దెబ్బకు దెబ్బ: అమెరికా రాయబారుల హోదా కుదించిన ఇండియా


U.S. consulate building in Mumbai

U.S. consulate building in Mumbai

భారత ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) అధికారి దేవయాని అరెస్టుకు ఇండియా లేటుగా అయినా ఘాటుగా స్పందిస్తోంది. న్యూయార్క్ లోని ఇండియా కాన్సల్ జనరల్ కార్యాలయంలో డిప్యూటీ కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న దేవయానిని అరెస్టు చేయడమే గాక దురహంకార పూరిత పద్ధతుల్లో ఆమెను బట్టలు విప్పించి వెతికారని, పెట్టీ దొంగలు, వ్యభిచారుణులు, హంతకులతో కలిపి పోలీసుల సెల్ లో నిర్బంధించారని వార్తలు వెలువడిన నేపధ్యంలో ఇండియాలోని అమెరికా రాయబారుల పట్ల తాము వ్యవహరిస్తున్న తీరును సమీక్షించుకునే పనిలో భారత ప్రభుత్వం పడిపోయింది. ఇండియా చట్టాలను అమెరికా కాన్సల్ అధికారులు సక్రమంగా పాటిస్తున్నదీ లేనిదీ సమీక్షిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

దేవయాని పట్ల తమ అనుచిత ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేయకపోగా వివిధ స్ధాయిల్లోని అమెరికా అధికారులు, రాయబారులు సమర్ధించుకుంటూ మాట్లాడడంతో భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మొదటి చర్యగా అమెరికా కాన్సల్ అధికారుల స్ధాయిని అమెరికా చెప్పిన భారత్ కాన్సల్ అధికారుల స్ధాయికి తగ్గించింది. అంటే ఇన్నాళ్లూ అమెరికా కాన్సల్ అధికారులకు ఒక స్ధాయి గౌరవం మనవాళ్లు ఇస్తుంటే అమెరికా అధికారులు మాత్రం అంతకంటే తక్కువ స్ధాయిని మన కాన్సల్ అధికారులకు ఇస్తున్నారనీ, దానిని మనవాళ్లు ఇన్నాళ్లూ భరించి ఊరుకున్నారని అర్ధం అవుతోంది.

ఏయే చర్యలు?

అమెరికా రాయబారులకు, వారి కుటుంబ సభ్యులకు భారత ప్రభుత్వం ఇన్నాళ్లూ ఇస్తున్న గౌరవ స్ధాయిని కుదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారందరికీ విమానాశ్రయాల్లో చెకింగ్ లేకుండా వెళ్ళే పాస్ లను రద్దు చేసింది. అమెరికా రాయబార కార్యాలయానికి ఇచ్చిన దిగుమతి క్లియరెన్స్ లను వెనక్కి తీసుకుంది. అమెరికా కాన్సలేట్ కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరూ వెంటనే తమ గుర్తింపు కార్డులు చూపాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అనధికారికంగా అమెరికా ఎంబసీ, కాన్సలేట్ ల పేరు చెప్పుకుని ఇండియాలో కొనసాగుతున్న సిబ్బందిని ఏరివేసే ప్రయత్నాలు ప్రారంభించింది.

అమెరికా కాన్సలేట్ లలో నియమించుకున్న భారతీయ సిబ్బందికి ఎంతెంత వేతనాలు చెల్లిస్తున్నదీ వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది. కాన్సలేట్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, వారు నియమించుకున్న పని మనుషులు ఎంతెంత వేతనాలు పొందుతున్నదీ వివరాలు ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది. తద్వారా భారత కనీస వేతన చట్టాలను, ఇతర చట్టబద్ధ నియమ నిబంధనలు అమెరికా అధికారులు, సిబ్బంది ఎంత చక్కగా పాటిస్తున్నదీ ప్రభుత్వం తేల్చబోతోంది.

అమెరికా (నిర్వహిస్తున్న?) పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల వేతన వివరాలనూ, భారతీయ సిబ్బంది వేతన వివరాలనూ, వారి బ్యాంకు ఖాతాల వివరాలనూ ఇవ్వాలని కోరింది. న్యూ ఢిల్లీలోని న్యాయ మార్గ్ రోడ్డులో ఉన్న అమెరికా ఎంబసీ వద్ద ఎంబసీ సిబ్బంది సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బ్యారీకేడ్లను ప్రభుత్వం తొలగించింది. పోలీసు పికెట్ మాత్రం కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

మన బంగారం మంచిదయితే…

ఈ చర్యలన్నీ భారత ప్రభుత్వం అమెరికా ఎంబసీ, కాన్సలేట్ ల అధికారులకు ఇన్నాళ్లూ కల్పిస్తూ వచ్చిన అనవసర సౌకర్యాలను ఎత్తి చూపుతున్నాయి. మన అధికారులు అవమానం పొందే వరకూ అయినా సరే భారత ప్రజలు కడుతున్న పన్నులను ఈ విధంగా వృధా చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉన్నదా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తున్నాయి. 

Devyani Khobragade’s father Uttam Khobragade

Devyani Khobragade’s father Uttam Khobragade

భారత దేశంలో పని చేస్తున్న అమెరికా కాన్సల్ అధికారులు అందరూ తమ గుర్తింపు ధృవపత్రాలను తమకు ఇచ్చేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ తెలిపింది. ఈ గుర్తింపు పత్రాలు వారి వద్ద ఉన్నపుడే వారికి రాయబార రాయితీ (diplomatic immunity) వర్తిస్తుంది. భారత ఎంబసీ అధికారులకే ఇలాంటి రాయితీ ఇచ్చాము తప్ప భారత కాన్సల్ అధికారులకు diplomatic immunity తాము ఇవ్వలేదనీ, ఈ పద్ధతిని తాము అన్నీ దేశాలకూ వర్తింపజేస్తున్నామనీ అమెరికా విదేశాంగ అధికారులు వివరణ పేరుతో విర్రవీగిన నేపధ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పరమ ఆవశ్యం. ఇన్నాళ్లూ అమెరికా విధానాలకు సరితూగే విధానాలనే అమలు చేయకపోవడమే మనవాళ్లు చేసిన తప్పు.

మరీ ఘోరమైన సంగతి ఏమిటంటే ఈ విధంగా ఎంబసీ అధికారులకు మాత్రమే రాయబార హోదా రాయితీ ఇవ్వడం, కాన్సల్ జనరల్ అధికారులకు ఇవ్వకపోవడం గురించి ఇండియా ఎన్నాళ్లుగానో అమెరికాతో చర్చలు జరుపుతూ ఉండడం. ఎంబసీ అధికారులకు ఇచ్చే హోదానే కాన్సల్ అధికారులకు కూడా ఇవ్వాలని ఇండియా అనేక సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ అమెరికా అందుకు నిరాకరిస్తూ వచ్చింది. తమ చట్టాలు అందుకు ఒప్పుకోవని కారణం చెపుతూ వచ్చింది.

కానీ ఇండియా లాంటి ఇతర దేశాలు తమ కాన్సల్ సిబ్బందికి కూడా ఇస్తున్న రాయబార హోదా రాయితీలను సుబ్భరంగా, సిగ్గు లేకుండా అనుభవిస్తూ వస్తోంది. మనం ఇస్తున్నప్పుడు వారు వద్దని ఎందుకంటారు? ఇప్పుడు తీరా మన దేశపు అత్యున్నత సర్వీసులలో ఒకటైన ఐ.ఎఫ్.ఎస్ అధికారిని కూడా అరెస్టు చేయడమే కాకుండా మహిళ అన్న సెన్సిటివిటీ కూడా లేకుండా బట్టలు విప్పించి తనిఖీ చేయడమే కాక రోజంతా హంతకులు, వ్యభిచారులతో సమానంగా సెల్ లో ఉంచడంతో తాము చేస్తున్న ‘అతి’ ఏమిటో భారత ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. మన బంగారం మంచిది కానప్పుడు….

అమెరికా ప్రతినిధులకు నో ఇంటర్వ్యూ

దేవయాని ఖోబ్రగదే ఎదుర్కొన్న పరిస్ధితికి ప్రతీకారంగా భారత ప్రభుత్వంలోని వివిధ స్ధాయిల అధికారులు, నాయకులు కూడా తమకు అవకాశం వచ్చిన పద్ధతుల్లో స్పందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ (House of Representatives – ప్రతినిధుల సభ) సభ్యుల బృందం ఒకటి ఇండియా పర్యటనలో ఉన్నది. వారిని కలవడానికి నిరాకరించడం ద్వారా అమెరికా చేసిన తప్పును ఎంచి చూపడానికి భారత నాయకులు ప్రయత్నిస్తున్నారు.

లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అమెరికా కాంగ్రెస్ సభ్యుల బృందాన్ని కలవడానికి ఇచ్చిన అపాయింట్ మెంట్ ను సోమవారం రద్దు చేసేశారు. తమ కాన్సల్ అధికారి దేవయానికి సంకెళ్లు వేసి అవమానకర పరిస్ధితుల్లో తనిఖీ చేయడానికి ప్రతీకారంగానే తాను ఈ ఇంటర్వ్యూను రద్దు చేస్తున్నానని చెప్పి మరీ రద్దు చేశారామె. మీరా కుమార్ కూడా పూర్వాశ్రమంలో ఐ.ఎఫ్.ఎస్ అధికారి కావడం గమనార్హం. ఒక సీనియర్ భారత రాయబార అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపధ్యంలో తాను అదే దేశానికి చెందిన బృందాన్ని ఏమీ జరగనట్లు కలవడం భావ్యం కాదని ఆమె భావించారని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. పైగా తమ చర్యల పట్ల అమెరికా అధికారులు ఏ మాత్రం విచారం వ్యక్తం చేయకపోవడం పట్ల ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

స్పీకర్ మీరా కుమార్ అడుగుజాడలనే ఇతర నాయకులూ నుసరించారు. కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడానికి నిరాకరించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమెరికా ప్రతినిధి బృందానికి ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేశారు. భారత జాతీయ భద్రతా సలహాదారు శివ శంకర్ మీనన్ సైతం అమెరికా బృందాన్ని కలవడానికి నిరాకారించారు. దేవయాని ఎదుర్కొన్న అనుభవం ‘అతి నీచంగా, క్రూరంగా ఉంది’ అని శివ శంకర్ మీనన్ అభివర్ణించారు. అయితే విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మాత్రం వీరికి భిన్నంగా ప్రవర్తించారు. అమెరికా కాంగ్రెస్ సభ్య బృందాన్ని ఆయన కలిశారు. దేవయాని పట్ల ప్రవర్తించిన తీరుపై నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.

కానీ ఎంతమంది అమెరికా బృందాన్ని కలవడానికి నిరాకరించినా లెక్కకు వచ్చేది మాత్రం మన విదేశాంగ మంత్రి చర్యే. ఎందుకంటే భారత దేశంతో విదేశాలకు ఉండే సంబంధాలన్నింటికీ విదేశీ మంత్రే బాధ్యుడు. అలాంటి ప్రధాన వ్యక్తి నుండి ‘తగిన చర్య’ లేకుండా ఇతర అధికారులు, నాయకులు ఎన్ని చర్యలు తీసుకున్నా లెక్క ఉండదు. విదేశాంగ మంత్రి ద్వారానే తగిన నిరసన తెలియజేసే అవకాశాన్ని భారత ప్రభుత్వం వదిలేసుకుంది. ప్రధాన వ్యక్తి ఏమీ జరగనట్లు వ్యవహరిస్తూ ఇతర అధికారులు ఎంత నిరసన తెలియజేస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? భారత ప్రభుత్వ అసంతృప్తి తెలియజేయాల్సిన అసలైన వ్యక్తి విదేశాంగ మంత్రి మాత్రమే. ఆయనే యధావిధిగా అమెరికా బృందాన్ని కలుసుకుంటే ఇక భారత ప్రభుత్వ నిరసనకు, అసంతృప్తికి ఎంత మాత్రం బరువు వచ్చి చేరుతుంది?

భారత ప్రభుత్వ అసంతృప్తిని తెలియజేయడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. అమెరికా ఎంబసీలో పని చేస్తున్న భారతీయ సిబ్బంది జీత భత్యాలను పరిశీలించడం ఇందులో ఒకటి. భారతీయ చట్టాల ప్రకారమే సామాజిక భద్రతా చెల్లింపులు జరుగుతున్నాయా లేదా కూడా పరిశీలించనున్నారు. ఇన్ని చర్యల తర్వాత కూడా అమెరికా లొంగి రాకపోతే అమెరికా రాయబారులు ప్రతి భారతీయ చట్టాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారా లేదా అని జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభిస్తామని భారత రాయబార అధికారులు చెప్పారని పత్రిక తెలిపింది. “మన ఇంటి పనివాళ్ళకు మనం ఇచ్చే సౌకర్యాలను డబ్బుతో లెక్కించడం ప్రారంభిస్తే అది కూడా పెద్ద మొత్తమే అవుతుంది. పని మనిషిని దోపిడి చేస్తున్నామనడానికి అవకాశమే ఉండదు” అని ఒక సీనియర్ రాయబార అధికారి చెప్పారని ది హిందు తెలిపింది.

“ఈ అంశాలన్నీ అమెరికా పరిశీలించాలి. లేకపోతే మనకి కూడా చాలా తెలుసు. తమ స్వలింగ సంపర్క భాగస్వాములందరినీ ఇండియాకు తెచ్చుకుంటున్నవారెవరో మాకు బాగానే తెలుసు. వారికి ఏ ప్రాతిపదికన వీసాలు ఇవ్వాలని కోరారో కూడా మన దృష్టిలో ఉంది. నిజానికి ఇలాంటివాటికి అవకాశం లేని విరుద్ధమైన చట్టాలు ఇండియాలో ఉన్నాయి. మనం దాని గురించి పెద్దగా మాట్లాడలేము. ఎందుకంటే ఈ చట్టాలు వివాదాస్పదం. నేటి కాలానికి సరితూగనివి. కానీ అమెరికా అంతదూరం వెళ్లదలుచుకుంటే గనక ఇలాంటి చట్టాలతో పాటు అనేక అవకాశాలు మనకు అందుబాటులో ఉన్నాయి” అని సదరు సీనియర్ అధికారి పేర్కొన్నారు.

కానీ ఇలాంటి అడ్డదారులు తొక్కడం కంటే మన కాన్సల్ అధికారులకు, రాయబార అధికారులకు తగిన మొత్తంలో భత్యాలు చెల్లించడం తగిన చర్య కాదా? పనివాళ్ళకు తగిన వేతనాలు చెల్లించేందుకు అనువుగా రాయబార, కాన్సల్ అధికారులకు అలవెన్సులు పెంచడం మాని మనం కూడా ‘నక్కలు బొక్కలు వెతుకును’ తరహాలో వ్యవహరిస్తే అమెరికా ప్రవర్తనకూ మన ప్రవర్తనకూ ఇక తేడా ఏమిటి?

మరో అధికారి ఏమంటున్నారంటే “ఆమెను తన పిల్లల ముందు అరెస్టు చేయడం, బట్టలు విప్పించి తనిఖీ చేయడం, కరుడుగట్టిన నేరస్ధులు, సెక్స్ వర్కర్లు ఉన్న సెల్ లో లాకప్ చెయ్యడం… ఈ చర్యలేవీ తగినంత అనుచిత చర్యలు కాదని అమెరికా చెప్పదలుచుకుంటే తీవ్రం కానీ నేరానికి రాయబారుల పట్ల ఈ తరహాలో ప్రవర్తించడం ‘ప్రోటోకాల్ కి అనుగుణమే’ అని అమెరికా చెబుతున్నట్లే అర్ధం” అని. అనగా చిన్నా, చితకా తప్పులు చేస్తున్నా అమెరికా కాన్సల్ అధికారులను మనం చూసీ చూడనట్లు ఊరుకుంటున్నామనీ ఇకనుండి అలా జరగదని సదరు అధికారి చెబుతున్నారు. నిజానికి దురహంకారంతో వ్యవహరించే అమెరికా అధికారులకు అలాంటి ప్రవర్తనను అనువర్తింపజేయడమే సరైన ప్రోటోకాల్ అని మన అధికారులకు తెలియాల్సి ఉంది.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను మన దేశంలోనే అమెరికా విమాన సంస్ధ అధికారులు ఒళ్ళంతా తడిమి, చెప్పులు విప్పించి తనిఖీ చేసినా నోరు మూసుకుని ఊరుకున్నాం. మన సిక్కు సోదరులను టెర్రరిస్తులుగా అనుమానిస్తూ విమానాల్లో, విమానాశ్రయాల్లో అనేక రకాలుగా వేధించినా నోరు మూస్కున్నాం. మన మహిళా రాయబార అధికారిని అమెరికా యూనివర్సిటీ అధికారుల ఆహ్వానం మేరకు ప్రసంగించడానికి వెళ్తున్న తరుణంలో ఆమె చీర ధరించి ఉన్నందుకు క్యూ నుండి పక్కకు లాక్కెళ్ళి బట్టలు విప్పించినంత పని చేసినా నోరు మూసుకున్నాం. మహా అయితే నిరసన తెలిపి ఊరుకున్నాం. కానీ బ్రెజిల్ అలా ఊరుకోలేదు. అమెరికా ఎన్నెన్ని దుష్కార్యాలు చేసిందో అన్నీ చర్యలనూ అమెరికా అధికారులు, పౌరుల పట్ల బ్రెజిల్ అనుసరించింది. అమెరికా పౌరులకు ప్రత్యేక క్యూలు పెట్టి మరీ వారిని నఖశిఖ పర్యంతం తనిఖీ చేసే పద్ధతులను బ్రెజిల్ అనుసరిస్తోంది. చైనా, రష్యా లాంటి దేశాలకు ఇలాంటిదే జరిగితే ఈపాటికి ప్రపంచం అంతా గగ్గోలు పుట్టి ఉండేది. వ్యాపార సంబంధాలు చెడిపోయేవరకూ పరిస్ధితి వెళ్ళేది.

కానీ మనం మాత్రం అడ్డదారులు వెతుక్కుంతున్నాం. బ్రెజిల్, చైనా, రష్యా తరహాలో స్పందించాలంటే మొదట మన నాయకులకు జాతీయతా చైతన్యం (national consciousness) ఉండాలి. ‘మన దేశం’ అన్న పౌరుషం ఉండాలి. అది లేనినాడు అడ్డదారులు వెతుక్కోవడమే మిగులుతుంది.

అమెరికాలోగానీ, ఇండియాలో గానీ మనవారి పట్ల అమెరికా ప్రవర్తన ఏమిటో ఈ కింది ఘటనలు తెలియజేస్తాయి.

భారత రాయబారి కూతురికి అమెరికా స్కూల్‌లో ఘోర పరాభవం, పరువు నష్టం కేసు దాఖలు

అమెరికా పొగరు: మరోసారి షారుఖ్ నిర్బంధం

మాజీ రాష్ట్రపతి ‘కలాం’ వళ్ళంతా వెతికిన తెల్లతోలు దురహంకారులు

Sari-clad Indian envoy in US faces pat-down search

4 thoughts on “దెబ్బకు దెబ్బ: అమెరికా రాయబారుల హోదా కుదించిన ఇండియా

  1. మొదట ఈ కేసుగురించి విన్నప్పుడు ఇంత పెద్ద కుట్ర ఉంటుంది అనుకోలేదు… ఎప్పుదో ఇటలి నావికుల ఇష్యుకి ఇది ప్రతికారం అంటే నిజంగా షాకింగా అనిపించింది….

  2. ఇటలి నావికుల ట్రీట్ మెంట్ కి ఇది ప్రతీకారం అన్నది కొన్ని పత్రికల ఊహ మాత్రమే. ఇంకా రుజువు కాలేదు. ముఖ్యంగా భారత అధికార వర్గాల నుండి ఈ ధియరీకి మద్దతుగా మాటలేవీ ఇంతవరకు లేవు. వారి నుండి నిర్ధారణ కాకపోయినా కనీసం సూచన వచ్చినా మనం నిర్ధారించుకోవచ్చు.

  3. ఇటలి నావికుల ఇష్యు తాలూకా కాకపోయిన ఖచ్చితంగా ఇందులో ఎదో కుట్ర దాగుంది.. మన ప్రభుత్వం అమెకు ప్రమోషన్ ఇవ్వకుండా అమెరికాను నేరుగా ఢీకొంటే ఇంకా బాగుండేదేమో….

  4. ద్రౌపది వస్త్రాపహరణం చేసిన అమెరికా సార్వభౌమత్యాన్ని అడ్డుకోలేక మనం వాళ్ళ బట్టలను కుదించి కట్టుకోమనడం పెద్ద ఘనకార్యంమేమి లేదు. వాళ్ళెప్పుడు కురచ బట్టలుతోనే వుంటారు. కళ్ళతో మౌనంగా చూసే మనం ఒక్క అడుగు ముందుకేసి వేలెత్తి చూపుతున్నాము.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s