సంగీత రిచర్డ్స్ పైన న్యూ ఢిల్లీలో నమోదైన కేసు గురించి అమెరికాకు ఏడు సార్లు చెప్పామని భారత ప్రభుత్వం చెబుతోంది. జూన్ 23 తేదీన సంగీత రిచర్డ్స్ దేవయాని ఇంటి నుండి అదృశ్యం అయింది. ఆ తర్వాత రోజు నుండే ఆమె విషయమై ఇండియా ఫిర్యాదు చేస్తూ వచ్చింది. జూన్ 24, జూన్ 25, జులై 2, జులై 5, జులై 30, అక్టోబర్ 8, డిసెంబర్ 6 తేదీలలో సంగీతా రిచర్డ్స్ అదృశ్యం, కేసుల విషయంలో సంభాషణలు జరిపామని భారత్ చెబుతోంది. అమెరికా రికార్డులను పరిశీలించామని చెబుతూ బ్రిటిష్ పత్రిక డెయిలీ మెయిల్ కూడా భారత్ వాదనను ధృవీకరించడం విశేషం.

కానీ అమెరికా విషయానికి వస్తే కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా దేవయానిపై వేతన చెల్లింపుల విషయంలో సంగీతా రిచర్డ్స్ చేసిన ఫిర్యాదు గురించి తెలియజేయడానికి మాత్రమే లేఖ రాసిందని భారత్ చెబుతోంది. అమెరికావైపు నుండి కూడా ఇంతవరకూ ఈ ఒక్క లేఖ గురించే సమాచారం ఉంది తప్ప మరే ఇతర కమ్యూనికేషన్ గురించీ సమాచారం ఇవ్వలేదు. కానీ ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్ 20) హఠాత్తుగా తాము అనేకసార్లు భారత్ తో సంప్రతింపులు జరిపామని అమెరికా విదేశీ శాఖ ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పడం ప్రారంభించారు.

భారత ప్రభుత్వం పత్రికలు, మీడియా అసలు బాధితురాలు సంగీతా రిచర్డ్స్ విషయం వదిలి దేవయాని పట్ల అమెరికా పోలీసులు వ్యవహరించిన అమానవీయ తీరుపై కేంద్రీకరించడం పైన మన్ హట్టన్ (న్యూయార్క్, అమెరికా) ప్రాసిక్యూటర్ ప్రీత్ భరార తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. భారత న్యాయ వ్యవస్ధపైన కూడా ఆయన దాడి చేశారు. అయితే ప్రీత్ భరార వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అమెరికా విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ వెండీ షర్మన్ గురువారం ప్రకటించారు. తద్వారా ఇరు దేశాల మధ్య రగిలిన ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం అమెరికా నుండి జరిగిందని భారత పత్రికలు భావించాయి. కానీ ఈ రోజు మేరీ హార్ఫ్ ఇచ్చిన వివరణ ఆ మాత్రం ఊరటను కూడా పూర్వపక్షం చేసేసింది. “ఈ జెంటిల్మెన్ (ప్రీత్ భరార)… అమెరికా విదేశాంగ శాఖతో పని చేయడం గురించి, మేము ఏమి చేశామన్న విషయం గురించీ కొన్ని మంచిమాటలు కూడా చెప్పారు. కాబట్టి లా ఎన్ ఫోర్స్ మెంట్ (చెప్పే) విషయాలను కూడా తీవ్రంగానే తీసుకుంటాము” అని మేరీ హార్ఫ్ తెలిపారు. అంటే ప్రీత్ భరార వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న వెండీ షర్మన్ ప్రకటనకు ఇప్పుడు ఎలాంటి విలువా లేనట్లే.

దేవయాని కేసును ఉపసంహరించుకునే ఆలోచన తమకు లేదని మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు. “మేము ఆ ఆరోపణల నుండి ఏ విధంగానూ వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా మా విదేశాంగ శాఖ ప్రతి సంవత్సరం డిప్లొమేటిక్ నోట్స్ ద్వారా ప్రతి దేశానికీ తమ సిబ్బందిని ఈ దేశానికి తెచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెబుతూనే ఉన్నాము” అని మేరీ హార్ఫ్ తెలిపారు. పని మనుషుల వేతనాల విషయంలో మేము మొదటి నుండి చెబుతున్నాము కాబట్టి దేవయాని కేసు విషయంలో ఇప్పుడు వెనక్కి తగ్గేది లేదని మేరీ హార్ఫ్ చెబుతున్నారు.

ప్రీత్ భరార వాదనను కూడా మేరీ హార్ఫ్ వెనకేసుకొచ్చారు. భారత న్యాయ వ్యవస్ధ పైన ఆయన పరోక్షంగా చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఆమె సమర్ధించారు. (ఈ వ్యాఖ్యలనే తీవ్రంగా తీసుకుంటూ భారత విదేశాంగ శాఖ ప్రతి సమాధానం జారీ చేసింది.) సంగీతా రిచర్డ్స్ భద్రతకు హాని కలిగే పరిస్ధితి వచ్చిందని అందువలన ఆమెను ఇండియా నుండి అమెరికాకు తీసుకురావలసి వచ్చిందని ఆమె ప్రీత్ భరార మాటలనే వల్లె వేశారు. సంగీత కుటుంబ భద్రతకు హాని ఏర్పడే పరిస్ధితుల్లో వారి కుటుంబాన్ని తిరిగి ఒకటి చేయడానికి అమెరికా ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకుందని మేరీ తెలిపారు. సంగీత కుటుంబం వేధింపులకు గురవుతున్న విషయం తమ దృష్టికి వచ్చినందున ఇలా చేశామని ఆమె తెలిపారు. అంటే సంగీత కుటుంబాన్ని భారత ప్రభుత్వం, కోర్టులు వేధిస్తుంటే, వారిని కాపాడి న్యూయార్క్ తీసుకెళ్లామని అమెరికా స్పష్టంగా చెబుతోంది. భారత ప్రభుత్వ కేంద్ర పెద్దలు, విదేశాంగ శాఖ, ఘనత వహించిన మన అమెరికా అనుకూల ప్రధాని తమ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఇప్పటికైనా ఆలోచించాల్సి ఉంది.

సంగీతా మామగారు ఇండియాలోని అమెరికా ఎంబసీలో పని చేస్తున్నారని మేరీ హార్ఫ్ అంగీకరించింది. అయితే అమెరికా రాయబారి తన వ్యక్తిగత హోదాలోనే ఆయనను నియమించుకున్నారు తప్పితే ఆయన అమెరికా ప్రభుత్వ ఉద్యోగి కాదని ఆమె తెలిపారు. సంగీత రిచర్డ్స్ విషయంలో అమెరికాలోని భారత ఎంబసీ గానీ, ఇండియాలోని భారత విదేశాంగ శాఖ గాని అనేకసార్లు సంభాషణలు జరిపినా స్పందించలేదని చెప్పడం సరికాదు (highly inaccurate) అని ఆమె స్పష్టం చేశారు. ఈ సంభాషణల్లో కొన్ని ప్రైవేటు రాయబార సంభాషణలు మాత్రమేనని లేదా లా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగ బాధ్యతల రీత్యా సున్నితమైనవని చెప్పిన మేరీ హార్ఫ్ అవి రెండు వైపులా జరిగాయని మేరీ చెప్పడం గమనార్హం.

అంటే ఇండియా విజ్ఞప్తులకు తాము స్పందించామని ఆమె చెబుతున్నారు. భారత ప్రభుత్వమేమో తమకేమీ బదులు రాలేదని చెబుతోంది. ఎవరు నిజం చెబుతున్నట్లు? భారత ప్రభుత్వం తేదీలతో సహా తాము ఎప్పుడు విజ్ఞప్తి చేసిందీ చెబుతోంది. కానీ అమెరికా మాత్రం దాపరికంతో వ్యవహరిస్తోంది. వాటికి లా ఎన్ ఫోర్స్ మెంట్ ముసుగు తొడిగి వాటి గురించి విలేఖరులతో మాట్లాడకూడదు అన్నట్లు చెబుతోంది. ప్రపంచ ప్రజలందరి ఇంటర్నెట్, సెల్ ఫోన్ సంభాషణలను రికార్డు చేస్తూ, నిఘా పెడుతూ ‘టెర్రరిస్టులను పట్టుకోడానికి” అని చెప్పినట్లు!

అనేక అక్రమ చర్యలకు పాల్పడుతూ వాటికి జాతీయ భద్రత, టెర్రరిజంపై యుద్ధం లాంటి ముసుగులు తొడగడం అమెరికాకు ఉన్న అలవాటే. ఆ ముసుగులు నిలువునా చీరేసే నిజాలను అమెరికా పౌరులే వెల్లడి చేసినా ఈ వంకర బుద్ధిని మాత్రం అమెరికా సిగ్గు లేకుండా ప్రదర్శించుకుంటుంది. బ్రెజిల్, జర్మనీ, ఇండియా, మెక్సికో తదితర దేశాల ప్రభుత్వాధినేతల సెల్ ఫోన్ సంభాషణలను రికార్డు చేస్తూ కూడా ‘టెర్రరిజంపై యుద్ధం’ కోసం ఆ పని చేస్తున్నామని చెప్పుకునే తెంపరితనం అమెరికా సొంతం. జి20, ఈ.యు, ఐ.ఏం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు, అపెక్ తదితర అంతర్జాతీయ ఆర్ధిక, వాణిజ్య శిఖరాగ్ర సమావేశాల్లో కూడా నిఘా పెట్టి గూఢచర్యం చేస్తూ అది కూడా తమ జాతీయ భద్రత కోసం, టెర్రరిజంపై యుద్ధం కోసం చేస్తున్నామని చెప్పే పరమ సిగ్గులేని రాజ్యం అమెరికా. అలాంటి అమెరికా ఇండియా విజ్ఞప్తులకు అసలు సమాధానమే ఇవ్వకుండా ఇచ్చామని చెబుతూ కానీ అవి రహస్యం అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ప్రపంచం అంతా ఛీ అని ఛీదరించుకుంటూ ఎడ్వర్డ్ స్నోడెన్ లాంటి ఆ దేశ పౌరులే ఆ రాజ్యం (ప్రజలు కాదు) మొఖంపై ఊస్తున్నా శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ అదే ఎత్తుగడకు పాల్పడడం బట్టి అమెరికాతో సావాసం ఎంత సిగ్గుమాలిన పనో భారత పాలకులు గ్రహించాలి.

భారత అధికారులు చెప్పేదాని ప్రకారం దేవయాని-సంగీతా రిచర్డ్స్ వ్యవహారంలో అమెరికా ఇచ్చిన స్పందన ఒకే ఒకటి. అది సెప్టెంబర్ 4 తేదీన. ఆ తర్వాత మళ్ళీ దేవయానిపై డిసెంబర్ 12 న నేరుగా కేసు పెట్టారు. సెప్టెంబర్ 4 తేది లేఖ కూడా ఏక పక్షంగా రాసిందే తప్ప అందులో సంగీతా రిచర్డ్స్ పైన పెండింగులో ఉన్న అరెస్టు వారంటు విషయం గానీ, ఆమె బ్లాక్ మెయిలింగ్ ఫోన్ల విషయం గానీ, వెతికి తమకు అప్పగించాలన్న ఇండియా కోరికగానీ ప్రస్తావనకు నోచుకోలేదు. కానీ మేరీ హార్ఫ్ మాత్రం తాము విస్తృత సంభాషణలు (extensive conversations) జరిపామని చెబుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వ స్పందన ఏమిటో చూడాల్సి ఉంది.

(దేవయాని ఖోబ్రగదే పైన అమెరికాలో నమోదైన ఫిర్యాదు పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s