ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే.
శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ను సంప్రదించిన స్పీకర్ మనోహర్ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అనంతరం చర్చను వెంటనే ప్రారంభించాలన్న శ్రీధర్ బాబు కోరిక మేరకు చర్చను ప్రారంభించాల్సిందిగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును స్పీకర్ స్ధానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోరారు. ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఉప సభాపతి ప్రకటించారు. దీనితో చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న అంశంలో ఎవరికి అనుకూలమైన భాష్యం వారు చెప్పుకుంటున్నారు.
అసెంబ్లీ మొదలయిన తర్వాత ఎప్పటిలాగా గొడవ మొదలయింది. దాదాపు అన్నీ పార్టీల సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి గొడవ మొదలు పెట్టారు. 30 నిమిషాల వాయిదా అనంతరం తిరిగి సమావేశం అయిన సభలో స్పీకర్ తనకు రాష్ట్రపతి నుండి బిల్లు ముసాయిదా అందినట్లు ప్రకటించారు. స్పీకర్ ఆదేశాల మేరకు శాసన సభ కార్యదర్శి ఎస్.రాజసదరం బిల్లు ముసాయిదాకు అనుబంధంగా పంపిన లేఖను (కవరింగ్ లెటర్) చదివి వినిపించారు. గొడవ, నినాదాలు, ప్రతి నినాదాలు కొనసాగడంతో స్పీకర్ మరో 30 నిమిషాలు సభను వాయిదా వేశారు.
అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ రసవత్తర దృశ్యాలకు వేదిక అయింది. శాసన సభ, శాసన మండలి లకు చెందిన మీడియా పాయింట్లు రెండూ ఇరు ప్రాంతాల సభ్యుల మధ్య ఘర్షణలు జరిగాయని ది హిందు తెలిపింది. సీమాంధ్ర ప్రాంత ఎమ్మేల్యేలు, మండలి సభ్యులు తెలంగాణ బిల్లు ముసాయిదా పత్రాలను చించివేయడంతో ప్రారంభం అయిన ఘర్షణ ఒకరినొకరు తోసుకుని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునేవరకు వెళ్లింది.
అసెంబ్లీ ఆవరణలో వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బిల్లు ముసాయిదా పత్రాలను తగులబెట్టినట్లు తెలుస్తోంది. దీనిని అడ్డుకోడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి ప్రయత్నం చేసినా సఫలం కాలేదని పత్రికలు తెలిపాయి. మరోవైపు తాము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లు టి.డి.పి ఎమ్మేల్యేలు దేవినేని ఉమ, ధూళిపాళ్ళ నరేంద్రలు కూడా బిల్లు ముసాయిదా పత్రాలను చించుతూ కనిపించారు. వారిని అడ్డుకోవడానికి టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రయత్నించారు. ఇది కాస్తా తోపులాటకు, తిట్లకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో అక్కడ గుమి కూడిన పోలీసు అధికారులు చూస్తుండగానే ఈ తతంగం నడిచింది.
అనంతరం సభలో గందరగోళం నెలకొన్న పరిస్ధితుల్లో బిల్లును సభలో ప్రవేశపెట్టడం పట్ల నిరసన తెలుపుతూ కొందరు టి.డి.పి సభ్యులు స్పీకర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. అంటే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టకుండా ఉండడానికే సీమాంధ్ర ఎమ్మేల్యేలు సభలో గందరగోళం సృష్టించినట్లు అర్ధం అవుతోంది. చర్చ జరిపే అంశాన్ని చర్చించడానికి పాలక, ప్రతిపక్ష సభ్యులతో కూడిన బి.ఏ.సి (బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశం జరపాల్సి ఉన్నప్పటికీ దాని విషయమై ఎలాంటి వార్తా లేదని ది హిందు తెలిపింది. ఆరోగ్యం బాగా లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు గైర్హాజరయ్యారు. దానితో బి.ఏ.సి సమావేశం జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
శాసన మండలి మీడియా పాయింట్ లో టి.డి.పి ఎం.ఎల్.సి లు కాసేపు హల్ చల్ చేశారు. బిల్లులోని కొన్ని సబ్ క్లాజుల్లో తమిళనాడు అనీ, తెలంగాణ అనీ రాశారనీ అందువల్ల బిల్లు చెల్లదని టి.డి.పి సభ్యుడు సతీష్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సతీష్ రెడ్డి భాష్యాన్ని నిరసిస్తూ టి.ఆర్.ఎస్ సభ్యుడు స్వామి గౌడ్ సతీష్ రెడ్డి పక్కకు చేరి వివరించే ప్రయత్నంలో ఆయన సతీష్ రెడ్డిని తోసేసినట్లు తెలుస్తోంది. ఇక సతీశ్ రెడ్డి, స్వామి గౌడ్ ల మధ్య తోపులాట మొదలయింది. ఈ గందరగోళంలో టి.డి.పి సభ్యులు నన్నపనేని రాజకుమారి, శ్యమంతకమణిలు పట్టుతప్పి కింద పడిపోయారు.
తోపులాటలో మరింత ఆగ్రహాన్ని తలబూనిన సతీష్ రెడ్డి తన చేతుల్లో ఉన్న బిల్లు ముసాయిదా కాపీలను చింపేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను చించడం అంటే బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతిని అవమానించడమేనని స్వామి గౌడ్ ప్రతి ఆగ్రహాన్ని ప్రకటించారు. దానితో ఉద్రిక్తతలు మరింత చెలరేగి మరోసారి చేతులు కలుపుకునే పరిస్ధితి ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.
సతీష్ రెడ్డి ప్రకారం బిల్లు ముసాయిదాలో అనేక తప్పులు ఉన్నాయి. బిల్లును ఆదరాబాదరాగా పంపించారు. ఉప క్లాజుల్లో అనేక తప్పులు దొర్లాయి. బిల్లు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు తెలియజేసే సెక్షన్ ఒకటి తప్పనిసరిగా ఉండాలని కానీ బిల్లులో ఎక్కడా అది లేదని ఆయన ఎత్తి చూపారు. గతంలో అసెంబ్లీ, కౌన్సిల్ ల ఉభయ సభల సభ్యులు సమావేశం అయి ఉండగా టి.ఆర్.ఎస్ ఎమ్మేల్యేలు గవర్నర్ చేతిలో ఉన్న పత్రాలను లాక్కుని చించివేసిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. టి.ఆర్.ఎస్ ఎమ్మేల్యేలు చించారు కాబట్టి తాము చించినా తప్పు లేదని సతీశ్ రెడ్డి చెప్పదలిచారు.
మరో టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే పాతూరు సుధాకర్ రెడ్డి రంగ ప్రవేశం చేసి బిల్లులో ఎలాంటి తప్పులూ లేవని చెప్పేందుకు ప్రయత్నించారు. మద్రాసు రాష్ట్రం విడిపోయి తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయిన విధానాన్ని బిల్లు ప్రస్తావించిందని కాబట్టి తమిళనాడు పేరు ఉన్నంత మాత్రాన తప్పు దొర్లినట్లు కాదని సుధాకర్ రెడ్డి వివరించారు. మద్రాసు రాష్ట్రం విభజన సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు శాసన మండలులను ఎలా ఏర్పాటు చేసిందీ బిల్లులో వివరించారని ఆయన తెలిపారు.
వివిధ చానెళ్లు ప్రసారం చేస్తున్న వివరాల ప్రకారం ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు – 2013’ లో మొత్తం 13 షెడ్యూళ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్యూల్ ను విభజనకు సంబంధించిన ఒక్కో అంశాన్ని వివరించడానికి కేటాయించారు. నీటి విభజనకు ఒక షెడ్యూల్, ఉద్యోగులు అధికారుల విభజనకు ఒక షెడ్యూల్, శాసన మండలి విభజనకు ఒకటి… ఇలా. ఏయే ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నదీ, ఎన్ని విద్యా సంస్ధలు, ఆసుపత్రులు ఉన్నదీ తదితర వివరాలన్నీ వివిధ షెడ్యూళ్లలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
అయితే సీమాంధ్ర ప్రాంతానికి ఇస్తామని చెప్పిన ప్యాకేజీ గురించి మాత్రం ఎక్కడా, ఎవరూ మాట్లాడడం లేదు. బహుశా బిల్లు ముసాయిదాలో కూడా అలాంటి ప్రస్తావన ఏదీ లేనట్లు కనిపిస్తోంది. ఈ అంశాల గురించి అడిగేవారు కూడా సీమాంధ్ర నాయకుల్లో ఎవరూ ఉన్నట్లు లేదు. శాసన సభ లాబీల్లో కాంగ్రెస్ మంత్రులు శైలజానాధ్, డి.కె.అరుణలు ఎదురుపడినపుడు చిన్నపాటి వాదన జరిగినట్లు ఈటీవి తెలిపింది. ‘మమ్మల్ని మోసం చేశారు. ఇకముందు మేమేమిటో చూపిస్తాం’ అని శైలజానాధ్ సవాలు విసరగా, ‘మా ఊరి మీదుగానే మీ ఊరికి వెళ్లాలని గుర్తుపెట్టుకోండి’ అని డి.కె.అరుణ ప్రతి సవాలు విసిరినట్లు ఛానెల్ తెలిపింది. శైలజానాధ్ చెప్పిన మోసం ‘ప్యాకేజీ’ గురించా లేక మరొకటా అన్న విషయమే తెలియలేదు.
మొత్తం మీద చూడబోతే రాష్ట్ర విభజనపై శాసన సభ, శాసన మండలిలలో చర్చ సజావుగా జరుగుతుందన్న అవకాశం కనిపించడం లేదు. చట్ట సభల సభ్యులు నినాదాలు, ప్రతి నినాదాలు, వాగ్వివాదాలు, ఆందోళనలతో సభలను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్యనే అప్పుడొకరు, ఇప్పుడొకరు అభిప్రాయాలూ చెప్పే అవకాశం లేకపోలేదు. ఇలా వ్యక్తమయిన అభిప్రాయాలనే క్రోడీకరించి వాటినే సభ్యుల అభిప్రాయాలుగా స్పీకర్ నమోదు చేసి రాష్ట్రపతికి పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 విధించిన ఒక సూత్రం పరిపూర్తి అవుతుంది. ఇక మిగిలింది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ప్రహసనం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందన్నదే తేలాలి.
బిల్లుపై ఈ తరహాలోనే అభిప్రాయాలు నమోదయితే ఇక తప్పు సీమాంధ్ర ఎమ్మేల్యేలు, నాయకులదే అవుతుంది. మెజారిటీ సభ్యులు విభజనకు ప్రతికూలంగా ఉన్నారన్న అభిప్రాయం రాష్ట్రపతికి చేరాలంటే మొదట సభ సజావుగా జరగాలి. ఆ తర్వాత రాష్ట్రపతి పేర్కొన్నట్లు అంశాలవారీగా సజావైన చర్చ జరగాలి. ఎటువంటి గందరగోళం లేకుండా చర్చ జరగడమే ఒక విధంగా సీమాంధ్ర నాయకులు తలపెట్టిన ఎత్తుగడలు నెరవేరడానికి అనుకూలంగా కనిపిస్తోంది. చర్చ జరగకుండా వాయిదాలు పడితే అదే అసెంబ్లీ అభిప్రాయంగా రాష్ట్రపతి వద్దకు వెళ్లవచ్చు. తద్వారా సీమాంధ్ర ప్రజల ఆందోళనలు సక్రమమైన పద్ధతిలో అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి చేరేదారి మూసుకుపోతుంది.