దేవయాని అరెస్టుకు ముందు అమెరికా ఎంబసీలో ఏం జరిగింది?


Our Sister

న్యూయార్క్ లో భారత (మాజీ) డిప్యూటీ కాన్సల్ జనరల్  దేవయాని ఖోబ్రగదే పై మోపిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇండియా డిమాండ్ చేస్తోంది. వీసా ఫ్రాడ్ కేసును అమెరికా కొనసాగించరాదని, కేసును వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదని భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ బుధవారం తనకు ఫోన్ చేశారని కానీ ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆయన తెలిపారు. అయితే ఇది నిజం కాకపోవచ్చని పత్రికలు సూచిస్తున్నాయి. కెర్రీ ఫోన్ కాల్ ను స్వీకరించకుండా ఉండడం ద్వారా దేవయాని అరెస్టు విషయంలో ఇండియా ఎంతగా అసంతృప్తితో ఉన్నదో చెప్పడానికి మంత్రి ప్రయత్నించారని అవి సూచిస్తున్నాయి.

సల్మాన్ వివరణ మాత్రం పత్రికల సూచనకు భిన్నంగా ఉన్నది. “జాన్ కెర్రీ ఫోన్ చేసినప్పుడు నేను లేను. ఈ రోజు సాయంత్రం ఆయన కాల్ లాగ్ అయ్యే విధంగా చూడడానికి ప్రయత్నిస్తున్నాము. కెర్రీ ప్రస్తుతం ఫిలిప్పైన్స్ లో ఉన్నారు. ఇరు దేశాల మధ్యా సమయంలో చాలా తేడా ఉంది” అని సల్మాన్ వివరించారని ది హిందు తెలిపింది.

“రాయబారి కేసు విషయంలో ఏమి జరిగిందీ వివరాలు ఇవ్వాలని నేను కోరాను… ఈ కేసును కొనసాగించరాదని మనం కోరుతున్నాం. దీన్ని ఇంతటితో ముగించాలి… మన సంబంధాలు భారీ పెట్టుబడితో కూడుకుని ఉన్నాయి. ఇదేమీ వెనక్కి తీసుకోలేని విషయం కాదు. ఈ అంశాన్ని మనం సున్నితంగా పరిష్కరించుకోవాలి” అని విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు.

1999 బ్యాచ్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దేవయానిని అమెరికా మిషన్ సర్వీస్ పోలీసులు డిసెంబర్ 12 తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాన్సల్ జనరల్ అధికారులకు రాయబార రక్షణ లేదని అమెరికా చెప్పిన నేపధ్యంలో దేవయానిని న్యూయార్క్ లోనే ఉన్న ఐరాస భారత శాశ్వత కార్యాలయంలో రాయబారిగా భారత ప్రభుత్వం నియమించింది. దానితో ఆమె అన్ని రకాలుగా రాయబార రక్షణలకు అర్హురాలు అయ్యారు. అమెరికా పోలీసులు మళ్ళీ దేవయానిని అరెస్టు చేయవచ్చని ఉప్పు అందడంతో భారత ప్రభుత్వం అత్యవసరంగా దేవయానిని ఐరాసకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా మార్షల్ సర్వీస్ పోలీసులు దేవయాని పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు జాన్ కెర్రీ విచారిస్తున్నారని ఆయన ప్రతినిధి మేరీ హార్ఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కు కెర్రీ ఫోన్ చేసి ఈ మేరకు విచారం వ్యక్తం చేశారని ఆమె తన లిఖిత ప్రకటనలో పేర్కొన్నారు. “దేవయాని వయసే ఉన్న ఇద్దరు కూతుళ్ల తండ్రిగా ఇండియా నుండి వస్తున్న ఆందోళనలతో సెక్రటరీ (ఆఫ్ స్టేట్) తన సహానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మీనన్ తో మాట్లాడుతూ ఆయన తన విచారం వ్యక్తం చేశారు. భారత్ తో అమెరికాకు ఉన్న సన్నిహిత, కీలకమైన సంబంధాలను దెబ్బతీసే విధంగా ఈ దురదృష్టకర సంఘటన పరిణమించరాదని ఆయన కోరుతున్నారు” అని మేరీ హార్ఫ్ ప్రకటన పేర్కొంది.

ఇంత చెప్పినప్పటికీ దేవయాని అరెస్టు విషయంలో తామేమీ తప్పు చేయలేదని జాన్ కెర్రీ ప్రతినిధి స్పష్టం చేయడం విశేషం. దేవయాని అరెస్టు సందర్భంగా ఆమె పట్ల వ్యవహరించిన తీరుపైనే కెర్రీ విచారం వ్యక్తం చేస్తున్నారు తప్ప అరెస్టు పట్ల కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కానీ మన మంత్రులు మాత్రం తెల్లగుర్రం ఎక్కినట్లు తూలి మాట్లాడడం మానలేదు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాధ్ అయితే  ఏదో నామమాత్రంగా విచారం వ్యక్తం చేస్తే సరిపోదనీ, అమెరికా తన తప్పును ఖచ్చితంగా గుర్తించి తీరాలనీ ప్రకటించారు. “మర్యాదపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తే సరిపోదు. అనుమానం లేని మాటల్లో వారు తమ తప్పును అంగీకరించి తీరాలి” అని ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.

దేవయాని తన పని మనిషికి వీసా కోసం ఒక కాంట్రాక్టు, ఆ తర్వాత వాస్తవంగా చెల్లించేందుకు మరొక కాంట్రాక్టు సంగీత రిచర్డ్స్ తో కుదుర్చుకున్నమాట వాస్తవం. మొదటి కాంట్రాక్టులో 4,500 డాలర్లు చెల్లిస్తామని చెప్పి రెండో కాంట్రాక్టు ద్వారా కేవలం 573 డాలర్లు మాత్రమే చెల్లించింది వాస్తవం. ఈ లెక్కన సింగీతా రిచర్డ్స్ కు దేవయాని కుటుంబం దాదాపు 35,000 డాలర్లకు పైగా బాకీ పడ్డారు. పైగా వారానికి 40 గంటలు పని చేయాల్సి ఉండగా రోజుకు 19 గంటలు పని చేయించారని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. బహుశా ఇది అతిగా చెప్పి ఉండవచ్చు. అందులో సగం వేసుకున్నా వారానికి 65 గంటలు పని చేయించుకున్నట్లు లెక్క. ఆ విధంగా ఇంకా ఎక్కువగానే దేవయాని, సంగీతా రిచర్డ్స్ కు బాకీ పడ్డారు. కానీ ఈ సందట్లో అందరూ విస్మరిస్తున్న విషయం ఏమిటంటే దేవయానికి భారత ప్రభుత్వం చెల్లించేదే నెలకు 6,500 డాలర్లు. అందులో 4,500 డాలర్లు తీసు పని మనిషికి చెల్లించడం అయ్యేపనేనా?

అయితే అమెరికా ప్రభుత్వం ఇంత గొప్ప కార్మికవర్గ పక్షపాతా? నిజానికి ఇదొక పెద్ద జోక్! పని వాళ్ళ కనీస వేతన చట్టాలను తాము తు.చ తప్పకుండా పాటిస్తాం అన్నట్లుగా అమెరికా న్యాయ శాఖ అధికారులు, విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడడం ఒక పెద్ద ప్రహసనం. విదేశీ పని మనుషుల వేతనం అటుంచి కనీసం స్వదేశీ పౌరుల వేతనాలకే అమెరికాలో దిక్కూ దివాణం లేదు. అమెరికాలో నిరుద్యోగాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించి చెప్పుకునే మోసానికి అమెరికా పాల్పడడం దాచేస్తే దాగని సత్యం.

ఉద్యోగం కోసం వెతికీ వెతికి, విసిగి వేసారి ఇక వెతకడం మానుకున్నవారిని నిరుద్యోగుల లెక్క నుండి తీసేస్తే తప్ప అమెరికాలో నిరుద్యోగం తగ్గని పరిస్ధితి. అమెరికాలో ఇంతగా నిరుద్యోగం పెరగడానికి కారణం ప్రభుత్వం వ్యయంలో కార్మికులు, ఉద్యోగుల కోసం ఖర్చు చేస్తున్న భాగాన్ని పెద్ద మొత్తంలో తగ్గించేసి వాల్ స్ట్రీట్ కంపెనీల లాభాలకు తరలిస్తున్న దగాకోరు రాజ్యం అమెరికా. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను ఊడబీకి ఇంటికి పంపిన దేశం అమెరికా. సంక్షోభం ఏర్పడడానికి కారణమైన బడా బహుళజాతి కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అప్పులు తెచ్చి దోచిపెట్టడం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకున్నట్లు, సంక్షోభం నుండి రికవరీ అయినట్లు చాటుకున్న దేశం అమెరికా.

సాధారణంగా సంక్షోభం నుండి రికవరీ సాధించడం అంటే కంపెనీలు విస్తరణ, లాభాలు ప్రకటించడంతో పాటు ఉపాధి కూడా అనివార్యంగా కలిసి ఉండాలి. కానీ ఉపాధి అసలు ఏమాత్రం కల్పించకుండా ‘జాబ్ లెస్ రికవరీ’ అంటూ సరికొత్త రికవరీ కనిపెట్టిన దేశం అమెరికా. తద్వారా మిలియన్ల మంది నిరుద్యోగాన్ని, అసామాన్య కష్టాలను అపహాస్యం చేసే దేశం అమెరికా. అలాంటి అమెరికా భారత దేశం నుండి వలస వచ్చిన, అది కూడా భారత రాయబారి తెచ్చుకున్న ఒక వ్యక్తి కనీస వేతనం గురించి ఇంతగా వాపోవడం, అలుపూ సోలుపూ లేకుండా నీతులూ సూత్రాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించడంతో సమానం అన్నా తక్కువే.

అలాంటి అమెరికా సంగీతా రిచర్డ్స్ గురించి ఎందుకు ఇంత దూరం వచ్చింది. సాధారణంగా అమెరికా ఇలాంటి అంశాలను రాయబార సంబంధాలను దెబ్బతీసే వరకూ అనుమతించదు. ఇక సంగీతా రిచర్డ్స్ లాంటి అనామకురాలినయితే అసలే పట్టించుకోదు. తన సొంత పౌరుడు ఎడ్వర్డ్ స్నోడెన్ పాస్ పోర్టు నే రద్దు చేయడం ద్వారా తన జాతీయ మాన మర్యాదలను రష్యా ముందు పారబోసుకున్న అమెరికాకు సంగీతా రిచర్డ్స్ కనీస వేతనం అసలు సమస్యే కాదు. దేవయాని ఘటన జరగడానికి ముందు ఇండియాలోని అమెరికా ఎంబసీలో ఇలాంటిదే ఏదో ఘటన జరిగింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురించిన ఒక వార్తలోని ఈ భాగాలను చూడండి.

Reports from Delhi also spoke of Sangeeta’s in-laws working for the American embassy in New Delhi, which would suggest that contacts within the US diplomatic community would have come into play in her battle against the Indian diplomat.

What role the US embassy in Delhi played in protecting a family member of its Indian staff, and whether it consequently resulted in harsh treatment of the Indian diplomat is something that might emerge in the coming days.

దీని ప్రకారం సంగీత రిచర్డ్స్ అత్త మామలు (లేదా బావా మరదళ్లు) న్యూ ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కోసం పని చేస్తున్నారు. ‘అమెరికా ఎంబసీలో పని చేస్తున్నారు’ అని కాదు ఇక్కడ చెబుతున్నది, ‘అమెరికా ఎంబసీ కోసం పని చేస్తున్నారు’ అని. ఎంబసీలోపని చేయడం అంటే అందులో విశేషం ఏమీ ఉండకపోవచ్చు (ఉండవచ్చు కూడా. కానీ నిర్ధారణగా కాదు). కానీ ఎంబసీకోసంపని చేయడం అంటే గూఢచారులుగా పని చేస్తున్నట్లు అర్ధం. ఈ సంబంధాల కారణంగా దేవయానికి వ్యతిరేకంగా సంగీతా రిచర్డ్స్ పడిన ఘర్షణలో సంగీతా కుటుంబం పై చేయి సాధించిందని టి.ఓ.ఐ చెబుతోంది.

అలాగే, ఇండియాలోని అమెరికా ఎంబసీ తన కార్యాయంలో పని చేసే భారతీయ సిబ్బంది వ్యవహారంలో ఎలాంటి పాత్ర పోషించిందో, దేవయాని పట్ల అమెరికా ఇంత కఠినంగా వ్యవహరించడానికి ఈ వ్యవహారమే కారణమా అన్నది రానున్న రోజుల్లో బైటపడక మానదు అని కూడా టి.ఓ.ఐ చెబుతోంది.

అనగా, ఇక్కడి అమెరికా ఎంబసీలో పనిచేసే భారతీయ సిబ్బంది ఒకరు అమెరికాకు అనుకూలంగానూ, ఇండియాకు వ్యతిరేకంగానూ పని చేశారని ఇక్కడ ధ్వనిస్తోంది. నేరుగా చెప్పాలంటే అమెరికా తరపున గూఢచారిగా భారతీయ సిబ్బందిని అమెరికా ఎంబసీ ఉపయోగించుకుని ఉండవచ్చు. అది కాస్తా మనవాళ్ళకు తెలిసి కట్టడి చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయోజనం వదులుకోవడానికి అమెరికా ఇష్టపడలేదు. దానిని సాధించడానికి దేవయాని వ్యవహారాన్ని అమెరికా బైటికి లాగిందని భావించవచ్చు. లేకపోతే దేవయాని అరెస్టుకు సరిగ్గా రెండు రోజుల ముందు సంగీతా రిచర్డ్స్ భర్తను, వారి ఇద్దరి పిల్లలను ఉన్నపళంగా వీసాలు ఇచ్చి న్యూయార్క్ తీసుకుపోయే ఆసక్తి అమెరికాకు ఎందుకు? ఇలాంటి వ్యవహారాలు అమెరికాకు కొట్టకాదు. ఆయా దేశాల్లో అక్కడి పౌరులనే గూఢచారులుగా నియమించుకోవడం, అది బైటపడినాక వారిని తమ దేశం తీసుకెళ్లి పౌరసత్వం ఇచ్చుకోవడం అమెరికా గతంలో అనేకసార్లు చేసింది. ఇలాంటి ఉదంతాలు ఇటీవల కాలంలోనే చైనా, రష్యాల విషయంలో జరిగాయి కూడా.

ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ చేసిన విమర్శ ప్రస్తావనార్హం. భారత ప్రజల ఇంటర్నెట్ కార్యకలాపాల పైనా, సెల్ ఫోన్ సంభాషణలపైనా అమెరికా గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఏ నిఘా పెట్టిందని, మొత్తం ప్రపంచ ప్రజలందరి వివరాలను, రోజువారీ కార్యకలాపాలనూ రికార్డు చేసి పెట్టుకుందని స్నోడెన్ పత్రాల ద్వారా బహిర్గతం అయినప్పుడు ఇతర దేశాలన్నీ ఖండించాయనీ కానీ ఇండియా మాత్రం ఒక్క మాటా అనలేదని ఆయన విమర్శించారు. ఇండియా విషయంలో తాము ఏమి చేసినా చెల్లిపోతుందన్న సందేశాన్ని భారత ప్రభుత్వం ఇచ్చేసిందనీ, అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. పనిలోపనిగా మోడి విషయం కూడా ఆయన లేవనెత్తారు. మోడీకి వీసా ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరని ప్రశ్నించకపోగా సంతోషించారని, ఇప్పుడు వగచి ఏమి ప్రయోజనం అనీ ఆయన ప్రశ్నించారు.

మోడి సంగతి పార్టీల మధ్య వ్యవహారం కాబట్టి కాసేపు పక్కన పెడదాం. కానీ ఎడ్వర్డ్ స్నోడేన్ పత్రాల ద్వారా అమెరికా గూఢచర్యం బైటపడినప్పుడు బి.జె.పి ఎందుకు ప్రశ్నించలేదు? భారత ప్రభుత్వం మౌనంగా ఉందన్న సంగతి ఆనాడే అరుణ్ జైట్లీ ఎందుకు ప్రశ్నించలేదు? పోనీ ఇప్పుడైనా ప్రశ్నించారు సరే. ఈ విషయాన్ని ఆయన ఇంతటితో వదిలేస్తారా లేక మునుముందు కూడా అప్రమత్తతతో ఉండి అమెరికా నుండి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తారా? కనీసం వారి ప్రభుత్వం వస్తేనయినా అమెరికాను నిలదీస్తామని అరుణ్ జైట్లీ చెప్పలేకపోయారు. బహుశా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండబట్టి ఈ మాత్రం అయినా అడుగుతున్నారు. పాలకపక్షంలో ఉంటే వారి స్పందనా ఇదే తరహాలో ఉండదా?

దేవయాని-సంగీత ల వ్యవహారం ఒక ముఖ్యమైన అంశాన్ని భారత ప్రజల ముందుకు తెచ్చింది. మన పాలకులకు జాతీయతా చైతన్యం గానీ, ప్రతిష్ట గానీ పెద్దగా ఉండవన్నదే ఆ అంశం. దేవయాని విషయం భారత దేశ ప్రతిష్టకు సంబంధించింది అయినప్పుడు ప్రజలందరి వ్యక్తిగత వివరాలను, రోజువారీ కార్యకలాపాలనూ అమెరికా గూఢచర్య కంపెనీలు రికార్డు చేస్తుంటే అది దేశ ప్రతిష్ట కాకుండా ఎలా పోతుంది. పైగా భారత ప్రభుత్వమే పనికట్టుకుని మరీ ఆధార్ పేరుతో బయో మెట్రిక్ వివరాలన్నీ సేకరించి సి.ఐ.ఏ పోషించే కంపెనీకి అప్పజెప్పడం ఏ విధమైన దేశభక్తి? ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాచాల్సిన ప్రశ్నలివి.

2 thoughts on “దేవయాని అరెస్టుకు ముందు అమెరికా ఎంబసీలో ఏం జరిగింది?

  1. ఈ విషయం నేపథ్యం లోతుగా విచారిస్తే ఇది కేవలం దేవయాని పనిమనిషికి ఇచ్చే జీతం వ్యవహారం మాత్రమే కాదని స్పష్టమౌతున్నది.ఇందులో మీరు రాసినట్లు అసలు సంగతి వేరే కోణం నుంచి చూడవలసివుంది.ఇంతకీ అమెరికా ఎంబసీలలో ఆయాదేశాలలో రెక్రూట్ చేసుకొనే పనివారికి అమెరికాలో ఇచ్చే జీతాలు ఇస్తారా?నెలకి 6000 డాలర్లు జీతం తెచ్చుకొనే ఆఫీసరు పనిమనిషికి 4500 డాలర్లు జీతం ఎట్లా ఇవ్వగలదు?ఏమైనా అమెరికన్ పోలీసులు దేవయానిని treat చేసిన పద్ధతి మాత్రం ఖండించవలసిందే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s