పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి


Devyani Khobragade

న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యుటి కాన్సల్ జనరల్ గా పని చేస్తున్న అధికారి ‘వీసా మోసం’ కేసులో అరెస్టయ్యారు. వీసా మోసం, తప్పుడు సమాచారం కేసుల్లో సదరు రాయబారి అరెస్టయినప్పటికి అసలు విషయం పని మనిషికి వేతన చెల్లింపులో మోసం చేయడం. పని మనిషికి అమెరికా వీసా సంపాదించడానికి అమెరికా చట్టాల ప్రకారం నెలకు వేతనం 4,500 డాలర్లు చెల్లిస్తానని చెప్పిన రాయబార అధికారి వాస్తవంలో రు. 30,000/- (500 డాలర్ల కంటే తక్కువ) చెల్లించినట్లు వెల్లడి అయింది. దానితో తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా వీసా సంపాదించారన్న నేరంతో ఆమెను అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసింది.

దేవయాని ఖోబ్రగదే న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాయంలో ఉప అధికారి. ఆమె వయసు 39 సం.లు. న్యూయార్క్ పోలీసులు ఆమెను గురువారం ఉదయం తమ పిల్లలను పాఠశాల వద్ద దింపుతుండగా అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అదే రోజు బెయిల్ పై విడుదల చేశారు. తమ ఇంట్లో పని చేసినందుకు గాను నెలకు 4,500 డాలర్లు చెల్లిస్తానని తాను సంగీత రిచర్డ్స్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు వీసా దరఖాస్తులో పేర్కొన్నారు. వీసా మంజూరు అయ్యాక నెలకు 30,000 మాత్రమే చెల్లిస్తానని ఆమె మరో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. పైగా పని గంటల విషయంలో కూడా కాంట్రాక్టును ఉల్లంఘించారు. ఈ సంగతి వెల్లడి కావడంతో దేవయాని గురువారం అరెస్టు అయ్యారు.

అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేరంతో పాటు అనైతికంగా వ్యవహరించిన దేవయాని పట్ల కఠినంగా వ్యవహరించడానికి బదులు భారత ప్రభుత్వం పని మనిషిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తోంది. వేతన కాంట్రాక్టులకు సంబంధించి భారత కోర్టులలో మాత్రమే దావా నిర్వహించాలంటూ ఢిల్లీ హై కోర్టు సంగీత రిచర్డ్స్ కు ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసింది. దానిని ఉల్లంఘిస్తూ అమెరికా కోర్టులో దావా వేసినందుకు భారత హై కోర్టు ఆమెపై అరెస్టు వారంటు జారీ చేసింది. ఈ అరెస్టు వారంటును అమెరికా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదనీ, పైగా రాయబార రక్షణ (Diplomatic immunity) ఉన్న దేవయానిని అరెస్టు చేశారని భారత ప్రభుత్వం, అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేవయాని పైన మోపబడిన ప్రధాన నేరాలు రెండు. ఒకటి: వీసా మోసం. రెండు: తప్పుడు సమాచారం ఇవ్వడం. వీసా సంపాదించడం కోసం ఒక కాంట్రాక్టు, వాస్తవ వేతనానికి మరొక కాంట్రాక్టు కుదుర్చుకోవడం వల్ల ఈ రెండు నేరాలు ఉత్పన్నం అయ్యాయి. నవంబర్ 2012 నుండి జూన్ 2013 వరకు దేవయాని ఇంటిలో సంగీత పని చేసినట్లు తెలుస్తోంది. సంగీతకు A-3 వీసా కోసం దేవయాని భారత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయంలో ప్రత్యేకంగా హాజరయ్యారు కూడా. అమెరికా కనీస వేతన చట్టాల ప్రకారం గంటకు 9.75 డాలర్లు చెల్లిస్తానని ఆమె ఈ ఇంటర్వ్యూలోనూ, వీసా దరఖాస్తులోనూ పేర్కొన్నారు. అయితే రెండో కాంట్రాక్టు ప్రకారం నెలకు 30,000 మాత్రమే చెల్లించడంతో అది గంటకు 3.31 డాలర్ల వేతనంగా తేలింది. అది కూడా కాంట్రాక్టులో ఉన్న పని గంటల కంటే (వారానికి 40 గంటలు) అధిక సమయం ఆమెతో పని చేయించుకున్నారు. “మొదటి కాంట్రాక్టు ఒప్పందం కేవలం వీసా పొందడం కోసమే” అని దేవయాని, సంగీతతో చెప్పినట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ నగరంలో ఈ విధంగా మానవ అక్రమ రవాణా కింద ఒక భారత రాయబారి అరెస్టు కావడం ఇది రెండోసారి. భారత రాయబార కార్యాలయంలో రాయబారిగా పని చేస్తున్న నీనా మల్హోత్రా, ఆమె భర్త జోగేష్ లు దాదాపు 1.5 మిలియన్ డాలర్ల పరిహారం తమ పని మనిషికి చెల్లించాలని 2012 లో న్యూయార్క్ సిటీ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. ఈ కేసులో అయితే పనికోసం తెచ్చుకున్న అమ్మాయి మైనర్ బాలిక. ఆమె పేరు శాంతి గునుంగ్. అసలు వేతనమే చెల్లించకపోగా ఆమెతో “క్రూరంగా వ్యవహరించార”ని కోర్టు పేర్కొంది.

భారత దేశంలో చట్టం పాటిస్తున్నామని చెప్పుకోవడానికి ఒక పే రికార్డు నిర్వహిస్తూ, వాస్తవంలో అత్యంత తక్కువ వేతనాలు చెల్లించడం సర్వ సాధారణం. అనేక ప్రభుత్వ సంస్ధలతో పాటు, ప్రభుత్వ రంగ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. కాంట్రాక్టీకరణ పెరిగిపోయాక ఈ మోసాలు ఇంకా తీవ్రం అయ్యాయి. ప్రైవేటు కంపెనీలయితే చెప్పనే అవసరం లేదు. ఇండియాలో సాధారణం అయినట్లే అమెరికాలో కూడా సాధారణంగా మోసం చేయడానికి పూనుకుని భారత రాయబారులు దొరికిపోయారు.

ఇదొక ఘోరం అయితే సంగీత రిచర్డ్స్ విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరో ఘోరం. అసలు నేరం చేసింది, మోసం చేసిందీ దేవయాని. మోసపోయింది సంగీతా రిచర్డ్స్. దేవయాని అటు అమెరికా చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా దేశానికి చెడ్డపేరు కూడా తెచ్చిపెట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మోసపోయిన, న్యాయం అవసరమయిన సంగీత రిచర్డ్స్ వైపు నిలబడడానికి బదులు దేవయాని వైపు నిలుస్తూ సంగీతను అరెస్టు చేయడానికి సైతం తెగబడుతోంది. మన ప్రభుత్వాలు కార్మికవర్గం కోసం పని చేయవనీ, ఎల్లవేళలా ధనిక వర్గాల కోసమే పని చేయడానికే కట్టుబడి ఉంటాయని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?

అలాగని అమెరికా ప్రభుత్వం కార్మిక వర్గం వైపు నిలుస్తున్నదనో లేక న్యాయం వైపు నిలుస్తున్నదనో భావించనవసరం లేదు. అమెరికా కనీస వేతన చట్టాలను ఉల్లంఘించడానికి అక్కడి కంపెనీలకు అనేక ఆధునిక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఔట్ సోర్సింగ్, పన్ను రాయితీలు, సబ్సిడీలు లాంటి అనేక మార్గాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాల అధికారుల తప్పులను ఎంచడంలో పశ్చిమ దేశాలు ఎప్పుడూ ముందుంటాయి. ఇతర దేశాల్లో తమ పౌరులు ఇంతకంటే ఘోరమైన నేరాలకు పాల్పడినా ఏదో విధంగా తప్పించడానికే అమెరికా ప్రయత్నిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈజిప్టు, లిబియా తదితర దేశాల్లో అమెరికా పౌరులు వివిధ పేర్లతో పాల్పడిన నేరాలనుండి స్నేహ-సహకార ఒప్పందాల ద్వారానే తప్పించుకోగల నేర్పరి అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ లో అలాంటి ఒక ఒప్పందమే ఇప్పుడు తయారీలో ఉన్న విషయం ఎలా విస్మరించగలం?

2 thoughts on “పనిమనిషిని మోసం చేసి అరెస్టయిన భారత రాయబారి

  1. అంతా సహజం. భారతీయం లంచాల కంచంలో భో’జనం’. ధనం కక్కుర్తి విషయంలో ప్రపంచపు సరిహద్దులు వరకు నైజం మారదు. ఎటొచ్చి అమెరికలో కాబట్టి దొందు దొందె. అవతలి వ్యక్తికి జరిగిన అన్యాయం ఏదైనావుంటే బాధ తప్ప, ఈ గాధ సహజం.

  2. సంగీతని భారత ప్రభుత్వం ఇలా వేధించడం తప్పే కాని మన రాయబారిని సంకెళ్ళు వేసి తీసుకెల్లడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు ……అది భారతదేశ ప్రతిష్ఠ కి భంగం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s