తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్


Telangana; Game of snakes and ladders

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సంగతేమో గానీ ఆ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు పరమ జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని ప్రబుద్ధులు కొందరు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి కొందరు తెలంగాణ వస్తే చాలు ఇక స్వర్గమే అన్నట్లుగా ‘అరచేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. ఇద్దరూ కలిసి అటూ, ఇటూ జనాన్ని ఎంతగా వంచించగలరో అంతా వంచిస్తున్నారు.

కాకపోతే అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా పాలక, ప్రతిపక్ష సభ్యులు అంతా ఆడుతున్న దాగుడుమూతలాట ఎలా అర్ధం చేసుకోవాలి? తెలంగాణ ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని లేఖ ఇచ్చిన టి.డి.పి నేత తీరా తెలంగాణ ఇచ్చే ప్రక్రియలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నానా విధాలా తూలనాడుతున్నారు. ‘సమ న్యాయం’ అంటూనే దానికి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనా ముందుకు తీసుకురాకుండా సీమాంధ్ర ప్రజలను ఆకర్షించడానికి వింత వింత డైలాగులు వాళ్లిస్తున్నారు. ఒక పక్క అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసి తీరా ఏర్పాటు చేస్తే అభిప్రాయం చెప్పకుండా తప్పుకుంటారు.

వైకాపా పుట్టి మూడేళ్లయిందేమో! కానీ ఆ పార్టీ వేసిన కుప్పి గంతులు మరో పార్టీ వేసిందా అంటే అనుమానమే. తమ అధినేతకు బెయిలు ఇచ్చిన కృతజ్ఞతను ఎలా చూపుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నదా అన్నట్లుగా తడవకొక మాట చెబుతూ వచ్చింది. తెలంగాణకు అనుకూలంగా సి.డబ్ల్యూ.సి నుండి ప్రకటన రాకముందే తమ సీమాంధ్ర ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తాను ఎవరి డైరెక్షన్ లో నడుస్తున్నదీ చెప్పకనే చెప్పింది. కాదు కాదని ఆ పార్టీ నేతలు ఎన్నిసార్లు చెప్పుకున్నా, సీమాంధ్ర ప్రజల ఓట్లకు గాలం వేయడానికి కాంగ్రెస్ తరపున వైకాపా పని చేస్తోందని చెప్పడానికి తగిన ఆధారాలను ఆ పార్టీ నేతలే ఇస్తున్నారు.

తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ ముఖ్యమంత్రిని ఎందుకు కట్టడి చేయదు? కట్టడి చేయలేకపోతే ఎందుకు తొలగించదు? ‘మీ ముఖ్యమంత్రి అతిగా మాట్లాడుతున్నాడు’ అని కేంద్ర మంత్రి ఆజాద్ అంటుంటే, ‘కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త’ అని దిగ్విజయ్ సింగ్ ఎలా ప్రకటిస్తారు? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి లే తమ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్న విడ్డూరం భారత ప్రజాస్వామ్య వ్యవస్ధ గొప్పతనానికి సంకేతమా లేక పతన విలువలకు పరాకాష్టా? పార్టీ స్వభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నించే నిస్పాక్షిక పరిశీలకులకు కూడా ఎంతమాత్రం అంతు దొరకని ప్రవర్తన కాంగ్రెస్ పార్టీది అంటే అతిశయోక్తి కాదేమో. జనాన్ని అయోమయంలో ఉంచడం ద్వారా కూడా లబ్ది పొందగల చతురత కాంగ్రెస్ వ్యూహకర్తల సొంతం.

సీమాంధ్ర ప్రజల ఆందోళనలను, సమస్యలను పరిష్కరించాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని బి.జె.పి నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. అందుకోవడమే గానీ అందులో వివరాలు ఏమీ ఉండవు. సీమాంధ్ర ప్రజల సమస్యలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించాలి? అన్న ప్రశ్నలకు బి.జె.పి నుండి ఎందుకు వివరమైన సమాధానాలు ఉండవు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప బి.జె.పి కొత్త అవగాహన జనానికి ఏ విధంగా ఉపయోగం?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన వల్లనే సాధ్యం అవుతోందని చెప్పుకోవాలన్నది టి.ఆర్.ఎస్ ఆరాటం. ఆ ఆరాటంలో ఆ పార్టీ ఛోటా యువనాయకుడు నోరు పారేసుకోని రోజంటూ లేదు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఏర్పాటు చేస్తోంది గనక తెలంగాణ ఓట్లన్నీ నొల్లుకుని ముఖ్యమంత్రి పీఠం పొందాలని అనేకమంది కాంగ్రెస్ నేతల ఆరాటం. ఈ ఆరాటం ఉన్న నాయకుల జాబితా తీస్తే అది కొండవీటి చాంతాడే. టి.ఆర్.ఎస్ విలీనం అయితే తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎం.పి సీట్లు కూడా గరిష్టంగా పొందాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంటే, కాంగ్రెస్ ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించి బేరసారాల్లో పైచేయి సాధించాలని టి.ఆర్.ఎస్ పై ఎత్తులు వేస్తోంది. ఈ ఎత్తులు పై ఎత్తుల రంధిలో నాలుగు సీట్లన్నా రాలవా అని బి.జె.పి పోరాటం.

సీమాంధ్రలోనేమో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గట్టిగా, ఎంత పెద్దగా, ఎంత బిగ్గరగా వ్యతిరేకిస్తే అన్నీ ఓట్లు అన్నట్లుగా ఉంది పరిస్ధితి. అందరికంటే ముందు రాజీనామాలు ఇవ్వడం ద్వారా తాము ముందున్నామని వైకాపా సంతోషించే లోపే యాత్రల పేరుతో చంద్రబాబు ‘కాదు నేనే ముందు’ అని చాటుకున్నారు. ‘తెలంగాణ ఇవ్వడం వల్ల మా పార్టీకి పుట్టగతులు ఉండవు. పార్టీని ఆరడుగుల గోయ్యి తీసి పాతేశారు’ అంటూ కాంగ్రెస్ ఎమ్మేల్యేలు, మంత్రులే తమ కేంద్ర నాయకులను శాపనార్ధాలు పెట్టడం ద్వారా ఓట్ల రేసులో ముందు నిలబడడానికి శతవిధాలా ప్రయత్నించడం మరొక ప్రహసనం. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించే వరకూ వెళ్ళిన ఈ ప్రహసనం తమకు 50 మంది మద్దతు కూడా వచ్చేసిందని తాజాగా చిందులు తొక్కుతోంది. తమను తాము కాంగ్రెస్ రెబెల్స్ గా చెప్పుకోడానికి కూడా లగడపాటి లాంటివారు వెనకాడని ఈ ప్రసహనానికి తగిన ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సిందే.

3 thoughts on “తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్

  1. రాజకీయ స(ర)0కుల సమరంలో తెలంగాణ క్రెడిట్‌, ఓట్ల క్రెడిట్‌ ఎవరిదో, కొట్టు మిట్టాడుతున్న ప్రజలే నిర్ణయీంచాలి!

  2. ఒకవేళ తెలంగాణా ఏర్పాటు 2014 ఎన్నికల షెడ్యూల్ విడుదల లోపు జరగకుండా వాయిదా పడితే ఎన్నికల ప్రచార సమయంలో ఇంకెన్ని నాటకాలు చూడాలో…

  3. పరమపదసోపానంలో తెలంగానం అటు నిచ్చెన ఎక్కలేక, ఇటు పాముల నోట్లోంచి తప్పించుకోలేక రాజకీయాల చేతులలో పావుగా మారింది. మరోమారు 2013 హడావుడి 1964 పంధాలో అటకెక్కడం ఖాయం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమానికి ఊపిరిపోయటం జరిగేపని కాదు. పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదనే సామెతకు లోబడి రాజకీయ వడిలో, చరిత్ర బడిలో పనికిరాని పాఠ్యాంశంగా మిగిలిపోయే ప్రమాదం గోచరిస్తోంది. ప్రమోదంలో ప్రమాదమంటే ఇదే కాబోలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s