దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా


Devyani Khobragade 3

న్యూయార్క్ లో భారత కాన్సల్ కార్యాలయంలోని డిప్యూటీ కాన్సల్ జనరల్ దేవయాని అరెస్టుపై ఇండియా తీవ్రంగా స్పందించింది. వియన్నా సదస్సు ఒప్పందాలను గౌరవించకుండా తమ రాయబారి పట్ల అనుచితంగా వ్యవహరించడం తమకు ససేమిరా ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇండియాలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ను పిలిపించుకుని వివరణ కోరారు.

కాగా అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయాని అరెస్టు వలన ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడరాదని ఆశాభావం వ్యక్తం చేస్తూనే అరెస్టును సమర్ధించుకుంది. రాయబార రక్షణ (diplomatic immunity) ఎంబసీ అధికారులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప కాన్సల్ అధికారులకు వర్తించదని తెలిపింది. కాన్సల్ అధికారుల వ్యక్తిగత చర్యలకు వారు బాధ్యత వహించాల్సిందేనని, అమెరికా కాన్సల్ అధికారులకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. కానీ అమెరికా తమ ఎంబసీ, కాన్సల్ అధికారుల విషయంలో గానీ గూఢచార కంపెనీల అధికారుల విషయంలో గానీ ఎలాంటి సూత్రాలు, నియమాలు పాటించదని అనేక అనుభవాలు నిర్ద్వంద్వంగా నిరూపించే సత్యం.

దేవయాని అరెస్టు ఇండియా-అమెరికాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడవేయదన్న ఆశాభావంతో ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారని పి.టి.ఐ తెలిపింది. “చట్టాన్ని అమలు చేసే విభాగాల ద్వారా మేము ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నాము. ఇండియాతో మాకు సుదీర్ఘ కాలంపాటు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇండియాతో భాగస్వామ్యం కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారని పి.టి.ఐ తెలిపింది. అయితే దేవయానిపై నమోదయిన కేసు విషయంలో వ్యాఖ్యానించడానికి అమెరికా నిరాకరించింది. కోర్టు విచారణలో ఉన్నందున తామేమీ వ్యాఖ్యానించలేమని తెలిపింది.

ఇండియా మాత్రం తమ కాన్సల్ అధికారి పట్ల అమెరికా వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతోంది. అమెరికాకు తమ తీవ్ర నిరసన తెలియజేశామని తమ కాన్సల్ అధికారి పట్ల ఇటువంటి ప్రవర్తన “ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాద”ని తెలిపామని వాషింగ్టన్ లోని ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.

“మా రాయబారుల్లో ఒకరయిన అధికారిపట్ల ఈ విధంగా ప్రవర్తించడం తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని గట్టిగా చెప్పాము. డాక్టర్ దేవయాని ఖాబ్రోగదే ఒక రాయబారి అని నొక్కి చెప్పాము. తన విధి నిర్వహణలో భాగంగానే ఆమె అమెరికాలో ఉన్నారని కాబట్టి రాయబార రక్షణకు ఆమె ఆర్హురాలని తెలిపాము” అని వాషింగ్టన్ లోని భారత ఎంబసీ ఉన్నతాధికారి (Charge d’Affairs) తరణ్ జిత్ సింగ్ సంధు తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారులను కలిసి తమ నిరసన తెలిపామని ఆయన తెలిపారు. “అమెరికా అధికారులు ఆమెతో వ్యవహరించిన తీరు పట్లా, ఆమెను ఇబ్బందిపాలు చేయడం పట్లా భారత ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురయింది” అని సంధు ప్రకటన పేర్కొంది.

Nancy Powell, U S Ambassador to India

Nancy Powell, U S Ambassador to India

39 సం.ల ఐ.ఎఫ్.ఎస్ అధికారి దేవయానిని డిసెంబర్ 12 తేదీన ఉదయం న్యూయార్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేతులకు సంకెళ్లు వేసి తీసుకొనిపోయారని పత్రికలు చెబుతున్నాయి. అదే రోజు సాయంత్రం దేవయానిని విడుదల అయినప్పటికీ ఆమెపై అనేక షరతులు విధించారు. సదరు షరతులు చూస్తే దేవయాని ఏదో భారీ నేరానికి పాల్పడిన అనుమానం రాక మానదు. పూచీకత్తుగా 250,000 డాలర్లను ఆమె చెల్లించారు. ఆమె పాస్ పోస్ర్టును పోలీసులకు అప్పజెప్పాల్సి వచ్చింది. ఇతర ట్రావెల్ డాక్యుమెంట్లన్నింటిని అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ప్రయాణాలపై పలు నిబంధనలు విధించారు.

దేవయాని సమర్పించిన వ్యక్తిగత పూచీకత్తు బాండు పైన ముగ్గురు హామీదారులు సంతకం చేయాల్సివచ్చింది. ఇక నుండి ఆమె కొత్త ప్రయాణాలు పెట్టుకోగూడదని షరతు విధించారు. ఆమె రాయబార పాస్ పోర్టును కూడా అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పని మనిషి సంగీతా రిచర్డ్స్ తో తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ తన తరపున ఇంకెవరైనా గానీ సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేయరాదని షరతు విధించారు. ఇకనుండి భారతీయులకు వీసా ఇవ్వాల్సిందిగా సిఫారసు చేసే అధికారం ఆమెకు లేదని తీర్మానించారు. కోర్టు విచారణ ప్రారంభం అయ్యే లోపు అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆమె ప్రయాణం చేయరాదు.

భారత ప్రభుత్వం దేవయాని అరెస్టు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నప్పటికీ అమెరికా నుండి తదనుగుణమైన ప్రకటన నిర్దిష్టంగా ఏదీ వెలువడలేదు. సంబంధాలు చెడిపోరాదని ఆశిస్తున్నాము అన్న అమెరికా ఆశాభావాన్నే భారత పత్రికలు గొప్పగా చెబుతున్నాయి తప్ప అరెస్టు విషయంలోగానీ, షరతుల విషయంలో గానీ అమెరికా కించిత్తు కూడా వెనక్కి తగ్గలేదన్న విషయాన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు.

పని మనిషి సంగీతా రిచర్డ్స్ గురించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేతనం విషయంలో ఆమె ఎన్నడూ అసంతృప్తి వెల్లడి చేయలేదని దేవయాని తండ్రి ఉత్తమ్ చెబుతున్నారు. దేవయాని భర్త ఆమె వేతనం గురించి కనీసం నాలుగైదు సార్లు విచారించినప్పటికీ ఆమె ఎన్నడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదట. అమెరికాలో శాశ్వత నివాస హోదా దక్కించుకునే లక్ష్యంతోనే ఆమె అమెరికాకు వచ్చినట్లు ఉత్తమ్ కధనం. అమెరికాలో నెలకు 500 డాలర్లు ఆమెకు చెల్లించేవారిమని, ఆ మొత్తానికి తోడు ఇండియాలో ఉన్న ఆమె కుటుంబానికి కూడా మరి కొంత మొత్తం చెల్లించేవారమని దేవయాని తండ్రి చెప్పినట్లు ది హిందూ తెలిపింది.

గత సం.ము సెప్టెంబర్ నుండి ఈ సం.ము జూన్ నెల వరకు దేవయాని ఇంటిలో పని చేసిన సంగీతా రిచర్డ్స్ అకస్మాత్తుగా అక్కడి నుండి మాయమయింది. వెళ్తూ వెళ్తూ ఆమె దేవయాని ఇంటి నుండి 200 డాలర్లు పట్టుకుపోయింది. దేవయాని భర్తకు చెందిన సెల్ ఫోన్ ను కూడా ఆమె దొంగిలించింది. అయితే ఈ సం.ము సెప్టెంబర్ లో దేవయానికి ఫోన్ చేసి తనకు 10,000 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఇండియాలో సంగీత వేతనానికి సంబంధించి ఢిల్లీ హై కోర్టు ఇంజెక్షన్ జారీ చేసింది. దీని ప్రకారం వేతనం వ్యవహారంలో సంగీత అమెరికా కోర్టులను సంప్రదించడానికి వీలు లేదు. ఏమన్నా ఫిర్యాదులు ఉంటే భారత కోర్టులను మాత్రమే ఆమె సహాయం కోరాలి. అప్పటికీ, ఇప్పటికీ ఆమె భారత దేశ పౌరురాలే కనుక బహుశా ఈ ఆదేశాలు చట్టబద్ధమే అయి ఉండవచ్చు. కానీ వేతనం విషయంలో దేవయాని రెండు కాంట్రాక్టులను కుదుర్చుకోవడం, అమెరికా కనీస వేతన చట్టాన్ని పాటించకపోవడం మాత్రం సమర్ధనీయం కాజాలదు.

ఎంబసీ అధికారులకు మాత్రమే రాయబార రక్షణ ఉంటుంది తప్ప కాన్సల్ అధికారికి వర్తించబోదన్న అమెరికా వాదన పరిశీలనార్హం. ఎంబసీ, కాన్సల్ ల మధ్య తేడా ఉన్నదని ఈ వాదన ద్వారా అర్ధం అవుతోంది. ఎంబసీ అనేది ప్రధాన కార్యాలయం అయితే కాన్సల్ కార్యాలయాలు ఎంబసీ కింద పని చేస్తాయని తెలుస్తోంది. విదేశాల్లో ఒక దేశానికి ఒక ఎంబసీ మాత్రమే ఉంటుంది. కాన్సల్ కార్యాలయాలు మాత్రం అనేక నగరాలలో ఉండవచ్చు.

ఎంబసీ కార్యాలయం ప్రధానంగా తమ దేశ రాజకీయ విధానాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అత్యున్నత అధికారిగా ఎంబసీలోని రాయబార అధికారి వ్యవహరిస్తారు. కాన్సల్ అధికారులు మాత్రం తాము పని చేసే దేశంలోని తమ దేశ పౌరుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. వీసా జారీ చేయడం దగ్గర్నుండి, తమ పౌరులకు ఎదురయ్యే, అవసరమయ్యే అనేక ఇతర వ్యవహారాలను వారు పర్యవేక్షిస్తారు. తమ దేశానికి చెందిన కంపెనీల వాణిజ్య ప్రయోజనాలను, వాణిజ్య సంబంధాలను కూడా వారు పర్యవేక్షిస్తారు.

దేవయాని డిప్యూటీ కాన్సల్ జనరల్ కాబట్టి ఆమెకు ఎంబసీ అధికారులకు వర్తించే రాయబార రక్షణ వర్తించబోదని అమెరికా వాదిస్తోంది. కానీ విదేశాల్లోని అమెరికా అధికారులకు మాత్రం ఈ సూత్రమే కాకుండా ఎలాంటి రాయబార చట్టాలూ వర్తింపజేయకుండా అమెరికా ప్రభుత్వం అడ్డుపడుతుంది. ముఖ్యంగా ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాల్లో అమెరికా కాన్సల్ అధికారుల దుష్ప్రవర్తనకు అడ్డూ అదుపూ ఉండదని వికీ లీక్స్ ద్వారా వెల్లడయిన వందల వేల ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ద్వారా వెల్లడి అయింది. కాబట్టి అమెరికా నీతులకు ఇండియా కట్టుబడాల్సిన అవసరం మాత్రం లేదు. కానీ దేవయాని విషయంలో ఇండియా మాట చెల్లుబాటు కావడం అనుమానమే. బహుశా ఇటలీ తరపున అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోందా అన్న అనుమానాలకు ఎంత కొద్దిగానయినా విలువ లేకపోలేదు.

2 thoughts on “దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా

  1. పింగ్‌బ్యాక్: దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా | ugiridharaprasad

  2. భారత్ ఎంత మెహర్బాని పోయినా అమెరికా దృష్టిలో కుర్బాని తప్పదు. ఈ సూక్ష్మ వ్యవహారమే కాదు, ప్రాపంచిక కార్యకలాపాలలో భారత్ ప్రాపకానికి ఎప్పుడు విలువలు ఇవ్వలేదు. తాత ఒళ్ళో మనుమడు కేరింతలు కొట్టే రీతిలో ఒబామా మన్మోహనం భుజాల మీద సవారి చేస్తుంటే, ఈ వెర్రి తాత ఒబామాను పొగడ్తలతో ముద్దుచేస్తున్నాడు. చివరకు ఒబామా లోకువ చేసి భారత్ విషయంలో మొండిగా ప్రవర్తిస్తున్నాడనేది నిస్సందేహం. దేశ గౌరవ ప్రతిష్టలతో రాజిపడే విదేశీ దౌత్యం విషయంలో నిక్కచ్చిగా మనం లేనప్పుడు అవతలవారి విషయంలో మనం చులకనమవుతాము. ఐనా, ఇంట్లో తప్పుంచుకుని కంట్లో శుక్లాలు గురించి మాట్లాడటం మరీ విడ్డూరం. భారత ప్రతిష్టతను అప్రదిష్టపాలు చేసే విషయాలు సాయబుగారి గడ్డం మూరెడా బారెడానే రీతిలో వ్యవహరించడం మన కంట్లో మన వేలు పెట్టుకుని నలుసు తీసుకోపోయి గుడ్డితనాన్ని కోరుకోవడంలాంటిది. దౌత్యాధికారులు కూడా విధినిర్వాహణలలో తత్సంబందిత దేశ ప్రవర్తనా నియమావళిని గౌరవించాలి కానీ మరీ ఇంత చిల్లరగా గారాలు పోవడం ఉభయత్ర పరువుకు పాకులాడటమవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s