సిరియా ప్రభుత్వం తన రసాయన ఆయుధాలను విధ్వంసం చేయడానికి ఐరాసకూ, పశ్చిమ దేశాలకూ పూర్తిగా సహకరించినా అక్కడ విధ్వంసం ఆగలేదు. అమెరికా, ఐరోపాలు అందిస్తున్న ఆయుధ సహకారంతో తిరుగుబాటు మూకలు చెలరేగిపోతూనే ఉన్నాయి. అంతులేని మహా విధ్వంసాన్ని అనుభవిస్తున్న సిరియా ప్రజ శాంతిలేని మధ్యప్రాచ్యానికి సాక్షీ భూతంగా భగభగ మండుతూనే ఉంది. వందలు దాటి, వేలు గెంతి లక్షకు ఎగిసిన విగతులను తలచుకుంటూ సిరియా శిధిలాల మధ్య ఇంకా రోదిస్తూనే ఉంది.
మూడేళ్ళ మైలు రాయిని చేరుకోవడానికి ఉరుకులు పెడుతున్న సిరియా మహా మానవ విధ్వంసంలో ఇప్పటికీ లక్ష 20 వేలు నిహతులైనారని ఐరాస లెక్క కట్టింది. 0.9 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ ఇళ్లను వదిలిపెట్టి శరణార్ధులుగా తరలిపోయారని ఐరాస అంచనా. వెరసి రికార్డు స్ధాయిలో మానవతా సంక్షోభం నాగరీక ప్రపంచానికి సవాలు విసురుతోంది. ఈ పరిస్ధితిని సిరియా పైనా, మొత్తం ప్రపంచం పైనా రుద్దిన దేశాలు మాత్రం తెరముందు శాంతి మంత్రం జపిస్తూ తెరవెనుక మంటలు రాజేస్తున్నాయి.
సిరియా సంక్షోభాన్ని ఆదుకోవడానికి కనీస మాత్రంగానైనా 6.5 బిలియన్ డాలర్లు కావాలని ఐరాస ఇటీవల ఒక విజ్ఞప్తి చేసింది. ఒకే ఒక దేశంలోని సంక్షోభ పరిస్ధితుల సహాయానికి ఇంతమొత్తం సహాయం ఐరాస ఎన్నడూ అర్ధించలేదని పత్రికలు చరిత్ర చెబుతున్నాయి.
జనవరి 22, 2014 తేదీన జెనీవా నగరంలో అందరం కలిసి కూర్చుని చర్చించి సిరియా సమస్యకు ఒక పరిష్కారం చూపుతామని అగ్ర దేశాలు చెబుతున్నాయి. ఏ దేశాలయితే సిరియాలో అగ్గి రాజేసాయో ఆ దేశాలే అక్కడ శాంతిని స్ధాపిస్తామని నమ్మబలకడమే అక్కడ ఇంకా శాంతి నెలకొనకపోవడానికి ఏకైక కారణమని వేరే చెప్పనవసరం లేదు. కానీ తప్పదు. గోముఖ వ్యాఘ్రాలే ఎల్లెడలా సంచరిస్తూ పావురాల రెక్కల చప్పుడు అసలే వినరాని పరిస్ధితుల్లో బురదలోనే కమలం వికసిస్తుందని సంతృప్తి పడడమే మిగిలింది.
రష్యా దౌత్యం మేరకు సిరియాపై అమెరికా, పశ్చిమ రాజ్యాలు దురాక్రమణ దాడి తృటిలో తప్పిపోయింది. హామీ ఇచ్చిన మేరకు తన రసాయన ఆయుధాలన్నింటినీ ఐరాస-అమెరికా-ఐరోపా పరిశీలకులకు సిరియా అప్పజెప్పింది. దీనితోనైనా ఇస్లామిస్టు తిరుగుబాటు మూకలకు పశ్చిమ దేశాల నుండీ, సౌదీ, ఖతార్ లాంటి రాచరిక మహమ్మారుల నుండీ ఆయుధ, ధన సహాయం బంద్ అవుతుందనీ, సిరియా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించినవారికి తీవ్ర నిరాశే మిగిలింది. జెనీవా చర్చల తేదీ దగ్గర పడే కొద్దీ అక్కడ విధ్వంసం, మానవ హననం పెట్రేగిపోతోంది తప్ప ఉపశమిస్తున్న దాఖలా లేదు. చర్చల లోపు సాధ్యమైనంత పై చేయి సాధించాలని వైరి పక్షం సాగిస్తున్న ప్రయత్నాలు సిరియా ప్రజల పాలిట మృత్యు ఘోష వినిపిస్తున్నాయి.
గత మూడు, నాలుగు నెలలుగా సిరియా వ్యాపితంగా కెమెరా కంటికి చిక్కిన విధ్వంసం తాలూకు ఫొటోలివి. The Atlantic పత్రిక ప్రచురించింది.
పింగ్బ్యాక్: సిరియా: అంతులేని విధ్వంసం, శాంతిలేని మధ్యప్రాచ్యం | ugiridharaprasad
Reblogged this on ugiridharaprasad.